Social Networking Site
-
పిల్లలు ఆన్లైన్లో ఏం చూస్తున్నారు?
ఎనిమిది, పదకొండేళ్ల వయసున్న ఇద్దరు అబ్బాయిలు ఆడుకోవడానికని వచ్చిన పక్కింటి అమ్మాయిని తమ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్లోని వీడియోలో చూసిన విధంగా ఉండాలని అడిగినందకు కాదంది. పైగా ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానని చెప్పడంతో భయపడిన అబ్బాయిలు ఆ అమ్మాయిపై రాళ్లతో దాడి చేయడంతో చనిపోయింది. విచారించిన పోలీసులు వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. పదకొండేళ్ల బాలుడి దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ అతని తండ్రిది. ఆన్లైన్ క్లాసుల కోసం తండ్రి కొడుక్కి ఇచ్చిన స్మార్ట్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండటం.. వాటిని చూడటానికి అలవాటుపడిన పిల్లవాడు చేసిన నేరం తాలూకు పరిణామం ఇది. అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ సంఘటన పిల్లలున్న తల్లిదండ్రులంందరినీ పునరాలోచించుకునేలా చేసింది. ఆన్లైన్లో లభ్యమయ్యే అశ్లీల, హింసాత్మక కంటెంట్ దుష్ప్రభావాలకు పిల్లలు గురికాకుండా కుటుంబం దిశానిర్దేశం చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తెలియజేస్తోందని నాగావ్ ఎస్పీ ఈ సందర్బంగా తెలిపారు. పిల్లలు ఆరుబయట నలుగురితో కలిసి ఆడుకునే రోజులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పుడు చాలా వరకు సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్ రూమ్‌లు, వర్చువల్ వరల్డ్‌లు, బ్లాగుల్లోనే కలుస్తున్నారు. ఆటలైనా, పాటలైనా, వినోదం ఏదైనా.. అన్నీ ఇంటర్నెట్లోనే. ఇలాంటప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక ప్రతికూలతలనూ పిల్లలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని ఆన్లైన్లో మీ పిల్లల భద్రత గురించి ఆలోచించడమూ అత్యంత ముఖ్యం. తెలుసుకోవాల్సిన నాలుగు స్తంభాలు పిల్లవాడు ముందుగా ఫోన్లో లేదా కంప్యూటర్లో గేమ్ ఆడుకోవాలని మారాం చేస్తాడు. గేమ్ కదా అని ఇంటర్నెట్ వ్యవస్థని పిల్లల చేతిలో పెడితే అది పెద్దలకే ముప్పు కలిగించవచ్చు. గతంలో ఓ పిల్లవాడు వీడియో గేమింగ్‌కు అలవాటుపడి తల్లి క్రెడిట్ కార్డుల నుంచి రూ.16 లక్షల వరకు ఖర్చు చేసిన విషయం కూడా మనకు తెలుసిందే. ఇంటర్నెట్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లలకు బహుమతిగా ఇవ్వడం, ఇచ్చింది లాగేసుకోవడమూ రెండూ చేయకూడదు. అలాగే ఇచ్చేసి వదిలేయకూడదు. పిల్లలతో పాటు ఆన్లైన్ ట్రావెలింగ్ చేయలేకపోతే డిజిటల్ పరికరాలను అస్సలు ఇవ్వకూడదు. డిజిటల్ వేదికల మీదకు పిల్లలను తీసుకువచ్చినప్పుడు వారికి ప్లే సేఫ్, సేఫ్ సెర్చ్, పేరెంటల్ కంట్రోల్, ఫ్యామిలీ ఇ–మెయిల్ .. ఈ నాలుగూ నాలుగు స్తంభాలని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఇ– మెయిల్ ఐడీ తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నదైతే సమస్యను అర్థం చేసుకోవడానికి మార్గం సులువవుతుంది. పర్యవేక్షణ అవసరం మన శ్రేయస్సుకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలో పిల్లలకు నేర్పడంలో తల్లిదండ్రులు వారికి సాయపడాలి. అందుకు పిల్లలతో కలిసి ఆన్లైన్ చూడటం, అందులో తమదైన కంటెంట్‌ను కలిసి సృష్టించడమనేది అలవాటు చేయాలి. అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్సైట్ సాధనాలు 13 ఏళ్ల వయసు గల పిల్లలకూ యాక్సెస్ ఇస్తున్నాయి. అందుకని, పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారో, చూస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పాలి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆన్లైన్ స్నేహాలను ప్రోత్సహించవద్దు. ఆన్లైన్ స్నేహితులు చెప్పే ప్రతీదాన్ని నమ్మవద్దు అని చెప్పాలి. తమ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, రోజువారీ ప్రణాళికలు, పుట్టినరోజులు.. వంటి వ్యక్తిగత సమాచారాన్ని పిల్లలు గోప్యంగా ఉంచేలా ముందే జాగ్రత్తపడాలి. తమ టీచర్లు, కుటుంబం, స్నేహితులు చూడకూడదనేవాటిని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ చేయవద్దని చెప్పాలి. ఆన్లైన్లో వచ్చిన ప్రతిదాన్ని నమ్మవద్దని చెప్పాలి. సైబర్ బెదిరింపులు వంటివి ఉంటే తప్పక తెలియజేయమనాలి. ఇ–మెయిల్ ఐడీ, యూజర్‌నేమ్, పాస్వర్డ్.. వంటివి ఇతరులకు చెప్పవద్దని సూచించాలి. ఆఫ్‌లైన్‌లో ఏవిధంగా ఉంటారో, ఆన్‌లైన్‌లోనూ అంతే మర్యాదగా ఉండాలని బోధించాలి. టీనేజర్లయినా .. నిబంధనలు తప్పనిసరి పేరెంటల్ కంట్రోల్ తప్పనిసరి. అలాగే, ఏ తరహా వెబ్సైట్లు చూడకూడదో ముందే సెట్ చేసుకోవడానికి ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. డబ్బులున్నాయి కదా అని ఈ వయసు పిల్లలకు మనీ ఎలా ఇవ్వకూడదో.. ఆన్లైన్లో జరిగే రకరకాల ప్రమాదాల గురించి చెప్పకుండా, పర్యవేక్షణ లేకుండా గ్యాడ్జెట్లు అలా ఇవ్వకూడదని గుర్తుపెట్టుకోవాలి. పెద్దలు ఉపయోగించే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు పిల్లలు కూడా ఉపయోగించేటప్పుడు కొన్ని వెబ్సైట్లు, యాప్స్ యాక్సెస్‌ని పరిమితం చేయచ్చు. లేదంటే అభ్యంతరకరంగా అనిపించిన ఫంక్షన్స్‌ని స్విచ్డాఫ్ చేసి ఉంచవచ్చు. సెర్చింగ్ ప్రక్రియలో సురక్షిత విధానాలు ప్రతిదానికీ ఉంటాయి. కొన్ని యాప్ అప్లికేషన్స్‌ని సైన్‌ఔట్ చేసి ఉంచచ్చు. ఈ నిబంధనలు పాటించడం ద్వారా పిల్లలు అనుచితమైన కంటెంట్‌ను చూసే ప్రమాదం తప్పుతుంది. క్రమం తప్పకుండా ఇంటర్నెట్ గురించిన అవగాహన తీసుకువస్తే తప్ప పిల్లల స్థాయి దారుణాలు జరగకుండా కాపాడుకోవచ్చు. అలాగే ప్రతికూల పరిస్థితి ఎదురైనప్పుడు ఏం చేయాలో కూడా సిద్ధంగా ఉండాలి. పిల్లల్ని ఇబ్బందిపెట్టేది ఏదైనా ఇంటర్నెట్లో కనిపిస్తే ఏం చేయాలో వారితోనే మాట్లాడాలి. పిల్లలు ఇంటర్నెట్లో వర్క్ చేస్తున్నప్పుడు పెద్దలు వస్తే ల్యాప్‌టాప్ మూసేయడం, స్త్రీన్ ఆఫ్ చేయడం వంటివి చేయకూడదనే విషయాలు కఠినంగానైనా చెప్పాలి. ఇతరులు పంపిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం/ ఇతరులకు యుపిఐ/పిన్/ఓటీపీ వంటివి షేర్ చేయడం వల్ల డబ్బు, వ్యక్తిగత డేటా అపరిచితుల చేతుల్లోకి వెళుతుందని ముందే పిల్లలను నేర్పాలి. సురక్షితం అని భావించినప్పుడే పిల్లలను డిజిటల్ లోకంలోకి అనుమతివ్వడం అన్ని విధాల శ్రేయస్కరం. అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు కాసేపు డౌన్!
న్యూఢిల్లీ: వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఫేస్బుక్ మెసెంజర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ వేదికలు శుక్రవారం రాత్రి చాలాసేపు మొరాయించాయి. ఏదైనా సందేశం పంపాలన్నా, స్వీకరించాలన్నా సాధ్యం కాక నెటిజన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూస్‌ఫీడ్‌ను అప్డేట్ చేయలేకపోయారు. కొందరైతే తమ అకౌంట్లలో లాగిన్ కూడా కాలేకపోయారు. ఎర్రర్ అనే సందేశం కనిపించడం చూసి తల పట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్ వల్లే ఆయా సైట్లు మొరాయించినట్లు సమాచారం. ట్రాకింగ్ వెబ్సైట్ ‘డౌన్ డిటెక్టర్’ గణాంకాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది మంది, వాట్సాప్‌పై 38 వేల మంది, ఫేస్‌బుక్‌పై 1,600 మంది ఫిర్యాదు చేశారు. -
ఉద్యోగులకు 6 నెలల జీతం బోనస్
సియాటిల్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తమ ఉద్యోగులకు 6 నెలల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఇంటి నుంచే పనిచేసే సిబ్బంది ఖర్చులను దృష్టిలో ఉంచుకుని 1,000 డాలర్లు అదనంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మొత్తం 45,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్బర్గ్ వెల్లడించారు. అయితే, కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ సదుపాయం ఉండదు. (ఫేస్బుక్ కార్యాలయం మూసివేత) కానీ, వారి ప్రాంతాల్లో లాక్డౌన్ ప్రకటించిన పక్షంలో విధులకు హాజరు కాకపోయినా.. పూర్తి వేతనం లభిస్తుంది. ఫేస్బుక్ ఉద్యోగుల సగటు వార్షిక వేతనం 2018లో 2,28,651 డాలర్లుగా ఉంది. ‘మీ కుటుంబాల గురించి మరింతగా జాగ్రత్తలు తీసుకునేందుకు మీకు సమయం అవసరమన్న సంగతి సంస్థకు తెలుసు. వర్క్ ఫ్రం హోమ్ ప్రక్రియకు నివాసంలో ఏర్పాట్లు చేసుకోవడానికి అదనపు ఖర్చులు ఉంటాయి. అందుకే, ఉద్యోగులందరూ అదనంగా 1,000 డాలర్లు పొందవచ్చు‘అని అధికారిక మెమోలో జకర్బర్గ్ తెలిపారు. అమెరికాలోని సియాటిల్‌లో ఫేస్బుక్ హెడ్ క్వార్టర్స్ ఉంది. ఓ కాంట్రాక్టర్‌కు కోవిడ్–19 బారిన పడటంతో కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మిగతా ఆఫీసులను తర్వాత మూసివేయడంతో చాలా మటుకు ఉద్యోగులు వారం రోజుల నుంచి.. ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. (‘ఊహించని పరిస్థితులు’.. ట్విటర్ కీలక నిర్ణయం!) -
వాట్సాప్ @ 500 కోట్ల డౌన్లోడ్లు
శాన్ఫ్రాన్సిస్కో: దిగ్గజ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల డౌన్లోడ్లను సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో గూగుల్‌యేతర యాప్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఇది కేవలం ప్లేస్టోర్ నుంచి చేసుకున్న డౌన్లోడ్లు మాత్రమేగాక, వివిధ సంస్థలకు చెందిన మొబైల్ ఫోన్లలో ప్రీఇన్స్టాల్గా వచ్చే వాటితో కలిపి ఈ ఘనత సాధించింది. వాట్సాప్‌కు నెలకు 160 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు 130 కోట్ల మంది, వియ్చాట్కు 110 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. సోషల్ నెట్‌వర్క్‌లలో ఫేస్బుక్, యూట్యూబ్‌ల తర్వాత వాట్సాప్ మూడో స్థానంలో నిలిచింది. గతేడాదిలో గూగుల్ 230 కోట్ల డౌన్లోడ్లను సాధించగా, ఫేస్బుక్ 300 కోట్ల డౌన్లోడ్లను సాధించింది. మరోవైపు టిక్‌టాక్ యాప్ 2019లో రెండో అత్యధిక డౌన్లోడ్లు సాధించిన యాప్‌గా నిలిచింది. వాట్సాప్ సేవల్లో అంతరాయం.. భారత్‌తో పాటు, పలు దేశాల్లో వాట్సాప్ స్తంభించింది. ఫొటోలు, వీడియోలు, స్టేటస్ అప్డేట్లు చేయలేకపోయామని పలువురు యూజర్లు ట్విట్టర్ వేదికగా ‘వాట్సాప్‌డౌన్’ హాష్‌టాగ్‌తో వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4:15 నుంచి ఈ సమస్య ఎదురైనట్లు యూజర్లు తెలిపారు. సందేశాలు అందుకోవడం, పంపడం వంటి వాటిల్లో కూడా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. భారత్, యూరోప్, మలేసియా, ఇండోనేసియా, బ్రెజిల్‌లోని పలు చోట్ల ఈ సమస్య ఎదురైంది. దాదాపు మూడు గంటల తర్వాత ఈ సమస్యను వాట్సాప్ ఇంజనీర్లు పరిష్కరించారు. -
వాళ్లందరి కోసం.. అద్భుతమైన ఆలోచన!
గట్టిగా మాట్లాడినా.. అభిప్రాయాలను కచ్చితంగా చెప్పినా.. ఫొటోలు అప్లోడ్ చేసినా... ఆఖరికి తమకు జరిగిన అన్యాయంపై నిర్భయంగా నోరు విప్పినా.. ఏదో నేరం చేసిన వాళ్లలాగా మహిళలను చిత్రీకరించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా విస్త్రృతి పెరిగిన తర్వాత స్త్రీవాదులు మొదలు సామాన్య మహిళల వరకు ప్రతీ ఒక్కరూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. రాయడానికి కూడా వీల్లేని అసభ్య, పరుష పదజాలంతో ఆమెను దూషించిన ఎందరెందరో మగానుభావుల సంస్కారం సదరు కామెంట్లలో ప్రస్ఫుటిస్తుంది. గౌరవప్రదమైన హోదాలో ఉండి, పెద్దమనిషిగా చలామణీ అవుతున్న వైరముత్తు లాంటి ఎంతో మంది వ్యక్తులపై వచ్చిన ఆరోపణల గురించి కనీసం ఆలోచించకపోగా... పైగా వారు ఏం చేసినా సరైందే అన్న రీతిలో ఉండే ట్వీట్లు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడతాయి. ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న చిన్మయిలు ఎందరో. అటువంటి వారికోసం నుపుర్ తివారీ అనే జర్నలిస్టు తన బృందంతో కలిసి ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించేందుకు, బాధితుల సమస్యల తీర్చేందుకు వీలుగా స్మాష్‌బోర్డు పేరిట యాప్‌ను తీసుకువచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీవాదులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్‌ను ఢిల్లీలోని మిరాండా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. కేవలం హ్యాష్‌ట్యాగ్ మూమెంట్లకే పరిమితం కాకుండా.. డిజిటల్ వీధుల్లో చేదు అనుభవాల బారిన పడుతున్న వారికి మద్దతు లభించేలా చేయడం, వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడమే ఈ సోషల్ నెట్వర్క్ ప్రధాన లక్ష్యం. అదే విధంగా బాధితుల గోడు వెళ్లబోసుకునేందుకు.. వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు.. ఈ యాప్ తోడ్పాడునందిస్తుంది. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడే మహిళలు, పురుషులు, థర్‌్డ జెండర్(ట్రాన్స్ మెన్ లేదా ట్రాన్స్ ఉమన్) ఇలా ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యులు కావొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. అందుకే స్మాష్‌బోర్డు.. స్మాష్‌బోర్డు యాప్ గురించి నుపుర్ తివారీ మాట్లాడుతూ... ‘ బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా నోరు విప్పేలా చేయాలనే ఆలోచనే స్మాష్‌బోర్డు రూపకల్పనకు కారణం. న్యాయవాదులు, జర్నలిస్టులు, సైకాలజిస్టులు వంటి వివిధ రంగాల నిపుణులు దీనితో ఎంతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి బాధితులు తమ సమస్యలు, మానసిక స్థితి గురించి వీరికి చెప్పుకోవచ్చు. కేవలం బాధితుల కోసమే కాకుండా పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంతో మందిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతోనే ఈ యాప్ ప్రారంభించాం. తద్వారా వారి ఆలోచనలు సారూప్య భావజాలం కలిగిన వ్యక్తులతో పంచుకునే వీలు కలుగుతుంది’ అని పేర్కొన్నారు. త్వరలోనే ఈ యాప్‌ను ప్రాంతీయ భాషల్లో తీసుకువచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. అద్భుతమైన ఆలోచన ఇది.. ది వెజీనా మోనాలోగ్స్ ఫేం ఈవ్ ఎన్స్లర్(స్త్రీలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్యకర్త) ఈ యాప్ గురించి మాట్లాడుతూ.. అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. మహిళలు నిర్భయంగా తమ గాథలను, అనుభవాలను చెప్పుకొనేందుకు గొప్ప వేదిక స్మాష్‌బోర్డు అని పేర్కొన్నారు. ఈ సోషల్ నెట్‌వర్క్‌లో అందరూ స్త్రీవాదులే ఉన్న కారణంగా బాధితులు తమ సమస్యలను మరింత ధైర్యంగా ఇతరులతో పంచుకోగలుగుతారన్నారు. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. Watch this video to learn more about the Smashboard app #smashboardapplaunch pic.twitter.com/RrD4tZfie1 — Smashboard_ (@Smashboard_) November 12, 2019 -
సమాచార సృష్టికర్తలు తెలిసిపోతారు!
న్యూఢిల్లీ: సోషల్ మీడియా, ఇతర ఆన్లైన్ వేదికల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కేంద్రం సమాచార, సాంకేతికత నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించింది. ప్రభుత్వ సంస్థలు కోరినప్పుడల్లా పలానా సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సోషల్ మీడియా సంస్థలు సహకరించాలని పేర్కొంది. ఈ మేరకు ఐటీ నిబంధనల్లో మార్పులు చేస్తూ సోమవారం ముసాయిదా సవరణలను ప్రకటించింది. ఈ చర్య వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘిస్తూ, పౌరుల జీవితాల్లోకి ప్రభుత్వం చొరబడేందుకు కారణమవుతుందని విపక్షాలు ఆరోపించాయి. ఈ సవరణలు అమల్లోకి వస్తే ప్రజలపై ప్రభుత్వం చలాయిస్తున్న పెద్దన్న అధికారాలు మరింత విస్తృతమవుతాయని, ఈ పరిస్థితి నియంత పాలనకు సమానమవుతుందని కాంగ్రెస్ పేర్కొంది. తాజా నిబంధనలు వ్యక్తిగత గోప్యత, భావ స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సవరణలపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలిపేందుకు జనవరి 15 వరకు గడువిచ్చారు. వ్యక్తిగత గోప్యతను కారణంగా చూపుతూ ప్రస్తుతం సోషల్ మీడియా సంస్థలు సమాచార వనరుల్ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి సమాచారంతో జాగ్రత్త.. ‘చట్టబద్ధ అధికారం కలిగి ఉన్న సంస్థలు కోరితే సోషల్ మీడియా సంస్థలు తమ ప్లాట్‌ఫాంపై ఉన్న సమాచార సృష్టికర్తలు ఎవరో తెలుసుకునేందుకు సహకరించాలి. అక్రమ, విద్వేషపూరిత సమాచారాన్ని గుర్తించి తొలగించేందుకు లేదా ప్రజలకు కనిపించకుండా చేసేందుకు ఆయా సంస్థలు టెక్నాలజీ ఆధారిత వ్యవస్థల్ని ఏర్పాటుచేసుకోవాలి’ అని ముసాయిదా సవరణల్లో పేర్కొన్నారు. కొన్ని ముఖ్యాంశా>లు..అమర్యాద, దైవదూషణ కలిగించే, అభ్యంతరకర సమాచారాన్ని అప్లోడ్, హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని సోషల్ మీడియా సంస్థలు వినియోగదారులకు సూచించాల్సి ఉంటుంది. చట్ట వ్యతిరేక, స్వీకర్తలను తప్పుదోవ పట్టించే, జాతి భద్రతకు ముప్పుగా మారే ఎలాంటి సమాచారాన్నైనా హోస్టింగ్, షేరింగ్ చేయొద్దని అప్రమత్తం చేయాలి. కోర్టు ఆదేశించిన 24 గంటల్లోపు సాధ్యమైనంత త్వరగా అలాంటి సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలు తొలగించాలి. సైబర్ భద్రత, దేశ భద్రత రీత్యా దర్యాప్తు సంస్థలు కోరితే అలాంటి సమాచారాన్ని 72 గంటల్లోగా అందించాలి. ఈ కేసుల దర్యాప్తులో ప్రభుత్వ సంస్థలకు సహకరించేందుకు అవసరమైతే ఇంటర్నెట్ కంపెనీలు సంబంధిత రికార్డుల్ని 180 రోజులు లేదా అంత కన్నా ఎక్కువ కాలం భద్రపరచాలి. నియంత్రణ మా ఉద్దేశం కాదు.. సామాజిక మాధ్యమాల సమాచారాన్ని నియంత్రించే ఉద్దేశం తమకు లేదని, కానీ ఈ సంస్థలు తమ ప్లాట్‌ఫాంలు ఉగ్రవాదం, హింస, నేరానికి దోహదపడకుండా ఉండాలని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇటీవల సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను వినియోగించుకుని కొత్త సవాళ్లు విసిరిన సంగతిని ప్రస్తావించింది. టెక్ కంపెనీలు గూగుల్, ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టర్లతో ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు గత వారం సమావేశమై ప్రతిపాదిత సవరణలపై చర్చలు జరిపారు. సామాజిక మాధ్యమాలు వేదికగా బూటకపు వార్తలు విస్తరించడం ఇటీవల పెద్ద సమస్యగా మారడం తెల్సిందే. వాట్సప్‌లో వ్యాపించిన పుకార్ల వల్ల దేశవ్యాప్తంగా మూకహింస చెలరేగింది. దీంతో సోషల్ మీడియా సంస్థల్ని చట్ట పరిధిలో జవాబుదారీని చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
నేడు ట్విటర్లో జైట్లీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ .. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విటర్లో నెటిజన్ల సందేహాలు తీర్చనున్నారు. నెటిజన్లు తమ సందేహాలను నేరుగా తనకే పంపవచ్చని ఆయన ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ట్విటర్లో ‘మైక్వశ్చన్టుఎఫ్ఎం’ హాష్‌ట్యాగ్‌తో సందేహాలు పంపవచ్చు. -
ఇండియాలో ఫేస్‌బుక్‌దే హవా!
న్యూఢిల్లీ: భారత్‌లో సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ దూసుకుపోతున్నది. 51శాతం యూజర్లతో దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైట్‌గా నిలిచింది. అదేవిధంగా ఇన్స్టంట్ మెసెజింగ్ యాప్స్ విషయంలో వాట్సాప్ 56శాతం యూజర్లతో ముందంజలో ఉంది. "కనెక్టెడ్ లైఫ్' పేరిట అంతర్జాతీయ రీసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ టీఎన్ఎస్ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 దేశాలకు చెందిన 60,500 మంది ఇంటర్నెట్ యూజర్ల డిజిటల్ మనస్తత్వం, ప్రవర్తనలపై టీఎన్ఎస్ అధ్యయనం జరిపి ఓ నివేదిక వెల్లడించింది. భారత్‌లో సోషల్ మార్కెటింగ్ వ్యాపారమంతా ఫేస్బుక్ కేంద్రంగా సాగుతున్నదని, దీంతో ఫేస్‌బుక్‌లోనూ వ్యక్తిగత సందేశాలు భారీగా ఉంటున్నాయని, అయితే ఇన్స్టంట్ మెసెజింగ్ విషయంలో మాత్రం వాట్సాపే ముందుంజలో ఉందని టీఎన్ఎస్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరిజత్ చక్రవర్తి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మూడోవంతుమంది (30%) యూజర్లతో ఫేస్బుక్ ప్రజాదరణలో మొదటిస్థానంలో ఉంది. అయితే ప్రతిరోజు ఫేస్బుక్లో లాగిన్ అయ్యేవారి సంఖ్య ఆసియా పసిఫిక్‌లో భారీగా ఉంది. ఫేస్బుక్ వినియోగం విషయంలో భారత్‌లో 51శాతం ఉండగా, ఆసియా పసిఫిక్ దేశాలైన థాయ్‌లాండ్ (78%), తైవాన్ (72%), హాంకాంగ్ (72%)లో ఇంకా అత్యధికశాతం ఉండటం గమనార్హం. -
ఐస్ కాదు.. రైస్ బకెట్
ఎఎల్ఎస్ (అమియోట్రోపిక్ లేటరల్ స్ల్కెరాసిన్) వ్యాధి గురించి ఎంతమందికి తెలుసోకాని ఇప్పుడు ప్రతిఒక్కరూ ఐస్ బకెట్లతో ఒళ్లంతా తెగతడుపుకుంటున్నారు. హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు... సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు.. బకెట్లతో క్యూ కడుతూ సోషల్ నెట్వర్క్ సైట్లను ‘తడి’పేస్తున్నారు. అసలే మంచినీటికి మహా కరువున్న మనదేశంలో ఇదంతా అవసరమా..? కూటికి గతిలేని కోట్లాది పేదలున్న భారత్‌లో ఐస్బకెట్ల గోలెందుకు ...? అనుకునేవారు ఉన్నారు. అయితే ఇదే ఐస్‌బకెట్ చాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఓ మహిళ దేశీ స్టైల్లో ‘రైస్‌బకెట్ చాలెంజ్’ అనే వినూత్న దాతృత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా మారిమోగిపోతున్న ఐస్ బకెట్ చాలెంజ్కే సవాలు విసిరింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు హైదరాబాద్‌కు చెందిన మంజులతా కళానిధి.. తన చుట్టుపక్కలున్న పేదవారి ఆకలి తీర్చేందుకు ఆమె ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఒక బకెట్ రైస్‌ను ఒక పేదవాడికి ఉచితంగా ఇచ్చి ఆ ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేసి‘మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి, రైస్ బకెట్ వీలుకాకుంటే కనీసం రూ.100 ల విలువైన ముందులను రోగులకు ఇవ్వండి’అని విజ్ఞప్తి చేసింది. ఫేస్బుక్లో అప్లోడ్ అయిన గంటల్లోపే ఆమె ఫ్రెండ్స్ నుంచి ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. వేలల్లో లైక్స్ వచ్చాయి. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలమంది రైస్ బకెట్ చాలెంజ్‌ను మొదలుపెట్టారు. ఇంకొంతమంది ఏకంగా రైస్ బకెట్ చాలెంజ్ మీద ఫేస్బుక్ పేజీనే ఏర్పాటు చేశారు. ప్రపంచం ఐస్‌బకెట్ చాలెంజ్‌తో మునుగుతుంటే రైస్బకెట్తో ఓ తెలుగు మహిళ సవాలు విసిరడం నిజంగా అభినందనీయం. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీరు పట్టండి ఒక రైస్ బకెట్‌ను..! -
ఫేస్బుక్లో ‘సెటైర్’ ట్యాగ్
న్యూయార్క్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో ఇకపై ‘ద ఆనియన్’ వెబ్‌సైట్‌కు చెందిన వ్యంగ్య వార్తలు, వ్యాసాలకు కొత్తగా ‘సెటైర్’ ట్యాగ్ జతకానుంది. స్నేహితులు పోస్టు చేసిన ఆనియన్ ఆర్టికల్ లింకుపై క్లిక్ చేసినా లేదా ఆనియన్ ఆర్టికల్‌ను స్వయంగా పోస్టు చేసినా.. ఫేస్బుక్ పేజీలో ఇకపై ఆ ఆర్టికల్ శీర్షికకు ముందు బ్రాకెట్లో సెటైర్ అనే పదం ఆటోమేటిక్‌గా చేరిపోతుంది. ఆనియన్ వ్యంగ్య వార్తలు, వ్యాసాలకు ప్రత్యేక ట్యాగింగ్‌ను జోడించాలంటూ ఫేస్బుక్ యూజర్ల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చినందున, వారికి మరింత సరదాను అందించేందుకు ఫేస్బుక్ ఈ ట్యాగ్‌ను ప్రవేశపెట్టినట్లు ‘ఆర్స్ టెక్నికా’ వెబ్సైట్ పేర్కొంది. -
రూ. 2 లక్షల కోట్లకు చేరువలో ఫేస్బుక్ జకర్బర్గ్ సంపద
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించడం ఆ కంపెనీ సీఈవో మార్క్ జకర్బర్గ్కి మరింతగా లాభించింది. కంపెనీ షేర్లు గురువారం కొత్త గరిష్టస్థాయికి ఎగియడంతో జకర్బర్గ్ సంపద విలువ కూడా మరో 160 కోట్ల డాలర్లు పెరిగి 3,330 కోట్ల డాలర్లకు(రూ.1,98,000 కోట్లు) చేరింది. దీంతో సంపదలో గూగుల్ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్, ల్యారీ పేజ్.. అమెజాన్‌డాట్‌కామ్ సీఈవో జెఫ్ బెజోస్‌ని కూడా జకర్బర్గ్ అధిగమించినట్లయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో ఆయన 16వ స్థానంలో నిల్చారు. జకర్బర్గ్ వయసు 30 ఏళ్లే. గూగుల్ వ్యవస్థాపకులు వరుసగా 17,18 స్థానాల్లో ఉండగా.. బెజోస్ 20వ ర్యాంకులో ఉన్నారు. 8,470 కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా అగ్రస్థానంలో ఉన్నారు. -
ఫొటోలు, వీడియోల షేరింగ్‌కి ఫేస్బుక్ కొత్త యాప్
న్యూయార్క్: సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తాజాగా స్లింగ్షాట్ పేరిట కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇతరులు పంపిన కంటెంట్‌ను చూడాలంటే స్లింగ్షాట్ యూజర్లు తాము కూడా ఏదైనా కంటెంట్‌ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది యూజర్లు మరింత సృజనాత్మకంగా ఆలోచించేందుకు, మరిన్ని ఫొటోలూ, వీడియోలు అప్లోడ్ చేసేందుకు తోడ్పడుతుందని సంస్థ ప్రోడక్ట్ డిజైనర్ జోయి ఫ్లిన్ తెలిపారు. అవతలివారు చూసిన తర్వాత సదరు కంటెంట్ సిస్టమ్ నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. ప్రత్యేక ఆప్షన్ని ఎంచుకుంటే తర్వాత కూడా చూసుకునే వీలుంటుంది -
విత్వానికి ఇదొక బుక్
అక్షరాల కూర్పులోని అందమైన భావన అంటే అది అమ్మను ఆకట్టుకోవడానికి చిన్నారి చేసే కేరింత లాంటిది... అలా అందమైన భావననిచ్చే అక్షరాల పొందికే కవిత. అలాంటి భావవ్యక్తీకరణకు అవకాశాన్ని ఇచ్చే సందర్భాలు ప్రతి జీవితంలో ఉండేవే. మరి అత్యంత సహజమైన ఈ ప్రక్రియకు నేడు సోషల్నెట్వర్కింగ్ సైట్లు ఎంతో సాయంగా నిలుస్తున్నాయి. యువతకు అత్యంత ఇష్టమైనవిగా మారిన ఫేస్బుక్, బ్లాగుల్లో కవిత్వం రయ్‌మంటూ దూసుకెళ్తోంది. సెల్ఫ్ బ్రాడ్ కాస్టింగ్ మీడియా అనద గ్గ సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో సృజనాత్మకతను సులభంగా చాటుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, అస్తిత్వవాద కవిత్వం... ఏదైనా సరే, మదిలో మెదిలే ఆలోచనలను మనసు మాటలుగా మార్చేస్తున్నారు అనేక మంది. అనేక పేజ్లున్నాయి... తరచి చూడాలి కానీ ఫేస్బుక్లో తెలుగు కవితల కూర్పుగా ఉండే పేజ్‌లు ఎన్నో కనిపిస్తాయి. ప్రతి దాంట్లోనూ అనేక మంది సృజించిన కవిత్వం కనిపిస్తుంది. ‘తెలుగు కవితలు’ అనే పేరుతో ఉన్న పేజ్లే లెక్కకు మించి ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒక్కోపేజ్కూ కనీసం ఏడెనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు కనిపిస్తూ ఉంటారు. అలాంటి పేజ్‌లలో పబ్లిష్ చేసే కవిత్వానికి వచ్చే లైకులూ, షేర్లే వాటి ఆదరణకు రుజువులు. కాదేదీ కవిత్వానికనర్హం..! అక్షరాల విత్తులు నాటి, ఊహలతో వ్యవసాయం చేసి, పదముల పూవుల పూయించి... కట్టేదే కవితల మాల. ఈ విషయంలో చెలి అధరాల తడిముద్రల నుంచి భువిని ముద్దాడే వానచినుకుల వరకూ కాదేదీ కవిత్వానికి అనర్హమైనది అంటోంది నయా జనరేషన్. అలాగే తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ నుంచి తెలుగు భాషను సుసంపన్నం చేసిన ప్రముఖ కవులపై అభిమానాన్ని ప్రకటించుకోవడానికి కూడా ఫేస్బుక్ మంచి మాధ్యమంగా ఉపయోగపడుతోంది. -
మనిషి మరణించినా.. ఫేస్బుక్లో సజీవంగా
న్యూయార్క్: మనిషి మరణాంతరం కూడా అతని జ్ఞాపకాలను సజీవంగా చూసుకోవచ్చు. సోషియల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎవరైనా బతికున్నప్పుడు ఫేస్బుక్లో ఉన్న వారి ప్రొఫైల్‌ను మరణించాక కూడా అదే సెట్టింగ్స్‌తో ఉంచాలని నిర్ణయించారు. ఇంతకుముందు ఫేస్బుక్ ఖాతాదారుల మరణాంతరం వారి స్నేహితులకు (ఫేస్బుక్) మాత్రమే ఈ అవకాశం ఉండేది. ఇకనుంచి ఎవరైనా కూడా చనిపోయిన వారి ప్రొఫైల్స్‌ను చూసే అవకాశం కల్పించినట్టు ఫేస్బుక్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కోరిక మేరకు ఈ మార్పులు చేసినట్టు వివరించారు. కుటుంబ సభ్యులు తమ వారి వీడియోలను కూడా ఇందులో పొందుపరచుకోవచ్చు. -
వివరం: ట్విటర్లో ఫాలోవార్
స్క్రీన్ మీద అలరించే సినీ తారలు సరదా కబుర్లు చెబుతున్నారు... ఆటతో స్టేడియంలో అలరించే క్రికెటర్లు కామెంట్లతో హల్చల్ చేస్తున్నారు... సంగీతకారులు సంభాషణలు పూరిస్తున్నారు... ఆధ్యాత్మికతను పంచే మతప్రవక్తలూ ఈ వేదికనే ఎంచుకున్నారు... వార్తలు చదివే జర్నలిస్టులు, వాగ్ధాటి గల రాజకీయవేత్తలు, నవలలు రాసే రచయితలు, దౌత్యవేత్తలు, దర్శకులు... ఆయా రంగాల్లో కాస్తంత పేరు కలిగిన వారెందరో ట్విటర్లో ఖాతాలు తెరిచి, ఎన్నో కబుర్లు చెబుతున్నారు! మరి వీరిలో బాగా అలరిస్తున్నదెవరు? అత్యధిక ఆదరణ కలిగినదెవరు? ఎవరు ఎక్కువమంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు? వారి మధ్య పోటీ ఎలా ఉంది? ట్విటర్లో సెలబ్రిటీల మధ్య నెలకొన్న ఫాలో‘వార్’ కథాకమామిషు... ప్రపంచ వ్యాప్తంగా రోజుకు పదిలక్షల మంది ట్విటర్లో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. పాపులేషన్ క్లాక్ కన్నా వేగంగా దూసుకెళ్తున్న ఈ నంబరింగ్ ప్రస్తుతానికి వెయ్యి మిలియన్ల అకౌంట్లను సూచిస్తోంది. వీటి నుంచి రోజుకు 275 మిలియన్ల ట్వీట్స్ వస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా ట్విటర్.కామ్‌కు యాడ్‌రెవిన్యూ రూపంలో ఏడాదికి 259 మిలియన్ డాలర్లు సమకూరుతోంది. ఇది గణాంకాల విషయంలో ట్విటర్ బాహ్య స్వరూపం. మరి ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ అంతర్గత స్వరూపంలో విషయానికి వస్తే...ట్విటర్లో ఖాతా ప్రారంభించిన ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గ లెక్కలో ఫాలోవర్లను సంపాదించుకుని, తమకెంత క్రేజ్ ఉందో చాటుకుంటున్నారు. అక్కడ పాప్స్టార్స్దే పై చేయి... అంతర్జాతీయ స్థాయిలో, మొత్తంగా ట్విటర్.కామ్‌లో ఉన్న అకౌంట్లన్నింటిలోనూ అత్యధిక స్థాయి ఫాలోవర్లను కలిగి ఉన్న సెలబ్రిటీ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్‌కు ఏకంగా 4,85,51,731మంది ఫాలోవర్లున్నారు! ఆ తర్వాతి స్థానంలో పాప్‌సింగర్ లేడీగాగా ఉన్నారు. ఆమెకు 4,10,49,667 మంది ఫాలోవర్లున్నారు! మూడోస్థానంలో కేటీ పెర్రీ 4,09,80,666, నాలుగుస్థానంలో షకీరా 2,39,65,582 మంది ఫాలోవర్లతో రేసులో ఉన్నారు. ఫాలోవర్లను సంపాదించుకోవడం ఎలా? అప్పుడప్పుడు నాలుగైదు మాటలు మొహాన పడేసే వారి కన్నా ఎప్పుడూ తమకు కబుర్లు చెబుతూ... తమ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సెలబ్రిటీలకే ట్విటర్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మన సెలబ్రిటీలే నిరూపిస్తున్నారు. ఉదాహరణకు... ఆఫ్‌లైన్‌లో ప్రియాంక చోప్రా కన్నా సచిన్‌కే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! అయితే ట్విటర్లో సచిన్ కన్నా ప్రియాంక చోప్రాకు ఎక్కువ ఆదరణ ఉందంటే ఇందుకు కారణం ఆమె చెప్పే క్యూట్ క్యూట్ కబుర్లే! అమావాస్యకూ పున్నమికి ట్విటర్ పేజ్‌లో ప్రత్యక్షమయ్యే సచిన్ కన్నా... ఉదయం కొశ్చన్‌కు సాయంత్రం రిప్లయ్ ఇచ్చే ప్రియాంక అంటేనే ట్విటర్ ప్రజలు పడి చస్తున్నారు! ట్విటర్లో కమల వికాసం! అత్యధిక స్థాయి ట్విటర్ ఫాలోవర్లను కలిగి ఉన్న రాజకీయవేత్త గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి. బీజేపీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన మోడీ ట్విటర్లో తన విధానాలను ప్రకటిస్తుంటారు. గుజరాత్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటుంటారు. 31,47,153 మంది ఫాలోవర్లున్నారాయనకు. మోడీ సంగతి ఇలా ఉంటే... ఎంపీ హోదాల్లో ట్విటర్ ఖాతాను నడిపేవారిలో కొంతమందికి ఆస్థాయి ఆదరణే ఉంది. ఈ జాబితాలో విజయ్‌మాల్యా 24,20,592తో తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానం కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్‌ది. ఆయనకు 20,20,762 మంది ఫాలోవర్లున్నారు. అయితే వీరిద్దరూ కేవలం రాజకీయనాయకులు మాత్రమే కాదు. వ్యాపారవేత్తగా మాల్యాకు, ఐరాసాలో పనిచేసిన వ్యక్తిగా శశికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. దీంతో వీరికి ఫాలోవర్ల సంఖ్య సినీ, క్రికెట్ సెలబ్రిటీల స్థాయికి సమానం ఉంది. వీరిద్దరిని మినహాయిస్తే ఇక బీజేపీకే చెందిన సుష్మా స్వరాజ్‌కు 4,52,648 మంది ఫాలోవర్లున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల వ్యవహారాలను తప్పుపడుతూ మాత్రమే ట్వీట్లను ఇచ్చే జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామికి 1,67,395 మంది ఫాలోవర్లున్నారు. స్పందించే హృదయాలు... కొంతమంది ప్రముఖుల ట్విటర్ అకౌంట్లకు మంచి పాలోయింగ్ ఉంది. ట్విటర్ అకౌంట్లను కలిగి ఉన్న ఇతర తారలను తలదన్నే రీతిలో వారు ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అందుకు కారణం వారు స్పందించే తీరు. సామాజిక రాజకీయ అంశాల గురించి చేతన్ భగత్, అనపమ్ ఖేర్, ఆనంద్ మహీంద్రా, ప్రీతిశ్ నంది వంటి భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఎప్పటికప్పుడు సునిశిత విమర్శలను పోస్టు చేస్తుంటారు. వీరిలో చేతన్భగత్కు 15,22,946, అనుపమ్‌ఖేర్‌కు 14,06,163, ఆనంద్ మహీంద్రాకు 7,82,593, ప్రీతిశ్ నందికి 3,80,176 మంది పాలోవర్లున్నారు. వివాదాలను ట్వీటేస్తున్నారు! ఇండియన్ సెలబ్రిటీస్‌లో ఈ విషయం గురించి ముందుగా ప్రస్తావించుకోవాల్సింది దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేసి ఓపెనప్ అయిపోయే వర్మ సినీ, రాజకీయ, మహిళా విషయాలలో వివాదాస్పద ట్వీట్లను ఎన్నో ఇచ్చాడు. అవన్నీ పత్రికలకు వార్తలు అవుతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత ఇచ్చిన రెండు మూడూ ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. ‘వన్’ సినిమా వాల్ పోస్టర్‌కు సంబంధించి, పవన్‌కల్యాన్ మూడో పెళ్లికి సంబంధించి ట్వీట్లతో తనకు ఏ మాత్రం ఉపయోగంలేని వ్యవహారాల్లో వేలు పెట్టిందని అనిపించుకొంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ‘గే, లెస్బియన్’ ల గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించి అమితాబ్ కూడా అభాసుపాలయ్యాడు. తీర్పు పట్ల విషాదాన్ని వ్యక్తపరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వయసులో బిగ్ బి ఇలాంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడాలి? అనే కామెంట్లు కూడా వినిపించాయప్పుడు. కొంతమందిది అడిక్షన్..! చేతిలో ఒక స్మార్ట్గాడ్జెట్ను ఉంచుకొని నిత్యం అప్డేట్స్ ఇవ్వడం మన సెలబ్రిటీలకు బాగా అలవాటుగా మారింది. టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌ను వేసినట్టుగా కొంతమంది సెలబ్రిటీలు అనునిత్యం ట్వీట్లను ఇస్తూనే ఉంటారు. షూటింగ్ స్పాట్స్‌లో ఖాళీ సమయం దొరికితే చాలు వీరు ట్వీట్లు ఇచ్చేస్తుంటారు. ఇక వారు ఏ విమానాశ్రయంలో ఫ్లైట్ కోసమో ఎదురుచూస్తున్నప్పుడు, దేశంలో ఏదైనా ప్రముఖ సంఘటన చోటు చేసుకొన్నప్పుడు ట్వీట్ల వర్షాన్నే కురిపించేస్తుంటారు. వాటికి వచ్చే రీట్వీట్లను ఆస్వాదించడానికే సెలబ్రిటీలు అంతగా ట్వీట్లను ఇస్తున్నారని అనుకోవాల్సి ఉంది. అయితే ఇది కూడా ఒకరకమైన అడిక్షన్ అని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. తాము ఏం పలికినా కొన్ని లక్షల మందికి చేరిపోతోందనే ఉద్వేగం వారి చేత అలా ట్వీట్లను ఇచ్చేలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. దీని ప్రకారం చాలా మంది సెలబ్రిటీలను ట్విటర్ అడిక్ట్స్ అనుకోవాల్సి వస్తోంది! - జీవన్ రెడ్డి.బి నేషనల్ లెవల్లో బిగ్ బీ... ది బాస్ భారతీయ సెలబ్రిటీల్లో అత్యధిక సంఖ్యలో ట్విటర్ ఫాలోవర్లను కలిగి ఉన్న వ్యక్తి బిగ్‌బి అమితాబ్ బచ్చన్. 77,00,796 మంది ఫాలోవర్లతో సెలబ్రిటీల్లో తొలిస్థానంలో ఉన్నారు. ఎక్కువగా హిందీలో, తక్కువగా ఇంగ్లిష్‌లో ట్వీట్లనిచ్చే అమితాబ్ తండ్రి హరివంశ్రాయ్ బచ్చన్ కవిత్వాన్ని పోస్టు చేస్తారు. షారూఖ్ ఖాన్‌కు 63,87,127 మంది బాలీవుడ్లో అమితాబ్ తర్వాత అంతటి స్థాయి అభిమానగణాన్ని సంపాదించి, బాలీవుడ్ బాద్ షా గా గుర్తింపు ఉన్న షారూఖ్ ట్విటర్ ఫాలోవర్లవ విషయంలో కూడా అమితాబ్ తర్వాతి స్థానంలోనే ఉన్నారు! సల్మాన్ ఖాన్- 59,27,751 ట్విటర్లో షారూఖ్ స్థానాన్ని అందుకుని అమితాబ్ తర్వాతి స్థానం సంపాదిచుకోవడానికి పుష్కలంగా అవకాశం కలిగిన వ్యక్తి సల్మాన్. తన సినిమాలు వచ్చినప్పుడు, ‘బీయింగ్ హ్యూమన్’కార్యక్రమాలకు సంబంధించిన ట్వీట్లు మాత్రమే వెలువడుతూ ఉంటాయి. ఆమిర్ ఖాన్- 55,47,847 సంవత్సరాల తరబడి ఆమిర్ ట్విటర్ పేజ్‌లోకి లాగిన్ అవ్వకుండా గడిపేస్తున్నా పాలోవర్ల సంఖ్యమాత్రం నిత్యం పెరుగుతూనే ఉంది! ఆమిర్ కూడా కేవలం తన సినిమాల గురించి మాత్రమే స్పందిస్తూ ఉంటారు. ప్రియాంకా చోప్రా- 53,45,184 ఒకప్పుడు భారతీయ సెలబ్రిటీలందరిలోనూ ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రియాంక తొలిస్థానంలో ఉండేది! ఇప్పటికైతే కాస్తంత వెనుకబడింది. అయితే ఈ స్థాయిలో ఫాలోవర్లను కలిగి ఉన్న ఏకైక భారతీయ మహిళ ప్రియాంక! దీపిక పదుకొనే: 50,59.997 తన స్నేహితుల గురించి, సినిమాల గురించి, క్రికెట్ గురించి ట్వీట్లను ఇచ్చే దీపిక ఫాలోవర్ల సంఖ్య విషయంలో ఫాలోవర్లు ఫిదా అయిపోతున్నారు. ఫాలో కావడానికి పోటీ పడుతున్నారు. హృతిక్ రోషన్: 48,79,760 తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా హృతిక్ ట్విటర్లో పోస్టు చేస్తుంటాడు. అభిమానులకు బోలెడన్ని విశేషాలు చెబుతుంటాడు. అక్షయ్ కుమార్: 41,39,278 హృతిక్ తర్వాతిస్థానంలో అక్కీ ఉండగా...వీరి మధ్య ఫాలోవర్ల సంఖ్య విషయంలో వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని గమనించవచ్చు. ఇప్పటి వరకూ అక్షయ్ 1,677 ట్వీట్లను ఇచ్చారు. సచిన్ టెండూల్కర్: 40,18,271 ఒకప్పుడు ఫాలోవర్ల సంఖ్య విషయంలో తొలిస్థానం కోసం పోరాడిన టెండూల్కర్ ఆఖరిసారి ట్వీట్స్ ఇచ్చింది 2013 ఫిబ్రవరిలో! అందుకే ఫాలోవర్ల సంఖ్య విషయంలో మాస్టర్ వెనుకబడి పోయారు. ప్రీతి జింతా:26,26,722 సినిమాల విషయాలను, షూటింగుల కోసం విదేశీ టూర్లను విశదీకరిస్తుంటుంది ప్రీతి. క్రికెట్ఫ్యాన్ను అంటూ క్రికెట్ కబుర్లు చెబుతూ ఉంటుంది. తద్వారా టాప్‌టెన్‌లో స్థానం సంపాదించింది. మనోళ్లు ఎక్కడ? ఇండియాకు సంబంధించి ట్విటర్ గురించి మాట్లాడుకోవడం అంటే అది బాలీవుడ్ సబ్జెక్ట్ అయిపోతోంది! ఇది సోషల్నెట్వర్కింగ్ సైటే అయినా.. బాలీవుడ్ నెట్‌వర్క్‌ను మాత్రమే కవర్ చేస్తోంది. అందుకు కారణం దక్షిణాది సినిమా సెలబ్రిటీలు ట్విటర్ గురించి అంతగా పట్టించుకోకపోవడమే! బాలీవుడ్ స్టార్ హీరోలందరికీ ట్విటర్ ఖాతాలు ఉంటే... మనవాళ్లలో వీరిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు! తెలుగు హీరోల్లో... మహేశ్ ఫాలోవర్ల సంఖ్య 7,05,178. తన సినిమాల విడుదల సమయాల్లో మాత్రమే మహేశ్ ట్వీట్స్ ఇస్తాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీ విషయాలు పంచుకొంటాడు. హీరోయిన్లలో శ్రుతి హాసన్! కొన్ని హిందీ సినిమాలు కూడా చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొన్న శ్రుతి కి 8,62,157 మంది ఫాలోవర్లున్నారు. సెకెండ్ ప్లేస్ త్రిషది! త్రిష చెప్పే కబుర్లకు మంచి క్రేజ్ ఉంది. 7,41,908 మంది ఫాలోవర్లతో దక్షిణాది సెలబ్రిటీల్లో రెండో ప్లేస్‌లో ఉంది ఈ భామ. దర్శకుల్లో రాజమౌళి... ఈగ సినిమాతో జాతీయస్థాయిలోగుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళికి 5,40,459 ల మంది ఫాలోవర్లున్నారు. నాగ్ పోటీ ఇస్తున్నాడు.. యువహీరోలతో ధీటుగా పోరాడుతున్నాడు అక్కినేని నాగార్జున. తన సినిమాల విశేషాల గురించి మాట్లాడే అక్కినేని నాగార్జునకు 4,86,910 మంది ఫాలోవర్లున్నారు. సమంత దూసుకొస్తోంది.. కొన్ని వివాదాస్పద ట్వీట్లను ఇచ్చిన సమంతకు ట్విటర్లో ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం తనకు 4,11,504 మంది ఫాలోవర్లున్నారు. దక్షిణాది స్టార్లు... తమిళ యువ హీరో ధనుష్‌కు 6,41,852 మంది పాలోవర్లున్నారు. మలయాళీ సీనియర్ హీరో మమ్మూట్టీ కి 2,53,018 మంది ఫాలోవర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరసగా హీరో రామ్ పోతినేనికి 2,23,804, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు 1,29,409 మంది ఫాలోవర్లున్నారు. నంబర్ వన్ కోసం పోరు...! ఇండియన్ సెలబ్రిటీల విషయంలో పాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడైతే నంబర్ వన్స్థానంలో అమితాబ్ బచ్చన్ ఇతర సెలబ్రిటీలెవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు కానీ...కొంత కాలం కిందటి వరకూ భారతీయ సెలబ్రిటీల మధ్య తొలిస్థానం కోసం తీవ్రమైన పోరు నడించింది. అమితాబ్, షారూఖ్, ప్రియాంకా చోప్రా, సల్మాన్ల మధ్య ఈ పోరాటం కొనసాగింది. ఒక దశలో ప్రియాంక నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. వీరి ఫాలోవర్ల సంఖ్య స్థాయి 15- 20 లక్షల వధ్య కొనసాగుతున్న సమయంలో అమితాబ్, సచిన్, షారూక్‌లను దాటేసి ప్రియాంక తొలిస్థానంలో చాలా రోజుల పాటు కొనసాగింది.