మృగశిర సందర్భంగా ఖమ్మంలో శుక్రవారం నుంచే చేపల విక్రయాలు
ఖమ్మంవ్యవసాయం: మృగశిర అనగానే గుర్తుకొచ్చేది ఆ రోజున చేపలు తినడం. అయితే దీని వెనుక అనేక రకాల కారణాలున్నాయి. కార్తె ఆరంభమైందంటే దాదాపు వేసవి కాలం నుంచి వర్షాకాలంలోకి అడుగిడినట్లే. వర్షాకాలం ఆరంభం.. మృగశిర కార్తె తొలిరోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం ఉన్నవారికి మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లో బత్తిని సోదరులు చేపమందు వేస్తుండడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అంతదూరం వెళ్లలేని వారు మృగశిర రోజున తప్పక చేపలు తింటారు. అంతేకాక వేసవిలో ఉష్ణోగ్రతలతో శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుందని, అది చేపలు తినడం వల్ల దూరమవుతుందనేది పెద్దల మాట. దీంతో కూడా మృగశిర ఆరంభం రోజున చేపలను తింటుంటారు. ఈ క్రమంలో మృగశిర రోజున చేపలకు మంచి గిరాకీ ఉంటుంది. చేపల విక్రయదారులు కార్తె ఆరంభం రోజును పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి చేపలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని విక్రయాలకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రధానంగా వైరా, పాలేరు రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున చేపల పెంపకం జరుగుతోంది. వైరా రిజర్వాయర్‌లో ఇప్పటికే చేపల వేట జరుగుతుండగా.. పాలేరు రిజర్వాయర్‌లో శనివారం నుంచి చేపలు పట్టడానికి అంతా సిద్ధం చేశారు.
100 టన్నులకు పైగానే విక్రయానికి సిద్ధం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 100 టన్నుల చేపలను మత్స్యకారులు, చేపల విక్రయదారులు అమ్మకానికి సిద్ధం చేసినట్లు సమాచారం. చేపలను వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని.. ఐస్ బాక్స్‌ల్లో నిల్వ చేస్తున్నారు. మృగశిర కార్తె ఆరంభం రోజైన శనివారం ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 నుంచి 150 టన్నుల చేపలను విక్రయించే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్క ఖమ్మంలోనే సుమారు 40 నుంచి 45 టన్నుల చేపలు విక్రయించే అవకాశాలున్నాయి. నగరంలో ఏ ప్రాంతంలో చూసినా రహదారుల వెంట చేపల విక్రయాలకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. పెద్ద పట్టణాలు కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు, మధిర, వైరా, భద్రాచలం, అశ్వారావుపేటతోపాటు మండలాల్లో కూడా మృగశిర రోజున చేపల విక్రయాలు భారీగానే జరుగుతాయి. పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో దాదాపు 40 నుంచి 50 టన్నుల మేర చేపలు విక్రయించే అవకాశం ఉంది. ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం వంటి ప్రాంతాల్లో కూడా క్వింటాళ్ల కొద్దీ చేపలను విక్రయాలకు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.
ఆంధ్రా నుంచి దిగుమతి
ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో పెంచిన చేపలు మృగశిర రోజున విక్రయానికి సరిపోవని గుర్తించిన వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా దిగుమతి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, బాపట్ల, విజయవాడ, గోదావరి జిల్లాలోని రాజమండ్రితోపాటు పలు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నారు. టన్నుల కొద్దీ చేపలను వాహనాల్లో ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేసుకొని.. ఐస్ వేసుకొని తీసుకొచ్చి నిల్వ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు.
రకాన్నిబట్టి డిమాండ్
చేపల రకాన్నిబట్టి ధర పలికే అవకాశం ఉంది. సహజంగా మన ప్రాంతంలో అధిక ధర ఉండే కొర్రమీను చేప ధర మృగశిర కార్తె ఆరంభం రోజున రెట్టింపు పలుకుతుంది. సాధారణ రోజుల్లో ఈ చేపలు కిలో రూ.300 ఉంటుంది. కానీ.. మృగశిర రోజున కిలో రూ.500 ధర పలికే అవకాశాలు ఉన్నాయి. ఇక పచ్చి రొయ్యలు, బొచ్చలు, రవ్వు, గ్యాస్‌కట్, బంగారు తీగ వంటి రకాలు సాధారణ రోజుల్లో కంటే అధిక ధరలు పలికే అవకాశాలు ఉన్నాయి. కిలో ఒక్కంటికి అదనంగా మరో రూ.30 నుంచి రూ.50 వరకు అధిక ధర పలికే అవకాశం ఉంది.
సమృద్ధిగా చేపలు
ప్రభుత్వం చేప పిల్లల పథకం చేపట్టిన తర్వాత చెరువుల్లో సమృద్ధిగా చేపల ఉత్పత్తి జరుగుతోంది. స్థానిక చెరువులు, జలాశయాల్లో ఉత్పత్తి అయ్యే చేపలను మత్స్యకారులు ఆయా గ్రామాలు, మండలాల్లోనే విక్రయిస్తున్నారు. మృగశిర కార్తె రోజున పలు చెరువుల్లో చేపలు పట్టడానికి మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. అన్ని ప్రాంతాల్లో మృగశిర రోజున సమృద్ధిగా చేపలు లభించే అవకాశాలున్నాయి. – బుజ్జిబాబు, జిల్లా మత్స్య శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment