కొనసాగుతున్న ఉష్ణతాపం, ఉక్కపోత
గాలిలో తేమ శాతం పెరుగుదలే కారణం
మరో మూడు రోజులు అసౌకర్య వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె పది రోజులకు పైగా ప్రభావం చూపించింది. ఉష్ణతాపం, ఉక్కపోత కలగలిసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏటా వేసవిలో రోహిణి కార్తె ప్రభావం అలాగే ఉంటుందని అంతా భరించారు. అయితే రోహిణి కార్తె వెళ్లిపోయాక మృగశిర కార్తె రాకతో వాతావరణం చల్లబడుతుందని భావించారు. కానీ రోహిణి వెళ్లిపోయి శనివారం నుంచి మృగశిర కార్తె ప్రవేశించింది. కానీ పరిస్థితిలో ఏమంత మార్పు కనిపించలేదు. ఉష్ణ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతూనే ఉంది.
తగ్గేదే లే.. అన్నట్టు ముచ్చెమటలు పోస్తూనే ఉన్నాయి. భానుడు కూడా సుర్రుమంటూనే ఉన్నాడు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మృగశిర కార్తె వచ్చినా చల్లదనం కానరావడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతం గాలిలో తేమ శాతం అధికంగా ఉండడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా విశాఖలో గాలిలో తేమ 70–80 శాతానికి పైగా నమోదవుతోంది. గాలిలో తేమ 60 శాతానికి మించితే ఉక్కపోత ఊపందుకుంటుంది.
కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా నమోదవుతుండడం వల్ల ఉక్కపోత కొనసాగుతోంది. మరోవైపు నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా 34–36 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఇలా ఒకపక్క ఉక్కపోత, మరోపక్క ఉష్ణతాపం వెరసి నగర వాసుల్ని అవస్థల పాల్జేస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఆపై కాస్త ఉపశమనం కలిగిస్తుందని వాతావరణ నిపుణులు భరోసా ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment