న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఇతర ఆన్‌లైన్ వేదికల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం సమాచార, సాంకేతికత నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ప్రభుత్వ సంస్థలు కోరినప్పుడల్లా పలానా సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు సహకరించాలని పేర్కొంది. ఈ మేరకు ఐటీ నిబంధనల్లో మార్పులు చేస్తూ సోమవారం ముసాయిదా సవరణలను ప్రకటించింది. ఈ చర్య వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ, పౌరుల జీవితాల్లోకి ప్రభుత్వం చొరబడేందుకు కారణమవుతుందని విపక్షాలు ఆరోపించాయి.
ఈ సవరణలు అమల్లోకి వస్తే ప్రజలపై ప్రభుత్వం చలాయిస్తున్న పెద్దన్న అధికారాలు మరింత విస్తృతమవుతాయని, ఈ పరిస్థితి నియంత పాలనకు సమానమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. తాజా నిబంధనలు వ్యక్తిగత గోప్యత, భావ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 15 వరకు గడువిచ్చారు. వ్యక్తిగత గోప్యతను కారణంగా చూపుతూ ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలు సమాచార వనరుల్ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.
అలాంటి సమాచారంతో జాగ్రత్త..
‘చట్టబద్ధ అధికారం కలిగి ఉన్న సంస్థలు కోరితే సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై ఉన్న సమాచార సృష్టికర్తలు ఎవరో తెలుసుకునేందుకు సహకరించాలి. అక్రమ, విద్వేషపూరిత సమాచారాన్ని గుర్తించి తొలగించేందుకు లేదా ప్రజలకు కనిపించకుండా చేసేందుకు ఆయా సంస్థలు టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకోవాలి’ అని ముసాయిదా సవరణల్లో పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశా>లు..అమర్యాద, దైవదూషణ కలిగించే, అభ్యంతరకర సమాచారాన్ని అప్‌లోడ్, హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని సోషల్ మీడియా సంస్థలు వినియోగదారులకు సూచించాల్సి ఉంటుంది.
చట్ట వ్యతిరేక, స్వీకర్తలను తప్పుదోవ పట్టించే, జాతి భద్రతకు ముప్పుగా మారే ఎలాంటి సమాచారాన్నైనా హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని అప్రమత్తం చేయాలి. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోపు సాధ్యమైనంత త్వరగా అలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు తొలగించాలి. సైబర్ భద్రత, దేశ భద్రత రీత్యా దర్యాప్తు సంస్థలు కోరితే అలాంటి సమాచారాన్ని 72 గంటల్లోగా అందించాలి. ఈ కేసుల దర్యాప్తులో ప్రభుత్వ సంస్థలకు సహకరించేందుకు అవసరమైతే ఇంటర్నెట్ కంపెనీలు సంబంధిత రికార్డుల్ని 180 రోజులు లేదా అంత కన్నా ఎక్కువ కాలం భద్రపరచాలి.
నియంత్రణ మా ఉద్దేశం కాదు..
సామాజిక మాధ్యమాల సమాచారాన్ని నియంత్రించే ఉద్దేశం తమకు లేదని, కానీ ఈ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలు ఉగ్రవాదం, హింస, నేరానికి దోహదపడకుండా ఉండాలని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను వినియోగించుకుని కొత్త సవాళ్లు విసిరిన సంగతిని ప్రస్తావించింది. టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్‌లతో ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు గత వారం సమావేశమై ప్రతిపాదిత సవరణలపై చర్చలు జరిపారు. సామాజిక మాధ్యమాలు వేదికగా బూటకపు వార్తలు విస్తరించడం ఇటీవల పెద్ద సమస్యగా మారడం తెల్సిందే. వాట్సప్‌లో వ్యాపించిన పుకార్ల వల్ల దేశవ్యాప్తంగా మూకహింస చెలరేగింది. దీంతో సోషల్ మీడియా సంస్థల్ని చట్ట పరిధిలో జవాబుదారీని చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
సమాచార సృష్టికర్తలు తెలిసిపోతారు!
Published Tue, Dec 25 2018 4:10 AM | Last Updated on Tue, Dec 25 2018 11:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment