న్యూఢిల్లీ: దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రం త్వరలో కొత్త సహకార విధానాన్ని ప్రకటిస్తుందనీ, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.
వచ్చే అయిదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీ)ల సంఖ్య 65 వేల నుంచి 3 లక్షలకు పెరగనుందన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 గ్రామాలకు ఒక పీఏసీ ఉండగా రానున్న అయిదేళ్లలో ప్రతి రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ సహకార యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ప్రభుత్వం సహకార ఉమ్మడి సేవా కేంద్రాల(కోఆపరేటివ్ కామన్ సర్వీస్ సెంటర్లు)ను, జాతీయ డేటాబేస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు.
సహకార వ్యవస్థలు రాష్ట్రాల పరిధిలోనే కొనసాగుతాయని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఘర్షణకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ చట్టాన్ని సవరించడంతోపాటు పీఏసీలను ఆధునీకరించి, డిజిటలైజ్ చేస్తామన్నారు. పీఏసీల అకౌంట్ల కంప్యూటరీకరణలో స్థానిక భాషలను వినియోగించుకోవడతోపాటు జిల్లా సహకార బ్యాంకులతో, నాబార్డుతో అనుసంధానం చేస్తామన్నారు.
పీఏసీలు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్‌పీవో)లుగా, సభ్యుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తాయని తెలిపారు. జాతీయ సహకార సమ్మేళనం మొట్ట మొదటి సమావేశంలో అమిత్ షా శనివారం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వివిధ సహకార సంఘాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరు కాగా, సుమారు మరో 6 కోట్ల మంది ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.
చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం
Comments
Please login to add a commentAdd a comment