ప్లాటు పొందిన వ్యక్తి పేరిట 36 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్
కొన్ని గంటల్లోనే మరో వ్యక్తి పేరిట భూమి మార్పు
సీనియారిటీ మేరకు సభ్యులకు దక్కాల్సిన భూమి వేరేవారి చేతుల్లోకి..
జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీలో మరో గోల్‌మాల్
పాలకమండలి కనుసన్నల్లో అక్రమాల పర్వం!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌లో అక్రమాల భూ‘చక్రం’ తిరిగింది. నిబంధనల ప్రకారం సీనియారిటీ ఉన్న సభ్యులకుగానీ, ప్రభుత్వానికి గానీ చెందాల్సిన భూమిని పాలకమండలిలోని ముఖ్యులు పక్కా ప్లాన్‌తో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. సొసైటీలోని ముఖ్యులతోపాటు అధికార యంత్రాంగం కూడా ఈ తతంగంలో భాగస్వామ్యం కావడం గమనార్హం.
ప్రభుత్వం ఈ సొసైటీకి కేటాయించిన భూమి నుంచి 304/జీ/111 ప్లాట్‌ను 1988లో సభ్యత్వం నంబర్ 4153గా ఉన్న ఐఏఎస్ నటరాజన్‌కు కేటాయించారు. నటరాజన్ మరణించిన కొన్నేళ్లకు ఆయన కుమారుడు శంకర్ నారాయణన్ పేరుపై సభ్యత్వ బదిలీ జరిగింది. కానీ ఆయన ఇప్పటివరకు ప్రభుత్వ విలువను చెల్లించి ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.
ఇలాంటప్పుడు సదరు ప్లాట్‌ను సీనియారిటీ మేరకు తర్వాతి లబ్ధిదారులకు బదిలీ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ అలా చేయలేదు. 36 ఏళ్లు గడిచాయి. ఇప్పటి పాలకమండలి సభ్యులు ‘భూ’ చక్రం తిప్పారు. అతి ఖరీదైన ఈ ప్లాట్‌ను తొలుత శంకర్ నారాయణన్ పేరిట, ఆ వెంటనే సర్దార్ దల్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి పేరిట ఒక్కరోజులోనే గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది పూర్తిగా సొసైటీ నిబంధనలకు విరుద్ధం.
ప్లాట్ ఓనర్ కాకుండానే..
సొసైటీ పాలకవర్గం చకచకా స్థలాన్ని శంకర్ నారాయణన్ పేరు మీదకు, తర్వాత గంటల వ్యవధిలోనే దల్జీత్ సింగ్‌కు బదిలీ చేయడం గమనార్హం. శంకర్ నారాయణన్‌కు రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వ విలువను సొసైటీకి చెల్లించాల్సిన నేపథ్యంలో.. ఆ మొత్తాన్ని దల్జీత్ సింగ్ బదిలీ చేశారు. జూన్ 28న నారాయణన్ చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ కోసం రూ.25,89,735.. 29న రూ.60,80,550 చెల్లించారు.
విచిత్రమేంటంటే అప్పటికి ఆయన ప్లాట్ ఓనర్ కానే కాదు. అలాగే సొసైటీకి చెల్లించాల్సిన రూ.3,40,67,600ను జూలై 1న బదిలీ చేశారు. డాక్యుమెంట్ నంబర్ 4244/2024తో 529 గజాల భూమి శంకర్ నారాయణన్ పేరు మీదకు మారింది. తర్వాత గంటల వ్యవధిలోనే ఆ భూమిని దల్జీత్ సింగ్ పేరిట మార్చే పని మొదలుపెట్టారు.
ఇళ్లు నిర్మించకుండా అమ్మకం చెల్లదు
సొసైటీలో భూమి పొందిన లబ్ధిదారులెవరైనా 18 నెలల్లో ఇల్లు నిర్మించకుంటే.. దాన్ని రద్దు చేసే అధికారం సొసైటీకి ఉంటుంది. అసలు ఇల్లు నిర్మించకుండా అమ్మడం చెల్లదనేది సొసైటీ నిబంధన కూడా. రిజిస్ట్రేషన్ పత్రాల్లోనూ ఈ విషయాన్ని పేర్కొంటారు. ఇవేమీ పట్టించుకోకుండా దల్జీత్ పేరు మీదకు రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నంబర్ 4257/2024) మారిపోయింది.
సాధారణంగా ఎవరైనా రిజిస్ట్రార్ కార్యాలయంలో భూమి రిజిస్ట్రేషన్ చేశాక డాక్యుమెంట్లు రావడానికి వారం రోజుల సమయం పడుతుంది. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే చేతికిచ్చారంటే.. అక్రమంలో అధికారుల పాత్ర ఏమిటో తెలిసిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నారాయణన్ పేరు మీది డాక్యుమెంట్ రాకుండానే సబ్ రిజిస్ట్రార్ దల్జీత్ పేరిట రిజిస్ట్రేషన్‌కు ఏర్పాట్లు చేయడం గమనార్హం.
రిజిస్ట్రేషన్ సమయంలో రూ.8 కోట్లు చెల్లిస్తున్నట్లు పేర్కొన్న దల్జీత్.. రూ.4,25,42,665ను డీడీ రూపంలో నారాయణన్‌కు బదిలీ చేసినట్టు చూపారు. సొసైటీలోని భూమి నారాయణన్ పేరు మీదకు జూలై 1న రిజిస్ట్రేషన్ కాగా.. అదే రోజున దల్జీత్ పేరు మీదకు మారడం గమనార్హం.
నిబంధనలను పక్కకు నెట్టి..
హౌసింగ్ సొసైటీ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం స్థలం మంజూరు చేస్తుంది. కేటాయించిన స్థలంలో గృహ నిర్మాణం చేపట్టాలి. లేదంటే తిరిగి సొసైటీకి స్థలాన్ని అప్పగించాలి. అంటే శంకర్ నారాయణన్ పేరిట స్థలం మారినా.. అందులో ఎలాంటి నిర్మాణం చేపట్టకుండానే దల్జీత్‌కు విక్రయించడం సొసైటీ నిబంధనలకు విరుద్ధం.
అంతేకాదు.. స్థలం బదిలీకి ఒకట్రెండు సంవత్సరాలు వేచిచూడాలి, లేదా సొసైటీలోని తర్వాతి లబ్ధిదారులకు కేటాయించాలని చట్టం చెబుతోంది. దీన్ని సొసైటీ పాలకమండలి పూర్తిగా ఉల్లంఘించింది. రిజిస్ట్రేషన్లు చేసిన సబ్ రిజిస్ట్రార్ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకపోవడంతో అధికారులకూ ఈ అక్రమాల్లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
కోట్ల రూపాయల అక్రమం!
దల్జీత్‌సింగ్ తన పేరుమీదకు మారిన స్థలంలో నిర్మాణం ప్రారంభించేందుకు జూన్ 18న జీహెచ్‌ఎంసీకి మార్టిగేజ్ చేశారు. సొసైటీ నుంచి నారాయణన్ పేరిట జరిగిన రిజిస్ట్రేషన్‌లో 529 గజాల ప్లాట్‌కు గజానికి రూ.64,400 చొప్పున మొత్తం రూ.3,40,67,600గా లెక్కగట్టారు. రూ.25,89,720 స్టాంప్ డ్యూటీగా చెల్లించారు.
ఇదే ప్లాట్‌ను దల్జీత్ పేరిట మార్చిన రిజిస్ట్రేషన్‌లో మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.1,54,228 చొప్పున లెక్కించారు. స్టాంపు డ్యూటీగా రూ.60,80,550 చెల్లించారు. అంటే మొత్తం ప్లాట్ ధర రూ.8 కోట్లుగా చూపారు. (జూన్ 8న ఆర్టీజీఎస్ ద్వారా రూ.25,89,735.. జూన్ 29న ఆర్టీజీఎస్ ద్వారా రూ.3,40,67,600.. జూలై 1న డీడీ రూపంలో రూ.4,25,42,665.. టీడీఎస్‌కు రూ.8 లక్షలు చెల్లించినట్టు చూపారు).
నిజానికి జూబ్లీహిల్స్‌లో బహిరంగ మార్కెట్ విలువ చదరపు గజానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంది. అంటే ఈ భూమి విలువ రూ.16 కోట్లకుపైనే! అందులో రూ.8 కోట్లు లెక్కకు వచ్చిందని, మిగతా సొమ్ము సంగతి తేల్చాలనే డిమాండ్ వస్తోంది. ఈ వ్యవహారంపై పలువురు ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)’ను ఆశ్రయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment