జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉల్లంఘనలపై కో–ఆపరేటివ్ సొసైటీస్ అధికారుల అలసత్వం
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితంలేదంటున్న సీనియర్ సభ్యులు
త్వరలో ఆందోళన చేపట్టనున్నట్టు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సహకార సొసైటీల్లో అక్రమాలు, అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సిన ‘రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్’విభాగం తీరుపై విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై హౌసింగ్ సొసైటీల స భ్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఏ మాత్రం స్పందించడం లేదనే ఆగ్రహం కనిపిస్తోంది. అక్రమాలపై విచారణ చేపట్టాలని సాక్షాత్తు న్యాయస్థానం ఆదేశించినా కూడా అలసత్వం వహించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సొసైటీలో అక్రమాలపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించి రెండు నెలలైనా సహకార శాఖలో చలనం లేకుండా పోయిందని సభ్యులు మండిపడ్డారు. కో–ఆపరేటివ్ కార్యాలయం ముందు ఆందోళనను నిర్వహించేందుకు సీనియర్ సభ్యులు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు.
ఎన్నెన్నో ఆరోపణలు, ఉల్లంఘనలు..
1962లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం కింద ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జీహెచ్‌సీహెచ్‌బీఎస్)’రిజిస్టర్ అయింది. ఇందులో 4,962 మంది సభ్యులు ఉండగా.. 3,035 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. మరో 1,952 మంది వెయిటింగ్‌లో ఉన్నారు. సొసైటీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.
చాలాకాలం పాటు వాటికి అనుగుణంగా సొసైటీ కార్యకలాపాలు సాగినా.. తర్వాత కొందరు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత సొసైటీ పాలకవర్గం అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు.
దశాబ్దాలుగా కొనసాగుతున్న 800 మంది సభ్యులను తొలగించే ప్రయత్నం చేయడం, కొత్త సభ్యులకు అవకాశం పేరుతో దరఖాస్తులు పంచుకుని సొమ్ము చేసుకోవడం, సొసైటీకి సంబంధం లేని ప్రైవేటు వెంచర్‌కు జూబ్లీహిల్స్–4 పేరుపెట్టి అక్కడ ప్లాట్స్ కొంటే సొసైటీలో సభ్యత్వం అంటూ ప్రచారం చేయడం వంటి ఎన్నో అవకతవకలు జరిగాయని చెబుతున్నారు.
ప్రత్యేక పర్యవేక్షణ ఏది?
సహకార చట్టం ప్రకారం ఎక్కువ సభ్యత్వం, ఉన్నతస్థాయి వ్యక్తులు సభ్యులుగా ఉన్న సొసైటీలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రస్థాయి రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ప్రత్యేక పర్యవేక్షణలోకి ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’తోపాటు మరో నాలుగు సొసైటీలు కూడా వస్తాయి. కానీ జూబ్లీహిల్స్ సొసైటీపై కొన్నేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. పట్టించుకునేవారే లేరన్న విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల సొసైటీ సభ్యులు కొందరు పాలకమండలి అక్రమాలపై కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని అంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. ఈ వ్యవహారం పోలీసుల పరిధిలోకి రాదని, అక్రమార్కులపై క్రిమినల్ కేసు పెట్టేలా సహకార శాఖలో అర్జీ పెట్టుకోవాలని వారు పేర్కొన్నారని చెబుతున్నారు. పోలీసులు ఇచ్చిన కాపీని సైతం జతపర్చి సహకార కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీనియర్ సభ్యులు వాపోతున్నారు.
పాలక వర్గం అక్రమాలపై విచారణ జరిపించాలి
సొసైటీ పాలక మండలి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలి. నిబంధనల ప్రకారం పాత సభ్యులందరికీ స్థలాల కేటాయింపు అనంతరమే కొత్త సభ్యత్వం చేపట్టాలి. సహకార రిజి్రస్టార్ తక్షణమే స్పందించాలి. – జ్యోతిప్రసాద్ కొసరాజు, సీనియర్ సభ్యుడు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ
ఎలాంటి ఉత్తర్వులు అందలేదు..
జూబ్లీహిల్స్ సొసైటీకి సంబంధించి ఎలాంటి ఉత్తర్వుల ప్రతి నాకు అందలేదు. రాష్ట్రంలోని 90 సొసైటీల్లో ఇదొకటి. సొసైటీలపై ఫిర్యాదులు రావడం సహజం. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఏవైనా వచ్చి ఉంటే.. సెక్షన్‌కు వచ్చి ఉండవచ్చు. – జి.శ్రీనివాసరావు, కో–ఆపరేటివ్ అడిషనల్ రిజి్రస్టార్
Comments
Please login to add a commentAdd a comment