rohini karthi
-
మృగశిర వచ్చినా ముచ్చెమటలే!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె పది రోజులకు పైగా ప్రభావం చూపించింది. ఉష్ణతాపం, ఉక్కపోత కలగలిసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏటా వేసవిలో రోహిణి కార్తె ప్రభావం అలాగే ఉంటుందని అంతా భరించారు. అయితే రోహిణి కార్తె వెళ్లిపోయాక మృగశిర కార్తె రాకతో వాతావరణం చల్లబడుతుందని భావించారు. కానీ రోహిణి వెళ్లిపోయి శనివారం నుంచి మృగశిర కార్తె ప్రవేశించింది. కానీ పరిస్థితిలో ఏమంత మార్పు కనిపించలేదు. ఉష్ణ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతూనే ఉంది. తగ్గేదే లే.. అన్నట్టు ముచ్చెమటలు పోస్తూనే ఉన్నాయి. భానుడు కూడా సుర్రుమంటూనే ఉన్నాడు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మృగశిర కార్తె వచ్చినా చల్లదనం కానరావడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతం గాలిలో తేమ శాతం అధికంగా ఉండడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా విశాఖలో గాలిలో తేమ 70–80 శాతానికి పైగా నమోదవుతోంది. గాలిలో తేమ 60 శాతానికి మించితే ఉక్కపోత ఊపందుకుంటుంది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా నమోదవుతుండడం వల్ల ఉక్కపోత కొనసాగుతోంది. మరోవైపు నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా 34–36 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఇలా ఒకపక్క ఉక్కపోత, మరోపక్క ఉష్ణతాపం వెరసి నగర వాసుల్ని అవస్థల పాల్జేస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఆపై కాస్త ఉపశమనం కలిగిస్తుందని వాతావరణ నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
రోహిణి తీవ్రత లేనట్టే!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె వేళ రోళ్లు పగిలే ఎండలు కాస్తాయన్న నానుడి ఎప్పట్నుంచో ఉంది. ఈ కార్తె వస్తోందంటేనే జనం బెంబేలెత్తి పోయే పరిస్థితి ఉంటుంది. ఈ ఏడాది ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఏప్రిల్ నుంచే మొదలవడంతో రోహిణి కార్తె ప్రవేశిస్తే ఇంకెంతలా ఉష్ణతాపం పెరిగిపోతుందోనని అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఈ ఏడాది రోహిణి కార్తె ఈనెల 25న ప్రవేశించింది. ఆ సమయానికి బంగాళాఖాతంలో ‘రెమాల్’ తుపాను కొనసాగుతుండడంతో రోహిణి తీవ్రత కనిపించ లేదు. మరోవైపు రాష్ట్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన గాలిలో కొద్దిపాటి తేమ ఇంకా ఉంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంపైకి గంటకు 30–40 కి.మీల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవి భానుడి ప్రతాపాన్ని అదుపు చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటున్నాయి. వాస్తవానికి రోహిణి కార్తె రోజుల్లో ఉష్ణోగ్రతలు 42–46 డిగ్రీల మధ్య నమోదవుతాయి. దీంతో పలు చోట్ల వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల లోపే రికార్డవుతున్నాయి. ఇవి సాధారణంకంటే 2–3 డిగ్రీలు మాత్రమే అధికం. రానున్న మూడు రోజులు కూడా దాదాపు ఇవే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగానే పెరగడం వల్ల వడగాడ్పులు గాని, తీవ్ర వడగాడ్పులు కూడా వీచే పరిస్థితులు లేవని చెబుతున్నారు. భారత వాతావరణ విభాగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఈదురు గాలులు వీస్తున్నాయని, నెలాఖరు వరకు వడగాడ్పులకు ఆస్కారం లేదని వెల్లడించింది. రోహిణి కార్తె ఎండలపై భీతిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు ఇది ఊరటనివ్వనుంది. సీమలో పిడుగుల వాన.. మరోవైపు దక్షిణ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నెలాఖరు వరకు రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. -
కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఉన్నవారు లేత ముంజెలు తిన్నారంటే!
నేటి నుంచి రోహిణి కార్తె. రోళ్లు పగులుతాయని ప్రతీతి. ఇంకో రెండు వారాలు ఉగ్ర ఉష్ణాన్ని ఎదుర్కొనక తప్పదు. కాని ప్రతిదానికి ప్రకృతిలో విరుగుడు ఉంటుంది. మార్కెట్‌ను ముంజెలు ముంచెత్తుతున్నాయి. ఎండకు జవాబుగా తమను జుర్రుకోమంటున్నాయి. పెద్దవాళ్లు వీటిని మర్చిపోయారు. పిల్లలు చులకనగా చూస్తున్నారు. కాని ముంజె చేసే మేలు తల్లి కూడా చేయదు. కుటుంబాన్ని కాపాడే శక్తి దీనికి ఉంది. అంతేనా? ఈ ముంజెల చుట్టూ అందరికీ ఎన్నో జ్ఞాపకాలు. ఇప్పుడు కాదులెండి... ముప్పై నలబై ఏళ్ల కింద మంచి ఎండపూట వీధుల్లో ‘తాటి ముంజెలో తాటి ముంజెలో’ అని అరపు వినిపిస్తే వంట పనిలోనో, అన్నాలు అయ్యాక కునుకులోకి వెళ్లబోతో ఉన్న అమ్మ, నానమ్మ, ఇంటికి భోజనానికి వచ్చిన నాన్న... ‘పిలువు... పిలువు’ అని పిల్లల్ని పురమాయించేవారు. పిల్లలు పరిగెత్తుకొని బయటకు వెళితే ఎవరో ఒక గ్రామీణుడు కావడిబద్దకు చెరొకవైపు ముంజెలు కట్టిన లేత తాటాకు కట్టలతో కనిపించేవాడు. 12 తాటి ముంజెల కట్టది ఒక రేటు. 24 తాటి ముంజెల కట్టది ఒక రేటు. గీచి గీచి బేరం తెగ్గొట్టాక, ఇంట్లోకి తెచ్చి కట్ట విప్పితే అన్నీ లేతగా ఉంటే అదృష్టం. ముదురు ఎక్కువగా ఉండే నష్టం. అమ్మ తాటిముంజెల చెక్కు తీసి, స్టీలు గిన్నెలో వాటిలో నుంచి నీరు చిమ్ముతూ ఉండగా ముక్కలుగా కోసి, కొద్దిగా చెక్కెర జల్లి మూతేసి పెట్టి (ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టి) ‘నిద్ర పోయి లేచాక తిందాం’ అని చెప్తే నిద్ర పడితే కదా. మధ్యాహ్నం కునుకు పూర్తి కాకముందే ఆ తాటి ముంజెల్ని గబగబా తింటూ ఆఖరున ఆ చక్కెర నీరు తాగుతూ ఉంటే ఎంతో హాయి మరెంతో రుచి ఇంకెంతో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేది. పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ తాటి చెట్లు, వాటిక్కాసిన గెలలు దొరుకుతాయి. తాటిచెట్టు ఎక్కడం ఆర్ట్. రాకపోతే ఒళ్లు చెక్కుకుపోతుంది. ఎక్కగలిగినవాడు కొడవలి విసిరి గెల కిందకు తెస్తే అల్లరి పిల్లలు మూగి చెక్కిన తాటి కాయల్లో నుంచి తొంగి చూసే కన్నులను కుడివేలు బొటన వేలుతో జుర్రేసి మింగేసేవారు. ఒక్కొక్కరు ఐదు పది కాయలను కూడా జుర్రేసేవారు. ఇక ఎంత ఎండలో ఆడినా డీహైడ్రేషన్ అవడం అసాద్యం. వడదెబ్బ అసంభవం. కడుపులో చేరిన లేత నీరు అలాంటిది. పట్నాల్లో ఎడ్ల బండ్లలో తాటి గెలలు తెచ్చి రోడ్డుకు ఒకవైపున బండి ఆపి తాటికాయలను కొట్టి ఒక్కో కాయ ఇంత అని అమ్ముతూ ఉంటే పిల్లలు తెగమూగేవారు. పెద్దలు అక్కడిక్కడ తిని డిప్పల్ని పారేసేవారు. పిల్లలు ఆ ఖాళీ డిప్పల్లో కాస్త పెద్దవాటిని రెండు ఎంచుకుని ఒక పుల్లతో అనుసంధానించి తాడు కట్టి లాగుతూ తాటిబండి ఆట ఆడుకునేవారు. వేసవిని పంపిన భగవంతుడు తాటిచెట్టు చిటారుకొమ్మన తాటి గెలలను పెట్టి వాటిలో ముంజెలను పెట్టి ఆ ముంజెల్లో తియ్యటి నీరును పెట్టడమే దయకు సూచన. కరుణకు ఆనవాలు. తాటి ముంజెలు పిల్లలు, పెద్దలు, గర్భిణులు, బాలింతలు అందరూ తినొచ్చు. తినాలి. వేసవిలో ఉష్ణం వల్ల ఆమ్ల, క్షార గుణాల్లో తేడా వచ్చి శరీరంలో విషకారకాలు ఉత్పన్నం అవుతాయి. వాటిని నిర్మూలం చేయాలంటే తాటి ముంజెలకు మించినవి లేవు. శరీరంలో కోల్పోయిన నీటిని ముంజెలు సమతులం చేస్తాయి. ఒంటికి చలువనిస్తాయి. కోవిడ్ అనంతర నీరసంలాంటి సమస్యలను, అలసటను తరిమికొట్టే శక్తి ముంజెలకు ఉంది. అవి మార్కెట్లో కనపడేనన్ని రోజులు తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి తెచ్చుకోవచ్చు. లేత తాటిముంజెల్లో ఉన్న నీరు మినరల్ వాటర్‌తో సమానం. తాటి ముంజెలు జీర్ణశక్తికి అద్భుతంగా తోడ్పడతాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఉన్నవారు ఉదయాన్నే గ్యాస్ నిండినట్టుగా భావించేవారు లేత ముంజెలు తింటే చాలా మంచిది. గర్భిణులు తింటే తల్లికి, లోపల ఉన్న బిడ్డకు మంచిది. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనతో తేల్చారు. రోహిణి కార్తెలో వడదెబ్బ తగలకుండా ముంజెలు కాపాడతాయి. వికారం ఉంటే పోగొడతాయి. తట్టు, పొంగులను నివారిస్తాయి. కాలేయాన్ని ఉత్సాహపరుస్తాయి. అధిక బరువు ఉన్నవారు వీటిని ఒకపూట ఆహారంగా తీసుకుంటే (వీటితో పాటు ఒక పండు తింటే) బరువు తగ్గుతారు. సీజన్లో వచ్చే ఫలాలు ఆ సీజన్లో వచ్చే సమస్యలను దూరం చేస్తాయని అందరికీ తెలుసు. వేసవిలో వచ్చే ముంజెలు వేసవి సమస్యలకు సమాధానం చెప్తాయి. ముదురు తాటిముంజెలు తినకూడదు. పిల్లలకు పెట్టకూడదు. కడుపునొప్పి వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో పాలిథిన్ కవర్లలో ముంజెలు అమ్ముతున్నారు. పిల్లలు పోజులకు పోయినా తప్పనిసరిగా తినిపించాలి. వీటిని ఇంగ్లిష్‌లో ‘ఐస్ యాపిల్స్’ అంటారని చెప్తే పేరు నచ్చయినా తింటారు. చల్లగా తినండి. ఎండను జయించండి. -
రోహిణితో జాగ్రత్త
సాక్షి, ఒంగోలు మెట్రో: రోహిణి కార్తె ఎండలకు రోళ్లు పగులుతాయనే నానుడి అనేకసార్లు నిజమైంది. రెండు రోజుల కిందట వచ్చిన రోహిణి కార్తె ఎండలతో జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర అనారోగ్యాల బారిన పడే పరిస్థితులు ఉత్పన్నమవుతాయని వైద్యులు చెబుతున్నారు. మనకి నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలి రోజుల్లో కొద్దికొద్దిగా ఉగాది నుంచి తాపం పెరుగుతూ ఉంటుంది. దిన దిన ప్రవర్ధమానంగా సూర్యుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తుంటాడు. మామూలుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే, ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఉండే ఎండలు మరీ అదరగొడతాయి. మే నెల 25 సోమవారం నుంచి జూన్8వ తేదీ సోమవారం వరకు మొత్తం 15 రోజుల పాటు రోహిణి కార్తె ఉంటుంది. ఈ రోహిణి కార్తె సోమవారం ఉదయం 6.30 నిమిషాలకు ప్రవేశించింది. అప్పటి నుంచీ ఎండవేడి త్రీవమైంది. వాతావరణంలో మార్పులు సంభవించాయి. అడపదడపా మేఘ ఘర్జనలు, రాత్రులలో వేడి గాలలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల చిన్నచిన్న జల్లుల వర్షం పడింది. అప్పటి నుంచి ఉక్కపోత మరీ అధికం అయింది. పక్షుల కోసం ప్రత్యేక ఏర్పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రోహిణి కార్తె ఫలితంగా ఎండ తీవ్రతకు శరీరం వెంటవెంటనే అలసిపోతుంది. ఆరోగ్య రీత్యా తగువిధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ► ఎక్కువగా మట్టికుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగిజావ, ఫలూదా వంటివి ఆయా వేళల్లో తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఇవి స్వీకరించటం వల్ల ఆరోగ్యానికి అనుకూలంగా ఉండటంతో పాటు ఉపశమనం కూడా కలుగుతుంది. ► వేడిని కలిగించే మసాలా పదార్థాలకు సంబంధించిన ఆహార పదార్థాలు, వేపుళ్లు, పచ్చళ్లు, ఎక్కువ ఆయిల్ కలిగిన ఆహార పదార్థాలు తినరాదు. ► నీళ్ల సౌకర్యం సమృద్ధిగా ఉన్నవారు రెండుపూటలా తప్పకుండా స్నానం చేయటం ద్వారా ఫలితం ఉంటుంది. ► అన్ని వయసుల వారూ ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించడం ద్వారా తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. ► చిన్నపిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి గుడ్డతో తుడిచి బట్టలు మార్చాల్సి ఉంటుంది. ► ఈ కాలంలో ముదురు రంగు దుస్తులు వేయకపోవడం ఉత్తమం. ► మనకు లాగే పశుపక్ష్యాదులకూ ఈ కార్తెలో ఇబ్బందులు ఎక్కువే. సాటి జీవులైన పశుపక్ష్యాదులకు తాగటానికి మనం నివసించే చోట ఆరుబయట ప్రదేశంలో గింజలను, నీటిని ఏర్పాటు చేయండి. -
రోహిణీలోనే దేశీ వరి
దేశీ వరి విత్తనాలను ఇంటి ఆహారపు అవసరాల కోసం కనీసం ఒక ఎకరంలో నైనా వేసుకొంటే మంచిదని, దేశీ వరి విత్తనాలను ఆరు తడి పద్ధతిలో మామూలు పద్ధతితో పోల్చితే 10 శాతం నీటితోనే సాగు చేయవచ్చని ప్రకృతి వ్యవసాయదారుడు, సేవ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు విజయరామ్ తెలిపారు. ఈ పద్ధతిలో 90 శాతం నీటిని ఆదా చేయవచ్చు. కలుపు నియంత్రణ కోసం మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 45 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలి. ఆరు తడి పద్ధతిలో వరిలో అంతర పంటలను కూడా వేయవచ్చు. అలా వేద్దాం అనుకున్న వారు మొక్కకు మొక్కకు దూరం, అలానే వరుసకు, వరుసకు మధ్య దూరం 60 సెం.మీ. ఉండేటట్లు నాటుకోవాలన్నారు. 180 నుంచి 210 రోజుల పంట కాలం ఉండే వరి రకాలు (మా పిళ్లై సాంబ, మొలగొలుకులు, మడుమురంగి లాంటివి) రోహిణి కార్తె (మే 25 నుంచి ప్రారంభం)లో నాట్లు వేసుకుంటేనే అనుకూలం. అలా అయితేనే 2వ పంటకు వీలు దొరుతుందన్నారు. జనవరి ఆఖరు లోపు నేల స్వభావం, నీటి వసతిని బట్టి పుచ్చకాయ, దోస, కూరగాయలు, నువ్వులు లేక పశుగ్రాసపు పంటలు వేసుకోవచ్చు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు మొదట ఏడాది ఒక ఎకరంలో మాత్రమే ఈ పద్ధతిని అనుసరించాలన్నారు. దేశీ వరి విత్తనాలతో మొదటి సంవత్సరం దిగుబడి 10 బస్తాల నుండి 20 బస్తాల వరకు రావచ్చని, తదుపరి కొంత పెరుగుతుందన్నారు. కేవలం వరిని మాత్రమే కాకుండా పప్పు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు పండించే ప్రయత్నమూ చేయాలి. వర్షము పడినప్పుడు పొలములో కొన్ని రోజుల వరకూ నీరి నిలిచిపోయే పరిస్థితి ఉన్న వారు (మాగాణి భూముల వారు, కోస్తా ప్రాంతాల వారు) కనీసం 200 గజాల స్థలంలోనైనా 2 అడుగుల ఎత్తులో మట్టిని వేసి ఇంటి అవసరాల కోసం కూరగాయలు పెంచుకోవాలన్నారు. దేశీ వరి విత్తనాలను పండించే రైతులు ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ ఉన్నారని, వారి దగ్గరి నుంచి విత్తనాలు తీసుకోవచ్చని విజయరామ్ వివరించారు. వివరాలకు హైదరాబాద్‌లోని సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయం కేంద్ర కార్యాలయానికి (04027654337 , 04027635867) ఫోన్ చేయవచ్చు. పొద్దున 10 గం. నుంచి సా. 6 గం. వరకు. గురువారం సెలవు. -
శ్రావణంలో ‘రోహిణి’
-
శ్రావణంలో ‘రోహిణి’
నిప్పులు కక్కుతున్న ఎండలు సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాపై ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. రోహిణి కార్తెను తలపించేలా సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కావలి, మచిలీపట్నం, నెల్లూరుల్లో 39, తుని, విజయవాడ, బాపట్ల, తిరుపతిల్లో 38, కాకినాడ, రెంటచింతలలో 37, నర్సాపురం, అనంతపురాల్లో 36 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా అవి సెగలను తగ్గించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య బంగాళాఖాతాల్లోనే ఇవి ఏర్పడుతుండటంతో, అవేమీ మన రాష్ట్రంపై ప్రభావం చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వేసవిలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదయితే వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆ పరిస్థితే ఉండటం గమనార్హం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ ఉష్ణతీవ్రత అధికంగా ఉంది.