
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యంపై చర్చ జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దేశ భవిష్యత్తుకోసం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో శనివారం జర్నలిస్టుల కోసం ‘దీపావళి మంగళ్ మిలన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ‘రాజకీయ పార్టీలకు నిధులపై చర్చ జరుగుతోంది. వారి విలువలు, సిద్ధాంతాలు, అంతర్గత ప్రజాస్వామ్యం, కొత్త తరానికి వాళ్లెలాంటి అవకాశాలిస్తున్నారనే అంశాలపై చర్చ జరగాలి. రాజకీయ పార్టీల్లోని ప్రజాస్వామ్యంపై ప్రజలకు పూర్తిగా తెలియదు’ అని మోదీ అన్నారు.
మాలో సైద్ధాంతిక సామరస్యం ఉంది
‘రాజకీయ పార్టీల్లో అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఇది దేశ భవిష్యత్తుకే కాదు.. ప్రజాస్వామ్యానికీ చాలా అవసరం’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఏ పార్టీ పేరునూ ప్రస్తావించనప్పటికీ.. పరోక్షంగా కాంగ్రెస్‌పైనే మోదీ విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. సోనియా స్థానంలో రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారన్న వార్తల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జనసంఘ్ సమయంలో, బీజేపీ చిన్న సంస్థగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు పార్టీలో కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు సైద్ధాంతిక సామరస్యం కొనసాగుతోందని మోదీ గుర్తుచేశారు. ‘స్వచ్ఛ భారత్’ ప్రాజెక్టు విషయంలో మీడియా చాలా సానుకూలంగా వ్యవహరించిందని ప్రశంసించారు. అధికార పార్టీ, మీడియా మధ్య చాలా అంచనాలు, ఫిర్యాదులు ఉంటాయని.. కానీ సానుకూలంగా ఇవన్నీ పరిష్కారమవ్వాలని మోదీ పేర్కొన్నారు.
జీఎస్టీతో ఇబ్బందులున్నాయి. కానీ..
తన ప్రసంగంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ కాంగ్రెస్‌ను విమర్శించారు. ‘కాంగ్రెస్ గుజరాత్‌లో కులరాజకీయాలకు తెరలేపింది. అది వారికి తీవ్ర నష్టం చేస్తుంది. గుజరాత్‌లో మేం 150 సీట్లు సాధించి తీరుతాం’ అని పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల చిరు, మధ్యతరగతి వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తొలిసారిగా అమిత్ షా అంగీకరించారు. అయినా వారంతా బీజేపీకే ఓటువేస్తారన్నారు. గుజరాత్‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. ‘మోదీ నాయకత్వంలో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం’ అని అన్నారు.
ప్రతి ఒక్కరికీ పలకరింపు
దీపావళి మిలన్ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులతో మోదీ గడిపారు. సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ ఆయన మాట్లాడారు. వారితో కరచాలనం చేశారు. సెల్ఫీలు దిగారు. రాజకీయ చర్చల్లేకుండా అందరికీ శుభాకాంక్షలు చెబుతూ కనిపించారు. జర్నలిస్టులు విధినిర్వహణలో భాగంగా.. చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తన ప్రసంగంలో ప్రధాని పేర్కొన్నారు. 17 ఏళ్ల క్రితం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు మీడియాతో తనకున్న సంబంధాలనూ గుర్తుచేసుకున్నారు. ‘పరిస్థితులు మారాయి. మీడియాతో దూరం కూడా పెరిగింది’ అని మోదీ పేర్కొన్నారు.
‘రక్షణ’లో ఫ్రాన్స్ సహకారం అవసరం
భారత్‌లోనే రక్షణ పరికరాల పరిశోధన, అభివృద్ధి, తయారీ విషయాల్లో ఫ్రాన్స్ నుంచి మరింత సహకారం అందాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ రక్షణ శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీతో మోదీ శనివారం సమావేశమయ్యారు. భారత్, ఫ్రాన్స్‌ల వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణ రంగంలో సహకారం ఓ కీలక స్తంభం అని మోదీ అన్నారు. పరస్పర ప్రయోజనం ఉన్న పలు ప్రాంతీయ, అంతర్జాతీయ విషయాలు కూడా మోదీ, పార్లీ చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. వీలైనంత త్వరగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత పర్యటనకు రావాల్సిందిగా తాను కోరుకుంటున్నట్లు మోదీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment