‘సాదా బైనామా’ క్రమబద్ధీకరణకు ఓకే | telangana governament ok to 'sada bainama' | Sakshi
Sakshi News home page

‘సాదా బైనామా’ క్రమబద్ధీకరణకు ఓకే

Published Sat, Jun 4 2016 2:39 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

‘సాదా బైనామా’ క్రమబద్ధీకరణకు ఓకే - Sakshi

‘సాదా బైనామా’ క్రమబద్ధీకరణకు ఓకే

జిల్లా కలెక్టర్లకు అధికారాలిస్తూ సర్కారు ఉత్తర్వులు
క్లెయిముల స్వీకరణకు ఆఖరు తేదీ జూన్ 15

 సాక్షి, హైదరాబాద్: తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల క్రమబద్ధీకరణకు సర్కారు పచ్చజెండా ఊపింది. సెక్షన్ 22(2) ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్‌బుక్స్ చట్టం మేరకు సాదా బైనామాపై ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ విన్నపం మేరకు జూన్ 2, 2014లోపు తేదీలు ఉన్న సాదా బైనామాలను రాష్ట్ర వ్యాప్తంగా క్రమబద్ధీకరిచేందుకు అనుమతించింది. క్లెయిమ్‌ల వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకు అప్ప గించింది. క్లెయిమ్‌ల స్వీకరణకు గడువును జూన్ 15గా నిర్ణయించింది.

ఐదెకరాలలోపు భూమికి సంబంధించి సాదా బైనామాల రిజిస్ట్రేషన్‌కు స్టాంపు డ్యూటీనీ మినహాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హక్కు బదిలీ, కేటాయింపు కోరుకునే సాదాబైనామా జూన్ 2, 2014కు ముందు రాసుకున్నదై ఉండాలి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు మాత్రమే వర్తిస్తుంది. హెచ్‌ఎండీఏ, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని భూములకు వర్తించదు. ఉత్తర్వుల అమలుపై తగిన చర్యలు చేపట్టాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ , అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

 రిజిస్ట్రేషన్లు ఇలా...
రిజిస్ట్రేషన్ కోరుకునేవారు ఫారమ్ 10తో పాటు సాదా బైనామా జిరాక్స్ ప్రతిని జతచేసి సంబంధిత మండల తహసీల్దారుకు దరఖాస్తు చేసుకోవాలి. పరిశీలన అనంతరం ఫారమ్ 11 ద్వారా నోటీసులుచ్చి తహసీల్దారు సదరు ఆస్తిపై విచారణ చేయిస్తారు. అనంతరం ఫారమ్ 10లో కోరిన భూమిని దరఖాస్తుదారుని పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా ఆ ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్‌కు తహసీల్దారు సిఫారసు చేస్తా రు. రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓనరుతో ఎంతమాత్రం పనిలేదు. లబ్ధిదారులు ఒక్క రూపాయి చెల్లించకుండానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. ప్రభుత్వం ఇచ్చిన సాదాబైనామా క్రమబద్ధీకరణ అవకాశం ద్వారా ఎన్నోఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని సుమారు లక్షన్నర మంది వ్యవసాయదారులకు తాజా ప్రక్రియ ద్వారా లబ్ధిచేకూరనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement