
సాక్షి, హైదరాబాద్: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ 2వ మహాసభలను వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హైదరాబాద్‌లో నిర్వహించను న్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మహాసభలను నిర్వహిస్తున్నామని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభలను విజయవంతం చేయా లని ఆయన పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపు ఇచ్చారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో సంఘ్ పరివార్ అరాచకాలు ఎక్కువ అయ్యాయని, పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కేంద్ర ప్రభుత్వ బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తుందని విమ ర్శించారు. 56 రోజులపాటు పోరుబాట చేపట్టామని, ఈ కార్యక్రమంలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా సాగుదామని చాడ పిలుపునిచ్చారు. కాగా, రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు.
అవి ప్రభుత్వ హత్యలే!: డీవైఎఫ్‌ఐ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) పేర్కొంది. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదనే ఓయూలో మురళి, నిర్మల్ పట్టణంలో భూమేశ్ ఆత్మహత్యలకు పాల్పడ్డారని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.విప్లవ్‌కుమార్, ఎ.విజయ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. ఓయూ విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని ఖండిస్తున్నామని, దీనికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.