ధాన్యం.. దైన్యం!
ఈసారైనా ‘మద్దతు’ లభించేనా?
- పక్షం రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ బాట
- కొనుగోళ్లకు ప్రభుత్వ సంస్థలు దూరం
- సహకార సంఘాలకే బాధ్యత లు!
- ఉత్పత్తుల సేకరణపై అనుమానాలు
గజ్వేల్: వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఈసారైనా మార్పులుంటాయా? మద్దతు ధర లభించేనా?.. మరో 15 రోజుల్లో వ్యవసాయోత్పత్తులు మార్కెట్ బాట పట్టే అవకాశమున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతోంది. మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్‌ఫెడ్, వడ్లను కొనుగోలు చేసే సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ), ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ), ఆముదాలు, పొద్దుతిరుగుడు వంటి నూనె ఉత్పత్తులు కొనుగోలు చేసే ఆయిల్‌ఫెడ్ సంస్థలు జిల్లాలో తమ కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి. మరోపక్క పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నామమాత్రంగానే కేంద్రాలను నడుపుతున్నది.
కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేస్తూ ప్రభుత్వరంగ సంస్థలు పర్యవేక్షణకే పరిమితం కావడం రైతులను కుంగదీస్తున్నది. ఈసారి ఐకేపీ కేంద్రాలనూ ఎత్తేసి సహకార సంఘాలకే కొనుగోళ్ల బాధ్యతను పూర్తిస్థాయిలో అప్పగించనున్నారని తెలుస్తున్నది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.. ఏదేమైనా ప్రభుత్వ సంస్థలను నేరుగా రంగంలోకి దిగితే తప్ప ఇబ్బందులు తీరేలా లేవు.
బాధ్యతల నుంచి తప్పుకున్న మార్క్‌ఫెడ్
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 80 వేల హెక్టార్లకుపైగా మొక్కజొన్న, 1.10 హెక్టార్లలో పత్తి, మరో 40 హెక్టార్లకుపైగా వరిసాగైంది. మొక్కజొన్నకు సంబంధించిన ఉత్పత్తులు మరో 15 రోజుల్లో మార్కెట్ బాటపట్టే అవకాశమున్నది. అక్టోబర్ నెలాఖరులోగా ధాన్యం, పత్తి ఉత్పత్తులూ మార్కెట్‌లోకి రానున్నాయి. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ జిల్లాలోని విస్తృత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మొక్కజొన్న ఉత్పత్తులను సేకరించాల్సి ఉండగా ఆ సంస్థ ఈ బాధ్యతను ఎప్పుడో మరిచిపోయిందనే చెప్పాలి. ఐకేపీ సంఘాలకే కొనుగోలు బాధ్యతలను అప్పగించి తాను పర్యవేక్షణకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం గజ్వేల్‌లో మక్కల కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకొన్నాయి. ముగ్గురు ఐకేపీ సిబ్బందిని సస్పెండ్ చేశారు.
వరిదీ అదే దారి..
వరి ఉత్పత్తుల సేకరణకు గతంలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, మెదక్ తదితర చోట్ల 8 వరకు కొనుగోలు కేంద్రాలను మూడేళ్ల క్రితం వరకు ఏర్పాటుచేయగా.. ప్రస్తుతం వాటిని ఎత్తేశారు. కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సొసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేసి కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమవుతున్నది.
గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేదికాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. ప్రత్యేకించి సహకార సంఘాలు కొనుగోళ్ల రంగంలోకి రావడం ఇది రెండో ఏడాదే. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్నచోట మార్కెటింగ్ శాఖ అధికారులు సమకూరుస్తుండగా మిగతాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతున్నది.
సీసీఐదీ అదే తీరు..
పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదు. సీజన్‌లో ఈ కేంద్రాలను నిరంతరంగా తెరవకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కాగా, ఈసారి కొత్తగా కొనుగోళ్ల బాధ్యత నుంచి ఐకేపీ కేంద్రాలను తప్పిస్తున్నారని, ఇందుకు సంబంధించిన జీఓ కూడా విడుదలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల బాధ్యతను పూర్తిగా సహకార సంఘాలకు అప్పగించనున్నారనే ప్రచారం సాగుతున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనే ఇబ్బందులకు అడ్డుకట్ట
కొనుగోళ్ల రంగంలోకి తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనే రైతుల ఇబ్బందులు తీరే అవకాశమున్నది. కొత్త రాష్ట్రంలో...ఈ విధానాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాల్సి ఉన్నది.