Mahabubabad Accident: Groom Emotional Words About Death Of His Bride - Sakshi
Sakshi News home page

రూ.1500 కిరాయి వస్తదే అంటూ వెళ్లాడు.. కానీ

Published Sat, Jan 30 2021 8:18 AM | Last Updated on Mon, Aug 23 2021 7:55 PM

Bride Groom Emotional Words Fiance Demise Mahabubabad Accident - Sakshi

ఇంకా సరిగ్గా పన్నెండో రోజున ఆ ఇళ్లు వచ్చివెళ్లే బంధువులు, పెళ్లి సందడితో కళకళలాడేది.. ఆ ఇంట ఏకైక కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరపాలని నెల రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్‌ నిర్వహించిన వారు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సమయం తక్కువగా ఉండడంతో బట్టలు కుట్టించడం కష్టమవుతుందని భావించి శుక్రవారం పెళ్లి బట్టలు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఆటోలో వరంగల్‌ బయలుదేరారు. ఇదే వారి చివరి ప్రయాణమైంది. మధ్యలో దారి కాచిన మృత్యువు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాలని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న యువతి సహా ఆమె తల్లి, సోదరుడు, బాబాయి–పిన్నితో పాటు ఆటోడ్రైవర్‌ను లారీ రూపంలో వచ్చి బలి తీసుకుంది. ఈ ఘటనతో మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం ఎర్రకుంట తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గూడూరు మండలం ఎర్రకుంట తండాకు చెందిన జాతోట్‌ కస్నానాయక్‌ – కళ్యాణి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు ప్రవీణ్‌ లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు ప్రదీప్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. కూతురు ప్రమీల డిగ్రీ బీకాం చేసింది. ప్రమీల వివాహం డోర్నకల్‌ మండలం చామ్లా తండా పరిధిలోని ధరావత్‌ తండాకు చెందిన ధరావత్‌ వెంకన్న – లలిత పెద్ద కుమారుడు వినోద్‌తో నిశ్చయమైంది. ఈ మేరకు ఈనెల 8వ తేదీన ఎంగేజ్‌మెంట్‌ జరగగా, వచ్చే నెల 10వ వివాహానికి తేదీ నిర్ణయించారు.

ఇందులో భాగంగా పెళ్లికి సంబంధించి వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలుకు వరంగల్‌కు శుక్రవారం బయలుదేరారు. తండాకు చెందిన డ్రైవర్‌ జాటోతు రాములునాయక్‌కు చెందిన ఆటో మాట్లాడుకుని పెళ్లికూతురు జాటోతు ప్రమీల(23), ఆమె తల్లి కళ్యాణి(45), అన్న ప్రదీప్‌(25), బాబాయ్‌ జాటోత్‌ ప్రసాద్‌(42), చిన్నమ్మ లక్ష్మి(39) వెళ్తున్నారు. ఇంతలోనే గూడూరు నుంచి అతివేగంగా, నిర్లక్ష్యంతో ఎదురుగా వచ్చిన లారీ వీరి ఆటోను మర్రిమిట్ట వద్ద బలంగా ఢీకొట్టింది. ఆపై ఆటోను సుమారు సుమారు 100 మీటర్లు ముందుకు నెట్టుకెళ్లింది. దీంతో ఆటో నుజ్జునుజ్జు కాగా, అక్కడికక్కడే ఆరుగురు మత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మృతదేహాలు ఛిద్రమై రహదారి రక్తమోడింది. – సాక్షి ప్రతినిధి, వరంగల్‌ / సాక్షి, మహబూబాబాద్‌ / కొత్తగూడ

కార్డులు ఎవరికి పంచను బిడ్డా..
ఒక్కగానొక్క కూతురి పెళ్లి నచ్చిన వ్యక్తికిచ్చి అంగరంగ వైభవంగా చేయాలని ప్రమీల తండ్రి జాటోతు కస్నానాయక్‌ నిర్ణయించుకున్నాడు. ఇంతలోనే ప్రమాదం జరగడంతో ఇంటికి చేరుకున్న ఆయన కన్నీరుమున్నీరుగా రోదించాడు. ‘వెయ్యి కార్డులు కొట్టిచ్చా.. ఊరూవాడా, బంధువులందరికీ సమాచారం ఇచ్చా.. ఇప్పుడు ఇవన్నీ ఎవరికివ్వను? నేనేం చేయను బిడ్డా? బట్టలకు రేపు పోదాం అన్నా కదా బిడ్డా. కుట్టించుకోవడానికి సమయం లేదంటూ ఇవ్వాలే బయలుదేరావు. అల్లుడు అడిగితే నేనేం చెప్పను బిడ్డా...’అంటూ ఆయన రోదించిన తీరు స్థానికులను కంట తడి పెట్టించింది.

