రెంటచింతల గ్రామం
నాడు గుంటూరు పరగణాలో ఎండుమిరప ఘాటునైనా, మండుటెండ ధాటినైనా తట్టుకొనేంత దిట్టలుండేవారట. అలాంటి దిట్టలకు కూడా ఇవాళ భానుడు ఠారెత్తిస్తున్నాడు. పౌరుషంలోనే కాదు భానుడి ప్రతాపంలోనూ పల్నాడు ఏమాత్రం తగ్గడం లేదు. ఉష్ణోగ్రతల రికార్డును మరొకరు బద్దలు కొట్టలేనంతగా ఈసారి రెంటచింతల 45.2 డిగ్రీలు దాటిపోయింది. భరణి కార్తె ఆరంభమే కాలేదు (రేపటి నుంచి), కృత్తిక రావడానికి ఇంకా 16 రోజుల గడువు ఉన్నా (వచ్చేనెల 11న) ఇప్పుడే ఎండలు బెంబేలెత్తిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
రెంటచింతల(పల్నాడు): రెంటచింతల మంటచింతలగా మారిపోతోంది. భానుడి ఉగ్రరూపంతో ఈ ప్రాంతం నిప్పుల కొలిమిలా మారడంతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారు. ఆదివారం గ్రామంలో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 కనిష్ట ఉష్ణోగ్రత 30.5 డిగ్రీలుగా నమోదైంది. ఉదయం 10 గంటల నుంచే ఎండకు వడగాడ్పులు తోడవడం.. భూమి నుంచి సెగ మండల వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంట్లోంచి బయటకు రాలేక.. ఉక్కపోతకు తట్టకోలేకపోతున్నట్లు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాలింతలు, చిన్నారులు, గర్భిణుల అవస్థలు అన్నిఇన్నీ కావు. ఎండతీవ్రత నుంచి కొబ్బరిబోండాలు, చెరుకురసం, శీతల పానియాలతో కొంత వరకు గ్రామ ప్రజలు ఉపశమనం పొందుతుంటే మేతకు (పశుగ్రాసం) కోసం పొలం వెళ్లిన గేదలు ఎండ తీవ్రత తట్టుకోలేక కుంటలలో, పారుతున్న వాగులలో పడుకుని సేదతీరుతున్నాయి. గతంలో రెంటచింతల గ్రామంలో 49 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన సంఘటనలు ఉన్నాయి.
1920లోనే ఉష్ణోగ్రత నమోదు కేంద్రం
ఎండలకు రెంటచింతల ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఎండాకాలం ఆరంభం కాగానే రాష్ట్రంలోని అందరి దృష్టి దీనిపైనే ఉంటుంది. బ్రిటీష్ పాలకులు సైతం ఈ విషయాన్ని గమనించి రెంటచింతలలోని ఏఎల్‌సీకి చెందిన కాంపౌండ్‌లో ఉష్ణోగ్రత నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
వేసవి అంటే పెద్దలకు వణుకే
ప్రతి ఏటా వేసవి కాలం వచ్చిందంటే ఈ ప్రాంతంలోని వృద్ధులు భయందోళనకు గురౌతుంటారు. ఈ ప్రాంతంలోని భూమిలో నాపరాయి నిక్షేపాలు అత్యధికంగా ఉండటం వలనే మార్చి నుంచి మే నెలవరకు ఎండతీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతకు భయటకు రాలేక.. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెట్లు నాటే కార్యక్రమాన్ని గ్రామస్తులు విజయవంతం చేసినప్పుడే వాతావరణ సమతూల్యత కారణంగా కొంతవరకు ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. –అల్లం మర్రెడ్డి, మాజీ సర్పంచ్, రెంటచింతల
Comments
Please login to add a commentAdd a comment