పౌరసత్వ బిల్లుకు కేబినెట్‌ ఓకే | Redrafted Citizenship Amendment Bill Cleared by Union Cabinet | Sakshi
Sakshi News home page

పౌరసత్వ బిల్లుకు కేబినెట్‌ ఓకే

Published Tue, Jan 8 2019 3:02 AM | Last Updated on Tue, Jan 8 2019 5:17 AM

Redrafted Citizenship Amendment Bill Cleared by Union Cabinet - Sakshi

గువాహటిలో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా కాగడాలతో కాంగ్రెస్‌ నేతల నిరసన

న్యూఢిల్లీ/ గువాహటి: కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ ముసాయిదా బిల్లు–2018కు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. మిత్రపక్షం అస్సాం గణపరిషత్‌(ఏజీపీ) సహా ఈశాన్య రాష్ట్రాల్లోని పలు విద్యార్థి సంఘాలు, నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ కేంద్రం ముందుకు వెళ్లేందుకే నిర్ణయించింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

2016లో తొలిసారి లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని(జేపీసీ) ప్రభుత్వం అప్పట్లో నియమించింది. అస్సాం, మేఘాలయలతో పాటు గుజరాత్, రాజస్తాన్‌లో పర్యటించిన ఈ కమిటీ.. ప్రజలు, నేతలు, నిపుణులు, వేర్వేరు సంఘాల అభిప్రాయాన్ని సేకరించింది. అలాగే అస్సాం, బిహార్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు డీజీపీలతో చర్చించింది. ఈ నివేదికను సోమవారం కమిటీ లోక్‌సభకు సమర్పించగా, కొన్ని గంటల్లోనే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంది.

ఐదేళ్లలో హిందువులు మైనారిటీలవుతారు
పౌరసత్వ బిల్లుపై అస్సాం మంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టాన్ని తీసుకురాకుంటే రాబోయే ఐదేళ్లలో అస్సాంలో హిందువులు మైనారిటీలుగా మారిపోతారని హెచ్చరించారు. అలా జరిగితే అస్సాం మరో కశ్మీర్‌గా మార్చాలనుకుంటున్న శక్తులకు లాభం చేకూరుతుందన్నారు. ఇది జిన్నా వారసత్వానికి, భారత వారసత్వానికి యుద్ధమని ఆయన తెలిపారు. మరోవైపు, ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించబోదని అస్సాం సీఎం సోనోవాల్‌ చెప్పారు.

మద్దతు ఉపసంహరించుకున్న ఏజీపీ
కేబినెట్‌ పౌరసత్వ ముసాయిదా (సవరణ) బిల్లు–2018ను ఆమోదించడంతో అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి తమ 14 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మితప్రక్షం అస్సాం గణపరిషత్‌(ఏజీపీ) ప్రకటించింది. ఈ విషయమై ఏజీపీ అధ్యక్షుడు, అస్సాం మంత్రి అతుల్‌ బోరా మాట్లాడుతూ.. ‘ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా ఆపేందుకు చివరి ప్రయత్నంగా హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశాం. దీనివల్ల అస్సాం ఒప్పందం, జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్‌ఆర్సీ) ప్రక్రియ నిర్వీర్యం అవుతాయని వివరించాం. మేం ఎన్డీయే కూటమిలో చేరినప్పుడు అక్రమ వలసదారుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

కానీ బీజేపీ ఇంత ద్రోహం చేస్తుందని అనుకోలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై విచారిస్తున్నాం’ అని తెలిపారు. ఏజీపీ మద్దతు ఉపసంహరణతో అస్సాంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చిన ఇబ్బందేమీ లేదు. మొత్తం 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో బీజేపీకి ప్రస్తుతం 74 మంది సభ్యుల బలముంది. 61 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి బోడోల్యాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(12), ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఇస్తున్నారు.  కాగా, పౌరసత్వ బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించడంతో అస్సాం అంతటా ఆందోళనలు మొదలయ్యాయి. పౌరసంఘాలు, అల్ఫాతో కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్లమెంటుతోపాటు అస్సాం భవన్‌ ముందు ఏఏఎస్‌యూ, కేఎంఎస్‌ఎస్‌ సభ్యులు నగ్నంగా నిరసన తెలిపారు.  

ముసాయిదా బిల్లులో ఏముందంటే..
ఈ ముసాయిదా బిల్లు ప్రకారం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన మైనారిటీలు అంటే.. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్దులకు పౌరసత్వం కల్పిస్తారు. సరైన పత్రాలు లేకపోయినా వీరు కనీసం ఆరేళ్ల పాటు భారత్‌లో నివాసముంటే పౌరసత్వం ఇస్తారు. ఇందుకోసం పౌరసత్వ చట్టం–1955ను సవరించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అస్సాం, మేఘాలయ, మిజోరం సహా ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 1971, మార్చి 24 తర్వాత రాష్ట్రానికి వచ్చిన విదేశీయులను మతాలతో సంబంధం లేకుండా బయటకు పంపాలని అస్సాం ఒప్పందం–1985 చెబుతోంది.

తాజాగా ఈ పౌరసత్వ ముసాయిదా బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే అస్సాం ఒప్పందం నిర్వీర్యమై పోతుందని అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్, తృణమూల్, సీపీఎం ప్రకటించాయి. లౌకిక దేశంలో మతాల ఆధారంగా వ్యక్తులకు పౌరసత్వం ఇవ్వడం రా జ్యాంగ విరుద్ధమన్నాయి. కాగా, ఈ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ఎన్డీయే మిత్రపక్షాలైన శివసేన, జేడీయూ ప్రకటిం చాయి. ఈ మూడు దేశాల నుంచి భారత్‌ను ఆశ్రయించే మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది.

కటాఫ్‌.. 2014, డిసెంబర్‌ 31
బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లో వివక్షకు గురై భారత్‌ను ఆశ్రయించిన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించడం అభినందనీయమని సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికలో తెలిపింది. బీజేపీ ఎంపీ రాజేంద్ర అగ్రవాల్‌ అధ్యక్షతన ఏర్పాటైన జేపీసీ తన 440 పేజీల నివేదికలో ‘వలసదారులకు అధికారికంగా పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్రం 2014, డిసెంబర్‌ 31ని కటాఫ్‌ తేదీగా నిర్ణయించింది. దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం వీలవుతుంది.  అంతేకాకుం డా వలసదారుల ముసుగులో పొరుగుదేశాలు పన్నే కుట్రలను తిప్పికొట్టవచ్చు’ అని తెలిపింది. పలువురు అడ్డుచెప్పిన ప్పటికీ చివరికి మెజారిటీ ఓటుతో నివేదికకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement