బాబోయ్ జూలై
మియామి: వాతావరణ కాలుష్యంతో భూతాపం నానాటికీ పెరిగిపోతోంది. కర్బన్ ఉద్గారాలు, శిలాజ ఇంధనాల వాడకం అధికమవుతుండడంతో గ్లోబల్ వార్మింగ్ ఎగబాకుతోంది. ఉష్ణోగ్రతలు ఆందోళనకర స్థాయికి చేరుతుండడంతో భూతాపం పెరుగుదలలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
అత్యధిక భూతాపం నమోదైన మాసంగా జూలై తాజాగా రికార్డుకెక్కింది. భూతాపోన్నతి చరిత్రలో ఈ ఏడాది జూలై శిఖరస్థాయిలో నిలిచిందని అమెరికాలోని జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ(ఎన్ఓఏఏ) వెల్లడించింది. 1880 నుంచి ఎన్ఓఏఏ భూతాపోన్నతి రికార్డులు సేకరిస్తోంది. శిలాజ ఇంధనాలను మండిచడమే భూతాపం పెరగడానికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమిపై వేడి నానాటికీ పెరుగుతోందని తమ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఎన్ఓఏఏ శాస్త్రవేత్త జాక్ క్రౌచ్ తెలిపారు. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నారు. జూలైలో సముద్ర ఉపరితల సరాసరి ఉష్ణోగ్రత 16.61 సెల్సియస్ గా నమోదైందని, అంతకుమున్నడూ ఇంత ఎక్కువ స్థాయిలో భూతాపం నమోదు కాలేదని వెల్లడించారు. అంతకుముందు 1998, జూలైలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 20వ శతాబ్దం సరాసరితో పోలిస్తే 1.53 శాతం అధికంగా భూతాపం ఈ ఏడాది మొదటి 7 నెలల్లో నమోదైందని తెలిపారు.