మృత్యువులోనూ వీడని అన్నాచెల్లెళ్ల బంధం
జాటోతు ప్రమీల ఆమె అన్న ప్రదీప్‌ చిన్ననాటి నుంచి ఎంతో అనురాగంతో మెలిగేవారని తండావాసులు చెప్పారు. చెల్లెలికి ఏం కావాలన్నా, ఆమె ఏం చేయాలన్నా ప్రదీప్‌ సలహా ఇచ్చేవాడు. తండ్రితో చెప్పలేని విషయాలు అన్నతో చెప్పేది. చెల్లెలికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే వాడు ప్రదీప్‌. ఇందులో భాగంగానే చెల్లి పెళ్లికి మంచి బట్టలు సెలక్ట్‌ చేసేందుకు బయలుదేరాడు. ఈక్రమంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందడంతో తండావాసులు వీరిద్దరి బంధాన్ని వివరిస్తూ కన్నీరు పెట్టారు.(చదవండి: కాబోయే వధువు సహా ఆరుగురు మృతి)

ఇప్పుడూ ఖమ్మం వెళ్తే బతికేవారేమో..
ఈనెల 8న ప్రమీల ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఆ సమయంలో నూతన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు ఖమ్మం వెళ్లారు. అయితే, వరంగల్‌లో ప్రమీల బాబాయి ఉంటుండడంతో అక్కడికే పెళ్లి వస్త్రాలు, సామగ్రి కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ, వరంగల్‌ చేరకుండగానే ప్రమాదం జరగడం, ఇప్పుడు కూడా ఖమ్మం వెళ్తే ప్రమాదం జరిగి ఉండకపోయేదేమోనని స్థానికులు విలపిస్తూ చెప్పారు. కాగా, వస్త్రాలు కొనుగోలు కోసం తీసుకెళ్తున్న రూ.లక్ష నగదు, మృతుల శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు ప్రమాదం జరిగాక మాయమయ్యాయని మృతుల బంధువులు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇలా అవుతుందనుకోలేదు..
ఈనెల 8న ఇరువురి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా ప్రమీలతో నా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. వచ్చే 10న వివాహానికి నిశ్చయించారు. ఈరోజు ఉదయం కూడా ప్రమీల నాకు ఫోన్‌ చేసి బట్టలు కొనుగోలు చేసేందుకు వరంగల్‌ వెళ్తున్నామని చెప్పింది. నన్ను కూడా రావాలని కోరినా పని ఉండడంతో ఆగిపోయాను. పెళ్లిపై ఇరువురం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇంతలోనే ఈ ఘోర ప్రమాదం జరుగుతుందని అనుకోలేదు.
– ధరావత్‌ వినోద్, పెళ్లి కుమారుడు 

తమ్ముడికి అన్నం పెట్టు బిడ్డా...
వరంగల్‌లో అక్క పెళ్లికి బట్టలు కొనేందుకు మా అమ్మానాన్నలు వెళ్లారు. వచ్చేసరికి ఆలస్యమయ్యే అవకాశమున్నందున తమ్ముడు దీక్షిత్‌(బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు)కు అన్నం పెట్టు బిడ్డా అని చెప్పారు. అంటే ఇప్పటి నుంచి తమ్ముడి బాధ్యత నీదేనని మా అమ్మానాన్నలు చెప్పినట్టా? ఇక నుంచి మమ్ముల్ని ఎవరు చూసుకోవాలి.
– దివ్య (ప్రసాద్‌ – లక్ష్మి కూతురు) 

కొత్త పంచె తెస్తానంది..
వరంగల్‌కు వెళ్లే ముందు కొత్త పంచె తెస్తానని చెపితివి కదా అమ్మా.. నా భార్య చనిపోయింది. నాకు అన్నం పెట్టే కొడుకు జాటోతు ప్రసాద్‌ – లక్ష్మి చనిపోయారు. తిన్నావా తాతా అంటూ పలకరించే మనవడు ప్రదీప్, మనవరాలు ప్రమీల లేకుండా పోయారు. ఇప్పుడు నేనెలా బతకాలి. నా బాధ్యతలు ఎవరికి అప్పగించి వెళ్లారో ఏమో...
– లచ్చిరాం, ప్రమీల తాత 

ఇప్పుడు మేమెట్లా బతకాలి
ఉదయమే మహబూబాబాద్‌ మార్కెట్‌కు బబ్బెర్లు తీసుకుని వెళ్లి అమ్ముకుని వచ్చాడు. మళ్లీ అన్నం తినగానే బయలుదేరుతుంటే ఎటు వెళ్తున్నావయ్యా అని అడిగా. పెళ్లి బట్టల కిరాయి వెళ్తున్నా.. రూ.1500 కిరాయి వస్తదే అంటూ వెళ్లాడు. ఇప్పుడు కనిపించని లోకాలకు వెళ్లాడు.. ఇద్దరు పిల్లలు నేను ఎలా బతకాలి?
– జాటోతు సునీత, ఆటో డ్రైవర్‌ జాటోతు రాము భార్య 

నాన్న లేకుండా నేనెలా? 
నాన్నా... నువ్వు లేకుండా నేనెలా బతకాలి అంటూ డ్రైవర్‌ రాము మృతదేహం వద్ద ఆయన కుమార్తె నందిని రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రాము మృతదేహం వద్ద ఆయన ధరించిన వస్త్రాలను పట్టుకుని ఆమె కన్నీరుమున్నీరుగా ఏడ్చింది. నన్నెవరు చూసుకుంటారు నాన్నా, నేనెలా చదువుకోవాలి నాన్నా, నాకు రోజు పండ్లు ఎవరు తెస్తారు నాన్నా అంటూ ఆమె ఏడుస్తుంటే కఠిన మనస్సు కలిగిన వారు సైతం కన్నీరు పెట్టారు.

30 కి.మీ... దాటాక...
ఎర్రకుంట నుంచి ఆటోలో ప్రమీల, ఆమె కుటుంబం ఉదయం 10 గంటలకు బయలుదేరారు. ఆపై సుమారు 30 కి.మీలు దాటాక ఎన్‌హెచ్‌ 365పై భూపతిపేట శివారు ప్రాంతంలో గూడూరు వైపు వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ఘోరప్రమాదం సంభవించింది. భార్య, కొడుకు, తమ్ముడు, మరదలు, కూతురు ప్రమీల వరంగల్‌ వెళ్లగా, పనిపై మహబూబాబాద్‌కు వెళ్లిన తండ్రి జాటోతు కస్నానాయక్‌కు విషయం తెలిసి కన్నీటి పర్యంతమయ్యాడు. ‘అయ్యో బిడ్డా... ఎంత పని జరిగింది..  ఇప్పుడే 40 నిమిషాల క్రితం ముందు నాతో ఉంటిరి కదా తల్లీ.. ఓ భగవంతుడా ఎంత పనిచేశావు’ అంటూ ఆయన రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.

‘బిడ్డా ఇవ్వాలా వద్దు... అలసటగా ఉంది.. రేపు బట్టలు కొనడానికి పోదాం అన్నకదా... లేదు నాన్న లగ్గం టైం దగ్గరికి వచ్చింది... స్టిచ్చింగ్‌కు 10రోజుల సమయం పడుతుంది.. ఇంకా లేట్‌ అయితే ఇబ్బంది అవుతుంది.. వరంగల్‌లో బాబాయి ఉన్నాడు కదా చూసుకుంటాడు. నాకు తోడుగా అన్న, అమ్మ, పిన్ని, బాబాయ్‌ వస్తున్నారు.. నీవు రెస్ట్‌ తీసుకో అని చెప్పావు కదా... దేవుడా నేనేమి ఇప్పుడు నేనేమీ చేయాలే’ అంటూ గుండెలవిసేలా కన్నతండ్రి విలపించిన తీరు అక్కడ ఉన్నవారందరినీ  కంటతడి పెట్టించింది.

అతివేగంతో మూడు కుటుంబాల్లో చీకటి
హైవే నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు సంబంధించిన లారీ నర్సంపేట వైపు నుంచి మహబూబాబాద్‌ వైపు వస్తోంది. ఇదే సమయంలో ఆటోలో ప్రమీల కుటుంబం వరంగల్‌ వెళ్తోంది. అయితే, రాంగ్‌ రూట్‌లో వచ్చిన లారీ డ్రైవర్‌ వరంగల్‌ వైపు వెళ్తున్న ఆటోను ఢీకొట్టాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఢీకొట్టిన తరువాత డ్రైవర్‌ లారీని ఆపకుండా అలాగే ఆటోతో సుమారు 100 మీటర్లు లాకెళ్లడంతో ఎంత నిర్లక్ష్యంగా నడుపుతున్నాడో అర్థం చేసుకోవచ్చని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంతో మహబూబాబాద్‌ – వరంగల్‌ రహదారి నెత్తురోడగా, మూడు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది.

పెళ్లి కూతురు ప్రమీల, తల్లి కళ్యాణి, అన్న ప్రదీప్‌ది ఒక కుటుంబం కాగా, బాబాయ్‌ జాటోత్‌ ప్రసాద్, చిన్నమ్మ లక్ష్మీ సమీప బంధువులే. ఇక ఆటోడ్రైవర్‌ రాములు కూడా మృతి చెందడం ఆయన కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రమాదం సమాచారం తెలుసుక్ను పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆపై మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహబూ బాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా బొద్దుగొండ దగ్గర ట్రాక్టర్‌ను మృతుల బంధువులు అడ్డుకున్నారు. ప్రమాదానికి కారణాలు చెప్పాలని ధర్నా చేపట్టారు. దీంతో 365 జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.  

హాహాకారాలు, ఆర్తనాదాలు
మర్రిమిట్ట వద్ద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను శవపరీక్ష నిర్వహించడానికి  మహబూబాబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరిలించారు. బొద్దుగొండ వద్ద స్థానికులు మృతదేహాలు తరలిస్తున్న ట్రాక్టర్‌ను మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కదలనివ్వలేదు. చివరకు ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ చేరుకుని కాంట్రాక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడించాడు. మృతుల్లో ఒక్కొక్కరికి రూ.5లక్షలు, ప్రభుత్వం నుంచి రూ.లక్ష చొప్పున పరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. ఆతర్వాత మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి మృతదేహాలను తీసుకొచ్చారు. అప్పటికే ఆస్పత్రికి భారీగా చేరుకున్న మృతుల బంధువులు, తండా వాసులు చేసిన రోదనలతో ఆస్పత్రి మార్మోగింది. ‘

ఎక్కడున్నరు బిడ్డా... ఒక్కసారి కనిపించు తండ్రీ.. నాన్న అమ్మా ఏడుస్తోంది రా నాన్న... అన్నా నీ చెల్లిలినొచ్చినా నన్ను చూసిపోవా అన్నా’ అంటూ రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. కాగా, రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని సీఎం ప్రకటించారు. అలాగే, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ కూడా మృతులకు సంతాపాన్ని, కుటుంబసభ్యులు సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, తాము అండగా ఉంటామని వెల్లడించారు. 

వంద మీటర్లు లాక్కెల్లింది
ఆటోను ఢీకొట్టిన లారీ సుమారు వంద మీటర్ల దూరం లాక్కెళ్లింది. అటూ ఇటూ తిరుగుతూ ముందుకు వెళ్లడం వల్లే మృతదేహలు ఛిద్రంగా మారాయి. అటు వైపుగా వెళ్తున్న నాకు ఈ ప్రమాద దృశ్యాన్ని చూడగానే ఎంతో భయం వేసింది. అలాగే వచ్చి ఇంకెవరిని అయినా ఢీకొడుతుందేమోనని అనిపించింది.  ఈ ప్రమాదంతో భయాందోళనకు గురయ్యాను.                                
– చెల్పూరి వెంకన్న, ప్రత్యక్ష సాక్షి 

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ
మహబూబాబాద్‌ రూరల్‌: గూడూరు మండలం మర్రిమిట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పరిశీలించిచారు. ప్రమాద కారణాలు ఆరా తీసిన ఆయన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణకు చేపట్టాల్సి న జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. మహబూబాబాద్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ మొట్ల వెంకటరమణ, సీఐలు చిలుక రాజిరెడ్డి, రవికుమార్, వెంకటరత్నం, ఎస్సై సతీష్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement