Health: సందేహం.. రోగ భయం! | Health: Precautions And Instructions To Be Taken To Eliminate Mental Illness | Sakshi
Sakshi News home page

Health: పదే పదే సందేహపడటం కూడా ఒక వ్యాధేనని మీకు తెలుసా?

Published Mon, Sep 9 2024 1:55 PM | Last Updated on Mon, Sep 9 2024 1:55 PM

Health: Precautions And Instructions To Be Taken To Eliminate Mental Illness

ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు

సోషల్‌ మీడియాలో పోస్టులతో మరింత బెంబేలు

ఏ చిన్న లక్షణం కనిపించినా వైద్యుల వద్దకు పరుగు

మాకు ఫలానా పరీక్షలు చేయించాలంటూ డాక్టర్లకు సలహా

20కి పైగా వైద్యపరీక్షలు చేసినా ఫలితం సున్నా

ఇది మానసిక వ్యాధి లక్షణమంటున్న వైద్యులు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలలోని మానసిక జబ్బుల విభాగానికి ప్రతిరోజూ 100 నుంచి 150 మంది వరకు  చికిత్స కోసం వస్తుంటారు. అలాగే ప్రైవేటుగా ఉండే మానసిక వ్యాధి నిపుణుల వద్దకు సైతం ప్రతిరోజూ 400 నుంచి 500 మంది చికిత్స కోసం వస్తారు. వీరిలో 20 శాతం మంది తమకు ఏ జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మదనపడుతూ వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు తిరుగుతూ ఎక్కడా ఎలాంటి పరిష్కారం లభించక చివరకు మానసిక వైద్యుల వద్దకు వస్తున్నారు.

ఫలానా చోట సెలూన్‌కు వెళ్లి గుండు/సేవింగ్‌ చేయించుకుంటే దానివల్ల ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందేమోనని, ఛాతీలో ఎక్కడైనా కొద్దిగా నొప్పిగా ఉన్నా, భారంగా అనిపించినా, గుండె వేగంగా కొట్టుకున్నా హార్ట్‌ ఎటాక్‌ వచ్చే అవకాశం ఉందేమోనని అనుమానం తరచూ వస్తుంటుంది. ఇలాంటి వారు ముందుగా ఆయా వ్యాధి లక్షణాలను బట్టి స్పెషలిస్టుల వద్దకు వెళతారు. అక్కడ అన్ని పరీక్షలు చేయించుకున్నా నార్మల్‌గా ఉందని డాక్టర్‌ చెప్పినా అనుమానం తీరదు. మళ్లీ ఇంకో డాక్టర్‌ను సంప్రదించి ముందుగా చేసిన పరీక్షలు చూపించకుండా మళ్లీ పరీక్షలు చేయిస్తారు. అక్కడ కూడా నార్మల్‌గా రిపోర్టులు వచ్చినా వారి మనస్సు శాంతించదు. ఏమీ లేకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతోందని వైద్యులను ప్రశి్నస్తుంటారు. ఇలాంటి వారికి నచ్చజెప్పి చికిత్స చేసేందుకు వైద్యులు చాలా కష్టపడుతుంటారు.

కోవిడ్‌ తర్వాత మరింత అధికం..
ప్రజల జీవనశైలి కోవిడ్‌కు ముందు...ఆ తర్వాత అన్నట్లు తయారయ్యింది. అప్పటి వరకు సాధారణ జీవితం కొనసాగించిన ప్రజలు ఆ తర్వాత ఆరోగ్యానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటున్నారు. ఏ ఒక్క విషయాన్ని నిర్లక్ష్యం చేయడం లేదు. అయితే ఇందులో తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో శోధించి, సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారం సరైనదిగా భావించి నమ్మి అనుసరిస్తున్నారు. ఎవరు ఏమి చెబితే దానిని ఆచరిస్తూ ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారు. మరికొందరు అతిగా మద్యం, గంజాయి, ధూమపానం చేయడంతో పాటు వారంలో నాలుగైదు రోజులు బిర్యానీలు, రోజూ ఫాస్ట్‌ఫుడ్‌లు తింటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు.

వీటి ఫలితంగా వారి ఆరోగ్యస్థితిగతుల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాల గురించి పట్టించుకోకుండా ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. వైద్యులకు వారే ఫలానా వ్యాధి వచ్చి ఉంటుందని, ఈ వైద్యపరీక్షలు చేయాలని, ఫలానా మందులు రాయాలని సూచిస్తున్నారు. వైద్యపరీక్షల్లో ఏమీ లేదని నిర్ధారణ అయినా మరో వైద్యుని వద్దకు వెళ్లి వారికున్న ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెట్టి మళ్లీ చికిత్స చేయించుకుంటున్నారు. ఇలా వారు ఏ ఒక్క పరీక్షనూ, వైద్యున్నీ సరిగ్గా నమ్మకుండా ఇంట్లో గుట్టలుగా వైద్యపరీక్షలు పేర్చుకుని కూర్చుంటున్నారు. ఏ వైద్యుని వద్దకు వెళ్లినా ఆ పరీక్షలన్నీ తీసుకెళ్లి చూపిస్తున్నారు. ఇది మానసిక జబ్బని, దీనిని హైపోకాండ్రియాసిస్‌గా పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు.

మహిళల్లో పెరుగుతున్న భయాందోళన..
ఇటీవల కాలంలో మహిళల్లో భయాందోళనలు అధికమవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు ఆందోళన, డిప్రెషన్, గుండెదడ, తీవ్ర మానసిక ఒత్తిళ్లతో వారు చికిత్స కోసం వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. తనను కుటుంబసభ్యులు, భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదని భావించి లేని రోగాన్ని ఆపాదించుకుని వైద్యుల వద్దకు తిరుగుతున్నారు.  వారికి వచ్చిన సమస్య నుంచి బయటపడేందుకు ఏదో ఒక ఆరోగ్యసమస్య చెబుతూ ఉంటారు. వారు చెప్పే వ్యాధి లక్షణాలకు తాలూకు వైద్యపరీక్షలు చేయిస్తే ఎలాంటి సమస్య ఉండదు. దీనిని సొమటైజేషన్‌ డిజార్డర్‌ అంటారు. ఇలాంటి వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లు ఉంటారు. వీరికి ఆరోగ్యం బాగైనా కూడా బాగున్నట్లు చెప్పరు. అలా చెబితే మళ్లీ తనను కుటుంబసభ్యులు సరిగ్గా పట్టించుకోరని వారి అనుమానం. ఇలాంటి వాటికి సైకోథెరపీ, మందులు వాడాల్సి ఉంటుంది.

  • కర్నూలు నగరం గాం«దీనగర్‌కు చెందిన లలితకుమారికి ఇటీవల గ్యాస్‌ పట్టేసినట్లు అనిపించింది. ముందుగా ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుని వచ్చింది. మరునాడు మళ్లీ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆయన ఎండోస్కోపిక్, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్, ఈసీజీతో పాటు మరికొన్ని పరీక్షలు చేయించి రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పి పంపించారు. ఆ తర్వాత మరో రెండు రోజులకు ఆమె ఛాతీలో బరువుగా ఉందని మరో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆమెకు మానసిక సమస్య ఉండటంతో ఇలా ప్రవర్తిస్తోందని వైద్యులు నిర్ధారించారు.

  • కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవికి గుండెలో పట్టేసినట్లు ఉంటే డాక్టర్‌ వద్దకు వెళ్లి ఈసీజీ తీయించుకున్నారు. ఈసీజీ నార్మల్‌గా ఉందని మందులు వాడాలని వైద్యులు సూచించారు. ఆ మరునాడు మళ్లీ తనకు గుండె దడగా ఉందని, నీరసంగా అనిపిస్తోందని, ఆయాసంగా ఉందని చెప్పడంతో మరో డాక్టర్‌ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించారు. అన్నీ పరీక్షలు నార్మల్‌గా రావడంతో ఏమీ లేదని కంగారు పడాల్సిందేమి లేదని వైద్యులు నిర్ధారించారు.

..వీరిద్దరే కాదు సమాజంలో ఇలాంటి వారి సంఖ్య ఇటీవల తరచూ పెరుగుతోంది. ఈ మేరకు ఆయా ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. తలనొస్తుందంటే ఎంఆర్‌ఐ, చేయి నొప్పి పెడుతుందంటే హార్ట్‌ ప్రాబ్లం ఉందని, కాస్త త్రేన్పులు వస్తే గ్యాస్‌ ఎక్కువైందని ఎండోస్కోపి చేయించుకుంటే మేలనే ధోరణిలో పలువురు తయారయ్యారు. ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో ఆరోగ్య విషయాలకు సంబంధించి తెలిసీ తెలియని వ్యక్తులు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. ఫలితంగా సాధారణంగా మనిíÙలో ఏదైనా కనిపించే ప్రతి ఆరోగ్య అవలక్షణాన్ని భూతద్దంలో చూస్తూ జనం బెంబేలెత్తుతున్నారు. దీనిని వైద్యపరిభాషలో హైపోకాండ్రియాసిస్‌గా పేర్కొంటారు.

హైపోకాండ్రియాసిస్‌ బాధితుల సంఖ్య పెరిగింది..
ప్రతిసారీ ఏదో ఒక జబ్బు ఉన్నట్లు భ్రమిస్తుంటారు. వైద్యుల వద్దకు వెళ్లి ఫలానా పరీక్షలు రాయాలని ఒత్తిడి చేస్తుంటారు. వారు ఒక డాక్టర్‌ చికిత్సతో సంతృప్తి చెందరు. ఎలాంటి వ్యాధి లేదని చెప్పినా మళ్లీ మళ్లీ ఇంకో డాక్టర్‌ వద్దకు వెళ్తుంటారు. వీరిలో భయం, ఆందోళన, డిప్రెషన్‌ కూడా ఉంటుంది. దీనిని హైపోకాండ్రియాసిస్‌ అంటారు. సమాజంలో 2నుంచి 5 శాతం మందిలో ఈ సమస్య ఉంది. వ్యాధి తీవ్రతను బట్టి సైక్రియాటిక్‌ మందులతో పాటు కౌన్సెలింగ్‌ అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్సులో ఉన్న వారికి వస్తుంది. ఇలాంటి సమస్య వల్ల వారు ఆర్థికంగా, వృత్తిపరంగా నష్టపోతుంటారు. – డాక్టర్‌ ఎస్‌. ఇక్రముల్లా, మానసిక వైద్యనిపుణులు, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి

కోవిడ్‌ అనంతరం ఆందోళన పెరిగింది..
కోవిడ్‌ అనంతరం చాలా మందిలో వారి ఆరోగ్యం పట్ల భయం, ఆందోళన మరింత పెరిగింది. ఫలితంగా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వారిలో భయం, ఆందోళన పెరుగుతున్నాయి. కోవిడ్‌ తర్వాత చిన్న వయస్సులోనే గుండెపోటు, స్ట్రోక్‌ బాధితుల సంఖ్య పెరగడం కూడా దీనికి ఒక కారణం. ఆకస్మిక మరణాలు కూడా ప్రజల్లో ఆందోళనకు ఒక కారణంగా చెప్పవచ్చు. చిన్న జ్వరం వచ్చినా ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరిగెత్తే వారి సంఖ్య బాగా పెరిగింది. దీనికితోడు ఒత్తిడితో కూడిన జీవితం ఈ తరంలో అధికమైంది. సోషల్‌ మీడియాలో సమాచారం చూసి తమ ఆరోగ్యంపై వ్యతిరేక భావాన్ని అన్వయించుకునే వారు ఎక్కువయ్యారు. తక్కువ సమయంలో జీవితంలో స్థిరపడిపోవాలనే వారి సంఖ్య ఎక్కువైంది. ఆకస్మిక మరణాలకు కారణం ఆల్కహాలు, గంజాయి సేవనం కూడా ఒక కారణం. వీటికి దూరంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. – డాక్టర్‌ ఎస్వీ చంద్రశేఖర్, జనరల్‌ ఫిజీషియన్, కర్నూలు

అతిగా అవగాహన పెంచుకోవడం వల్లే..
సాధారణంగా వైద్యులు కావాలంటే ఐదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్, స్పెషలిస్టు డాక్టర్‌ అయితే మరో మూడేళ్లు, సూపర్‌ స్పెషలిస్టు కావాలంటే ఇంకో మూడేళ్లు చదవాల్సి ఉంటుంది. ఆయా పీజీ సీట్లు సాధించాలంటే రెండు, మూడేళ్లు కష్టపడి చదివి సీటు సంపాదించాల్సి ఉంటుంది. ఈ మేరకు వారికి వైద్యునిగా పూర్తిస్థాయి పట్టా తీసుకునేందుకు 12 నుంచి 15 ఏళ్ల సమయం పడుతుంది. కానీ కొంత మంది ఎలాంటి విద్యార్హత లేకుండా యూ ట్యూబ్‌లు, సోషల్‌ మీడియాలో ఆరోగ్యం గురించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు.

వైద్యుల మాట కంటే ఇలాంటి వారు చెప్పే మాటాలు వినేవారు ఇటీవల అధికమయ్యారు. వీరు చెప్పిన విషయాలను చూసి తనకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఏదో అయ్యిందని మానసికంగా బాధపడే వారి సంఖ్య అధికమైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మీడియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి లక్షణాలను ఎవరికి వారు తమకు ఆపాదించుకుంటూ భయంతో వైద్యుల చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. కోవిడ్‌ అనంతరం ఈ పరిస్థితి మరింత అధికమైంది. కోవిడ్‌ అనంతరం ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, సలహాలు సోషల్‌ మీడియాలో మరింత అధికమయ్యాయి.

ఇవి చదవండి: పచ్చిపాలు ఆరోగ్యానికి మంచివేనా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement