క్రమబద్ధీకరణకు మార్గం సుగమం!
డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు సర్కారు ఆమోదం
చెల్లింపు కేటగిరీలో డిసెంబర్ 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్లు
సర్కారు ఖాతాకు చేరిన మొత్తం రూ. 162.79 కోట్లు
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కోసం భూపరిపాలన విభాగం అధికారులు రూపొందించిన డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు రాష్ట్ర ఆమోదం తెలిపింది. దీంతో పూర్తి సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు సదరు భూమి హక్కులను వెంటనే బదలాయించేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీట ర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చెల్లింపు కేటగిరీలో 28,233 దరఖాస్తులు రాగా.. ఉచిత కేటగిరీలో వచ్చిన 23,784 దరఖాస్తులను కూడా చెల్లింపు కేటగిరీ కింద అర్హమైనవిగా తేల్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో మొత్తం దరఖాస్తుల సంఖ్య 52,107కు చేరింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరులోగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. తాజాగా డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆన్‌లైన్‌లో పంపారని, డిసెంబర్ 1నుంచి అర్హులైన లబ్ధిదారులకు భూమి హక్కుల బదలాయింపు (రిజిస్ట్రేషన్) ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారని సీసీఎల్‌ఏ అధికారులు చెబుతున్నారు.
రూ. 162.79 కోట్లు జమ
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగా, ఆపైన ఉన్న స్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని నిర్ణయిం చిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో సులభ వాయిదాలతో పాటు ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి రాయితీని కూడా కల్పించారు. ప్రస్తు తం చెల్లింపు కేటగిరీలో ఉన్న 52,017 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 409 మంది ఏకమొత్తంలో సొమ్ము చెల్లించారు. మిగతా లబ్ధిదారులు డిసెంబర్‌లోగా పూర్తి సొమ్ము చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులు డిమాండ్ నోటీసులు జా రీచేశారు. చెల్లింపు కేటగిరీ కింద సర్కారు ఖాతాలో రూ.162.79 కోట్లు జమ అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
సంతకంపై సంశయం!
లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే విషయమై తహసీల్దార్లు చేయాల్సిన సంతకంపై రెవెన్యూ యంత్రాంగంలో సంశయం ఏర్పడింది. డీడ్ ఆఫ్ కన్వేయన్స్‌పై డిజిటల్ సిగ్నేచర్ చేయాలా, ఇంకు సంతకం చేయాలా.. అన్న అంశంపై స్పష్టత రాలేదని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించిన సర్కారు... అవకతవక లు జరిగితే వారినే బాధ్యులుగా చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తే మేలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై 2,3 రోజుల్లో స్పష్టత రానుందని సీసీఎల్‌ఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.