NOAA
-
వేడి అలలు... జీవజాలానికి ఉరితాళ్లు! పరిస్థితి ఇలాగే కొనసాగితే..
నానాటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం (గ్లోబల్ వార్మింగ్) వల్ల భూఉపరితం క్రమంగా వేడెక్కుతోంది. భూమిపై విలువైన జీవావరణ వ్యవస్థ దెబ్బతింటోంది. పర్యావరణ విధ్వంసం చోటుచేసుకుంటోంది. ఈ పరిణామం కేవలం భూమి ఉపరితలంపైనే కాదు, సముద్రాల అంతర్భాగాల్లోనూ సంభవిస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఓషియానిక్, అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాల అడుగు భాగం సైతం వేడెక్కుతోందని, అక్కడున్న జీవజాలం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోందని తేలింది. ఫలితంగా సముద్ర జీవావరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. భూతాపంతో సముద్రాల్లో వేడి అలల తీవ్రత పెరుగుతోంది. ఇవన్నీ ప్రమాద ఘంటికలే’’ అని హెచ్చరించారు. ఏమిటీ భూతాపం? శిలాజ ఇంధనాల వినియోగం, కర్బన ఉద్గారాల వల్ల వాతావరణ మార్పులు, తద్వారా భూ ఉపరితలంపై ఉష్ణోగ్రతలు పెరగడమే భూతాపం. భూగోళంపై జనాభా వేగంగా పెరుగుతుండడంతో అదే స్థాయిలో శిలాజ ఇంధనాల వినియోగం సైతం పెరుగుతోంది. బొగ్గు, చమురు, గ్యాస్ వంటివి మండించడం వల్ల భూమి వేడెక్కుతుంది. దీంతోపాటు అడవుల నరికివేత, పారిశ్రామిక విప్లవం, అగ్నిపర్వతాల పేలుళ్లు, నీరు వేగంగా ఆవిరి కావడం, అడవుల్లో కార్చిచ్చు వంటివి కూడా భూతాపానికి కారణాలే. వాస్తవానికి సూర్య కాంతి వల్ల సంభవించే వేడి వాతావరణంలోకి తిరిగి వెనక్కి వెళ్తుంది. శిలాజ ఇంధనాల వాడకం వల్ల ఉత్నన్నమయ్యే విష వాయువులు వేడి వెనక్కి వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో భూమిపై ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ఈ ప్రభావం సముద్రాలపైనా పడుతుంది. అధ్యయనంలో ఏం తేలిందంటే... ► మెరైన్ హీట్‌వేవ్స్‌గా పిలిచే సముద్రాల అంతర్భాగాల్లోని వేడి అలల తీవ్రత, వ్యవధి అధికంగా ఉంది. సముద్రాల లోపలి ఉష్ణోగ్రతలు వేర్వేరు ప్రాంతాల్లో 0.5 డిగ్రీల సెల్సియస్ నుంచి 3 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగాయి. ► సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదలకు భూతాపం కారణమని సైంటిస్టులు నిర్ధారించారు. ► హీట్‌వేవ్స్ ప్రభావం ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సముద్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ► సముద్రాల ఉపరితలంలో హీట్వేవ్స్పై గత పదేళ్లుగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని, అంతర్భాగంలోని వేడి అలలు, అక్కడి పరిణామాలు, జీవజాలం ప్రభావితం అవుతున్న తీరు గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి అని ఎన్ఓఏఏ రీసెర్చ్ సైంటిస్టు దిల్లాన్ అమామా చెప్పారు. ► సముద్రాల్లో ఉండే ప్లాంక్టన్ అనే సూక్ష్మజీవుల నుంచి భారీ పరిమాణంలోని వేల్స్ దాకా అన్ని రకాల జీవులు హీట్‌వేవ్స్ వల్ల ప్రభావితమవుతున్నాయి. ► ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సముద్ర జీవుల వలసలు ఆగిపోతున్నాయి. వాటిలో పునరుత్పాదక శక్తి దెబ్బతింటోంది. వివిధ జీవుల మధ్య అనుసంధానం తెగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం సముద్ర జీవావరణ వ్యవస్థ ప్రమాదంలో పడుతున్నట్లే లెక్క. ► భూతాపం వల్ల నీరు ఇలాగే వేడెక్కడం కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి సముద్రాల్లోని పగడపు దీవులన్నీ అంతరించిపోతాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం వెల్లడించింది. ► సముద్రాల ఉష్ణోగ్రత 1.5 డిగ్రీలు పెరిగితే 70–90 శాతం, 2 డిగ్రీలు పెరిగితే పూర్తిగా పగడపు దీవులు మాయమవుతాయని యునెస్కో పేర్కొంది. సముద్రాలే రక్షణ ఛత్రం భూతాపం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత లో 90% మిగులు వేడిని సముద్రాలే శోషించుకుంటాయి. భూమిని చల్లబరుస్తాయి. సముద్రాలే లేకుంటే భూమి అగ్నిగుండం అయ్యేది. సాగరాల ఉష్ణోగ్రత గత శతాబ్ద కాలంలో సగటున 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. మెరైన్ హీట్‌వేవ్స్ గత పదేళ్లలో 50% పెరిగాయి. భూతాపం పెరుగుదలను అడ్డుకోకపోతే సముద్రాలు సలసల కాగిపోవడం ఖాయం. ఫలితంగా భూమి అగ్నిగోళంగా మారుతుంది మానవులతో సహా జీవుల మనుగడ ప్రశ్నార్థకమే అవుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమికి తప్పిన భారీ సౌర తుపాను ముప్పు!
బుధవారం భూమిపై ఉత్తర, దక్షిణ ధృవాల పరిధిలో సాంకేతిక ఇబ్బందులను కలిగిస్తుందని భావించిన 16 లక్షల కిలో మీటర్ల వేగంతో దూసుకొచ్చిన సౌర తుపాను ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండానే వెళ్లిపోయింది. బుధవారం సాయంత్రం భూమిపైకి వచ్చిన సౌర తుఫాను కొన్ని గంటల పాటు ఉండి వెళ్లిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఎలాంటి గుర్తించదగిన మార్పులు చోటు చేసుకోలేదన్నారు. భూ అయస్కాంత క్షేత్రంలో మాత్రం కొద్దిగా మార్పులు సంభవించాయని అమెరికన్ ఏజెన్సీ తెలిపింది. నేషనల్ ఓషియానిక్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ) హెచ్చరిక ప్రకారం.. 16:41 యుటీసీ(22:11 ఐఎస్ టీ) సమయం వద్ద భూమికి సమీపంగా వచ్చిన సౌర తుపాను భూ అయస్కాంత కె-ఇండెక్స్ 4తో ప్రయాణించింది. భూ అయస్కాంత తుఫానుల పరిమాణాన్ని వర్ణించడానికి కె-ఇండెక్స్ ను ఉపయోగిస్తారు. కె-ఇండెక్స్ 4లో 4 అనేది చిన్న అంతరాయాన్ని సూచిస్తుంది. సౌర తుఫాను కారణంగా పవర్ గ్రిడ్, ఇంటర్ నెట్ లో సమస్యలు తలెత్తుతాయని, కెనడా, అలాస్కా వంటి అధిక అక్షాంశాల వద్ద అరోరాలు కనిపిస్తాయని ఎన్ఓఏఏ తెలిపింది. అయితే, స్థానిక యుఎస్ మీడియా అటువంటి ఏవి కనబడినట్లు పేర్కొనలేదు. అంతరిక్ష వాతావరణ తుఫాను సూర్యుడిని విడిచిపెట్టినప్పుడు, అది కరోనా గుండా సౌర గాలిలోకి వెళుతుంది. ఇది భూమికి చేరుకున్నప్పుడు, అది గ్రహం మాగ్నెటోస్పియర్ ను శక్తివంతం చేస్తుంది. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లను భూమి అయస్కాంత క్షేత్ర రేఖల వరకు వేగవంతం చేస్తుంది. అక్కడ అవి వాతావరణం, అయోనోస్పియర్ తో ముఖ్యంగా అధిక అక్షాంశాల వద్ద ఢీకొంటాయి. అంతరిక్ష వాతావరణం ప్రతి విభిన్న టెక్నాలజీపై ప్రభావం చూపుతుంది. 2015లో వచ్చిన సౌర తుపాను ఆమెరికాకు ఈశాన్యంలో ఉన్న గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థలను దెబ్బ తీసింది. -
అత్యంత వేడి మాసం జూలై
వాషింగ్టన్: భూ గ్రహ చరిత్రలోనే ఈ ఏడాది జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది. ఈ విషయాన్ని గతంలోనే యూరోపియన్ యూనియన్ వెల్లడించగా, తాజాగా అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్వోఏఏ) కూడా గురువారం ధ్రువీకరించింది. ‘ప్రపంచంలోని అనేక చోట్ల జూలై నెలలో ఎన్నడూ లేనంత వేడిగా వాతావరణం ఉంది. భూ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల 2019 జూలై. ఈ వేడిమి కారణంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోనూ మంచు భారీగా కరిగింది’ అని ఎన్వోఏఏ తెలిపింది. ఆ వివరాల ప్రకారం, 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీ సెల్సియస్ కాగా, తాజాగా ఈ జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. 2016 జూలై రెండో ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత వేడి మాసంగా ఉంది. పది అత్యంత వేడి జూలై మాసాల్లో తొమ్మిది 2005 తర్వాతనే నమోదవడం గమనార్హం. ఇక ఆర్కిటిక్ సముద్రంలో మంచు సాధారణంగా జూలై నెలలో ఉండే సగటు కన్నా ఈ ఏడాది జూలై నెలలో 19.8 శాతం తక్కువగా ఉంది. అంటార్కిటికాలోనూ సగటు కన్నా 4.3 శాతం తక్కువ మంచు ఉంది. -
భూమిపై ఏంటా వెలుగు..?
వాషింగ్టన్ : ఈ ఫొటోలోని వెలుగులను చూశారా?. అర్థరాత్రి అంతరిక్షం నుంచి చిత్రీకరించిన ప్రపంచ వెలుగు జిలుగులు కావవి. ప్రకృతి ప్రకోపానికి నిదర్శనాలు. ఉత్తర, దక్షిణ అమెరికాల్లో సంభవించిన భారీ మెరుపులకు సంబంధించిన వెలుగు అది. ఇందుకు సంబంధించిన ఫుటేజిని జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలక సంస్థ(ఎన్ఓఏఏ) విడుదల చేసింది. జీవోఈఎస్-17 ఉపగ్రహం ద్వారా ఈ వీడియోను రికార్డు చేసినట్లు ఎన్ఓఏఏ వెల్లడించింది. ఈ నెల 9న ఈ వీడియోను ఉపగ్రహం రికార్డు చేసినట్లు పేర్కొంది. -
2100 నాటికి ముంబై ‘గరం గరం’
వాషింగ్టన్: ముంబై నగరం ఈ శతాబ్దిలో నిప్పుల కుంపటిలా మారనుంది! నగరంలో ప్రశాంత వాతావరణంతో కూడిన రోజుల(మైల్డ్ డే) సంఖ్య భారీగా తగ్గుతుందని, ఈ శతాబ్ది చివరికి పరిస్థితి మరింత దిగజారుతుందని ఓ అధ్యయనం పేర్కొంది. అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ ఆట్మాస్మెరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్ఓఏఏ), ప్రిన్స్టన్ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలోని అంచనాల ప్రకారం ముంబైలో ప్రస్తుతం ఏడాదికి 82 ప్రశాంత దినాలున్నాయి. 2035 నాటికి వీటిలో 16 తగ్గుతాయి. 2100 నాటికి మరో 44(దాదాపు సగం) తగ్గుతాయి. 18 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, తక్కువ తేమ, అర అంగుళం కంటే తక్కువ వర్షపాతంతో కూడిన రోజులను శాస్త్రవేత్తలు ప్రశాంత దినాలుగా పరిగణిస్తారు. -
బాబోయ్ జూలై
మియామి: వాతావరణ కాలుష్యంతో భూతాపం నానాటికీ పెరిగిపోతోంది. కర్బన్ ఉద్గారాలు, శిలాజ ఇంధనాల వాడకం అధికమవుతుండడంతో గ్లోబల్ వార్మింగ్ ఎగబాకుతోంది. ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరుతుండడంతో భూతాపం పెరుగుదలలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అత్యధిక భూతాపం నమోదైన మాసంగా జూలై తాజాగా రికార్డుకెక్కింది. భూతాపోన్నతి చరిత్రలో ఈ ఏడాది జూలై శిఖరస్థాయిలో నిలిచిందని అమెరికాలోని జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్ఓఏఏ) వెల్లడించింది. 1880 నుంచి ఎన్ఓఏఏ భూతాపోన్నతి రికార్డులు సేకరిస్తోంది. శిలాజ ఇంధనాలను మండిచడమే భూతాపం పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వేడి నానాటికీ పెరుగుతోందని తమ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఎన్ఓఏఏ శాస్త్రవేత్త జాక్ క్రౌచ్ తెలిపారు. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. జూలైలో సముద్ర ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత 16.61 సెల్సియస్ గా నమోదైందని, అంతకుమున్నడూ ఇంత ఎక్కువ స్థాయిలో భూతాపం నమోదు కాలేదని వెల్లడించారు. అంతకుముందు 1998, జూలైలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20వ శతాబ్దం సరాసరితో పోలిస్తే 1.53 శాతం అధికంగా భూతాపం ఈ ఏడాది మొదటి 7 నెలల్లో నమోదైందని తెలిపారు. -
‘మార్చి’ చాలా హాట్ గురూ!
హైదరాబాద్: 2015 మార్చి నెల.. భూతాపోన్నతి చరిత్రలో ఒక మైలురాయిలా నిలిచిపోయింది. భూఉపరితల వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు 400 పార్ట్స్ పర్ మిలియన్(పీపీఎం) కన్నా ఎక్కువగా మార్చి నెలంతా కొనసాగటమే ఇందుకు కారణం. అమెరికాలోని జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్ఓఏఏ) ఇటీవల వెల్లడించిన సమాచారం ప్రకారం.. బొగ్గుపులుసు వాయువు స్థాయి 400 పీపీఎం కన్నా ప్రమాదకర స్థాయికి పెరగటం ఇదే మొదటిసారి కాదు. 2012, 2013లో అప్పుడప్పుడూ కొద్ది రోజుల పాటు ఈ స్థాయి దాటి భూతాపం పెరిగిన సందర్భాలున్నాయి. అయితే, వాతావరణ కాలుష్యాన్ని నమోదు చేసే అన్ని కేంద్రాల్లోనూ, ఆ నెలలో అన్ని రోజులూ 400.83 పీపీఎం మేరకు నమోదుకావటం మాత్రం ఇదే మొదటి సారి. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు పాళ్లు 350 పీపీఎం కన్నా తక్కువ నమోదైతే మానవాళి మనుగడ సజావుగా సాగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 1980 వరకు 280 పీపీఎం వరకు నమోదైన ఉద్గారాల స్థాయి ఆ తర్వాత నుంచి వేగంగా పెరుగుతూ వస్తోంది. భూతాపం పెరుగుతున్నకొద్దీ కరువు కాటకాలు, అకాల వర్షాలు, వరదల బెడద ఎక్కువ అవుతోంది. భూ ఉపరితల వాతావరణంలో వేడిని పట్టిఉంచే బొగ్గుపులుసు వాయువు పాళ్లు ఎంత పెరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం అంత పెరుగుతుంది.