cooperative
-
‘జూబ్లీహిల్స్’.. అక్రమాలు ఫుల్!
సాక్షి, హైదరాబాద్: సహకార హౌసింగ్ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారని మండిపడుతున్నారు. దీనికోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని సొసైటీ నుంచి తొలగించేందుకు ప్రయతి్నంచారని.. సంబంధిత అధికారులు దీన్ని తిరస్కరించారని సమాచారం. తమ పథకం బెడిసికొట్టినా.. కొత్త సభ్యత్వాలను మాత్రం ప్రారంభించడం గమనార్హం. టీవీ–5 చానల్ అధినేత కుమారుడు రవీంద్రనాథ్ అధ్యక్షుడిగా ఉన్న ఈ జూబ్లీహిల్స్ సొసైటీ లీలలు మరెన్నో ఉన్నాయని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. సహకార సూత్రాల మేరకు ఏర్పాటై.. ‘ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం’కింద 1962 జూలై 7న ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)’రిజిస్టర్ అయింది. సొసైటీ ఏర్పడినప్పుడు సభ్యుల సంఖ్య 300 మంది. సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ప్రయోజనాలు కాపాడుతూ.. భూమి కొనుగోలు, అభివృద్ధి చేయాలన్నది నిబంధన. సొసైటీ కోసం 2,500 షేర్లను, ఒక్కో షేర్‌కు రూ.100 చొప్పున నిర్ణయించి.. మొత్తంగా రూ.2.5 లక్షల మూలధనంతో సొసైటీని ప్రారంభించారు. నిబంధనల మేరకు జూబ్లీహిల్స్లోనే ఈ సొసైటీ కార్యకలాపాలు నిర్వహించాలి.సభ్యుల్లో ఎవరైనా తన పేరిట, తన భార్య, పిల్లల పేరు మీద షేర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే సొంత ఇల్లు లేనివారే సభ్యుడిగా ఉంటారు. 1964లో ప్రభుత్వం షేక్‌పేట్ సర్వే నంబర్ 403లో 1,195 ఎకరాలు, హకీంపేట్ సర్వే నంబర్ 102లో 203 ఎకరాలు కలిపి మొత్తంగా 1,398 ఎకరాలను కేటాయించింది. ఇందులో.. 1971లో 1,345.40 ఎకరాలను, 1972లో 40.67 ఎకరాలను కలిపి.. 1,386.07 ఎకరాలను సొసైటీకి అందజేసింది. సొసైటీ ఈ భూమిలో 1984 నుంచి 1991 మధ్య 3,035 మంది సభ్యులకు ప్లాట్లను అందజేసింది. సభ్యులకు ఒకసారి ప్లాట్ అందినా, లేదా సభ్యుడయ్యాక హైదరాబాద్ నగరంలో ఇల్లు ఉన్నా వారు మరో ప్లాట్ పొందేందుకు అనర్హులు. విక్రయించడం చట్టవిరుద్ధం ఒకరి ప్లాట్‌ను మరో సభ్యుడికి బదిలీ చేయడంగానీ, అసలు సభ్యత్వమే లేని వారికి విక్రయించడంగానీ చట్టవిరుద్ధం. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో సభ్యుడెవరైనా ప్లాట్ బదిలీ చేయాలని భావిస్తే.. దాన్ని సొసైటీకి అప్పగించాలి. ప్లాట్ పొందేటప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా సొసైటీ తిరిగి చెల్లించాలి. ఈ స్థలాన్ని సొసైటీలో సీనియారిటీ ప్రకారం వెయిటింగ్‌లోని లబ్ధిదారులకు మంజూరు చేయాలి. వీరి నుంచి ప్రభుత్వ మార్కెట్ విలువ, ఇతర చార్జీలు వసూలు చేయవచ్చు. మేనేజింగ్ కమిటీ అనుమతి లేకుండా సభ్యుడు స్థలాన్ని విక్రయించడానికి వీలులేదు. అలా ఎవరైనా విక్రయిస్తే అది చట్టవిరుద్ధంగా, కొనుగోలు చేసినవారిని ఆక్రమణదారుగా పరిగణిస్తారు. ఇక సొసైటీలోని సభ్యులందరికీ ఇంటి స్థలం మంజూరుకాకుండా.. కొత్తగా సభ్యులను తీసుకోవద్దని నిబంధన చెబుతోంది. ఉదాహరణకు 90 మందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంటే 100 మందిని సభ్యులుగా తీసుకోవాలి. లబి్ధపొందని వారు 10 శాతానికి మించి ఉండటానికి వీలులేదు. కానీ జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలాలు అందనివారు 30 శాతానికి పైనే.. 800 మందిని తొలగించే ప్రయత్నం.. సొసైటీలో కేవైసీ (పూర్తి చిరునామా, ఇతర వివరాలు) లేదని, జనరల్ బాడీ సమావేశానికి హాజరుకావడం లేదని.. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ కూడా లేదని కారణాలు చూపుతూ దశాబ్దాలకుపైగా ఉన్న 800 మంది సభ్యుల తొలగింపునకు సొసైటీ పాలకవర్గం ఎత్తులు వేసింది. 2024 మార్చి 24లోగా కేవైసీ అందజేయాలంటూ సభ్యులను ఆదేశించింది. అనుకున్నదే తడవుగా వివరాలు ఇవ్వని 800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జాబితా కూడా సిద్ధం చేసి పంపగా.. హౌసింగ్ అధికారులు దీనికి ససేమిరా అనడంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. అయితే అంగ బలం, ఆర్థిక బలంతో ఈ తొలగింపు జాబితాకు అధికారులు ఆమోదముద్ర వేసేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. సొసైటీ పాలకవర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యులు కరపత్రాలు వేసి, పంచినా కూడా.. వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. ‘రియల్’దందా కోసమే.. సొసైటీలో అసలు స్థలమే లేనప్పుడు సభ్యులను తొలగించడం ఎందుకు? కొత్త వారిని చేర్చుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక్కడే సదరు అక్రమార్కులు చక్రం తిప్పడం ప్రారంభించారు. కొత్త సభ్యత్వాల పేర రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టారు. సొసైటీకి సంబంధం లేని వెంచర్లో అమ్మకాలు ప్రారంభించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమంటూ అంటగడుతున్న ఆ వెంచర్ ఏంటి? ఎక్కడ ఉంది? ప్లాట్ల అమ్మకాల ‘రియల్’కహానీ రెండో భాగంలో.. ప్రస్తుతం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య: 4,962 మంది వీరిలో స్థలం పొందిన లబి్ధదారులు: 3,035 మంది ఇంకా ప్లాట్లు రానివారు: 1,927 మంది మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులే.. జూబ్లీహిల్స్ సొసైటీలో స్థలం మంజూరు కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటివరకు వారికి స్థలం అందించే దిశగా ఎలాంటి చర్యలు లేవు. మొత్తం 1,927 మంది ఎదురుచూస్తుండగా.. పలు కారణాలతో 800 మందిని తొలగించారు. వారి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా 800 మందిని తీసుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. మిగిలిన 1,145 మందికి స్థలాలు వచ్చే వరకు కొత్త వారిని చేర్చుకోవద్దని డిమాండ్ చేస్తున్నాం. క్లబ్ కోసమంటూ కొత్త వారిని చేర్చుకుంటే ఒత్తిడి పెరిగి, అసౌకర్యంగా మారుతుంది. – ప్రభాకర్‌రావు, సొసైటీ సభ్యుడు10 శాతానికి మించి ఉండొద్దు.. కో–ఆపరేటివ్ చట్టంలోని సెక్షన్–19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. ప్రస్తుతానికి సొసైటీ వద్ద ఖాళీ స్థలం లేదు. అంతేకాదు స్థలం పొందని సభ్యులు 10శాతానికి మించి ఉండకూడదని హౌసింగ్ సొసైటీ నిబంధన. కొత్తవారి నుంచి షేర్ వ్యాల్యూ కేవలం రూ.300 తీసుకుని దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులపై వారికి కూడా హక్కులు వర్తింపజేస్తున్నారు. క్లబ్, స్కూల్, కమ్యూనిటీ సెంటర్ ఇలా అన్నింటిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? – విజయభాస్కర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడుసొసైటీది సహాయక పాత్ర మాత్రమే.. వివిధ కారణాలతో సొసైటీ నుంచి 800 మంది వెళ్లిపోయారు. వారికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. జనరల్ బాడీ ఆమోదంతోనే వారిని తొలగించాం. కొత్త సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. 800 మందికి మించి తీసుకోం. వీరితోపాటు ఇంకా స్థలాలు రానివారు దాదాపు 1,200 మంది ఉన్నారు. ఈ రెండు వేల మంది కలిసి నిర్మించుకుంటున్న వెంచర్ జూబ్లీహిల్స్ ఫేజ్–4. కాస్ట్ టు కాస్ట్ (ఖర్చులు) ధరకే వీరికి ఫ్లాట్లు అందనున్నాయి. వీరంతా సొసైటీ సభ్యులే అయినందున మేం ఫెసిలిటేటర్‌గా ముందుకు వచ్చాం. వెంచర్‌ను నిపుణులైన కమిటీ పర్యవేక్షిస్తుంది. సొసైటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా వెంచర్ కోసం ఖర్చు చేయడం లేదు. చట్టప్రకారం, జనరల్ బాడీ అనుమతితోనే చర్యలు చేపడుతున్నాం. – రవీంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు సభ్యత్వం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది? చట్టప్రకారం ఎవరి సభ్యత్వమైనా తొలగించాలంటే.. ఎందుకు తీసివేస్తున్నామో కారణాలు వెల్లడిస్తూ వారికి నోటీసులు జారీ చేయాలి. తర్వాత వారి వివరణను పరిశీలించాలి. దానిపై సంతృప్తి చెందకుంటే తీసివేతపై మేనేజ్మెంట్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ తొలగింపు చట్ట వ్యతిరేకమని సభ్యుడు భావిస్తే.. ట్రిబ్యునల్‌ను, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే తొలగింపుపై సొసైటీ నోటీసులు జారీచేసినా అవి చాలా మందికి అందలేదని.. వారి వివరణ కూడా రాకుండానే, తొలగిస్తూ జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ సొసైటీ సభ్యత్వం తొలగింపునకు సంబంధించి ఒక ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఇక కొత్తగా సభ్యులను చేర్చుకునే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సొసైటీలో లబి్ధపొందని వారు 10శాతం దాటకుండా ఉండాలి. అలాంటిది స్థలం దక్కనివారు ఇప్పటికే 30శాతం ఉన్నా.. కొత్త వారిని ఎలా తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సొసైటీని వివరణ కోరగా.. వివిధ కారణాలతో 800 మందిని తొలగించామని, ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం. -
వ్యవసాయ, సహకార బదిలీల్లో ‘చేతి’వాటం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ, సహకార శాఖల్లో చేపట్టిన బదిలీల్లో ఓ కీలక ప్రజాప్రతినిధికి చెందిన ఓఎస్డీ చేతివాటం చూపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తానే వ్యవసాయ కమిషనరేట్‌లో మూడురోజులు కూర్చొని డబ్బులు తీసుకొని తనకు ఇష్టమైన వారికి ఇష్టమైన చోట పోస్టింగ్ ఇచ్చారని వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయశాఖలో జరిగిన బదిలీలపై అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ ఇప్పటికే డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, సహకారశాఖలో జరిగిన బదిలీలపై ఉద్యోగ సంఘాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికే ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. 40 శాతం ఉద్యోగులనే బదిలీ చేయాల్సి ఉన్నా, ఉన్నతాధికారులు దానికి మించి ఉత్తర్వులు ఇచ్చారని, సీనియారిటీని పట్టించుకోలేదని, ఆప్షన్లు ఇచి్చన వారికి కోరుకున్న చోట కాకుండా దూరంగా బదిలీ చేశారని ఆ వినతిపత్రంలో ప్రస్తావించారు. బ్లాక్ చేసి... ఆపై డబ్బులు వసూలు చేసి వ్యవసాయశాఖలో వ్యవసాయ విస్తరణాధికా రులు (ఏఈవో), మండల వ్యవసాయాధికా రులు (ఏవో), వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీఏ), డిప్యూటీ డైరెక్టర్లు (డీడీ), వ్యవ సాయ జాయింట్ డైరెక్టర్లు (జేడీఏ)ల బదిలీలు చేపట్టారు. వ్యవసాయ, సహకారశాఖల్లో రుణమాఫీ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. దాదాపు 900 మంది వరకు బదిలీలు జరిగాయని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. డిమాండ్‌ను బట్టి బదిలీల కు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆ ఓఎస్డీ వసూలు చేసినట్టు ఉద్యోగులే చెబుతున్నారు.83 ఏడీఏ పోస్టులకుగాను 29 బ్లాక్ చేశా రు. మరో 11 ఇతర పోస్టులు బ్లాక్ చేశారని తెలిసింది. బ్లాక్ చేసినవే కాకుండా ఇతర పోస్టులను కూడా కౌన్సెలింగ్‌లో తమ వారికి దక్కేలా ఆ ఓఎస్డీ చక్రం తిప్పారు. సహకారశాఖలో 366 మంది ఉద్యోగులకు బదిలీలు అయ్యాయి. గడు వు ముగిసిన తర్వాత ఈ నెల 21న ఐదుగురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ రిజిస్ట్రార్లు, 17 మంది జాయింట్ రిజి్రస్టార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేయలేదని, డబ్బులు చేతులు మారాయని విమర్శిస్తున్నా రు. సహకారశాఖలో దాదాపు 20 పోస్టులు బ్లాక్ చేసి, వాటిని అమ్ముకున్నారని ఉద్యోగులు అంటున్నారు. కొందరికైతే నాలుగేళ్లు నిండకుండానే బదిలీ చేస్తే... కొందరికైతే రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే బదిలీ చేశారు. అసలు వ్యవసాయ, సహకారశాఖల్లో బదిలీకి అర్హులైన జాబితాలో పేర్లు లేనివారిని కూడా చెప్పాపెట్టకుండా బదిలీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌లో బదిలీల నిలిపివేత Ü మార్క్‌ఫెడ్‌లో గత నెలలోనే బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ బది లీలు నిలిపివేశారు. హైదరాబాద్‌లో కీలకమైనచోట పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు ఉన్నతస్థాయిలో ఫైరవీలు చేయించుకొని తమకు స్థానచలనం జరగకుండా బదిలీలు నిలుపుదల చేశారన్న విమర్శలున్నాయి. మరోవైపు ఆయిల్‌ఫెడ్‌లోనూ ఏళ్లుగా బదిలీల ప్రక్రియ జరగడం లేదు. అనేకమంది ఏళ్ల తరబడి ఒకేచోట ఉన్నా, వారిని కదిలించడం లేదన్న చర్చ జరుగుతోంది. -
16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లకు మంచిరోజులు!
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభం ఎదుర్కొంటున్న 16 కోపరేటివ్ బ్యాంకు కస్టమర్లు.. ఒక్కొక్కరికి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) కింద గరిష్టంగా రూ.5 లక్షల వరకు దక్కనుంది. డీఐసీజీసీ 21 బ్యాంకులతో ఒక జాబితాను రూపొందించగా.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంకు (పీఎంసీ బ్యాంకు) సహా ఐదు బ్యాంకులను ఈ పథకం కింద మినహాయించింది. డీఐసీజీసీ కింద బ్యాంకులు సంక్షోభం పాలైతే.. డిపాజిట్ దారునకు గరిష్టంగా రూ.5లక్షలు పరిహారం చెల్లించే బిల్లుకు పార్లమెంటు ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆమోదం తెలుపగా.. సెప్టెంబర్ 1న ప్రభుత్వం నోటిఫై చేసింది. -
త్వరలో కొత్త సహకార విధానం
న్యూఢిల్లీ: దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రం త్వరలో కొత్త సహకార విధానాన్ని ప్రకటిస్తుందనీ, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీ)ల సంఖ్య 65 వేల నుంచి 3 లక్షలకు పెరగనుందన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 గ్రామాలకు ఒక పీఏసీ ఉండగా రానున్న అయిదేళ్లలో ప్రతి రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ సహకార యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ప్రభుత్వం సహకార ఉమ్మడి సేవా కేంద్రాల(కోఆపరేటివ్ కామన్ సర్వీస్ సెంటర్లు)ను, జాతీయ డేటాబేస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. సహకార వ్యవస్థలు రాష్ట్రాల పరిధిలోనే కొనసాగుతాయని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఘర్షణకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ చట్టాన్ని సవరించడంతోపాటు పీఏసీలను ఆధునీకరించి, డిజిటలైజ్ చేస్తామన్నారు. పీఏసీల అకౌంట్ల కంప్యూటరీకరణలో స్థానిక భాషలను వినియోగించుకోవడతోపాటు జిల్లా సహకార బ్యాంకులతో, నాబార్డుతో అనుసంధానం చేస్తామన్నారు. పీఏసీలు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లుగా, సభ్యుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తాయని తెలిపారు. జాతీయ సహకార సమ్మేళనం మొట్ట మొదటి సమావేశంలో అమిత్ షా శనివారం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వివిధ సహకార సంఘాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరు కాగా, సుమారు మరో 6 కోట్ల మంది ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం -
సహకార సంస్థల మెగా సదస్సు ప్రారంభం: కొత్త కార్యక్రమానికి శ్రీకారం
Cooperative Conference: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రి ఇవాళ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖ ఆధ్వర్యంలో శనివారం సహకార సంస్థల మెగా సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ సహకార సంఘాలకు చెందిన 8 కోట్ల మంది సభ్యులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడనున్నారు. ఈ వేదిక మీద అమిత్ షా ప్రసంగించనున్నారు. (చదవండి: నరేంద్ర మోదీ ఒక హీరో.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ప్రశంసలు వర్షం) ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ సమావేశం జరగుతుండగా.. ఈ కాన్ఫరెన్స్‌ను సహకార సంస్థలు ఐఎఫ్ఎఫ్సీఓ, నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అమూల్, సహకార భారతి, నాఫెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ), క్రిబ్చో (KRIBHCO)తోపాటు ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయి. చదవండి: మూడే రోజులు... ఎన్నో అంశాలు -
రాష్ట్రానికి నానో యూరియా
సాక్షి, హైదరాబాద్: నానో యూరియా.. ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న ఘన యూరియాకు ప్రత్యామ్నాయం. తక్కువ ఖర్చు, పర్యావరణ హితం, మంచి దిగుబడి దీని ప్రత్యేకత. భారతీయ రైతాంగ స్వీయ ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో) ఆవిష్కరించిన ఈ నానో యూరియా అతి త్వరలో రాష్ట్రానికి చేరనుంది. గుజరాత్‌లోని కలోల్ నుంచి రాష్ట్రానికి బయల్దేరే నానో యూరియా ట్రక్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆన్లైన్ పద్ధతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు పాల్గొన్నారు. నానో ప్రత్యేకతలివే ♦నానో టెక్నాలజీతో రూపొందించిన నానో యూరియాతో ప్రభుత్వాలపై సబ్సిడీ, రవాణా భారాలు తగ్గుతాయి. ♦ప్రస్తుతం ఒక బస్తాపై రూ.800 నుంచి రూ.1000 వరకు ప్రభుత్వం రాయితీ భారాన్ని మోస్తోంది. రూ.240కే లభించే 500 ఎంఎల్ లిక్విడ్ నానో యూరియా బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ♦ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ పొందింది. ♦ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత నానో యూరియాను రెండుసార్లు పిచికారీ చేయాలి. మామూలు యూరియా సమర్థత 30 శాతమైతే దీని సమర్థత 80 శాతమని ఇఫ్కో చెబుతోంది. -
పరపతేతర వ్యాపారంతో సహకరించండి
చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా సహకార అధికారిణి ప్రవీణ అమలాపురం టౌన్ : జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు పరపతేతర వ్యాపారాలు చేసుకుంటూ సహకార శాఖ బలోపేతానికి భాగ స్వాములయ్యేలా సంఘాల పాలక వర్గాలు, సీఈవోలు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని డీసీఓ టి.ప్రవీణ అన్నారు. అమలాపురంలోని డీసీసీబీ బ్రాంచి కార్యాలయంలో కోనసీమలోని 116 సంఘాల సీఈఓలతో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘాలు, సిబ్బంది, పాలక వర్గాలు సహకార చట్టాలు, నిబంధనావళికి అనుగుణంగానే పనిచేయాలని వాటిని ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ప్రయోజనం చేకూరేలా ఉండాలన్నారు. డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు మాట్లాడుతూ సంఘాలు రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పలువురు జిల్లా సహకార శాఖ అధికారులు మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలతో సహకార కార్యకలాపాలు జరగాలన్నారు. ప్రతి సంఘం కచ్చితంగా నగదు రహిత మెషీన్లు కలిగి ఉండాలన్నారు. సంఘంలో సభ్యుడైన ప్రతి రైతు డెబిట్ మెంబర్ రిజిస్ట్రేషన్ (డీఎంఆర్) కార్డు కలిగి ఉండాలన్నారు. ఈ కార్డులో సభ్యుల సమగ్ర సమాచారం ఉంటుందన్నారు. జిల్లా ఆడిట్ అధికారి వి.ఫణికుమార్, నాబార్డ్ డీజీఎం ప్రసాద్, డీసీసీబీ ఏజీఎం కృష్ణమూర్తి రాజు, జిల్లా సహకార విద్యాధికారి ఆదిమూలం వెంకటేశ్వరరావు, అమలాపురం డివిజన్ సహకార అధికారి బీకే దుర్గా ప్రసాద్, రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పెంకే సత్యనారాయణ, కోశాధికారి తోట వెంకట్రామయ్య, అమలాపురం డీసీసీబీ బ్రాంచి మేనేజర్ కోలా నారాయణరావు తదితరులు సమావేశంలో మాట్లాడారు. అనంతరం 116 సంఘాల సీఈఓలకు నగదు రహిత లావాదేవీలు, డీఎంఆర్ కార్డులు, పరపతేతర వ్యాపారాలపై సహకార నిపుణులు శిక్షణ ఇచ్చారు. డీసీఓ ప్రవీణ, డీసీసీబీ సీఈవో ధర్మారావులు సంఘాల సీఈవోలకు నగదు రహిత మెషీన్లు, ఆరోగ్య రక్ష కార్డులు పంపిణీ చేశారు. -
ధాన్యం.. దైన్యం!
ఈసారైనా ‘మద్దతు’ లభించేనా? - పక్షం రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ బాట - కొనుగోళ్లకు ప్రభుత్వ సంస్థలు దూరం - సహకార సంఘాలకే బాధ్యత లు! - ఉత్పత్తుల సేకరణపై అనుమానాలు గజ్వేల్: వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఈసారైనా మార్పులుంటాయా? మద్దతు ధర లభించేనా?.. మరో 15 రోజుల్లో వ్యవసాయోత్పత్తులు మార్కెట్ బాట పట్టే అవకాశమున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతోంది. మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు కొనుగోలు చేసే మార్క్‌ఫెడ్, వడ్లను కొనుగోలు చేసే సివిల్ సప్లయ్ (పౌర సరఫరాల శాఖ), ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ), ఆముదాలు, పొద్దుతిరుగుడు వంటి నూనె ఉత్పత్తులు కొనుగోలు చేసే ఆయిల్‌ఫెడ్ సంస్థలు జిల్లాలో తమ కొనుగోలు కేంద్రాలను ఎత్తేశాయి. మరోపక్క పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నామమాత్రంగానే కేంద్రాలను నడుపుతున్నది. కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార సంఘాలకు వదిలేస్తూ ప్రభుత్వరంగ సంస్థలు పర్యవేక్షణకే పరిమితం కావడం రైతులను కుంగదీస్తున్నది. ఈసారి ఐకేపీ కేంద్రాలనూ ఎత్తేసి సహకార సంఘాలకే కొనుగోళ్ల బాధ్యతను పూర్తిస్థాయిలో అప్పగించనున్నారని తెలుస్తున్నది. ఈ మేరకు జీఓ కూడా విడుదలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.. ఏదేమైనా ప్రభుత్వ సంస్థలను నేరుగా రంగంలోకి దిగితే తప్ప ఇబ్బందులు తీరేలా లేవు. బాధ్యతల నుంచి తప్పుకున్న మార్క్‌ఫెడ్ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 80 వేల హెక్టార్లకుపైగా మొక్కజొన్న, 1.10 హెక్టార్లలో పత్తి, మరో 40 హెక్టార్లకుపైగా వరిసాగైంది. మొక్కజొన్నకు సంబంధించిన ఉత్పత్తులు మరో 15 రోజుల్లో మార్కెట్ బాటపట్టే అవకాశమున్నది. అక్టోబర్ నెలాఖరులోగా ధాన్యం, పత్తి ఉత్పత్తులూ మార్కెట్లోకి రానున్నాయి. నిజానికి ప్రభుత్వ రంగ సంస్థ మార్క్‌ఫెడ్ జిల్లాలోని విస్తృత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మొక్కజొన్న ఉత్పత్తులను సేకరించాల్సి ఉండగా ఆ సంస్థ ఈ బాధ్యతను ఎప్పుడో మరిచిపోయిందనే చెప్పాలి. ఐకేపీ సంఘాలకే కొనుగోలు బాధ్యతలను అప్పగించి తాను పర్యవేక్షణకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం గజ్వేల్‌లో మక్కల కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకొన్నాయి. ముగ్గురు ఐకేపీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. వరిదీ అదే దారి.. వరి ఉత్పత్తుల సేకరణకు గతంలో పౌరసరఫరాలశాఖ, భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో గజ్వేల్, సిద్దిపేట, తొగుట, మెదక్ తదితర చోట్ల 8 వరకు కొనుగోలు కేంద్రాలను మూడేళ్ల క్రితం వరకు ఏర్పాటుచేయగా.. ప్రస్తుతం వాటిని ఎత్తేశారు. కొనుగోలు బాధ్యతలను పూర్తిగా సహకార సొసైటీలు, ఐకేపీ కేంద్రాలకు అప్పగించారు. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో 50 వరకు కేంద్రాలను ఏర్పాటుచేసి కేవలం పర్యవేక్షణ బాధ్యతలకే పౌరసరఫరాల శాఖ పరిమితమవుతున్నది. గతంలో సివిల్ సప్లయ్, ఎఫ్‌సీఐ కేంద్రాల్లో అమ్ముకునే ఉత్పత్తులకు తూకాల్లో, గిట్టుబాటు ధర విషయంలో మోసం జరిగేదికాదు. ప్రస్తుతం కొనుగోళ్లను పూర్తిగా ఐకేపీ, సహకార కేంద్రాలే నిర్వహించడం వల్ల ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదు. ప్రత్యేకించి సహకార సంఘాలు కొనుగోళ్ల రంగంలోకి రావడం ఇది రెండో ఏడాదే. కొనుగోళ్ల బాధ్యతను చేపట్టిన సంస్థలకు క్వింటాలుకు 2.5శాతం కమీషన్ ఇస్తున్నారు. ఈ సంస్థలకు మార్కెట్ యార్డులున్నచోట మార్కెటింగ్ శాఖ అధికారులు సమకూరుస్తుండగా మిగతాచోట్ల ఆ సంస్థలే సమకూర్చుకోవాలని సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన తలకు మించిన భారంగా మారుతున్నది. సీసీఐదీ అదే తీరు.. పత్తి ఉత్పత్తులకు ఆధారమైన సీసీఐ కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదు. సీజన్లో ఈ కేంద్రాలను నిరంతరంగా తెరవకపోవడం వల్ల రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కాగా, ఈసారి కొత్తగా కొనుగోళ్ల బాధ్యత నుంచి ఐకేపీ కేంద్రాలను తప్పిస్తున్నారని, ఇందుకు సంబంధించిన జీఓ కూడా విడుదలైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల బాధ్యతను పూర్తిగా సహకార సంఘాలకు అప్పగించనున్నారనే ప్రచారం సాగుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనే ఇబ్బందులకు అడ్డుకట్ట కొనుగోళ్ల రంగంలోకి తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలు వస్తేనే రైతుల ఇబ్బందులు తీరే అవకాశమున్నది. కొత్త రాష్ట్రంలో...ఈ విధానాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుకుంటున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాల్సి ఉన్నది.