కొత్తగూడెం : సాదా బైనామాపై సవాలక్ష సందేహాలు.. అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ పథకాన్ని అడ్డుపెట్టుకుని కొందరు వసూళ్లకు పాల్పడేందుకు.. మరికొందరు ఎలాగైనా తమ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సైతం తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూములు పహాణీలోకి ఎక్కకపోవడం.. పట్టాదారు పాస్‌పుస్తకాలు సైతం లేకపోవడం తో ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ భూములను పహాణీలో ఎక్కించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో మై దాన ప్రాంత పరి స్థితులు వేరే ఉండగా.. ఏజెన్సీలో మా త్రం దీనికి విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. 1969 తర్వాత గిరిజనేతరు లు క్రయవిక్రయాలు చేస్తే అవి చట్టవిరుద్ధం కావడంతో.. 1970 తర్వాత గిరిజనేతరులు కొనుగోలు చేసిన భూ ములను క్రమబద్ధీకరించుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అసలు అధికారులు విచారణ ఏ ప్రాతిపదికన చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అంతటా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
భూముల ధరలకు రెక్కలు రావడమే..
మైదాన ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో గతంలో అమ్మిన భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కొంద రు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు తమకున్న భూమిలో కొంత మేరకు మాత్రమే అమ్మిన వారు.. కొనుగోలు చేసిన వారు ఎంత మేరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారనే విషయంపై గందరగోళం నెల కొంది. మరికొన్ని చోట్ల అమ్మకం చేసిన వ్యక్తు లు కొనుగోలుదారుల వద్ద నుంచి ఎంతో కొం త రాబట్టుకునేందుకు అబ్జెక్షన్ దరఖాస్తులు సైతం చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ప్ర స్తుతం మైదాన ప్రాంతంలో దీనిపైనే ప్రధాన చర్చ జరగడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఏజెన్సీ ప్రాంతంలో దీనికి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 1969 తర్వాత గిరిజనేతరుల భూముల అమ్మకాలు, కొనుగోలు నిషేధించడంతో ఇప్పటికే వారి వద్ద నుంచి కొనుగోలు చేసి.. సాగు చేసుకుంటున్న రైతులు అడ్డదారులు తొక్కాల్సిన పరిస్థితులున్నాయి.
ప్రహాసనమేనా..
సాదా బైనామా ప్రక్రియ ప్రహాసనంలా మారనుందనే ప్రశ్నకు రెవెన్యూ వర్గాలు అవుననే సమాధామిస్తున్నాయి. సాధారణంగా పహాణీ లో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకుం టే.. కనీసం 6 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం సాదా బైనామాకు సిద్ధం కావడంతో 2,01,762 దరఖాస్తులు వచ్చాయి. ఖమ్మం డివిజన్‌లో అత్యధికంగా 1,28,769, కొత్తగూడెం డివిజన్‌లో 52,119, పాల్వంచ డివిజన్‌లో 19,337, భద్రాచలం డివిజన్‌లో 1,537 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే అరకొర సిబ్బందితో రెవెన్యూ శాఖ సతమతమవుతుండటం.. ఉన్న పనులే సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితులు నెలకొనడంతో.. ప్రస్తు తం సాదా బైనామా క్రమబద్ధీకరణకు ఎన్నేళ్లు పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమానాలెన్నో...
⇔ అధికారులు విచారణ సమయంలో అమ్మకం, కొనుగోలుదారుల వాంగ్మూలం స్వీకరిస్తారా?
⇔ హద్దులు లేని అగ్రిమెంట్లను ఏ ప్రాతిపదికన చేస్తారు?
⇔ అమ్మకందారులు మరణిస్తే వారి వారసుల వాంగ్మూలం సేకరిస్తారా?
⇔ పంపకాలు జరగని వారసత్వ భూములను ఎలా క్రమబద్ధీకరిస్తారు?
⇔ అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ నిలిచేనా?
⇔ ఏజెన్సీలో నకిలీ డాక్యుమెంట్లను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారా?
⇔అమ్మకందారులు స్థానికంగా లేనిపక్షంలో వారి వాంగ్మూలం సేకరణ పరిస్థితి ఏమిటి?
⇔ సాదా బైనామాకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేస్తారా?
⇔ వివాదంలో ఉన్న భూముల అడ్డదారి క్రమబద్ధీకరణ నిలిచేనా?
⇔ డాక్యుమెంట్ రాత సమయంలో సాక్షుల సంతకాలు లేకుంటే వాటి పరిస్థితి ఏమిటి?