ఎస్‌ఎస్‌తాడ్వాయి : గిరిజన ఆశ్రమ పాఠశాలలు సమస్యల వలయంలో కొట్టుమిట్టులాడుతున్నాయి. విద్యార్థులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థినులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. తాడ్వాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 558 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో 26 స్నానాల గదులు, 40 మరుగుదొడ్ల గదులు ఉన్నాయి. ఇందులో 16 మరుగుదొడ్లు వినియోగంలో ఉండగా, 24 మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి.
విద్యార్థినుల సంఖ్యకు తగిన స్నానాల గదులు, మరుగుదొడ్లు లేకపోవడంతో వారు తెల్లవారుజామునే లేచి మరుగుదొడ్లు, బాత్రూమ్‌ల ఎదుట గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పాఠశాలలో భవనాల మీద భవనాలు నిర్మిస్తున్న గిరిజన సంక్షేమశాఖ అధికారులు విద్యార్థినులకు కావాల్సిన కనీస సౌకర్యాలపై దృష్టి సారించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
మేడారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో..
మేడారం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోనూ మరుగుదొడ్లు, స్నానాల గదుల కొరత ఉంది. 480 మంది విద్యార్థినులు ఉన్న ఈపాఠశాలలో 17 స్నానాల గదులు, 13 మరుగుదొడ్లు ఉన్నాయి. మేడారం జాతర సందర్భంగా నిర్మించిన 10 మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరి వినియోగించడానికి వీలులేకుండా ఉన్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొస్తే కొంతమేరకైనా సమస్య తీరుతుందని విద్యార్థినులు పేర్కొంటున్నారు. ఐటీడీఏ అధికారులు దృష్టి సారించి మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
తాడ్వాయి హాస్టల్లోనూ అంతే..
మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహాంలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ పాఠశాలలో 250 మంది విద్యార్థినులు ఉన్నారు. పాఠశాలలోని 20 మరుగుదొడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్ పైపు పగిలిపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. ఇటీవల కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లకు వాటర్ కనెక్షన్ పైపులు పాడైపోవడంతో విద్యార్థినులు బకెట్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సి వస్తోంది.
స్నానాలకు గదులు కూడా లేకపోవడంతో విద్యార్థినులు హౌస్ వద్దనే స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. హాస్టల్ భవనం కుడా శిథిలావస్థకు చేరింది. భవనం స్లాబ్ పెచ్చులూడి చువ్వలు తేలుతున్నాయి. భవనం ఎప్పుడు కూలుతోందనని విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై సంబంధిత అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని హెచ్‌డబ్ల్యూఓ వాపోయారు. వేసవి సెలవుల తర్వాత పాఠశాల పునఃప్రారంభం నాటికల్లా అదనపు మరుగుదొడ్లు, స్నానాల గదుల నిర్మాణంతోపాటు నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, స్నానాల గదులను వినియోగంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఐటీడీఏ అధికారులపై ఉంది. పీఓ స్పందించి ఆశ్రమ పాఠశాలల్లోని సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని విద్యార్థులు కోరుతున్నారు.
తలుపుల్లేని మరుగుదొడ్లు.. నీళ్లు రాని బాత్రూమ్‌లు
Published Sun, Mar 22 2015 3:07 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement