‘మార్చి’ చాలా హాట్ గురూ!
హైదరాబాద్: 2015 మార్చి నెల.. భూతాపోన్నతి చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. భూఉపరితల వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు 400 పార్ట్స్ పర్ మిలియన్(పీపీఎం) కన్నా ఎక్కువగా మార్చి నెలంతా కొనసాగటమే ఇందుకు కారణం. అమెరికాలోని జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్‌ఓఏఏ) ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం.. బొగ్గుపులుసు వాయువు స్థాయి 400 పీపీఎం కన్నా ప్రమాదకర స్థాయికి పెరగటం ఇదే మొదటిసారి కాదు. 2012, 2013లో అప్పుడప్పుడూ కొద్ది రోజుల పాటు ఈ స్థాయి దాటి భూతాపం పెరిగిన సందర్భాలున్నాయి.
అయితే, వాతావరణ కాలుష్యాన్ని నమోదు చేసే అన్ని కేంద్రాల్లోనూ, ఆ నెలలో అన్ని రోజులూ 400.83 పీపీఎం మేరకు నమోదుకావటం మాత్రం ఇదే మొదటి సారి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పాళ్లు 350 పీపీఎం కన్నా తక్కువ నమోదైతే మానవాళి మనుగడ సజావుగా సాగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1980 వరకు 280 పీపీఎం వరకు నమోదైన ఉద్గారాల స్థాయి ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ వస్తోంది. భూతాపం పెరుగుతున్నకొద్దీ కరువు కాటకాలు, అకాల వర్షాలు, వరదల బెడద ఎక్కువ అవుతోంది. భూ ఉపరితల వాతావరణంలో వేడిని పట్టిఉంచే బొగ్గుపులుసు వాయువు పాళ్లు ఎంత పెరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం అంత పెరుగుతుంది.