వాషింగ్టన్: భూ గ్రహ చరిత్రలోనే ఈ ఏడాది జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది. ఈ విషయాన్ని గతంలోనే యూరోపియన్ యూనియన్ వెల్లడించగా, తాజాగా అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్‌వోఏఏ) కూడా గురువారం ధ్రువీకరించింది. ‘ప్రపంచంలోని అనేక చోట్ల జూలై నెలలో ఎన్నడూ లేనంత వేడిగా వాతావరణం ఉంది. భూ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెల 2019 జూలై. ఈ వేడిమి కారణంగా ఆర్కిటిక్, అంటార్కిటిక్ సముద్రాల్లోనూ మంచు భారీగా కరిగింది’ అని ఎన్‌వోఏఏ తెలిపింది.
ఆ వివరాల ప్రకారం, 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీ సెల్సియస్ కాగా, తాజాగా ఈ జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. 2016 జూలై రెండో ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత వేడి మాసంగా ఉంది. పది అత్యంత వేడి జూలై మాసాల్లో తొమ్మిది 2005 తర్వాతనే నమోదవడం గమనార్హం. ఇక ఆర్కిటిక్ సముద్రంలో మంచు సాధారణంగా జూలై నెలలో ఉండే సగటు కన్నా ఈ ఏడాది జూలై నెలలో 19.8 శాతం తక్కువగా ఉంది. అంటార్కిటికాలోనూ సగటు కన్నా 4.3 శాతం తక్కువ మంచు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment