Fact Check: రైతుకు కాదు.. రామోజీకే విపత్తు  | Distribution of certified farm produce through RBKs | Sakshi
Sakshi News home page

Fact Check: రైతుకు కాదు.. రామోజీకే విపత్తు

Published Sun, Dec 31 2023 5:27 AM | Last Updated on Sun, Dec 31 2023 4:09 PM

Distribution of certified farm produce through RBKs - Sakshi

సాక్షి, అమరావతి: వాతావరణ ప్రభావంతో ఏదైనా పంటకు తెగులు సోకినా.. పురుగు వచ్చినా దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్టుగా ఉంది ఈనాడు రామోజీరావు రాతలు చదువుతుంటే. సర్టిౖఫై చేసిన సాగు ఉత్పాదకాలను ఆర్బీకేల ద్వారా గ్రామస్థాయిలో రైతుల ముంగిట అందిస్తూ అన్నదాతలకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా నిత్యం రోత రాతలు రాస్తూ రామోజీ పైశాచికానందం పొందుతున్నారు.

నకిలీ సాగు ఉత్పాదకాల బారినపడి రాష్ట్రంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న సంకల్పంతో.. పంపిణీ చేసే ముందు వాటి నాణ్యతను పరీక్షించాలన్న లక్ష్యంతో నియోజకవర్గ స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ను తీసుకొచ్చింది. ఈ ల్యాబ్‌ల్లో పరీక్షించిన తర్వాతే మార్కెట్‌లోకి తీసుకొచ్చేలా ఏర్పాటు చేసింది. ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన ఉత్పాదకాలను మాత్రమే గ్రామస్థాయిలో రైతులకు పంపిణీ చేస్తోంది.

ఈ కారణంగానే నాలుగున్నరేళ్లలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వల్ల తాము పంట నష్టపోయామని ఒక్కరంటే ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. ఇవేమీ పట్టని ఈనాడు వాస్తవాలకు ముసుగేసి.. ‘విత్తనం నుంచే విపత్తు’ అంటూ అడ్డగోలుగా అబద్ధాలతో కథనాన్ని అచ్చేసింది. ఈ కథనంలో పేర్కొన్న అంశాలపై వాస్తవాలు ఇవీ.. 

ఏటా 50 వేల శాంపిల్స్‌ పరీక్షిస్తున్నా ఏడుపే 
రాష్ట్రంలో ఏటా సగటున 1.25 లక్షల లాట్స్‌ విత్తనాలు, 2.80 లక్షల బ్యాచ్‌ల పురుగు మందులు, 20 వేల బ్యాచ్‌ల ఎరువులు మార్కెట్‌కు వస్తుంటాయి. గతంలో వీటి నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్రస్థాయిలో 11 లే»ొరేటరీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. పెస్టిసైడ్స్‌ కోసం 5, ఎరువులు, విత్తన పరీక్షల కోసం 3 చొప్పున ఉండేవి. మార్కెట్‌లోకి వచ్చే ఎరువుల్లో 25–30 శాతం, విత్తనాల్లో 3–4 శాతం, పురుగు మందుల్లో ఒక శాతానికి మించి శాంపిళ్లను పరీక్షించే వారుకాదు.

దీంతో మార్కెట్‌లో నకిలీలు రాజ్యమేలేవి. ఫలితంగా ఏటా రూ.వేల కోట్ల విలువైన పెట్టుబడిని రైతులు నష్టపోయేవారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టాలనే లక్ష్యంతోనే రూ.213 కోట్లతో దేశంలో మరెక్కడా లేనివిధంగా జిల్లా స్థాయిలో 10, నియోజకవర్గ స్థాయిలో 127 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ను జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయిలో మరో 20 ల్యాబ్స్‌ నిర్మాణ దశలో ఉన్నాయి.

ఈ ల్యాబ్‌లలో చట్టపరంగా సేకరించిన నమూనాలతో పాటు రైతువారీ వ్యాపార సంబంధమైన విత్తనాలు, ఎరువుల నమూనాలు పరీక్షిస్తున్నారు. గతంలో ఏటా అన్నిరకాల శాంపిల్స్‌ కలిపి 10 వేలు పరీక్షించడమే కష్టంగా ఉండేది. కానీ.. నేడు అగ్రి ల్యాబ్స్‌ రాకతో ఏటా సగటున 50వేల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. ఫలితంగా ఎక్కడా నకిలీ విత్తనం, ఎరువు, పురుగు మందుల బారినపడి నష్టపోయామన్న మాటే విన్పించలేదు.
 
ఆర్బీకేల ద్వారా పురుగుల మందుల విక్రయం 

2020–21 నుంచి 2021–22 వరకు ఆర్బీకేల ద్వారా రూ.14.01 కోట్ల విలువ చేసే 1,36,443 లీటర్ల పురుగు మందులను 1,50,822 మంది రైతులకు ప్రభుత్వం అందించింది. 2023–24లో రైతులకు అవసరమైన, నాణ్యత పరీక్షించబడిన పురుగు మందులను ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేసేందుకు నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ అవసరమైన చర్యలు తీసుకుంది. సీజన్లో మందులు దొరకవనే భయంతో రైతులు విత్తనం వేసేప్పుడే అధిక సంఖ్యలో తీసుకుని నిల్వ చేసుకుంటుంటారు.

కాగా.. పురుగుల మందుల వినియోగం పెరగడానికి పలు కారణాలు దోహదం చేస్తుంటాయి. 2022–23 సీజన్‌లో అధిక వర్షపాతం వలన గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలలో రైతులు పప్పుధాన్యాల పంటల నుండి వాణిజ్య పంటలైన మొక్కజొన్న, పత్తి, మిరప పంటల వైపు మళ్లారు.

 రాయలసీమ జిల్లాలలో నూనె గింజల పంటల నుండి  పండ్ల తోటలు, పత్తి పంటల సాగు వైపు మొగ్గు చూపారు. మిరపలో వచ్చిన నల్లతామర, పత్తి, మొక్కజొన్నలలో పురుగులు, తెగుళ్ల ఉ«ధృతికి అడ్డుకట్ట వేసేందుకు గతం కంటే కాస్త ఎక్కువగానే పురుగు మందులను వినియోగించారు. అయితే.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో మాత్రమే వినియోగించాలని ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేస్తూనే ఉన్నారు. 

దిగుబడులకు ఢోకా లేదు 
ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్యలో సగటున 153.95 లక్షల టన్నులుగా నమోదైతే.. 2019–23 మధ్య 165.40 లక్షల టన్నులుగా నమోదైంది. అంటే 11.45 లక్షల టన్నుల మేర పెరిగింది. ఇక ఉద్యాన పంటల విషయానికి వస్తే టీడీపీ హయాంలో 2018–19లో 17.40 లక్షల హెక్టార్లలో సాగవగా, 305 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి.

కాగా ప్రస్తుతం 18.03 లక్షల హెక్టార్లకు విస్తరించగా.. 368.83 లక్షల టన్నుల దిగుబడులు నమోదయ్యాయి. అంటే ఏకంగా 63 లక్షల టన్నులకు పైగా ఉద్యాన పంటల దిగుబడులు పెరిగాయి. నిజంగా నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాజ్యమేలితేæ ఈ స్థాయిలో దిగుబడులు పెరుగుతాయా అన్నది ఒక్కసారి రామోజీ ఆలోచన చేయాలి.   

ఏటా విస్తృత తనిఖీలు.. నాణ్యత లోపిస్తే క్రిమినల్‌ కేసులు 
రాష్ట్రవ్యాప్తంగా ఏటా పురుగు మందులు, ఎరువుల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన తనిఖీల్లో పురుగు మందుల చట్టం 1968 నిబంధనల ప్రకారం సక్రమంగా లేని రూ.5.21 కోట్ల విలువైన 37,998 లీటర్ల పురుగు మందుల అమ్మకాలను నిలిపివేశారు. రూ.కోటి విలువైన 17,073 లీటర్ల పురుగు మందులను స్వా«దీనం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇంకోవైపు ర్యాండమ్‌ తనిఖీల్లో భాగంగా ఈ ఏడాది 10,500 పురుగుల మందుల నమూనాలు సేకరించి ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ ద్వారా పరీక్షించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

డిసెంబర్‌ నాటికి 8,159 నమూనాలు సేకరించి పరీక్షించగా, కేవలం 55 నమూనాలు మాత్రమే నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించి సంబంధిత కంపెనీలు, డీలర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. తయారీదారుల అభ్యర్థన మేరకు 19 నమూనాల పునర్విశ్లేషణ కోసం పంపించారు. మిగిలిన నాసిరకం పురుగు మందుల ఉత్పత్తిదారులపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేశారు. æనాణ్యత నిర్ధారణ నిమిత్తం నమూనాలను సేకరించి సంబంధిత పరీక్షా కేంద్రాలకు పంపించటం జరిగింది. ఈ విధంగా అగ్రిల్యాబ్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 23,714 పురుగులమందుల నమూనాలను పరీక్షించగా, 175 శాంపిల్స్‌ నాసిరకంగా ఉన్నట్టుగా గుర్తించారు.

తయారీదారులు, సరఫరాదారుల అభ్యర్థన మేరకు 82 నమూనాలను కోర్టు ద్వారా పునర్విశ్లేషణ కోసం పంపించారు. ఇప్పటికే 31 నాసిరకం ఉత్పత్తిదారులపై చట్టపరమైన చర్యలు, క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. మిగిలిన 73 నాసిరకమైన నమూనాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. పురుగు మందుల చట్టం నియమ నిబంధనల మేరకు కాల పరిమితికి లోబడి నాసిరకం పురుగుల మందుల ఉత్పత్తిదారులపై తగిన చర్యలు, క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేవలం 5 వేల నమూనాలు మాత్రమే తీశారంటూ ఈనాడు అర్థరహితమైన ఆరోపణలు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement