ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి(పాత చిత్రం)
నెల్లూరు జిల్లా: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు వింటుంటే కంటనీరు వస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మనుబోలు మండలం ధాన్యం కేంద్రంను కాకాణి శుక్రవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా మంత్రి సోమిరెడ్డి వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిల్లర్ల దగ్గర మంత్రి సోమిరెడ్డి ముడుపులు తీసుకుని రైతులకు కన్నీళ్ళు పెట్టిస్తోన్నాడని ధ్వజమెత్తారు. రైతులు 6 లక్షల టన్నుల బీపీటీ ధాన్యం అమ్మేసిన తర్వాత మంత్రి సోమిరెడ్డి ధాన్యం ధర పెంపు అంటూ ప్రకటన చేయటం సిగ్గుచేటన్నారు. జిల్లా యంత్రాంగం సోమిరెడ్డి మాటలు విని మిల్లర్లపై చర్యలకు వెనుకాడిందని వ్యాఖ్యానించారు. రైతులను బాధించే సోమిరెడ్డిని, రైతు బాంధవుడంటారా అని ప్రశ్నించారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో సోమిరెడ్డి వైఫల్యం చెందాడని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ప్రకటించిన ధర కూడా రాకపోవడానికి సోమిరెడ్డి అవినీతే కారణమని ఆరోపించారు. సోమిరెడ్డి ప్రకటనలు చూస్తుంటే,దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టుందని ఎద్దేవా చేశారు. మిల్లర్లు రైతులను దోచుకుంటుంటే అధికార యంత్రాంగం, చోద్యం చూస్తుందని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment