ఆదివారం తిరుపతిలో ఎండ వేడిమి తట్టుకోలేక తలకు టవల్ చుట్టుకున్న వాహనదారుడు, వెనుక గొడుగు పట్టుకొని వెళ్తున్న మహిళ
నిప్పులు కక్కుతున్న ఎండలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాపై ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. రోహిణి కార్తెను తలపించేలా సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కావలి, మచిలీపట్నం, నెల్లూరుల్లో 39, తుని, విజయవాడ, బాపట్ల, తిరుపతిల్లో 38, కాకినాడ, రెంటచింతలలో 37, నర్సాపురం, అనంతపురాల్లో 36 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా అవి సెగలను తగ్గించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య బంగాళాఖాతాల్లోనే ఇవి ఏర్పడుతుండటంతో, అవేమీ మన రాష్ట్రంపై ప్రభావం చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వేసవిలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదయితే వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితే ఉండటం గమనార్హం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ ఉష్ణతీవ్రత అధికంగా ఉంది.