
ఇంటా..బయటా..నరకమే..
సాక్షి, రాజమండ్రి :జిల్లావాసులు శనివారం ఇంటా బయటా నరకం చవిచూశారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు కాస్త అటూ ఇటూగా నమోదైనా.. విపరీతమైన ఉక్కపోత.. ఎడాపెడా విధించిన కరెంటు కోతలతో అల్లాడిపోయారు. శనివారం విధించిన విద్యుత్ కోతలు ప్రజల పాలిట శాపంగా మారాయి. ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని అన్ని వర్గాల ప్రజలు వాపోయారు.
గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా..
మండపేట 41; రాజమండ్రి 40.5; తుని, జగ్గంపేట 40; కాకినాడ 39.5; అమలాపురం 39 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే మూ డో వారంలో జిల్లాలో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 43 నుంచి 46 డిగ్రీల .సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనా.. ఇంత ఉక్కపోత లేదు. వాతావరణంలో తేమ శాతం పెరగడమే ఇందుకు కారణమంటున్నారు.
కోతల వాతలు
గత మూడేళ్లలో ఎప్పుడూ లేనివిధంగా శనివారం జిల్లాలో విద్యుత్ కోతలు విధించారు. గతంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప రాజమండ్రి, కాకినాడ నగరాలు, ఇతర పట్టణాల్ల్లో నాలుగు నుంచి ఆరు గంటల పాటు కోత విధించింది లేదు. గ్రామాల్లో మాత్రమే పది గంటల కోతలు విధించేవారు. కానీ శనివారం జిల్లావ్యాప్తంగా తొమ్మిది నుంచి పది గంటల పాటు విద్యుత్ కోతలు విధించారు. రాజమండ్రి, కాకినాడల్లో ఉదయం ఏడు నుంచి రాత్రి పది వరకూ తొమ్మిది గంటల పాటు దఫదఫాలుగా అత్యవసర కోతలు విధించారు. ఇతర ప్రాంతాల్లో కూడా ఎనిమిది నుంచి పది గంటలు పైగా విద్యుత సరఫరా నిలిపివేశారు.
ఫ్రీక్వెన్సీ పడిపోవడమే కారణం
గ్రిడ్ లైన్లలో విద్యుత్ సరఫరా ఫ్రీక్వెన్సీ 50 హెర్‌ట్జ్డ్స దాటి ఉండాలి. ఇది తగ్గితే ఆ ప్రభా వం రాష్ట్రంలోని ఉత్పత్తి కేంద్రాలపై పడుతుంది. ఒక వేళ ఉత్పత్తి నిలిచిపోతే మూడు రోజుల వరకూ పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో వినియో గం పెరిగిప్పుడల్లా ఎడాపెడా కోతలు పెడుతున్నారు. రెండు రోజులుగా వినియో గం భారీగా పెరడగంతో పాటు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోవడమే కోతలకు కారణమని చెబుతున్నారు.
ఇంటర్ విద్యార్థుల ఇబ్బందులు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ఇంటర్ విద్యార్థులు శనివారం కెమిస్ట్రీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి 12 వరకూ మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఆ సమయంలో కరెంటు కోత విధించడంతో విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో అవస్థలు పడ్డారు. చెమటకు ఆన్సర్ షీట్లు తడిసిపోయి ఇబ్బందులు పడ్డామని పలువురు చెప్పారు.