సాక్షి, పల్నాడు జిల్లా: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఓ మహిళ, శ్రీచైతన్య స్కూల్‌లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు.
పోలీసుల వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ (11) ప్రాణాలు కోల్పోయాడు. స్కూల్ బస్సు పులిపాడు గ్రామం నుండి స్కూల్ విద్యార్థులతో దాచేపల్లికి వెళ్తుంది. ఆ సమయంలో స్కూల్ బస్ రేడియేటర్లో మంటలు చెలరేగాయి.
దీంతో మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు ప్రయత్నించాడు. ఇందుకోసం కుంటలో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించాడు. సాయం కోసం సుభాష్‌ను వెంట తీసుకెళ్లాడు. అయితే నీటి కుంటలో నుంచి నీటిని తోడేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవ శాత్తూ కాలు జారి నీటి కుంటలో జారి ఇద్దరూ పడిపోయారు. ఈ దుర్ఘటనలో బస్సు క్లీనర్ పప్పుల కోటేశ్వరరావు, ఐదవ తరగతి విద్యార్థి కుంచె సుభాష్ మృతి చెందారు.
మరో దుర్ఘటనలో
తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న మరో దుర్ఘటనలో బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు స్కూటీపై వెళ్తున్న మహిళను ఓ కారు ఢీకొంది. రూరల్ ఎస్‌ఐ ఎస్కే మూర్తి తెలిపిన వివరాల మేరకు.. నగరి మండలం మాంగాడుకు చెందిన గోవిందమ్మ(48), తన కుమారుడు భానుప్రకాష్ సమీప బంధువు కిరణ్‌తో కలిసి చంద్రగిరి మండలం పిచ్చినాయుడుపల్లిలో బంధువుల ఇంట్లో పురుడు ఫంక్షన్‌కు స్కూటర్‌లో వెళ్తున్నారు.
పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వకుళామాత ఆలయం సర్కిల్ వద్ద పేరూరు పంచాయతీలో నుంచి వేగంగా బైపాస్ పైకి దూసుకొచ్చిన గుర్తు తెలియని కారు గోవిందమ్మ ప్రయాణిస్తున్న స్కూటర్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో గోవిందమ్మ స్కూటర్‌పై నుంచి కింద పడి తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
స్కూటర్ నడుపుతున్న కిరణ్, మృతురాలి కుమారుడు భానుప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని తిరుపతి రూరల్ ఎస్‌ఐ ఎస్కే మూర్తి పరిశీలించారు. కేసు నమోదు విచారిస్తున్నట్లు ఎస్‌ఐ మూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment