Personal privacy
-
మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ?
మనమున్న సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలు మన వ్యక్తిగత సమాచారం బజార్లో పడినట్టే. మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఈ– కామర్స్ సైట్లు పౌరుల వ్యక్తిగత డేటాతో ఆటాడుకుంటున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేయడానికే ఇప్పుడీ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు–2022’’ను (డీపీడీపీ) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఆరేళ్లుగా మేధోమథనం సాగించిన కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు ముసాయిదా బిల్లును రూపొందించింది. గతేడాది నవంబర్‌లో ప్రజలు, సామాజిక సంస్థల అభిప్రాయం కోసం వెలువరించిన ముసాయిదా బిల్లులో అంశాలే ఇంచుమించుగా ఇందులో ఉన్నాయి. అయితే విదేశీ సంస్థలు సమాచార సేకరణలో కొన్ని ఆంక్షల్ని విధించారు. బిల్లులో ఏముందంటే ? డీపీడీపీ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీని వివరాలను కేంద్రం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వివాదాస్పద అంశాలు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తృతమైన మినహాయింపులు ఇవ్వడం, డేటా ప్రొటక్షన్ బోర్డు పాత్రను గణనీయంగా తగ్గించడం వంటివి ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వాధికారులు, ఇతర నాయకులకు సంబంధించిన డేటా కూడా ఈ చట్టం కింద గోప్యంగా ఉంచడం వల్ల సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందనే ఆందోళనలున్నాయి. ఇంకా బిల్లులో ఉన్న అంశాలివే.. ► ఆన్లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా వారి సమ్మతితో సేకరించాలి. దానిని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సంస్థలదే. తమ పని పూర్తి కాగానే ఆ సమాచారాన్ని తొలగించాలి. ► మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటాను సేకరించి ప్రాసెస్ చేయవచ్చు. అదే విదేశాల్లో వస్తు, సేవల వినియోగంలో మాత్రం డేటాను సేకరించే అవకాశం ఉంటుంది. ► వివిధ సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ యాప్స్ జవాబుదారీ తనం పెరిగేలా సేకరించిన సమాచారాన్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఏ రకంగా సేకరిస్తున్నారు ? పౌరుల సమాచారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు ? వంటి ప్రశ్నలకు ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ► ఏదైనా సమాచారం చుట్టూ వివాదం చెలరేగితే కేంద్రం ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా వాటిని పరిష్కరి స్తుంది. ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కేంద్రమే నియమిస్తుంది. ► పౌరుల వ్యక్తిగత సమాచారం ఉల్లంఘన జరిగితే సదరు కంపెనీలకు అత్యధికంగా రూ.250 కోట్ల జరిమానా విధించవచ్చు. ► ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు విధివిధానాలున్నాయి. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లో సమాచార సేకరణపై మినహాయింపులున్నాయి. ► పౌరులు తమ డేటాను వాడుకున్నారని భావిస్తే నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కొచ్చు. చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించాల్సి వచ్చిన ప్పుడు వారి లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది. ► ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో అత్యంత కీలకం కానుంది. గతంలో ఏం జరిగింది? వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిబంధనల్నీ విధిస్తూ ఉంటే మన ప్రభుత్వం 2018 నుంచి ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం ఉద్దేశించిన శ్రీకృష్ణ కమిటీ 2018లో ఒక ముసాయిదా బిల్లు కేంద్రానికి సమర్పించింది. కానీ కేంద్రానికి, దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలకి మధ్య ఒక అంగీకారం రాలేదు. చివరికి 2019లో ఒక ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో సమగ్రత లోపించిందని స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొనడం కలకలం రేపింది. డేటా పరిరక్షణ బిల్లు నిబంధనల్ని అతిక్రమించే వారి జాబితా నుంచి ప్రభుత్వం తనని తాను మినహాయించుకోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బిల్లులో 81 సవరణలు చేయాలంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించడంతో గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది. విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ప్రపంచంలోని 71% దేశాల్లో వ్యక్తిగత సమాచారం భద్రతపై కఠినమైన చట్టాలే ఉన్నాయి. వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా 194 దేశాల్లోని 137 దేశాలు డేటా పరిరక్షణ కోసం చట్టాలు రూపొందించాయి. ► ఆఫ్రికా దేశాల్లో 54గాను 33 దేశాల్లో (61%) డేటా చట్టాలు అమల్లో ఉన్నాయి. ► ఆసియా దేశాల్లో ఇది ఇంకా తక్కువగా 57% మాత్రమే ఉంది. ► 60 దేశాలకు గాను 34 దేశాలు చట్టాలను రూపొందించాయి. ఇక వెనుకబడిన దేశాలు 46కి గాను 22 దేశాల్లో మాత్రమే చట్టాలున్నాయి. అంతర్జాతీయంగా ఈయూ మోడల్, యూఎస్ మోడల్ చట్టాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఈయూ మోడల్లో వ్యక్తిగత సమాచార సేకరణ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పౌరుల డేటా బయటకు వచ్చిందంటే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తాయి. అత్యధిక దేశాలు ఈ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. ఇక అమెరికా మోడల్లో డేటా భద్రతని వ్యక్తుల స్వేచ్ఛ పరిరక్షణగా చూస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యక్తుల పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లవు. వ్యక్తుల డేటా అవసరమైన ప్రతీ సారి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. -సాక్షి, నేషనల్ డెస్క్ -
వాట్సాప్‌లో అసలేం జరుగుతోంది.. మండిపడ్డ యూజర్ - సంస్థ రిప్లై ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ: వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై కొద్ది రోజులుగా సందేహాలు తలెత్తుతున్నాయి. వాట్సాప్ యాప్ వాడకంలో లేనప్పుడు కూడా వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్లో మైక్రోఫోన్‌ను సంస్థ యాక్సెస్ చేస్తోందన్న ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. అసలేం జరిగింది? ‘నేను ఫోన్ వాడకున్నా సరే వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో నా మొబైల్ మైక్రోఫోన్‌ను వాడుతోంది. నిద్రపోయి ఉదయం ఆరింటికి లేచా. అప్పుడూ మైక్రోఫోన్ దుర్వినియోగం అవుతోంది. అసలేం జరుగుతోంది?’ అంటూ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోడ్ డబిరి శనివారం ట్వీట్‌చేశారు. దీనికి 6.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీనిపై ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ స్పందించారు. ‘నథింగ్ ట్రస్ట్.. నాట్ ఈవెన్ నథింగ్’ (దేన్నీ నమ్మొద్దని, ఏం కాదని) అంటూ ఆయన ట్విట్ చేశారు. మరోవైపు ఈ ట్వీట్‌పై.. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ‘‘ఇది గోప్యతపై దాడి. దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం. గోప్యతకు భంగం వాటిల్లినట్లు తేలితే చర్యలు తప్పవు’ అంటూ ట్వీట్ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్ యాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేస్తోంది. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోఫోన్, కెమెరా వంటి ప్రైవసీ సూచికలను ఏదైనా యాప్ యాక్సెస్ చేసినప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో గ్రీన్ నోటిఫికేషన్ వినియోగదారుడికి హెచ్చరికగా పనిచేస్తుంది. ఖండించిన వాట్సాప్: ఈ ఆరోపణలను వాట్సాప్ ఖండించిది. డబిరి పిక్సల్ ఫోన్లోని బగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి పరిష్కరించాలని గూగుల్‌ను అభ్యర్థించినట్టు ట్వీట్లో చేసింది. -
నా వ్యక్తిగత గోప్యతను గౌరవించండి
ముంబై: తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఫొటోలను బహిరంగపరచవద్దని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(36) మీడియాను కోరారు. సుకేశ్ చంద్రశేఖర్ అనే మోసగాడితో జాక్వెలిన్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు శనివారం సామాజిక మాధ్యమాల్లో బయటకు రావడంతో ఆదివారం జాక్వెలిన్ ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో ఉన్న తనను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. బహ్రెయిన్‌లో ఉన్న జాక్వెలిన్ తల్లి ఇటీవల గుండెపోటుకు గురయ్యారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. చంద్రశేఖర్ తదితరులకు సంబంధమున్న మనీ లాండరింగ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట పలుమార్లు జాక్వెలిన్ హాజరైన విషయం తెలిసిందే. -
ఎవ్వరికీ వ్యక్తిగత గోప్యత మిగల్లేదు
న్యూఢిల్లీ: ఓ ఐపీఎస్ అధికారి ఫోన్ ట్యాపింగ్ విషయమై సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘ఎవ్వరికీ వ్యక్తిగత గోప్యత మిగలలేదు’ అని వ్యాఖ్యానించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఓ ఐపీఎస్ అధికారికీ, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్‌చేయడంపై కోర్టు స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ చేసి పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కును ఇలా హరించివేయొచ్చా? అంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు మిమ్మల్ని ఫోన్ ట్యాప్ చేయాలని ఆదేశించెందెవరో, అందుకు కారణాలేమిటో పూర్తివివరాలను కోర్టుముందుంచాల్సిందిగా∙ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఇలా చేయడానికి కారణమేమిటి? ఏ ఒక్కరికీ వ్యక్తిగత గోప్యత హక్కు మిగల్లేదు. అసలీ దేశంలో ఏం జరుగుతోంది?’అని కోర్టు ప్రశ్నించింది. ఎవరివ్యక్తిగత విషయాలపైనైనా నిఘావేసి, వారి వ్యక్తిగత గోప్యతను హరించివేయొచ్చా అని కోర్టు ప్రశ్నించింది. ఐపీఎస్ అధికారి తరఫున వాదిస్తోన్న న్యాయవాదిపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటికీ తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అతనిపై బలవంతంగా ఎటువంటి చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ యేడాది ఫిబ్రవరి 9న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కుంభకోణంలో ఆర్థిక ఆరోపణలపై స్పెషల్ డీజీపీ ముఖేష్ గుప్తా సహా ఇద్దరు అధికారులను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 2015లో 25 సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయాల్లో ఏసీబీ, ఈఓడబ్ల్యూ ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో ఈ కుంభకోణం బయటపడింది. అయితే ఈ కోట్లాదిరూపాయల కుంభకోణంపై దర్యాప్తు జరిపేందుకు బాగెల్ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 8న ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో 12 మంది సభ్యులతో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. -
వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు
న్యూఢిల్లీ: పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిన అవసరం ఉందన్న భారత్ ప్రభుత్వ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్ తెలిపింది. ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వివరించింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఎన్‌ఎన్‌వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్‌తో భారత్‌లోని జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల సమాచారాన్ని గుర్తు తెలియని సంస్థలు తస్కరించాయంటూ వాట్సాప్ చేసిన ప్రకటన కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం.. ఈ వ్యవహారంతోపాటు, పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు తీసుకున్న చర్యలపై 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్‌ను ఆదేశించింది. దీనిపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ...‘పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించాల్సి ఉందన్న భారత ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం. సైబర్ దాడులపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం. యూజర్ల సమాచార పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు. అయితే, ఇటీవల పలుమార్లు జరిగిన చర్చల సందర్భంగా ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని వాట్సాప్ వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను మూడు నెలల్లోగా వివరించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హమన్నారు. -
సమాచార సృష్టికర్తలు తెలిసిపోతారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ వేదికల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం సమాచార, సాంకేతికత నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ప్రభుత్వ సంస్థలు కోరినప్పుడల్లా పలానా సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు సహకరించాలని పేర్కొంది. ఈ మేరకు ఐటీ నిబంధనల్లో మార్పులు చేస్తూ సోమవారం ముసాయిదా సవరణలను ప్రకటించింది. ఈ చర్య వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ, పౌరుల జీవితాల్లోకి ప్రభుత్వం చొరబడేందుకు కారణమవుతుందని విపక్షాలు ఆరోపించాయి. ఈ సవరణలు అమల్లోకి వస్తే ప్రజలపై ప్రభుత్వం చలాయిస్తున్న పెద్దన్న అధికారాలు మరింత విస్తృతమవుతాయని, ఈ పరిస్థితి నియంత పాలనకు సమానమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. తాజా నిబంధనలు వ్యక్తిగత గోప్యత, భావ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 15 వరకు గడువిచ్చారు. వ్యక్తిగత గోప్యతను కారణంగా చూపుతూ ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలు సమాచార వనరుల్ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సమాచారంతో జాగ్రత్త.. ‘చట్టబద్ధ అధికారం కలిగి ఉన్న సంస్థలు కోరితే సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై ఉన్న సమాచార సృష్టికర్తలు ఎవరో తెలుసుకునేందుకు సహకరించాలి. అక్రమ, విద్వేషపూరిత సమాచారాన్ని గుర్తించి తొలగించేందుకు లేదా ప్రజలకు కనిపించకుండా చేసేందుకు ఆయా సంస్థలు టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకోవాలి’ అని ముసాయిదా సవరణల్లో పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశా>లు..అమర్యాద, దైవదూషణ కలిగించే, అభ్యంతరకర సమాచారాన్ని అప్లోడ్, హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని సోషల్ మీడియా సంస్థలు వినియోగదారులకు సూచించాల్సి ఉంటుంది. చట్ట వ్యతిరేక, స్వీకర్తలను తప్పుదోవ పట్టించే, జాతి భద్రతకు ముప్పుగా మారే ఎలాంటి సమాచారాన్నైనా హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని అప్రమత్తం చేయాలి. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోపు సాధ్యమైనంత త్వరగా అలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు తొలగించాలి. సైబర్ భద్రత, దేశ భద్రత రీత్యా దర్యాప్తు సంస్థలు కోరితే అలాంటి సమాచారాన్ని 72 గంటల్లోగా అందించాలి. ఈ కేసుల దర్యాప్తులో ప్రభుత్వ సంస్థలకు సహకరించేందుకు అవసరమైతే ఇంటర్నెట్ కంపెనీలు సంబంధిత రికార్డుల్ని 180 రోజులు లేదా అంత కన్నా ఎక్కువ కాలం భద్రపరచాలి. నియంత్రణ మా ఉద్దేశం కాదు.. సామాజిక మాధ్యమాల సమాచారాన్ని నియంత్రించే ఉద్దేశం తమకు లేదని, కానీ ఈ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలు ఉగ్రవాదం, హింస, నేరానికి దోహదపడకుండా ఉండాలని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను వినియోగించుకుని కొత్త సవాళ్లు విసిరిన సంగతిని ప్రస్తావించింది. టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లతో ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు గత వారం సమావేశమై ప్రతిపాదిత సవరణలపై చర్చలు జరిపారు. సామాజిక మాధ్యమాలు వేదికగా బూటకపు వార్తలు విస్తరించడం ఇటీవల పెద్ద సమస్యగా మారడం తెల్సిందే. వాట్సప్‌లో వ్యాపించిన పుకార్ల వల్ల దేశవ్యాప్తంగా మూకహింస చెలరేగింది. దీంతో సోషల్ మీడియా సంస్థల్ని చట్ట పరిధిలో జవాబుదారీని చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గోప్యతపై డైనమైట్ ‘ఆధార్’
ఆధార్ ద్వారా ఓ వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరికి సందేశాలు పంపుతున్నారు వంటి సమాచారం తెలుసుకోవడంతోపాటు ఇంట్లో ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నారనే విషయం కూడా పసిగట్టి ఆ ఇంటిని దోచుకోవడానికి అవకాశం ఉంది. ఇదే ఓ మహిళ అయితే, ఆమె వెంటపడే వ్యక్తి ఆమె ఆధార్ సాయంతో ఆమె ఇంటికి చేరుకునే వీలు కూడా ఉంది. ఇలాంటి ముప్పు ఉందనే విషయం శర్మ వంటి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తికి తెలియకపోవచ్చు. ట్రాయ్ చైర్మన్ తన ఆధార్ నంబర్ చెప్పి సవాలు విసరగానే అనేకమంది తమ నంబర్లు ఆన్లైన్లో వెల్లడిస్తూ తమ గోప్యత గుట్టు విప్పవచ్చని చాలెంజ్ చేశారు. అలా చేస్తే వారు ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి ఆహ్వానం పలికినట్లే. ఆధార్ నంబర్ వెల్లడిస్తే ఏ వ్యక్తి సమాచారమైనా ఎంత వరకు తవ్వి తీయ వచ్చో ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వ్యవహారంలో తేలిపోయింది. టెక్నాలజీ డెవలపర్ కింగ్స్లీ జాన్ ప్రశ్నకు స్పందనగా శర్మ శనివారం ట్విట్టర్లో తన ఆధార్ సంఖ్య లోకానికి వెల్లడిస్తూ, ఈ నంబర్ ద్వారా తనకు ఎలాంటి హాని చేయగలరో నిరూపిం చాలని సవాలు విసిరారు. వెంటనే ఆధార్ నంబ రుతో కొందరు ఆయన మొబైల్ ఫోన్ నంబర్లు, జీమెయిల్, యాహూ అడ్రస్‌లు, ఇంటి చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు బయటకు లాగి వెల్ల డించడం సంచలనానికి కారణమైంది. అలాగే పలు బ్యాంకుల్లోని ఆయన ఖాతాల నంబర్లు కూడా తెలిసి పోయాయి. బ్యాంక్ ఖాతాకు ఆయన ఆధార్‌ను అను సంధానం చేయలేదని ఓ సెక్యూరిటీ పరిశోధకుడు చెప్పగా, అది నిజం కాదని శర్మ జవాబిచ్చారు. ఆయన మొబైల్ నంబరు ఉపయోగించి ఆయన వాట్సాప్ ప్రొఫైల్ ఫొటో (నిజానికి ఈ ఫొటో ఆయన కూతురుది కావచ్చు)ను కూడా వెల్లడిం చారు. అంతేగాక, శర్మ ఐఫోన్ వాడుతున్నారని గుర్తిం చారు. ఇది చాలా ముఖ్య పరిణామం. ఆధార్ నంబర్‌తో బహిరంగంగా జరిగిన ఈ ప్రయోగం ప్రాధాన్యం మనకు అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతటి కీలక వ్యక్తో తెలుసుకోవాలి. ఆధార్ నంబర్లు జారీ చేసే సంస్థ యూఐడీఏఐ స్థాపక సీఈఓగా శర్మ పనిచేశారు. ప్రస్తుతం ట్రాయ్ చైర్మన్ హోదాలో ఆయనకు ఈ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉంది. ఆధార్ నంబర్‌కు ఉన్న భద్రత, వ్యక్తిగత గోప నీయత అంశాలను కూడా ఆయన తరచూ అధ్య యనం చేయడమేగాక, ఆధార్ నంబర్ ఇతరులకు తెలిస్తే ప్రమాదం లేదంటూ భరోసా ఇచ్చేవారు. ఈ కారణాల వల్ల త్వరలో ఏర్పాటు చేసే భారత డేటా ప్రొటెక్షన్ అథారిటీ తొలి అధిపతిగా శర్మ నియమి తులౌతారని కూడా అనుకుంటున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పెద్ద మనిషి ఆధార్ నంబర్ వెల్ల డించగానే ఎథికల్ హ్యాకర్లు పైన చెప్పినవే కాకుండా అనేక ఇతర వివరాలు తవ్వితీయడం చిన్న విషయ మేమీ కాదు. ఆధార్ నంబర్ వెల్లడిస్తే ఎంతవరకు హాని జరుగుతుంది? శర్మకు టెక్నాలజీ అవగాహన ఉంది కాబట్టి తన అకౌంట్లను ఎలా భద్రంగా కాపాడుకోవాలో తెలుసనే అనుకోవాలి. పెద్ద పదవిలో ఉన్న కారణంగా తన కేదైనా సమస్య వస్తే చట్టాలు అమలు చేసే సంస్థలు, బ్యాంకులు, మొబైల్ ఆపరేటర్లతో ఆయన సునాయా సంగా మాట్లాడగలరు. ఆయన ఆధార్ సంఖ్యను ఉపయోగించి తనకు హాని చేస్తే దేశంలో వార్తాపత్రి కలన్నీ ఆ విషయానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రచురి స్తాయి. టెక్నాలజీ ఉపయోగించి ఆయన చేసే లావా దేవీలకు మరింత భద్రత లభిస్తుంది. అయితే, ఈ మొత్తం వ్యవహారంలో హాని అంటే ఆయన ఏ అర్థంలో ఈ పదం వాడారో తెలియదు. తన ఖాతాల నుంచి తన అనుమతి లేకుండా డబ్బు బయటకు లాగడమే ఆయన దృష్టిలో హానికి అర్థం కావచ్చు. ఆయన ఆధార్ నంబర్ ఉపయోగించి అంతకన్నా ఎక్కువ హాని ఆయనకు చేశారు హ్యాకర్లు. మరో ముఖ్య విషయం ఏమంటే, ఆధార్ ద్వారా ఓ వ్యక్తి ఎవరితో మాట్లాడేది, సందేశాలు పంపుతున్నది వంటి సమాచారం తెలుసుకుని ఇంట్లో ఆ వ్యక్తి ఒంట రిగా ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆ ఇంటిని దోచుకోవడానికి అవకాశం ఉంది. ఇదే ఓ మహిళ అయితే, ఆమె వెంట పడే వ్యక్తి ఆమె ఆధార్ సాయంతో ఆమె ఇంటికి చేరుకునే వీలు కూడా ఉంది. మన నగరాల్లో నివసించే, ప్రయాణించే స్త్రీల భద్రతకు ఇలాంటి ముప్పు ఉందనే విషయం శర్మ వంటి పెద్ద హోదాలో ఉన్న వ్యక్తికి తెలియకపోవచ్చు. ఆధార్ నంబర్ సంపాదించి ఓ మహిళ ఈమెయిల్ తెరిచి, వ్యక్తిగత సంభాషణల వివరాలను ఆగంత కులు సంపాదించే ప్రమాదం ఉంది. అదే వ్యాపారం విషయానికి వస్తే, నంబర్ తెలుసుకుని కంపెనీల ఈమెయిల్ ఖాతా ద్వారా వ్యాపార రహస్యాలు బయ టకు తీయడానికి ఆస్కారం ఉందంటున్నారు. వ్యక్తిగత సమాచారం బయటకు లాగడానికి తొలి అస్త్రంగా ఆధార్? ఆధార్ సంఖ్యను వెల్లడిస్తే ఆ వ్యక్తి సమాచారం మొత్తం బయటపెట్టడానికి ఇది అత్యంత ఉపయోగక రమైన పనిముట్టుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఆర్ఎస్ శర్మ వ్యవహారం ఈ విషయం నిరూపించిందని చెబుతున్నారు. వాస్తవా నికి ఓ వ్యక్తి జీవిత విశేషాలు, వ్యక్తిగత వివరాలు సేకరించడానికి ఆధార్ నంబర్ అవసరం లేదు. ఎందుకంటే, శర్మ వంటి ప్రముఖ వ్యక్తి వివరాలను ఆయన పూర్వ, ప్రస్తుత పదవులకు సంబంధించి అందుబాటులో ఉండే సమాచారం నుంచి తెలుసు కోవచ్చు. అంటే, ఏ వ్యక్తి వివరాలనైనా సేకరించి ప్రొఫైల్ రూపొందించడానికి ఆధార్ అవసరం లేద నేది వీరి వాదన. కానీ, ఈ వాదనలో పస లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. తమ వ్యక్తిగత కీలక సమాచారం బయటికి వెల్లడి కాకుండా ఉండేం దుకు ఈ సాంకేతికపరిజ్ఞానం వినియోగించే వ్యక్తులు అన్నిటికీ ఒకే ఈమెయిల్ అడ్రస్ వాడరు. విభిన్న కార్యకలాపాలకు భిన్న ఈమెయిల్ అడ్రస్‌లు వారు ఉపయోగిస్తుంటారు. అయినా, ఆధార్, మొబైల్ నంబర్ల ద్వారా వారి వ్యక్తిగత సమాచారం తెలుసుకో వడం ప్రస్తుతం సాధ్యమయ్యే పనేనని నిపుణులు అంటున్నారు. అందుకే ఇలాంటి సమాచారం బయ టకు లీకవకుండా భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో అంతా అందుబాటులోకి వస్తుంటే డేటా భద్రత మిథ్యేనా? వ్యక్తులకు సంబంధించిన ఎంతో సమాచారం ఆన్ లైన్లో(ఇంటర్నెట్) దొరుకుతున్నప్పుడు వ్యక్తిగత వివరాల గోపనీయత మిథ్య అని కొందరు అభి ప్రాయపడుతున్నారు. వివిధ అవసరాలకు విభిన్న సంఖ్యలు, పాస్వర్డ్స్ వాడుతూ వ్యక్తిగత వివరాలు భద్రంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా, మన ఆరోగ్యానికి సంబంధించిన మెడి కల్ రిపోర్టులు, ఆరోగ్య పరీక్షల నివేదికలు ఇతరు లకు తెలియకుండా ఉంచుకుంటాం. ఇలాంటి వివరా లను తేలికగా బయటకు తీసి వెల్లడించడం అంత తేలిక కాదు. తరచూ ఓ వ్యక్తికి సంబంధించిన ఆధార్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ వంటి అనేక వివరాలను ఒకేసారి ఉపయోగించి ఇలాంటి సమాచారం తవ్వితీయడానికి వీలుందని చెబుతు న్నారు. శర్మ వ్యవహారంలో ఆయనకు హ్యాకర్లు ప్రస్తు తానికి హాని చేయగలమని నిరూపించలేదుగానీ భవిష్యత్తులో అది జరగదనే గ్యారంటీ ఏమీ లేదు. వారు శర్మకు సంబంధించి వెల్లడించిన సమాచారం శాశ్వతమైనది. అయితే, ఇప్పటికి బయటపెట్టిన ఆయన సమాచారంతో ఎప్పుడు ఆయనకు కీడు చేయగలరో ఇంకా స్పష్టం కాలేదు. ఒక వేళ మనం కోరుకుంటున్నట్టు ఆయనకు ఎలాంటి హాని జరగక పోతే, ఈ ప్రత్యేక సందర్భంలోనే ఇది కుదరలేదని చెప్పడం అంత సులువు కాదు. మనకు తెలియ కుండా వ్యక్తిగత వివరాలు ఇతరులు మన అకౌంట్ల నుంచి సంపాదిస్తే దాని వల్ల మనకు కీడు జరిగిందని నిరూపించడం సాధ్యం కాదు. కీడు చేసినా చర్యలుండవని చెప్పినా.... తన ఆధార్ నంబర్‌తో తనకు హాని చేసినట్టు నిరూ పించినవారిపై చర్యలేమీ తీసుకోనని ఆర్ఎస్ శర్మ హామీ ఇచ్చినాగానీ టెక్నాలజీ డెవలపర్ కింగ్స్లీ జాన్ దాని పర్యవసానాలపై న్యాయ సలహా తీసుకు న్నారు. ఎందుకంటే, శర్మ ఉన్నత పదవిలో ఉండడం, జాన్ బాధ్యతగల నిపుణుడు కావడం వల్ల ఈ ప్రయో గం ఫలితంగా సమస్యలు ఉత్పన్నం కాలేదు. అలా గాక, ఎవరికైనా శర్మ ఆధార్ నంబరు తెలిసి ఉంటే హ్యాకింగ్ చేసి గుట్టుచప్పుడు కాకుండా వారు సమా చారం బయటకు లాగేవారు. ఆధార్ అందరికీ తెలి యడంతో ఇప్పుడు కూడా శర్మ అకౌంట్లపై హ్యాకర్ల దాడులకు అవకాశం లేకపోలేదు. ఇలా ఆధార్ నంబర్ బహిరంగంగా వెల్లడించడం ప్రమాద కరమే గాక, అత్యంత బాధ్యతారహితమైన చర్యగా పరిగ ణించవచ్చు. ఇది చట్టబద్ధమైనది కూడా కాదని చెప్ప వచ్చు. ట్రాయ్ చైర్మన్ తన ఆధార్ నంబర్ చెప్పి సవాలు విసరగానే అనేకమంది తమ నంబర్లు ఆన్ లైన్లో వెల్లడిస్తూ తమ గోపనీయ వివరాల గుట్టు విప్పవచ్చని చాలెంజ్ చేశారు. నిజానికి అలా చేయడం వారు ఇబ్బందుల్లో చిక్కుకోవడానికి ఆహ్వా నం పలకడమే అవుతుంది. ఉన్నత పదవిలో ఉన్న కారణంగా శర్మ వ్యక్తిగత సమాచారానికి అనేక రకాల ‘భద్రతా ఏర్పాట్లు’ ఉన్నాగాని ఆయన చేసిన పని సబబు కాదనిపిస్తోంది. అయితే, ఆయన చర్య వల్ల ఇతరులు తెలివి తక్కువగా తమ కీలక సమాచారాన్ని ఇతరులకు అందేలా ఆధార్ నంబర్లు వెల్లడిస్తున్నారు. ఆధార్ నంబర్ కీలకమైన వ్యక్తిగత వివరంగా జస్టిస్ శ్రీకృష్ట కమిటీ పరిగణించింది. ఆధార్ నంబర్లు ప్రచురించడం చట్టవ్యతిరేకమని కూడా ఆధార్ చట్టం చెబుతోంది. ట్రాయ్ చైర్మన్ శర్మ తన ఆధార్ వెల్లడిం చడం ద్వారా చట్టవ్యతిరేక చర్యకు పాల్పడినట్టు పరి గణించే అవకాశం ఉంది. శర్మ మార్గంలో ఇతరులు పయనిస్తే, ఆయన చర్య చట్ట వ్యతిరేక కార్యకలాపా లను ప్రోత్సహించినట్టవు తుంది. ఈ వ్యవహారం మొత్తం పరిశీలిస్తే ట్రాయ్ చైర్మన్ మరింత బాధ్యతా యుతంగా వ్యవహరించాల్సిందనిపిస్తోంది. తన చర్యల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఆయన గుర్తించి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే బాగుం డేది. ఇతరులు తమ ఆధార్ నంబర్లు ప్రచురించడానికి శర్మ ప్రత్యక్షంగా బాధ్యులు కాకున్నా వారిలో ఎవరికి నష్టం జరిగినా ఆయన వల్లే ఇది జరిగిందనే చెడ్డపేరు వస్తుంది. తన ఆధార్ నంబర్‌ను ఆయుధంగా వాడు కుని ఆయన వ్యక్తిగత సమాచారం ఇంతగా వెల్లడించి నాగానీ, తన కేమీ జరగనట్టు దీనినంతా కొట్టిపారేస్తూ తనకు హాని జరిగినట్టు నిరూపించాలని శర్మ ఇంకా సవాల్ చేస్తున్నారు. కీలక వ్యక్తిగత వివరాలు బయ టకు వెల్లడి కావడాన్ని సాధారణ విషయంగా ఆయన చిత్రిస్తున్నారు. ఇది ఆయన చేయాల్సిన పని కాదు. ఆయన దూకుడు, సాహసం ప్రమాదకరమైనవి. నిఖిల్ పహ్వా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, డిజిటల్ హక్కుల కార్యకర్త -
వ్యక్తిగత గోప్యత మన హక్కు: నాదెళ్ల
సియాటెల్: ప్రపంచమంతా కంప్యూటర్‌మయం అయిపోయిందని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత గోప్యత, మానవ విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే నైతిక విలువలు, మౌలిక సూత్రాలను కలుపుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2018 కాన్ఫరెన్స్ ప్రసంగంలో.. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన వేలమంది సాఫ్ట్వేర్ డెవలపర్లనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘వ్యక్తిగత గోప్యత మానవ హక్కు. మైక్రోసాఫ్ట్‌లో మనమంతా ఈ హక్కులను కాపాడాలనే మూల సూత్రానికే కట్టుబడి పనిచేస్తున్నాం. మనం డేటా వినియోగించినపుడు అది వినియోగదారుడికి మేలు చేస్తుందనే భరోసాను మనం కల్పించగలగాలి. వ్యక్తిగత వివరాలన్నీ తన నియంత్రణలో ఉన్నట్లు యూజర్‌కు భరోసా కల్పించాలి. కంప్యూటర్లు ఏం చేయగలవు? ఏం చేయాలి? అనే దాన్ని మనకు మనం ప్రశ్నించుకోవాలి.అదే నైతిక కృత్రిమ మేధ’ అని అన్నారు. -
గోప్యత కంటే జాతీయ భద్రతే ముఖ్యం: రిజిజు
న్యూఢిల్లీ : వ్యక్తిగత గోప్యత వంటి అంశాలతో పోల్చుకున్నప్పుడు జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలు అత్యంత ప్రధానమైనవని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సైబర్ భద్రతపై అసోచామ్ గురువారం నాడిక్కడ నిర్వహించిన సదస్సులో రిజిజు మాట్లాడారు. ‘నేనిక్కడ గోప్యతపై సుప్రీం తీర్పును విమర్శించడం లేదు. దేశంలో చట్టాలు రూపొందించడానికి సర్వాధికారాలను ప్రజలు పార్లమెంటుకు కట్టబెట్టారు. ప్రాథమిక హక్కుల్లో భాగమైన గోప్యత హక్కును సమీక్షించే ఆలోచన కేంద్రానికి లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయంలో దేశ భద్రత, ప్రయోజనాలు వ్యక్తిగత గోప్యతతో పోల్చుకున్నప్పుడు అత్యంత ప్రధానమైనవి’ అని రిజిజు తెలిపారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని ఆగస్టు 24న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.