125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ  | Government land regulation Free up to 125 yards | Sakshi
Sakshi News home page

125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ 

Published Sun, Sep 2 2018 1:24 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Government land regulation Free up to 125 yards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై గతంలో జారీ చేసిన జీవోల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఉత్తర్వులు (జీవో 179) జారీ చేశారు. 2008లో జారీ చేసిన జీవో 166 కింద దరఖాస్తు చేసుకున్న వారికి జీవో 59 కింద భూములను క్రమబద్ధీకరించడానికి వీలు కల్పించడంతోపాటు మూడు విడతల్లో రుసుము చెల్లించే అవకాశం కల్పిస్తూ జారీ చేసిన జీవో 134 అమలుకు మార్గదర్శకాలను అందులో పొందుపరిచారు. 

ఈ జీవో ప్రకారం... 
- 125 గజాలు పేద వర్గాల చేతుల్లో ఉంటే ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. పేదల చేతిలో 150 గజాల కంటే ఎక్కువ ఉంటే నామమాత్రపు మార్కెట్‌ విలువను చెల్లించాలి.  
- 150 గజాల్లోపు భూములు నోటిఫైడ్, గుర్తించిన మురికివాడల్లో ఉంటే 10 శాతం మార్కెట్‌ విలువ చెల్లిస్తే చాలు. 
- 250 గజాల్లోపు 25 శాతం, 500 గజాల్లోపు 50 శాతం, 1,000 గజాల్లోపు 75 శాతం, 1,000 గజాలు దాటితే పూర్తి మార్కెట్‌ విలువను చెల్లించాలి. 
- ఖాళీ స్థలాలకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా పూర్తి మార్కెట్‌ విలువ చెల్లించాలి. 
- జీవో 58, 59 తరహాలోనే ఆన్‌లైన్‌ విధానంలో, దరఖాస్తుదారుల ఆధార్‌ నంబర్‌ ఆధారంగా పరిశీలన నిర్వహించాలి. 
- వెబ్‌పోర్టల్‌ను ఈ నెల 15లోగా సిద్ధం చేసి అక్టోబర్‌ 15లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేయాలి. 
- దరఖాస్తులను స్వీకరించిన వెంటనే ఆన్‌లైన్‌లోనే నోటీసు జారీ చేయాలి. 1,000 గజాలు దాటితే దరఖాస్తులను ప్రభుత్వానికి పంపించాల్సిందే. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే సంబంధిత తహసీల్దారే కన్వేయన్స్‌ డీడ్‌ను జారీ చేయాల్సి ఉంటుంది. 
- దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, క్రమబద్ధీకరణ ప్రక్రియ అంతా 2019 జనవరి 31లోగా పూర్తి చేయాలి. 

మూడు వాయిదాలు... 
దరఖాస్తుదారులు క్రమబద్ధీకరణ రుసుమును మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. తొలి వాయిదాను నవంబర్‌ 1లోగా, రెండో వాయిదాను డిసెంబర్‌ 1లోగా, మూడో వాయిదాను 2019 జనవరి 1లోగా చెల్లించాలి. ఏకకాలంలో చెల్లిస్తే 5 శాతం రాయితీ లభించనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement