
అంతా తూచ్.!
- బహిరంగ మల విసర్జన రహితంపై అధికారుల కాకిలెక్కలు
- గ్రామాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఇబ్బందులు
వీరంతా పరిగి మండలం బీచిగానిపల్లి పంచాయతీ పరిధిలోని బీచిగానిపల్లి, గొల్లపల్లి, వంగలపల్లి, పాత్రగానిపల్లి గ్రామాల ప్రజలు. అందరూ ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లలో నివాసముంటున్నారు. వీరి ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవు. కట్టిస్తామని ఇప్పటి వరకూ ఏ అధికారి వెళ్లలేదు. దీంతో తమకు మరుగుదొడ్లు మంజూరు చేయాలంటూ కలెక్టర్‌ను కోరేందుకు పంచాయతీ సర్పంచి బాలాజీ ఆధ్వర్యంలో ఈనెల 21న కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఆడవారు బహిర్భూమికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'అనంత’ను బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్)జిల్లాగా తీర్చిదిద్ధుతున్నాం. గ్రామాలకు గ్రామాలనే మార్చివేస్తాం’ అని చెప్పడమే కాదు... ఈ పేరిట అధికారులు పండుగలు కూడా నిర్వహించుకున్నారు. సన్మానాలు చేయించుకున్నారు. అవార్డులు ప్రకటించుకున్నారు. జిల్లాను ఎక్కడికో తీసుకెళతామంటూ అంతలా గొప్పలకు పోతోంది నిజమేనా అంటే... కాదని క్షేత్రస్థాయిలో తేలిపోతోంది. అవన్నీ ఉత్తుత్తి మాటలే... మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులు కాకిలెక్కలతో కహానీలు చెబుతున్నారనేందుకు గ్రామాల్లోని పరిస్థితులే అద్దం పడుతున్నాయి.
బహిరంగ మల విసర్జన రహితంగా జిల్లాను తీర్చిదిద్ధుతామని అధికారులు చెబుతున్నదానికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణ విషయంలో మొక్కుబడి నివేదికలతోనే సరిపెడుతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిస్తామంటూ గ్రామాల్లోకి అధికారులు వెళ్లడం లేదనేందుకు బీచిగానిపల్లి పంచాయతీ నిదర్శనం. అధికారులు అక్కడికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి ఉంటే వారంతా కలెక్టరేట్‌కి వచ్చి ఉండేవారు కాదు. ఇప్పటికే జిల్లాలో వందశాతం బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్ధామని చెబుతున్న గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
నత్తనడకన నిర్మాణ పనులు
జిల్లాకు స్వచ్ఛభారత్ కింద 37,754 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నాటికి వీటిని నిర్మించాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 18,754 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. లక్ష్యంలో 50 శాతానికి మించలేదనే విషయం ఈ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. మరో నాలుగు నెలల్లో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇంత తక్కువ కాలంలో వంద శాతం లక్ష్యం పూర్తి చేయడం సాధ్యం కాదనే విషయం తేలిపోతోంది.