‘జూబ్లీహిల్స్‌’.. అక్రమాలు ఫుల్‌! | Scams In Jubilee Hills Cooperative Society | Sakshi
Sakshi News home page

‘జూబ్లీహిల్స్‌’.. అక్రమాలు ఫుల్‌!

Published Sat, Oct 5 2024 5:42 AM | Last Updated on Sat, Oct 5 2024 3:57 PM

Scams In Jubilee Hills Cooperative Society

సహకార హౌసింగ్‌ సొసైటీలో అవకతవకలు 

స్వలాభం కోసం పాలకవర్గంలోని కొందరి స్కెచ్‌ 

చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొత్తగా సభ్యత్వాలకు ఆహ్వానం 

సొసైటీలో లబి్ధపొందని వారు 10శాతానికి మించొద్దని నిబంధన 

ఇప్పటికే స్థలం రానివారు 30శాతానికిపైనే.. 

అయినా మరో 800 మందిని చేర్చుకునేందుకు ప్లాన్‌ 

రూ.5 లక్షలు కడితే సభ్యత్వం అంటూ ప్రచారం 

తెర వెనుక అనధికారిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం! 

సొసైటీ పాలక వర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యుల కరపత్రాలు 

అయినా వెనక్కి తగ్గని పాలకవర్గం..

సాక్షి, హైదరాబాద్‌: సహకార హౌసింగ్‌ సొసైటీలు ఏవైనా.. సొసైటీలో ఇల్లు లేని వారికి తక్కువ ధరతో స్థలం అందేలా చూడటం, సభ్యులు చెల్లించే సొమ్మును, వారి ప్రయోజనాలను పరిరక్షించడం వాటి విధి. కానీ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ అందుకు పూర్తి విరుద్ధంగా తయారైంది. 1962లో ఎంతో మంచి ఉద్దేశంతో ఏర్పాటైన ఈ సొసైటీ.. కొన్నేళ్ల నుంచి రూట్‌ మార్చుకుంది. చట్టాన్ని పట్టించుకునేది లేదు.. నిబంధనలను అమలు చేసేది లేదు.. పాలక వర్గానికి తోచిందే చట్టం, వారు పెట్టిందే నిబంధన అన్నట్టు మారింది.

కొందరు వ్యక్తులు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారు కొన్నేళ్లుగా సొసైటీని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న  విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పాతవారికి స్థలాలు మంజూరు కాకుండానే కొత్తగా సభ్యులను చేర్చుకునే అక్రమానికి తెరలేపారని మండిపడుతున్నారు. దీనికోసం దశాబ్దాలుగా ఉంటున్న వారిని సొసైటీ నుంచి తొలగించేందుకు ప్రయతి్నంచారని.. సంబంధిత అధికారులు దీన్ని తిరస్కరించారని సమాచారం. తమ పథకం బెడిసికొట్టినా.. కొత్త సభ్యత్వాలను మాత్రం ప్రారంభించడం గమనార్హం. టీవీ–5 చానల్‌ అధినేత కుమారుడు రవీంద్రనాథ్‌ అధ్యక్షుడిగా ఉన్న ఈ జూబ్లీహిల్స్‌ సొసైటీ లీలలు మరెన్నో ఉన్నాయని కొందరు సభ్యులు పేర్కొంటున్నారు. 

సహకార సూత్రాల మేరకు ఏర్పాటై.. 
‘ఆంధ్రప్రదేశ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ చట్టం’కింద 1962 జూలై 7న ‘జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీ లిమిటెడ్‌ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్‌)’రిజిస్టర్‌ అయింది. సొసైటీ ఏర్పడినప్పుడు సభ్యుల సంఖ్య 300 మంది. సహకార సూత్రాలకు అనుగుణంగా సభ్యుల ప్రయోజనాలు కాపాడుతూ.. భూమి కొనుగోలు, అభివృద్ధి చేయాలన్నది నిబంధన. సొసైటీ కోసం 2,500 షేర్లను, ఒక్కో షేర్‌కు రూ.100 చొప్పున నిర్ణయించి.. మొత్తంగా రూ.2.5 లక్షల మూలధనంతో సొసైటీని ప్రారంభించారు. నిబంధనల మేరకు జూబ్లీహిల్స్‌లోనే ఈ సొసైటీ కార్యకలాపాలు నిర్వహించాలి.

సభ్యుల్లో ఎవరైనా తన పేరిట, తన భార్య, పిల్లల పేరు మీద షేర్లు కొనుగోలు చేయవచ్చు. అయితే సొంత ఇల్లు లేనివారే సభ్యుడిగా ఉంటారు. 1964లో ప్రభుత్వం షేక్‌పేట్‌ సర్వే నంబర్‌ 403లో 1,195 ఎకరాలు, హకీంపేట్‌ సర్వే నంబర్‌ 102లో 203 ఎకరాలు కలిపి మొత్తంగా 1,398 ఎకరాలను కేటాయించింది. ఇందులో.. 1971లో 1,345.40 ఎకరాలను, 1972లో 40.67 ఎకరాలను కలిపి.. 1,386.07 ఎకరాలను సొసైటీకి అందజేసింది. సొసైటీ ఈ భూమిలో 1984 నుంచి 1991 మధ్య 3,035 మంది సభ్యులకు ప్లాట్లను అందజేసింది. సభ్యులకు ఒకసారి ప్లాట్‌ అందినా, లేదా సభ్యుడయ్యాక హైదరాబాద్‌ నగరంలో ఇల్లు ఉన్నా వారు మరో ప్లాట్‌ పొందేందుకు అనర్హులు. 

విక్రయించడం చట్టవిరుద్ధం 
ఒకరి ప్లాట్‌ను మరో సభ్యుడికి బదిలీ చేయడంగానీ, అసలు సభ్యత్వమే లేని వారికి విక్రయించడంగానీ చట్టవిరుద్ధం. ఒకవేళ ఏవైనా అనివార్య కారణాలతో సభ్యుడెవరైనా ప్లాట్‌ బదిలీ చేయాలని భావిస్తే.. దాన్ని సొసైటీకి అప్పగించాలి. ప్లాట్‌ పొందేటప్పుడు వారు చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా సొసైటీ తిరిగి చెల్లించాలి. ఈ స్థలాన్ని సొసైటీలో సీనియారిటీ ప్రకారం వెయిటింగ్‌లోని లబ్ధిదారులకు మంజూరు చేయాలి. వీరి నుంచి ప్రభుత్వ మార్కెట్‌ విలువ, ఇతర చార్జీలు వసూలు చేయవచ్చు. మేనేజింగ్‌ కమిటీ అనుమతి లేకుండా సభ్యుడు స్థలాన్ని విక్రయించడానికి వీలులేదు. అలా ఎవరైనా విక్రయిస్తే అది చట్టవిరుద్ధంగా, కొనుగోలు చేసినవారిని ఆక్రమణదారుగా పరిగణిస్తారు. ఇక సొసైటీలోని సభ్యులందరికీ ఇంటి స్థలం మంజూరుకాకుండా.. కొత్తగా సభ్యులను తీసుకోవద్దని నిబంధన చెబుతోంది. ఉదాహరణకు 90 మందికి స్థలాలు ఇచ్చే అవకాశం ఉంటే 100 మందిని సభ్యులుగా తీసుకోవాలి. లబి్ధపొందని వారు 10 శాతానికి మించి ఉండటానికి వీలులేదు. కానీ జూబ్లీహిల్స్‌ సొసైటీలో స్థలాలు అందనివారు 30 శాతానికి పైనే.. 

800 మందిని తొలగించే ప్రయత్నం.. 
సొసైటీలో కేవైసీ (పూర్తి చిరునామా, ఇతర వివరాలు) లేదని, జనరల్‌ బాడీ సమావేశానికి హాజరుకావడం లేదని.. ఎక్కడ ఉంటున్నారో అడ్రస్‌ కూడా లేదని కారణాలు చూపుతూ దశాబ్దాలకుపైగా ఉన్న 800 మంది సభ్యుల తొలగింపునకు సొసైటీ పాలకవర్గం ఎత్తులు వేసింది. 2024 మార్చి 24లోగా కేవైసీ అందజేయాలంటూ సభ్యులను ఆదేశించింది. అనుకున్నదే తడవుగా వివరాలు ఇవ్వని 800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. జాబితా కూడా సిద్ధం చేసి పంపగా.. హౌసింగ్‌ అధికారులు దీనికి ససేమిరా అనడంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్‌ పడింది. అయితే అంగ బలం, ఆర్థిక బలంతో ఈ తొలగింపు జాబితాకు అధికారులు ఆమోదముద్ర వేసేలా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. సొసైటీ పాలకవర్గం తీరును నిరసిస్తూ కొందరు సభ్యులు కరపత్రాలు వేసి, పంచినా కూడా.. వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. 

‘రియల్‌’దందా కోసమే.. 
సొసైటీలో అసలు స్థలమే లేనప్పుడు సభ్యులను తొలగించడం ఎందుకు? కొత్త వారిని చేర్చుకోవడం ఎందుకు? అనే ప్రశ్నలూ వస్తున్నాయి. ఇక్కడే సదరు అక్రమార్కులు చక్రం తిప్పడం ప్రారంభించారు. కొత్త సభ్యత్వాల పేర రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలుపెట్టారు. సొసైటీకి సంబంధం లేని వెంచర్‌లో అమ్మకాలు ప్రారంభించారు. అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమంటూ అంటగడుతున్న ఆ వెంచర్‌ ఏంటి? ఎక్కడ ఉంది? ప్లాట్ల అమ్మకాల ‘రియల్‌’కహానీ రెండో భాగంలో.. 

ప్రస్తుతం సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య: 4,962 మంది 
వీరిలో స్థలం పొందిన లబి్ధదారులు: 3,035 మంది 
ఇంకా ప్లాట్లు రానివారు: 1,927 మంది 

మూడు దశాబ్దాలుగా ఎదురుచూపులే.. 
జూబ్లీహిల్స్‌ సొసైటీలో స్థలం మంజూరు కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నవాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటివరకు వారికి స్థలం అందించే దిశగా ఎలాంటి చర్యలు లేవు. మొత్తం 1,927 మంది ఎదురుచూస్తుండగా.. పలు కారణాలతో 800 మందిని తొలగించారు. వారి స్థానంలో నిబంధనలకు విరుద్ధంగా 800 మందిని తీసుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. మిగిలిన 1,145 మందికి స్థలాలు వచ్చే వరకు కొత్త వారిని చేర్చుకోవద్దని డిమాండ్‌ చేస్తున్నాం. క్లబ్‌ కోసమంటూ కొత్త వారిని చేర్చుకుంటే ఒత్తిడి పెరిగి, అసౌకర్యంగా మారుతుంది.  
– ప్రభాకర్‌రావు, సొసైటీ సభ్యుడు

10 శాతానికి మించి ఉండొద్దు.. 
కో–ఆపరేటివ్‌ చట్టంలోని సెక్షన్‌–19 ప్రకారం స్థలాలు ఉంటేనే కొత్త సభ్యులను చేర్చుకోవాలి. ప్రస్తుతానికి సొసైటీ వద్ద ఖాళీ స్థలం లేదు. అంతేకాదు స్థలం పొందని సభ్యులు 10శాతానికి మించి ఉండకూడదని హౌసింగ్‌ సొసైటీ నిబంధన. కొత్తవారి నుంచి షేర్‌ వ్యాల్యూ కేవలం రూ.300 తీసుకుని దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులపై వారికి కూడా హక్కులు వర్తింపజేస్తున్నారు. క్లబ్, స్కూల్, కమ్యూనిటీ సెంటర్‌ ఇలా అన్నింటిలో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం? 
– విజయభాస్కర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడు

సొసైటీది సహాయక పాత్ర మాత్రమే.. 
వివిధ కారణాలతో సొసైటీ నుంచి 800 మంది వెళ్లిపోయారు. వారికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. జనరల్‌ బాడీ ఆమోదంతోనే వారిని తొలగించాం. కొత్త సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. 800 మందికి మించి తీసుకోం. వీరితోపాటు ఇంకా స్థలాలు రానివారు దాదాపు 1,200 మంది ఉన్నారు. ఈ రెండు వేల మంది కలిసి నిర్మించుకుంటున్న వెంచర్‌ జూబ్లీహిల్స్‌ ఫేజ్‌–4. కాస్ట్‌ టు కాస్ట్‌ (ఖర్చులు) ధరకే వీరికి ఫ్లాట్లు అందనున్నాయి. వీరంతా సొసైటీ సభ్యులే అయినందున మేం ఫెసిలిటేటర్‌గా ముందుకు వచ్చాం. వెంచర్‌ను నిపుణులైన కమిటీ పర్యవేక్షిస్తుంది. సొసైటీకి సంబంధించి ఒక్క రూపాయి కూడా వెంచర్‌ కోసం ఖర్చు చేయడం లేదు. చట్టప్రకారం, జనరల్‌ బాడీ అనుమతితోనే చర్యలు చేపడుతున్నాం. 
– రవీంద్రనాథ్, సొసైటీ అధ్యక్షుడు 

సభ్యత్వం తొలగింపుపై చట్టం ఏం చెబుతోంది? 
చట్టప్రకారం ఎవరి సభ్యత్వమైనా తొలగించాలంటే.. ఎందుకు తీసివేస్తున్నామో కారణాలు వెల్లడిస్తూ వారికి నోటీసులు జారీ చేయాలి. తర్వాత వారి వివరణను పరిశీలించాలి. దానిపై సంతృప్తి చెందకుంటే తీసివేతపై మేనేజ్‌మెంట్‌ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ తొలగింపు చట్ట వ్యతిరేకమని సభ్యుడు భావిస్తే.. ట్రిబ్యునల్‌ను, ఆ తర్వాత కోర్టును ఆశ్రయించవచ్చు. అయితే తొలగింపుపై సొసైటీ నోటీసులు జారీచేసినా అవి చాలా మందికి అందలేదని.. వారి వివరణ కూడా రాకుండానే, తొలగిస్తూ జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఇప్పటివరకు జూబ్లీహిల్స్‌ సొసైటీ సభ్యత్వం తొలగింపునకు సంబంధించి ఒక ఫిర్యాదు అందినట్టు తెలిసింది. ఇక కొత్తగా సభ్యులను చేర్చుకునే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ సొసైటీలో లబి్ధపొందని వారు 10శాతం దాటకుండా ఉండాలి. అలాంటిది స్థలం దక్కనివారు ఇప్పటికే 30శాతం ఉన్నా.. కొత్త వారిని ఎలా తీసుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై సొసైటీని వివరణ కోరగా.. వివిధ కారణాలతో 800 మందిని తొలగించామని, ఆ స్థానంలో కొత్తవారిని తీసుకుంటున్నామని వెల్లడించడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement