మహబూబ్‌నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ శివారులో లే–అవుట్ లేని వెంచర్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్).. రాష్ట్రంలో లక్షలాది మందిని ఇరకాటంలో పడేసింది. లే–అవుట్లు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన పాపానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాపురించింది. గ్రామాలు, పట్టణాల్లో లే–అవుట్లు లేని ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. నూతన విధానంతో ప్లాట్లు క్రమబద్ధీకరణ ఫీజు అధికంగా ఉండటంతో ఆ మేరకు వెచ్చించడం పేదలకు భారంగా మారింది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో మళ్లీ రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 14,569 లే–అవుట్లు ఉండగా.. వాటిలో 3,568కు మాత్రమే నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయి.
11,001 లే–అవుట్లకు ఎలాంటి అనుమతులు లేవు. అనధికార లే–అవుట్లు అని తెలియక చాలామంది భవిష్యత్తు, ఇతర అవసరాల దృష్ట్యా ప్లాట్లు కొనుగోలు చేశారు. వీటిలో రెండు, మూడుసార్లు చేతులు మారి రిజిస్ట్రేషన్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అనధికార లే–అవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఉండి ఉంటే తాము జాగ్రత్త పడి ఉండేవారమని బాధితులు చెబుతున్నారు. ఇదిలాఉండగా అక్రమ లే–æఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయడాన్నీ వారు తప్పుబడుతున్నారు. అక్రమ లే–అవుట్లను గుర్తించి వాటిలో ప్లాట్ల క్రయవిక్రయాలు నిషేధించడం, బోర్డులు ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తే ఎదురయ్యే ఇబ్బందులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు గతంలో ఇవేమీ పట్టించుకోకపోవడంతోనే తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
‘రియల్’వ్యాపారులకు వరం
అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్‌ఆర్‌ఎస్ చాలామంది సామాన్యులపై భారం మోపుతుండగా, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం వరంగా మారింది. రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి అమాయకులకు అంటగట్టారు. తాజాగా ఎల్‌ఆర్‌ఎస్ అమలుతో ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన పేదలపై చార్జీల భారం పడింది. ఇదిలాఉండగా జిల్లా టౌన్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) అనుమతి లేకుండానే నాలా కన్వర్షన్ చేయకుండా, సరైన రోడ్లు, కనీస వసతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లకు ఎల్‌ఆర్‌ఎస్ వరంగా మారింది. ఎల్‌ఆర్‌ఎస్ చార్జీ చెల్లించడం ద్వారా అక్రమ లే–అవుట్లు సక్రమంగా మార్చుకునే వీలు కలుగుతుంది. ప్రస్తుతం ప్లాట్లు విక్రయిస్తున్న రియల్టర్లు ఈ ప్లాట్లు విక్రయించేటప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ సైతం కలుపుకొని ధరలు పెంచి చెబుతున్నారు. ఫలితంగా భవిష్యత్‌లో ప్లాట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా ఇలా..
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 3,416 లే–అవుట్లు ఉండగా వాటిలో 1,609కి మాత్రమే ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 1,014 లే–అవుట్లు ఉండగా 296, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,480 లే–అవుట్లకు గాను 489, నిజామాబాద్ జిల్లాలో 952 లే–అవుట్లకు 176, మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో 825కు 223, నాగర్‌కర్నూల్ జిల్లాలో 676 లే–అవుట్లు ఉంటే 72కు మాత్రమే అనుమతులు ఉన్నాయి. కాగా పెద్దపల్లి జిల్లాలో 58, జగిత్యాలలో 170 లే–అవుట్లు ఉంటే వాటిలో ఒక్క దానికి అనుమతి లేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బుజగౌని రాఘవేందర్‌గౌడ్. మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో సర్వే నం.375/ఆ లో 150 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నాడు. ఆ ప్లాట్లు అక్రమమని, ఎల్‌ఆర్‌ఎస్ చెల్లించాలని మున్సిపల్ అధికారులు చెప్పడంతో ఆందోళనలో పడ్డాడు. అయితే.. అప్పుడే అక్రమమని చెప్పి రిజిస్ట్రేషన్ ఆపితే కొనేవాళ్లమే కాదని, ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవంటున్నాడు. ఇతనొక్కడే కాదు రాష్ట్రంలో అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారందరిదీ ఇదే ఆవేదన.
రాష్ట్రంలో మొత్తం లే–అవుట్లు: 14,569
లే–అవుట్ల పరిధిలో ప్లాట్లు: 16,22,681
ప్లాట్ల విస్తీర్ణం (ఎకరాల్లో): 1,22,338.24
అనుమతులు లేని లే–అవుట్లు: 11,001
వాటి పరిధిలో ప్లాట్లు: 12,14,574
విస్తీర్ణం: 83,452.12
అనుమతులున్న లే–అవుట్లు: 3,568
వాటి పరిధిలో ప్లాట్లు: 4,08,107
విస్తీర్ణం: 38,886.12
Comments
Please login to add a commentAdd a comment