న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను నిర్దిష్ట దేశాలకు బదిలీ చేసేందుకు, అక్కడ నిల్వ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త డేటా ప్రైవసీ చట్టం ముసాయిదాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం భారత్‌కు వెలుపల ఏయే దేశాలు, ప్రాంతాలను ఎంచుకోవచ్చనేది నోటిఫై చేయనుంది. అలాగే సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించనుంది. శుక్రవారం ఈ మేరకు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) బిల్లు 2022 ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనిపై డిసెంబర్ 17లోగా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.
భారత్‌కు సంబంధించిన డేటాను దేశీయంగానే నిల్వ చేయాలంటూ గత బిల్లులో చేసిన ప్రతిపాదనలు పలు దిగ్గజ టెక్ కంపెనీల్లో ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. తాజా మార్పులతో గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి సంస్థలకు ఊరట లభించనుంది. పార్లమెంటు ఆమో దం పొందాక ముసాయిదా బిల్లు .. చట్టంగా మారుతుంది. వ్యక్తిగత డేటా విషయంలో ఒకవైపు వ్యక్తుల హక్కులు, బాధ్యతలను మరోవైపు డేటా సేకరించే సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచిస్తూ ఈ బిల్లును రూపొందించినట్లు ముసాయిదాలో పేర్కొన్నారు.
చట్టబద్ధత, పారదర్శకత తదితర ఏడు సూత్రాల ప్రాతిపదికన బిల్లును తయారు చేసినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ వివరించింది. ‘పౌరుల డేటా రక్షణ, పరిశ్రమకు వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడం, దేశ భద్రత.. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యాలకు అనుగుణంగా బిల్లు రూపొందింది‘ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వివాదాస్పద అంశాలు తొలగించి డేటా బిల్లును సరళతరం చేశారని న్యాయ సేవల సంస్థ జేఎస్‌ఏ పార్ట్‌నర్ రూపీందర్ మాలిక్ పేర్కొన్నారు.
ముసాయిదాలోని ముఖ్యాంశాలు..
► వ్యక్తిగత డేటాను సేకరించే ముందు వ్యక్తుల సమ్మతి తీసుకోవాలి. సదరు డేటాను షేర్ చేయడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించిన పక్షంలో డేటాను సేకరించిన వ్యక్తులు, కంపెనీలపై రూ. 500 కోట్ల వరకూ జరిమానా విధించవచ్చు. 2019లో జారీ చేసిన గత ముసాయిదాలో ఈ పెనాల్టీని రూ. 15 కోట్లు లేదా కంపెనీ గ్లోబల్ టర్నోవరులో 4% (ఏది ఎక్కువైతే అది)గా ప్రతిపాదించారు.
► అలాగే ఏదైనా పత్రం, సర్వీసు, గుర్తింపు ధ్రువీకరణ లేదా చిరునామా ధ్రువీకరణ కోసం దరఖాస్తులో తప్పుడు సమాచారం ఇచ్చే వ్యక్తులపై రూ. 10,000 జరిమానా విధించవచ్చు.
► దేశ సార్వభౌమత్వం, సమగ్రత కాపాడేందుకు రాష్ట్ర ఏజెన్సీలకు బిల్లులోని నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి.
► కంపెనీలు తాము సేకరించిన డేటాను నిర్దిష్ట వ్యవధి వరకే నిల్వ చేసుకోవచ్చు.
► డేటా సేకరించే సేకరించే సంస్థలు.. నిబంధనల పాటింపు కోసం డేటా రక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ల నుండి వచ్చే ఫిర్యాదులను కూడా ఈ బోర్డు వినాలి.
► యూజర్లు తమ సమ్మతిని తెలియజేసేందుకు, సమీక్షించుకునేందుకు, ఉపసంహరించుకునేందుకు ఆయా కంపెనీలు పారదర్శకమైన ప్లాట్‌ఫాంను అందుబాటులో ఉంచాలి.
► వ్యక్తిగత డేటాను సరిచేసుకునేందుకు, తొలగించేందుకు యూజర్లకు హక్కులు ఉంటాయి.
► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పిల్లల వ్యక్తిగత డేటాను సేకరించకూడదు. ప్రాసెస్ చేయకూడదు. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు ఇవ్వకూడదు.
► భారీ కంపెనీలు తాము ప్రాసెస్ చేసే డేటా పరిమాణాన్ని బట్టి .. నిబంధనల పాటింపును మదింపు చేసేందుకు స్వతంత్ర డేటా
ఆడిటర్‌ను నియమించుకోవాలి.
► డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసే ప్రతిపాదన ముసాయిదాలో ఉంది. ఇది నిబంధనల ఉల్లంఘన కేసులను విచారణ చేసి, తగు నిర్ణయాలు తీసుకుంటుంది.
► వ్యక్తిగత డేటాను స్వయంగా లేదా డేటా ప్రాసెసర్లతో ప్రాసెస్ చేసే డేటా ఫిడ్యుషియరీ సంస్థలకు వివిధ రకాల జరిమానాలుంటాయి.
చదవండి: ‘కూతురు పుట్టిందని కోట్ల జీతం కాదన్నాడు’..మనసును హత్తుకునే ఓ తండ్రి కూతురు కథ
Comments
Please login to add a commentAdd a comment