‘లెక్క’ తప్పింది!
♦ కాసులు కురిపించని క్రమబద్ధీకరణ
♦ ప్రభుత్వ అంచనాలు తారుమారు
♦ మార్గదర్శకాల్లో కొరవడిన స్పష్టత
♦ నిర్దేశిత మొత్తం చెల్లించేందుకు వెనుకడుగు
♦ మరోసారి గడువు పెంచే యోచనలో సర్కారు
మొత్తం దరఖాస్తులు 11,846
అర్హమైనవి 6,746
తిరస్కరించినవి 4,872
రావాల్సిన ఆదాయం రూ.243 కోట్లు
ఇప్పటివరకు వచ్చింది రూ.88.36 కోట్లు
భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ గాడితప్పింది. కాసుల వర్షం కురిపిస్తుందని భావించిన సర్కారు లెక్క తారుమారైంది. మార్గదర్శకాల జారీలో జాప్యం.. దరఖాస్తుల పరిశీలనలో సాంకేతికపరమైన ఇబ్బందులు.. డీడీల రూపేణా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించాలనే నిబంధనతో అసలుకే ఎసరొచ్చింది. దీంతో జిల్లావ్యాప్తంగా రూ. 243.99 కోట్ల ఆదాయం రావాల్సిఉండగా, కేవలం రూ.88.36 కోట్లు మాత్రమే జమ అయ్యింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చెల్లింపు కేటగిరీ (జీఓ 59) కింద జిల్లాలో 11,846 దరఖాస్తులు అధికార యంత్రాంగానికి అందాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన రెవెన్యూ అధికారులు 6,746 అర్జీలు క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన విగా తేల్చారు. 4,872 దరఖాస్తులను తిరస్కరించింది. అయితే, క్రమబద్ధీకరణకు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు మొగ్గు చూపలేదు. అధికార యంత్రాంగం సృష్టించిన గంద రగోళమే ఇందుకు కారణం. ఏకమొత్తం చెల్లించిన దరఖాస్తులకు కూడా మోక్షం కలగకపోవడంతో క్రమబద్ధీకరణపై మీమాంసకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశించినట్లు క్రమబద్ధీకరణ ఖజానాకు కాసుల వర్షాన్ని కురిపించలేకపోయింది.
భారీగా ఆశలు..
ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లో వెలిసిన కట్టడాలను క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. శివార్లలో భూముల విలువలు ఆకాశన్నంటినందున.. వీటిని విలువ ఆధారంగా పెద్దఎత్తున రాబడి వస్తుందని లెక్క గట్టింది. అయితే, క్రమబద్ధీకరణకు సంబంధించిన చెల్లింపులకు డిమాండ్ డ్రాఫ్ట్‌లను ముడిపెట్టడంతో చాలా ఆక్రమణదారులు వెనక్కి తగ్గారు. ప్రతి చెల్లింపుపై ఆదాయశాఖ (ఐటీ) నిఘా ఉంటుందని భావించి దరఖాస్తు చేసుకునేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. మార్కెట్ విలువకు అనుగుణంగా కనీస ధరలను నిర్ధేశించడం కూడా వెనుకడుగు వేసేందుకు కారణమైంది. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా 11,846 మంది స్థలాల రెగ్యులరైజేషన్‌కు అర్జీలు పెట్టుకున్నారు. ఈ మేరకు రూ.133 కోట్లను చెల్లించారు. దీంట్లో 628 మంది ఏకమొత్తంలో నిర్దేశిత ఫీజులను కూడా కట్టారు. అయితే, దరఖాస్తుల వడపోతలో చాలావరకు ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురయ్యాయి.
వాస్తవానికి ఆమోదం పొందిన దరఖాస్తులతో ఖజానాకు రూ.243 కోట్లు వస్తాయని లెక్క గట్టింది. విధివిధానాల ఖ రారులో అస్పష్టత, మార్గదర్శకాలను సకాలంలో వెలువరించకపోవడం, యాజమాన్య హక్కుల (కన్వియెన్స్‌డీడ్)లు కల్పించకపోవడంతో క్రమబద్ధీకరణ విషయంలో అర్జీదారుల్లో సహజంగానే అనుమానాలకు తావిచ్చింది. దీంతో అర్హత సాధించిన దరఖాస్తుదారులు కూడా నిర్దేశిత ఫీజుల చెల్లింపుపై వేచిచూసే ధోరణిని అవలంబించారు. ఈ క్రమంలోనే తుది గడువు (ఫిబ్రవరి 29) కాస్తా ముగిసింది. ఈ పరిణామాలతో ఇప్పటివరకు రూ.88.36 కోట్లు మాత్రమే ప్రభుత్వ పద్దుకు చేరాయి. దీంట్లో జనవరిలో రూ.78.79 కోట్లు, ఫిబ్రవరిలో రూ.9.41 కోట్లు, గడువు ముగిసిన తర్వాత అంటే మార్చిలో రూ.15.97 లక్షలు ఖజానాకు జమ అయ్యాయి.
మరోసారి గడువు పొడిగింపు?
భూ క్రమబద్ధీకరణ (జీఓ 59) గడువును మరోసారి పొడగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దడానికి సాంకేతిక సమస్యలు తలెత్తడం, కన్వియెన్స్ డీడ్ ఖరారు కాకపోవడం, ఇతరత్రా పాలనాపరమైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సర్కారు ఈ దిశగా ఆలోచ న చేస్తోంది. మరోవైపు ఆమోదం పొందిన దరఖాస్తుదారులు కూడా స్థలాల రెగ్యులరైజ్‌కు ఆసక్తి చూపకపోవడాన్ని క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని విశ్లేషించుకున్న ఉన్నతాధికారులు.. గడువు పొడగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వ్యవధి పొడగింపు ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి కూడా సంకేతాలు పంపిన ప్రభుత్వం.. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది.