Mrigasira Karthi
-
మృగశిర వచ్చినా ముచ్చెమటలే!
సాక్షి, విశాఖపట్నం: రోహిణి కార్తె పది రోజులకు పైగా ప్రభావం చూపించింది. ఉష్ణతాపం, ఉక్కపోత కలగలిసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏటా వేసవిలో రోహిణి కార్తె ప్రభావం అలాగే ఉంటుందని అంతా భరించారు. అయితే రోహిణి కార్తె వెళ్లిపోయాక మృగశిర కార్తె రాకతో వాతావరణం చల్లబడుతుందని భావించారు. కానీ రోహిణి వెళ్లిపోయి శనివారం నుంచి మృగశిర కార్తె ప్రవేశించింది. కానీ పరిస్థితిలో ఏమంత మార్పు కనిపించలేదు. ఉష్ణ తీవ్రతతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతూనే ఉంది. తగ్గేదే లే.. అన్నట్టు ముచ్చెమటలు పోస్తూనే ఉన్నాయి. భానుడు కూడా సుర్రుమంటూనే ఉన్నాడు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మృగశిర కార్తె వచ్చినా చల్లదనం కానరావడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. ప్రస్తుతం గాలిలో తేమ శాతం అధికంగా ఉండడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా విశాఖలో గాలిలో తేమ 70–80 శాతానికి పైగా నమోదవుతోంది. గాలిలో తేమ 60 శాతానికి మించితే ఉక్కపోత ఊపందుకుంటుంది. కానీ ఇప్పుడు అంతకంటే ఎక్కువగా నమోదవుతుండడం వల్ల ఉక్కపోత కొనసాగుతోంది. మరోవైపు నగరంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా 34–36 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఇలా ఒకపక్క ఉక్కపోత, మరోపక్క ఉష్ణతాపం వెరసి నగర వాసుల్ని అవస్థల పాల్జేస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే వాతావరణం కొనసాగుతుందని, ఆపై కాస్త ఉపశమనం కలిగిస్తుందని వాతావరణ నిపుణులు భరోసా ఇస్తున్నారు. -
చేపల లూటీ
-
నేడు మృగశిర కార్తె
ఖమ్మంవ్యవసాయం: మృగశిర కార్తె అనగానే తొలుత గుర్తుకొచ్చేది చేపలు. ఈ కార్తె ఆరంభం రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. మృగశిర కార్తెతో వేసవి కాలం దాదాపు ముగిసి వర్షాకాలం మొదలైందని భావిస్తారు. ఈ నేపథ్యాన కార్తె మొదటి రోజు చేపలు తింటే మంచిదని నమ్ముతారు. ఇదేరోజు ఉబ్బసం, ఆయాసంతో బాధపడుతున్న వారికి హైదరాబాద్‌లో బత్తిని సోదరులు చేపమందు ఇవ్వడం అందరికీ తెలిసిందే. ఇక ఈరోజు చేపలు తింటే వేసవిలో ఉష్ణోగ్రతతో శరీరంలో పెరిగే వేడి దూరమవుతుందని చెబుతారు. ఇలా కారణాలు ఏమైనా మృగశిర ఆరంభం రోజున చేపలు తినడానికి జనం ఆసక్తి చూపిస్తుండటంతో అమ్మకాలు కూడా జోరుగా సాగనున్నాయి. ఈ మేరకు జిల్లాలో దాదాపు 100 టన్నులకు పైగా చేపల అమ్మకం సాగనున్నట్లు అంచనా. ఒక్క ఖమ్మం నగరంలోనే సుమారు 40 నుంచి 50 టన్నుల చేపలు అమ్ముడవుతాయని విక్రయదారులు చెబుతున్నారు. సరిపడా లభ్యత లేక.. మృగశిర కార్తె రోజున ప్రజలు చేపలు తినడానికి ప్రాధాన్యత ఇస్తుండగా ఆ స్థాయిలో లభ్యత లేదు. దీంతో విక్రయదారులు, మత్స్యకారులు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చేపలను శుక్రవారం సాయంత్రానికి దిగుమతి చేసుకున్నారు. ఆయా జిల్లాలో ఉన్న చేపల చెరువుల నుంచి టన్నుల కొద్ది చేపలను తెప్పించి.. అమ్మకానికి సిద్ధం చేశారు. రకాల ఆధారంగా డిమాండ్ మృగశిర కార్తె సందర్భంగా చేపలకు డిమాండ్ పెరిగింది. శనివారం మృగశిర అయినప్పటికీ లభ్యత, ధర ఎలా ఉంటాయోనన్న భావనతో పలువురు శుక్రవారమే కొనుగోలుకు రాగా విక్రయం ఊపందుకుంది. దీంతో ధరలూ పెరిగాయి. సహజంగా ఇక్కడ అధిక ధర ఉండే కొర్రమేను చేప కిలో రూ.350 నుంచి రూ.500కు చేరింది. ఇక పచ్చి రొయ్యలు కిలో రూ.450 చొప్పున విక్రయిస్తుండగా, బొచ్చలు, రవ్వలు, గ్యాస్‌కట్‌లు, బంగారు తీగలు వంటి రకాలను రూ.200 నుంచి రూ.220 వరకు అమ్ముతున్నారు.మొదటి నుంచి అలవాటు మృగశిర కార్తె ఆరంభం రోజున చేపలు తినడం అలవాటు. ఈ రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేవారు. అందుకే ఏటా ఈ కార్తె రోజున చేపలు తప్పక కొనుగోలు చేస్తాం. చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని, ఉబ్బసం, ఆయాసం వంటి వ్యాధులు దూరమవుతాయని నమ్మకం. –ప్రభాకర్, బురహాన్‌పురం, ఖమ్మంచేపల విక్రయాలు పెరిగాయి.. మృగశిర కార్తె సందర్భంగా చేపల విక్రయాలు పెరిగాయి. ఇక్కడ చేపలు సరిపడా లేకపోవడంతో ఏపీ నుంచి తెప్పించాం. చాలామంది ముందురోజే ఆర్డర్ చేశారు. ఈసారి కొర్రమేను రకం చేపలకు డిమాండ్ ఉంది. ఇతర రకాలు సైతం బాగానే అమ్ముడవుతాయనే నమ్మకంతో దిగుమతి చేసుకున్నాం. –రేణుక, చేపల విక్రయదారు, త్రీటౌన్, ఖమ్మం -
మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?
మృగశిర కార్తె అంటే.. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి.మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్నవారు , గర్భిణులు ఈ సమయంలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. ఇది మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడిగా ఉండేందుకు బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. దీని వల్ల గుండె జబ్బులు , ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం , దగ్గు బారిన పడతారు. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కాలంటే బెల్లంలో ఇంగువ కలుపుకుని తినాల్సిందే.ఇక మాంసాహారులైతే ఈ సీజన్లో కోళ్లు, పొట్టేళ్లు, మేకపోతులు, చేపలు వంటి వాటిని తింటారు. కార్తె ప్రారంభం శుక్రవారం అయినా కొంత మంది మాంసాహారాన్ని తీసుకోకపోవడంతో శని, ఆదివారాల్లో తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరోగ్య పరంగా చెప్పుకుంటే కోడి మాంసం వేడి చేస్తుందని, తద్వారా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, సీజనల్‌గా వచ్చే వ్యాధులు రావన్నది అందరికీ తెలిసిందే. ఈ సీజన్లోనే చేప మందు ఇవ్వడం జరుగుతుంది. చేపలు తినడం ద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఇంగువలో, చింతచిగురులో పెట్టి తీసుకుంటారు.ఈ కార్తెలు ఎందుకంటే..పంచాంగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి , వార , నక్షత్ర , యోగ , కరణాలు , శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.పురాణగాధ ప్రకారంమృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్రఅలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.ప్రకృతి మార్పు ప్రభావంఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ. -
8న హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ
