మనమున్న సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకంగా మారింది. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకున్నా చాలు మన వ్యక్తిగత సమాచారం బజార్లో పడినట్టే. మెటా, ట్విట్టర్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు ఈ– కామర్స్ సైట్లు పౌరుల వ్యక్తిగత డేటాతో ఆటాడుకుంటున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేయడానికే ఇప్పుడీ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
‘‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు–2022’’ను (డీపీడీపీ) వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఈ డిజిటల్ ప్రపంచంలో పౌరుల వ్యక్తిగత సమాచారం గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. గత ఆరేళ్లుగా మేధోమథనం సాగించిన కేంద్రం ప్రభుత్వం ఎట్టకేలకు ముసాయిదా బిల్లును రూపొందించింది. గతేడాది నవంబర్‌లో ప్రజలు, సామాజిక సంస్థల అభిప్రాయం కోసం వెలువరించిన ముసాయిదా బిల్లులో అంశాలే ఇంచుమించుగా ఇందులో ఉన్నాయి. అయితే విదేశీ సంస్థలు సమాచార సేకరణలో కొన్ని ఆంక్షల్ని విధించారు.
బిల్లులో ఏముందంటే ?
డీపీడీపీ బిల్లును ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో దీని వివరాలను కేంద్రం అత్యంత గోప్యంగా ఉంచింది. అయితే కొన్ని జాతీయ మీడియా కథనాల ప్రకారం నిపుణులు ఆందోళన వ్యక్తం చేసిన కొన్ని వివాదాస్పద అంశాలు అలాగే ఉన్నట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థలకు విస్తృతమైన మినహాయింపులు ఇవ్వడం, డేటా ప్రొటక్షన్ బోర్డు పాత్రను గణనీయంగా తగ్గించడం వంటివి ఉన్నట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ప్రభుత్వాధికారులు, ఇతర నాయకులకు సంబంధించిన డేటా కూడా ఈ చట్టం కింద గోప్యంగా ఉంచడం వల్ల సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందనే ఆందోళనలున్నాయి. ఇంకా బిల్లులో ఉన్న అంశాలివే..
► ఆన్‌లైన్ లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా సమాచారం సేకరించి డిజిటలైజ్ చేసే పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిగా వారి సమ్మతితో సేకరించాలి. దానిని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత ఆ సంస్థలదే. తమ పని పూర్తి కాగానే ఆ సమాచారాన్ని తొలగించాలి.
► మన దేశంలో డిజిటల్ పర్సనల్ డేటాను సేకరించి ప్రాసెస్ చేయవచ్చు. అదే విదేశాల్లో వస్తు, సేవల వినియోగంలో మాత్రం డేటాను సేకరించే అవకాశం ఉంటుంది.
► వివిధ సామాజిక మాధ్యమాలు, ఈ కామర్స్ సంస్థలు, మొబైల్ యాప్స్ జవాబుదారీ తనం పెరిగేలా సేకరించిన సమాచారాన్ని ఎలా భద్రపరుస్తున్నారు, ఏ రకంగా సేకరిస్తున్నారు ? పౌరుల సమాచారాన్ని ఏ రకంగా ఉపయోగిస్తున్నారు ? వంటి ప్రశ్నలకు ఆయా సంస్థలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది
► ఏదైనా సమాచారం చుట్టూ వివాదం చెలరేగితే కేంద్రం ఏర్పాటు చేయనున్న డేటా ప్రొటక్షన్ బోర్డు ఆఫ్ ఇండియా వాటిని పరిష్కరి స్తుంది. ఈ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను కేంద్రమే నియమిస్తుంది.
► పౌరుల వ్యక్తిగత సమాచారం ఉల్లంఘన జరిగితే సదరు కంపెనీలకు అత్యధికంగా రూ.250 కోట్ల జరిమానా విధించవచ్చు.
► ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు వేర్వేరు విధివిధానాలున్నాయి. జాతి భద్రతకు సంబంధించిన అంశాల్లో సమాచార సేకరణపై మినహాయింపులున్నాయి.
► పౌరులు తమ డేటాను వాడుకున్నారని భావిస్తే నష్టపరిహారం కోసం కోర్టుకి ఎక్కొచ్చు. చిన్నారుల వ్యక్తిగత డేటాను సేకరించాల్సి వచ్చిన ప్పుడు వారి లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరిగా ఉంటుంది.
► ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో వాణిజ్య లావాదేవీల్లో అత్యంత కీలకం కానుంది.
గతంలో ఏం జరిగింది?
వ్యక్తిగత డేటా పరిరక్షణకు ప్రపంచ దేశాలన్నీ కఠినమైన నిబంధనల్నీ విధిస్తూ ఉంటే మన ప్రభుత్వం 2018 నుంచి ఈ చట్టంపై కసరత్తు చేస్తోంది. వ్యక్తిగత డేటా పరిరక్షణ కోసం ఉద్దేశించిన శ్రీకృష్ణ కమిటీ 2018లో ఒక ముసాయిదా బిల్లు కేంద్రానికి సమర్పించింది. కానీ కేంద్రానికి, దిగ్గజ సామాజిక మాధ్యమ సంస్థలకి మధ్య ఒక అంగీకారం రాలేదు. చివరికి 2019లో ఒక ముసాయిదా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లులో సమగ్రత లోపించిందని స్వయంగా జస్టిస్ శ్రీకృష్ణ పేర్కొనడం కలకలం రేపింది. డేటా పరిరక్షణ బిల్లు నిబంధనల్ని అతిక్రమించే వారి జాబితా నుంచి ప్రభుత్వం తనని తాను మినహాయించుకోవడంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఆ బిల్లులో 81 సవరణలు చేయాలంటూ పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించడంతో గత ఏడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకుంది.
విదేశాల్లో వ్యక్తిగత గోప్యతకు అత్యంత ప్రాధాన్యం
ప్రపంచంలోని 71% దేశాల్లో వ్యక్తిగత సమాచారం భద్రతపై కఠినమైన చట్టాలే ఉన్నాయి. వాణిజ్యం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సులో తీసుకున్న నిర్ణయానికనుగుణంగా 194 దేశాల్లోని 137 దేశాలు డేటా పరిరక్షణ కోసం చట్టాలు రూపొందించాయి.
► ఆఫ్రికా దేశాల్లో 54గాను 33 దేశాల్లో (61%) డేటా చట్టాలు అమల్లో ఉన్నాయి.
► ఆసియా దేశాల్లో ఇది ఇంకా తక్కువగా 57% మాత్రమే ఉంది.
► 60 దేశాలకు గాను 34 దేశాలు చట్టాలను రూపొందించాయి. ఇక వెనుకబడిన దేశాలు 46కి గాను 22 దేశాల్లో మాత్రమే చట్టాలున్నాయి.
అంతర్జాతీయంగా ఈయూ మోడల్, యూఎస్ మోడల్ చట్టాలే అత్యధికంగా ప్రాచుర్యం పొందాయి. ఈయూ మోడల్‌లో వ్యక్తిగత సమాచార సేకరణ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. పౌరుల డేటా బయటకు వచ్చిందంటే ఆయా సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తాయి. అత్యధిక దేశాలు ఈ మోడల్‌నే అనుసరిస్తున్నాయి. ఇక అమెరికా మోడల్‌లో డేటా భద్రతని వ్యక్తుల స్వేచ్ఛ పరిరక్షణగా చూస్తారు. ప్రభుత్వాలు కూడా వ్యక్తుల పర్సనల్ స్పేస్‌లోకి వెళ్లవు. వ్యక్తుల డేటా అవసరమైన ప్రతీ సారి వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
-సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment