ఇటు పౌరసమాజ కార్యకర్తలనూ, అటు దిగ్గజ సైబర్ సంస్థలనూ సమానంగా వణికించిన పాత డేటా పరిరక్షణ ముసాయిదా బిల్లు స్థానంలో సరికొత్త ముసాయిదా బిల్లు శుక్రవారం వెలువడింది. పాత బిల్లు ఉపసంహరించుకున్న మూణ్ణెల్లలోపులో దీన్ని తీసుకురావడాన్నిబట్టి డేటా పరిరక్షణ బిల్లు విషయంలో కేంద్రం ఎంత పట్టుదలగా ఉన్నదో వెల్లడవుతోంది. 2019లో రూపొంది పార్లమెంటులో ప్రవేశించిన ముసాయిదా బిల్లుపై అన్నివైపులా తీవ్ర విమర్శలు చెలరేగటంతో దాన్ని ఉపసంహరించక తప్పలేదు. సైబర్ ప్రపంచంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచివుంటున్నాయి. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రశ్నార్థకమవుతున్నది. లక్షల కోట్లకు పడగెత్తిన మెటా (ఫేస్‌బుక్), ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మొదలుకొని సాధారణ వ్యాపార, వాణిజ్య సంస్థల వరకూ పౌరుల డేటాతో ఆటలాడుకుంటున్నాయి. వారి వ్యక్తిగత గోప్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వీటి దూకుడుకు కళ్లెం వేసేలా ఇప్పటికే చాలా దేశాలు పకడ్బందీ చట్టాలు చేశాయి. ఆ చట్టాలను ఉల్లంఘించిన పక్షంలో భారీ జరిమానాలు విధిస్తున్నాయి. కానీ మన దేశం మాత్రం పుష్కరకాలంగా తాత్సారం చేస్తోంది.
చట్టం తెస్తామనటమే తప్ప దాని ఆచూకీ లేదు. అందుకోసం జస్టిస్ బీఎస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ 2018లోనే ఒక ముసాయిదా బిల్లును కేంద్రానికి సమర్పించింది. చివరకు మరో ఏడాది కాలం తర్వాత దాని ఆధారంగా కేంద్రం ఒక ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే తమ బిల్లుకూ, కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుకూ పొంతనలేదని జస్టిస్ శ్రీకృష్ణ పెదవి విరిచారు. పార్లమెంటు లోపలా, వెలుపలా ఆ ముసాయిదాపై విస్తృతంగా చర్చ జరిగిన సందర్భంగా అందులో సమగ్రత గల్లంతయిందని అనేకులు విమర్శించారు. డేటా పరిరక్షణ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే ఏ చర్యలు తీసుకోవాలో అందులో ప్రతిపాదించారు. కానీ దీన్నుంచి ప్రభుత్వం తనను తాను మినహాయించుకోవటం అన్ని వర్గాలనూ దిగ్భ్రాంతిపరిచింది. అలాగే ఇక్కడ సేకరించే డేటా సరిహద్దులు దాటిపోరాదన్న నిబంధన అందులో ఉంది. ఈ నిబంధన సరికాదని మెటా, ట్విటర్‌వంటివి విమర్శించాయి. చివరకు ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం సైతం జోక్యం చేసుకుంది. ఏమైతేనేం...ఆ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఆ సంఘం బిల్లుకు మొత్తం 81 సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ఆ బిల్లు ఉపసంహరణే ఉత్తమమని ప్రభుత్వం భావించింది.
చాలా సైబర్ సంస్థలు, ఈ–కామర్స్, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసు సంస్థలు వినియోగదారుల డేటాను ఇష్టానుసారం సేకరిస్తున్నాయి. వీటిల్లో చేరాలంటే చాలా వివరాలు సమర్పించుకోవాల్సి వుంటుంది. ఖాతా తెరవాలన్న తొందరలో అత్యధికులు వెనకాముందూ చూడకుండా అడిగిన వివరాలన్నీ అందజేస్తున్నారు. ఈ వ్యక్తిగత డేటాను సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయి. ఆ వివ రాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి పోయి పౌరుల బ్యాంకు ఖాతాలు ఖాళీ కావటం, వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు అవాంఛనీయ వ్యక్తుల చేతుల్లో పడటం రివాజైంది. ఇలాంటివి చోటుచేసు కున్నప్పుడు ఆ మాధ్యమాలు తమకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాయి. పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేనప్పుడు డేటా సేకరణ ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ సంగతలా ఉంచి పౌరుల డేటాను ప్రభుత్వం అడిగినప్పుడు ఏం చేయాలన్న ప్రశ్న ఉండనే ఉంది. పాత ముసాయి దాలో భద్రతా సంస్థలకు పూర్తిస్థాయి మినహాయింపునీయటం విమర్శలకు తావిచ్చింది. ప్రస్తుత ముసాయిదాలో సైతం అదే కొనసాగింది. జాతీయ భద్రత కీలకం గనుక అవాంఛనీయ శక్తుల కదలికపై నిఘా వేయటం, వారి కార్యకలాపాలను కనిపెట్టి ఉండటం అవసరం కావొచ్చు. కానీ ఆ మాటున నికార్సయిన అసమ్మతిని అణచాలని చూడటం, ఆ కృషిలో నిమగ్నమయ్యే వ్యక్తులనూ, సంస్థలనూ వేధించటం సరైంది కాదు. ప్రభుత్వాల విధానాలూ, చర్యలూ సరిగాలేవని భావించిన వారు శాంతియుత పద్ధతుల్లో నిరసించటం ప్రజాస్వామిక హక్కు. దీనికి భంగంవాటిల్లని రీతిలో భద్రతా సంస్థలు మెలిగితే ఎవరూ అభ్యంతరపెట్టరు. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడే సమస్య తలెత్తుతుంది. ఏ అధికారైనా హద్దుమీరిన పక్షంలో ఎలాంటి చర్యలుంటాయో చెప్పాలి.
తాజా ముసాయిదాలో డేటా పరిరక్షణ బోర్డు ఏర్పాటు ప్రతిపాదన భేషైనది. పౌరుల వ్యక్తిగత డేటాను పరిరక్షించటంలో విఫలమైన సంస్థలపై రూ. 250 కోట్ల వరకూ జరిమానా విధించే అధి కారం ఈ బోర్డుకుంది. అలాగే డేటా లీకయిందని తెలిసిన వెంటనే ఖాతాదార్లకు ఆ సంగతి చెప్పక పోతే రూ. 200 కోట్లవరకూ జరిమానా విధించొచ్చు. ఉద్దేశించిన ప్రయోజనం నెరవేరాక సేకరించిన డేటాను సంస్థలు పూర్తిగా తొలగించాలన్న నిబంధన, వినియోగదారులు తమ డేటా తొలగించాలని కోరినా, సవరించాలని కోరినా సంస్థలు అంగీకరించాలన్న నిబంధన మంచిదే. తమ డేటా సేకరణ ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చూసేందుకు సంస్థలు ఆడిటర్‌ను నియ మించుకోవాలన్న నిబంధన కూడా మంచిదే. అయితే భారత్‌లో సేకరించిన డేటాను ఇక్కడి సర్వర్ల లోనే భద్రపరచాలన్న అంశంలో ప్రభుత్వం రాజీపడింది. అందుకు బదులు ఏయే దేశాల్లో డేటా ఉంచవచ్చునో ప్రభుత్వమే నోటిఫై చేస్తుంది. తనకు అవసరమైనపక్షంలో డేటా తీసుకోవటం సాధ్య పడే దేశాల్లో సర్వర్లు ఉండొచ్చన్నది సర్కారు భావన. మొత్తానికి తాజా ముసాయిదాపై కూడా లోతైన చర్చ జరగాలి. అందుకు పౌరుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణే గీటురాయి కావాలి.
ఇదీ చదవండి: సెలక్షన్ కమిటీ రద్దు.. కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment