
కుయ్యో..మొర్రో..
కడప రూరల్ :
జీవీకే–ఈఎంఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 108 అంబులెన్స్ వాహనాలు నడుస్తున్నాయి. ఇందులో కొన్ని వాహనాలు గడువు దాటినా పరిగెడుతూనే ఉన్నాయి. ఈ వాహనాలతోపాటు సిబ్బంది కొరత కూడా ఏర్పడింది. ఫలితంగా ఆపదలో ఉన్న వారు ఇబ్బందులు పడే పరిస్థితి దాపురించింది. సిబ్బంది మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వ సహకారం పెద్దగా లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
కనిపించని కొత్త వాహనాల రాక
జిల్లా వ్యాప్తంగా 108 వాహనాలు 28 ఉన్నాయి. కడప నగర పరిధిలో రెండు ఉండగా, మండలానికి రెండు చొప్పున మొత్తం మీద 28 వాహనాలు నడుస్తున్నాయి. కాగా, ఒక వాహనం నాలుగు లక్షల కిలోమీటర్ల వరకు మాత్రమే నడవాల్సి ఉండగా, ఆరు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వాహనాలు కూడా నేటికీ అలాగే నడుస్తూనే ఉండడం గమనార్హం. 28 వాహనాల్లో నాలుగు లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన వాహనాలు 12 వరకు ఉన్నాయి. అలాగే ఏడాదికి ఐదు చొప్పున జిల్లాకు కొత్త వాహనాలు మంజూరు కావాలి. మూడేళ్లు కావస్తున్నా జిల్లాకు ఒక్క కొత్త వాహనం కూడా మంజూరుకు నోచుకోకపోవడం దారుణం.
ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలో 14 వాహనాలు ఉండగా, అందులో ఐదు వాహనాలు నాలుగు లక్షల కిలోమీటర్లు దాటి నేటికీ నడుస్తున్నాయి. దీంతో ఆ వాహనాలు రోడ్డు మీదనే మొరాయిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉదాహరణకు ఐదు రోజుల క్రితం రైల్వేకోడూరులోని వాహనం ద్వారా తిరుపతి రుయా ఆస్పత్రికి రోగిని అత్యవసరంగా తరలిస్తుండగా మామండూరు దగ్గర 108 వాహనం నడిరోడ్డుపై కదలనని మొండికేసింది. దీంతో అందులో ఆపదలో ఉన్న వ్యక్తి బంధువులు ఆందోళన చెందారు. చివరకు అరగంట తర్వాత తిరుపతి నుంచి 108 వాహనం రాగా, అందులో ఆ వ్యక్తిని తరలించారు. కాగా జిల్లా వ్యాప్తంగా నెలకు 3500 నుంచి 4000కు పైగా వివిధ రకాల కేసులు నమోదవుతున్నాయి. అందులో 40 శాతం రోడ్డు ప్రమాదాలు, 35 శాతం మెడికల్, 20 శాతం గర్భిణీ స్త్రీలు, 5 శాతం ఆత్మహత్యలకు సంబంధించి ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గడువు దాటిన వాహనాలు నడపడం ఎంతవరకు సబబనే ప్రశ్న తలెత్తుతోంది.
సిబ్బంది ఆవేదన
విధులు చేపట్టే సిబ్బందికి దాదాపు ఎవరికైనా సరే ఎనిమిది గంటల పని ఉంటుంది. అయితే 108లో పనిచేసే వారు 12 గంటలపాటు పనిచేయాలి. ఆ మేరకు ఒక వాహనానికి ఒక టెక్నిషియన్, ఒక పైలెట్ (డ్రైవర్)తోపాటు అదనంగా మరో ఇద్దరిని కేటాయిస్తారు. ఇలా జిల్లా వ్యాప్తంగా టెక్నిషియన్లు 63 మంది, డ్రైవర్లు 68 మంది పనిచేస్తున్నారు. వారంతా తమకు చాలీచాలని వేతనం వస్తోందని వాపోతున్నారు. సీనియారిటీ ప్రకారం టెక్నిషియన్లకు రూ. 7500 నుంచి రూ. 11000, డ్రైవర్లకు రూ. 7700 నుంచి రూ. 10,000 మాత్రమే వస్తుందని, ఇది తమకు ఏమాత్రం సరిపోతుందని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకపోగా, కనీసం వేతనాల్లో కూడా పెంపుదల లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆపదలో ఉన్న వారిని ఆదుకునే 108కు, అందులో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం అన్ని విధాల సహకరించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జిల్లా వ్యాప్తంగా 108 సర్వీసుల వివరాలు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాల సంఖ్య 28
4 లక్షల కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తున్న వాహనాలు 12
నెలకు నమోదయ్యే కేసులు 4 వేలకు పైగా
మూడేళ్లుగా మంజూరైన కొత్త వాహనాలు –– నిల్
పనిచేస్తున్న టెక్నిషియన్ల సంఖ్య 63 పైలెట్లు
త్వరలో ఐదు కొత్త వాహనాలు వస్తాయి!
జిల్లాకు త్వరలో అత్యాధునికమైన ఐదు కొత్త వాహనాలు రానున్నాయి. వీటిని కడపతోపాటు ప్రధాన పట్టణాలకు ఒకటి చొప్పున కేటాయిస్తాం. మందులకు, నిర్వహణకు నిధులకు ఎలాంటి కొరత లేదు. ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకోవడమే మా ధ్యేయం.
– ఐవీ శంకర్, జిల్లా (ఈఎంఈ) ఎమర్జెన్సీ మెడికల్ ఎగ్జిక్యూటివ్