చార్మినార్/దూద్‌బౌలి (హైదరాబాద్): మృగశిర కార్తె సందర్భంగా ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆస్తమా రోగులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడానికి బత్తిని కుటుంబ సభ్యులు అంతా సిద్ధం చేస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశం రోజైన జూన్ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని శుక్రవారం బత్తిన అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌గౌడ్‌లు మీడియాకు తెలిపారు.చేప ప్రసాదం తయారీలో భాగంగా జూన్ 7వ తేదీన ఉదయం 11 గంటలకు దూద్‌బౌలీలోని స్వగృహంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, బావి పూజ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అనంతరం 8వ తేదీన ఉదయం ఇంట్లోనే తమ కుటుంబ సభ్యులందరూ చేప ప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించి ప్రసాదం పంపిణీ చేస్తామని వివరించారు. -
మృగశిర కార్తెలో ‘మీనం‘ దివ్యౌషధం
సాక్షి, అమలాపురం: భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కో కార్తెలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం ఆనవాయితీ. ఇటువంటి ఆహారపు అలవాట్లు ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా ఆరోగ్యానికి మేలు చేసేవి కావడం విశేషం. ఒక్కో మాసంలో ఒక్కో రకం ఆహారం తీసుకోవడం గోదావరి వాసులకు సంప్రదాయంగా, ఆనవాయితీగా వస్తోంది. వీటిలో పండ్లు, కూరగాయల వంటి శాకాహారమే కాదు. చేపల వంటి మాంసాహారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత మృగశిర కార్తెలో చేపలు ఆహారంగా తీసుకోవడం కూడా ఈ ఆనవాయితీల్లో ఒకటి. మృగశిర కార్తె రోజుల్లో చేపలు తినడం ఆరోగ్యానికి మేలని నమ్మకం. రోళ్లు పగిలే స్థాయిలో ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసిన వెంటనే మృగశిర మొదలవుతుంది. తొలకరి వర్షాలు ఆరంభమవుతాయి. ఈ క్రమంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా అనేక హానికర సూక్ష్మ క్రిముల వంటివి ఉత్పత్తి అవుతాయి. ఇటువంటి వాతావరణంలో రోగ నిరోధక శక్తి తగ్గి జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఇటువంటి అనారోగ్యాల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాసీ్త్రయంగా కూడా నిరూపితమైంది. ఈ సీజన్లోనే హైదరాబాద్‌లో బత్తిని గౌడ్ సోదరులు ‘చేప ప్రసాదం’ ఇస్తూంటారు. దీనివల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని విశ్వసిస్తారు. రుచిలో మిన్న.. గోదారి చేప నెల్లూరు అంటే కేవలం చేపల పులుసు మాత్రమే గుర్తుకు వస్తుంది. అదే గోదారి జిల్లాలంటే పులస చేపల పులుసు ఒక్కటే కాదు.. ఇక్కడ దొరికే రకరకాల చేపలు.. వాటితో తయారు చేసే రకరకాల వంటలు గుర్తుకొస్తాయి. గోదావరి నీటి మాహాత్మ్యమో.. లేక వండటంలో గొప్పతనమో చెప్పలేం కానీ గోదావరి చేప కూరలు తినాల్సిందేనని మాంసాహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ చెబుతారు. చందువా వేపుడు, పండుగొప్ప ఇగురు, కొర్రమేను కూర, కొయ్యింగల పులుసు, గుమ్మడి చుక్క, కోన చేపల డీప్ ఫ్రై వంటివి తింటే జిహ్వ వహ్వా అనాల్సిందే. పెద్ద చేపల్లోనే కాదు.. చిన్న వాటిల్లో పచ్చి మెత్తళ్ల మామిడి, ఎండు మెత్తళ్ల వేపుడు, కట్టి చేపలు, బొమ్మిడాయిల పులుసు, రామల ఇగురు, చింతకాయ చిన్న చేపలు, చీరమేను కూరలకు ఫిదా కాని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఈ చేపలతో పులుసులు, కూరలు, ఇగురులు, వేపుళ్ల వంటివి చేయడంలో గోదావరి వాసులు సిద్ధహస్తులు. ఇక ఉప్పు చేప పప్పుచారు, ఆర్చిన చేప ఇగురు, టమాటా రసం తినాలే కానీ వర్ణించేందుకు మాటలు చాలవు. ఇవే కాదు జెల్లలు, మాతలు, గొరకలు, బొచ్చు, శీలావతి, మోసు, గోదావరి ఎర్రమోసు, వంజరం, గులిగింతలు, మట్టకరస ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు వంటి నగరాల్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కటే కాదు.. గోదారోళ్ల చేపల పులుసు, గోదావరి చేపల కూరల పేరుతో రెస్టారెంట్లు కూడా వెలిశాయంటే ఇక్కడ వండే రకాలకు ఉన్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. లెక్కకు మిక్కిలిగా ఔషధ గుణాలు ► చేపల్లో ఔషధ గుణాలు అపారంగా ఉంటాయి. ► ఇందులోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బులు, ఆస్తమా తదితర అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయాలంటే చేపలు తినాలని వైద్యులు చెబుతారు. ► మనిషి తన రోజువారీ కార్యకలాపాలు సాఫీగా సాగించేందుకు మెదడులో న్యూరాన్లతో కూడిన గ్రే మ్యాటర్ ఉంటుంది. చేపలు తింటే ఇది మరింత చురుకుగా పని చేస్తుంది. ► వయస్సు మీద పడుతున్న సమయంలో మెదడులోని కణాల క్షీణతను నిరోధించడానికి చేపల ఆహారం తోడ్పడుతుంది. దీనివల్ల అల్జీమర్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ► టైప్–1 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. ► చేపలు తింటే దృష్టి లోపాలు, అంధత్వం వంటివి తగ్గుతాయి. ► గర్భిణులు, పిల్లలకు పాలిచ్చే సీ్త్రలకు చేపలు తినడం ఎంతో మేలు. ► చిన్న పిల్లలకు సరిపడే స్థాయిలో పాలు ఇవ్వలేనప్పుడు బాలింతలకు మెత్తళ్ల కూర వండి పెట్టడం సర్వసాధారణం. అలాగే బైపాస్ ఆపరేషన్ చేయించుకున్న వారికి పచ్చి మెత్తళ్లతో పాటు, ఎండు మెత్తళ్లు, చిన్న చేపలు (చేదు చేపలు) పత్యంగా అందిస్తారు. సొరచేపల ద్వారా శృంగార సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు చెబుతారు. చేపలు.. కోకొల్లలు మాంసాహారులకు కార్తెతో సంబంధం లేదు. ఏడాది పొడవునా చేపలను ఆహారంగా తీసుకుంటారు. గోదావరి జిల్లాల్లో కూడా చేపలకు కొదవే లేదు. విస్తారమైన సముద్రం, అఖండ గోదావరితో పాటు నదీపాయలు, డెల్టా పంట కాలువలు, పర్రభూములు, మెట్టలో సాగునీటి చెరువులు, ప్రాజెక్టులు.. ఏజెన్సీని ఆనుకుని ఉండే సహజసిద్ధమైన చెరువులు (ఆవలు).. ఆపై వేలాది ఎకరాల్లో చేపల సాగు.. ఇలా ఎటు చూసినా రకరకాల చేపలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతూంటాయి. -
మృగశిర ఎఫెక్ట్.. కొర్రమీను@ 650
హైదరాబాద్: మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. గురువారం నగరంలోని చేపల మార్కెట్లు వినియోగదారులతో కిక్కిరిశాయి. గ్రేటర్ వ్యాప్తంగా సుమారు 3 లక్షల కిలోల చేపల విక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాల అంచనా. మృగశిర కార్తె ఎఫెక్ట్‌తో కొర్రమీను ధరలు విపరీతంగా పెరిగాయి. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలోకు రూ.320 పలుకుతుండగా.. ప్రస్తుతం రూ.500 నుంచి రూ. 650 వరకు విక్రయించారు. బొచ్చ, రవ్వు చేపలను కిలో రూ.120 నుంచి రూ. 150కి, పాంప్లేట్ రూ. 90–120 విక్రయించారు. -
మృగశిర కార్తె.. చేపలకు ఫుల్ డిమాండ్! (ఫోటోలు)
-
Photo Feature: చేపలు.. గుంపులు.. నిరసనలు
మృగశిర కార్తె సందర్భంగా మంగళవారం చేపలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. చేపలను కొనేందుకు వినియోగదారులు దుకాణాల ముందు గుమిగూడారు. కరోనా నిబంధనలకు ఖాతరు చేయకుండా గుంపులు గుంపులుగా తిరగడంతో ఆందోళన వ్యక్తమయింది. కాగా, కోవిడ్ వ్యాక్సిన్, ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వద్ద ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. -
మృగశిరొచ్చే..
ఖమ్మంవ్యవసాయం: మృగశిర అనగానే గుర్తుకొచ్చేది ఆ రోజున చేపలు తినడం. అయితే దీని వెనుక అనేక రకాల కారణాలున్నాయి. కార్తె ఆరంభమైందంటే దాదాపు వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి అడుగిడినట్లే. వర్షాకాలం ఆరంభం.. మృగశిర కార్తె తొలిరోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లో బత్తిని సోదరులు చేపమందు వేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అంతదూరం వెళ్లలేని వారు మృగశిర రోజున తప్పక చేపలు తింటారు. అంతేకాక వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందని, అది చేపలు తినడం వల్ల దూరమవుతుందనేది పెద్దల మాట. దీంతో కూడా మృగశిర ఆరంభం రోజున చేపలను తింటుంటారు. ఈ క్రమంలో మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. చేపల విక్రయదారులు కార్తె ఆరంభం రోజును పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి చేపలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయాలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వైరా, పాలేరు రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున చేపల పెంపకం జరుగుతోంది. వైరా రిజర్వాయర్‌లో ఇప్పటికే చేపల వేట జరుగుతుండగా.. పాలేరు రిజర్వాయర్‌లో శనివారం నుంచి చేపలు పట్టడానికి అంతా సిద్ధం చేశారు. 100 టన్నులకు పైగానే విక్రయానికి సిద్ధం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 100 టన్నుల చేపలను మత్స్యకారులు, చేపల విక్రయదారులు అమ్మకానికి సిద్ధం చేసినట్లు సమాచారం. చేపలను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని.. ఐస్ బాక్స్‌ల్లో నిల్వ చేస్తున్నారు. మృగశిర కార్తె ఆరంభం రోజైన శనివారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 నుంచి 150 టన్నుల చేపలను విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్క ఖమ్మంలోనే సుమారు 40 నుంచి 45 టన్నుల చేపలు విక్రయించే అవకాశాలున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా రహదారుల వెంట చేపల విక్రయాలకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. పెద్ద పట్టణాలు కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు, మధిర, వైరా, భద్రాచలం, అశ్వారావుపేటతోపాటు మండలాల్లో కూడా మృగశిర రోజున చేపల విక్రయాలు భారీగానే జరుగుతాయి. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో దాదాపు 40 నుంచి 50 టన్నుల మేర చేపలు విక్రయించే అవకాశం ఉంది. ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం వంటి ప్రాంతాల్లో కూడా క్వింటాళ్ల కొద్దీ చేపలను విక్రయాలకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. ఆంధ్రా నుంచి దిగుమతి ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో పెంచిన చేపలు మృగశిర రోజున విక్రయానికి సరిపోవని గుర్తించిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా దిగుమతి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, బాపట్ల, విజయవాడ, గోదావరి జిల్లాలోని రాజమండ్రితోపాటు పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టన్నుల కొద్దీ చేపలను వాహనాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకొని.. ఐస్ వేసుకొని తీసుకొచ్చి నిల్వ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. రకాన్నిబట్టి డిమాండ్ చేపల రకాన్నిబట్టి ధర పలికే అవకాశం ఉంది. సహజంగా మన ప్రాంతంలో అధిక ధర ఉండే కొర్రమీను చేప ధర మృగశిర కార్తె ఆరంభం రోజున రెట్టింపు పలుకుతుంది. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలో రూ.300 ఉంటుంది. కానీ.. మృగశిర రోజున కిలో రూ.500 ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇక పచ్చి రొయ్యలు, బొచ్చలు, రవ్వు, గ్యాస్కట్, బంగారు తీగ వంటి రకాలు సాధారణ రోజుల్లో కంటే అధిక ధరలు పలికే అవకాశాలు ఉన్నాయి. కిలో ఒక్కంటికి అదనంగా మరో రూ.30 నుంచి రూ.50 వరకు అధిక ధర పలికే అవకాశం ఉంది. సమృద్ధిగా చేపలు ప్రభుత్వం చేప పిల్లల పథకం చేపట్టిన తర్వాత చెరువుల్లో సమృద్ధిగా చేపల ఉత్పత్తి జరుగుతోంది. స్థానిక చెరువులు, జలాశయాల్లో ఉత్పత్తి అయ్యే చేపలను మత్స్యకారులు ఆయా గ్రామాలు, మండలాల్లోనే విక్రయిస్తున్నారు. మృగశిర కార్తె రోజున పలు చెరువుల్లో చేపలు పట్టడానికి మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. అన్ని ప్రాంతాల్లో మృగశిర రోజున సమృద్ధిగా చేపలు లభించే అవకాశాలున్నాయి. – బుజ్జిబాబు, జిల్లా మత్స్య శాఖాధికారి -
50 వేల మందికి చేప ప్రసాదం
♦ శుక్రవారం ఉదయం 9 గంటల వరకు పంపిణీ ♦ వివిధ రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన ఆస్తమా బాధితులు ♦ ఏర్పాట్లు పరిశీలించిన నాయిని, తలసాని, స్వామిగౌడ్ సాక్షి, హైదరాబాద్: చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ప్రశాంతంగా సాగింది. ఏటా మృగశిర కార్తె ప్రారంభం రోజు అందజేసే చేపప్రసాదం పంపిణీ కార్యక్రమం గురువారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. బత్తిని హరినాథ్‌గౌడ్, విశ్వనాథ్‌గౌడ్, శివరాంగౌడ్, సోమలింగంగౌడ్, ఉమామహేశ్వర్‌గౌడ్‌లు, వారి కుటుంబసభ్యులు చేపప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం భారీ వర్షం కారణంగా కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్తమా బాధితుల సంఖ్య క్రమంగా పెరిగింది. హైదరా బాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు తరలివచ్చారు. రాత్రి 10.30 గంటల వరకు సుమారు 50 వేల మందికి చేప ప్రసాదం పంపి ణీ అయినట్లు అధికారులు వెల్లడిం చారు. అయితే, గత సంవత్సరంతో పోల్చు కుంటే ఈ సంఖ్య తక్కువే. గతేడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు 64 వేల మందికి పైగా చేపప్రసాదం పంపిణీ చేశారు. చేపప్రసాదం కోసం వచ్చిన వారిలోనూ తెలుగు రాష్ట్రాల వారి కంటే ఉత్తరాది రాష్ట్రాల ప్రజలే ఎక్కువ సంఖ్యలో కనిపించారు. సేవలందించిన స్వచ్ఛంద సంస్థలు చేప ప్రసాదం పంపిణీ కోసం మొత్తం 32 కౌంటర్లను, టోకెన్లు అందజేసేందుకు మరో 40 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంత్‌నిరంకారీ గ్రూపు, ఉత్తరభారత్ నాగరిక్ సంఘ్, పంజాబీ సేవాదళ్, హైదరాబాద్ దేశ్పాల్ సమితి, బద్రీ విశాల్ పన్నాలాల్ ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, గౌడ విద్యార్థి సంఘాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు సేవలంద జేశారు. క్యూలైన్ల వద్ద ప్రతి ఒక్కరికీ చేపపిల్లలు, ప్రసాదం లభించే విధంగా జాగ్రత్తలు చేపట్టారు. ఆస్తమా బాధితులకు, వారి బంధు మిత్రులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉదయం ప్రారంభోత్సవ సమయంలోనూ సాయంత్రం 4 గంటలకు రెండుసార్లు వచ్చి ఏర్పాట్లను పర్య వేక్షించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు చేప ప్రసాద పంపిణీ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. 4 కేంద్రాల్లో మరో రెండు రోజులు చేప ప్రసాదం మృగశిర కార్తె ప్రారంభం రోజున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం స్వీక రించని వారికి బత్తిని సోదరులు నగరంలోని నాలుగు కేంద్రాల్లో చేప ప్రసాదాన్ని అందజేస్తారు. మరో రెండు రోజులపాటు ఈ కేంద్రాలు పనిచేస్తాయి. నగరంలోని కూకట్ పల్లి, కవాడిగూడ, వనస్థలిపురం, పాత బస్తీలో ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని బత్తిని హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. నాలుగు తరాలుగా తమ వంశం చేప మందును అందజేస్తోందని చెప్పారు. ఈ ప్రసాదాన్ని మూడు రకాలుగా తయారు చేసి ఇస్తున్నా మని పేర్కొన్నారు. మాంసాహారులకు చేప ప్రసాదం, శాకాహారులకు బెల్లం ప్రసాదం, ఈ రెండూ తీసుకోనివారికి కార్తీక ప్రసాదం ఇస్తామని తెలిపారు.