వివరం: ట్విటర్లో ఫాలోవార్ | Most Followers war of Celebrities in Twitter | Sakshi
Sakshi News home page

వివరం: ట్విటర్లో ఫాలోవార్

Published Sun, Jan 19 2014 2:13 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

వివరం: ట్విటర్లో ఫాలోవార్ - Sakshi

వివరం: ట్విటర్లో ఫాలోవార్

 స్క్రీన్ మీద అలరించే సినీ తారలు సరదా కబుర్లు చెబుతున్నారు...  ఆటతో స్టేడియంలో అలరించే క్రికెటర్లు కామెంట్లతో హల్‌చల్ చేస్తున్నారు...  సంగీతకారులు సంభాషణలు పూరిస్తున్నారు... ఆధ్యాత్మికతను పంచే మతప్రవక్తలూ ఈ వేదికనే ఎంచుకున్నారు...  వార్తలు చదివే జర్నలిస్టులు, వాగ్ధాటి గల రాజకీయవేత్తలు, నవలలు రాసే రచయితలు, దౌత్యవేత్తలు, దర్శకులు... ఆయా రంగాల్లో కాస్తంత పేరు కలిగిన వారెందరో ట్విటర్‌లో ఖాతాలు తెరిచి, ఎన్నో కబుర్లు చెబుతున్నారు! మరి వీరిలో బాగా అలరిస్తున్నదెవరు? అత్యధిక ఆదరణ కలిగినదెవరు? ఎవరు ఎక్కువమంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు? వారి మధ్య పోటీ ఎలా ఉంది? ట్విటర్‌లో సెలబ్రిటీల మధ్య నెలకొన్న ఫాలో‘వార్’ కథాకమామిషు...
 
 ప్రపంచ వ్యాప్తంగా రోజుకు పదిలక్షల మంది ట్విటర్‌లో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. పాపులేషన్ క్లాక్ కన్నా వేగంగా దూసుకెళ్తున్న ఈ నంబరింగ్ ప్రస్తుతానికి వెయ్యి మిలియన్ల అకౌంట్లను సూచిస్తోంది. వీటి నుంచి రోజుకు 275 మిలియన్ల ట్వీట్స్ వస్తున్నాయి. వీటన్నింటి ఫలితంగా ట్విటర్.కామ్‌కు యాడ్‌రెవిన్యూ రూపంలో ఏడాదికి 259 మిలియన్ డాలర్లు సమకూరుతోంది. ఇది గణాంకాల విషయంలో ట్విటర్ బాహ్య స్వరూపం. మరి ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ అంతర్గత స్వరూపంలో విషయానికి వస్తే...ట్విటర్‌లో ఖాతా ప్రారంభించిన ప్రతి ఒక్కరూ తమ స్థాయికి తగ్గ లెక్కలో ఫాలోవర్లను సంపాదించుకుని, తమకెంత క్రేజ్ ఉందో చాటుకుంటున్నారు.
 
 అక్కడ పాప్‌స్టార్స్‌దే పై చేయి...
 అంతర్జాతీయ స్థాయిలో, మొత్తంగా ట్విటర్.కామ్‌లో ఉన్న అకౌంట్లన్నింటిలోనూ అత్యధిక స్థాయి ఫాలోవర్లను కలిగి ఉన్న సెలబ్రిటీ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్‌కు ఏకంగా 4,85,51,731మంది ఫాలోవర్లున్నారు! ఆ తర్వాతి స్థానంలో పాప్‌సింగర్ లేడీగాగా ఉన్నారు. ఆమెకు 4,10,49,667  మంది ఫాలోవర్లున్నారు! మూడోస్థానంలో కేటీ పెర్రీ 4,09,80,666, నాలుగుస్థానంలో షకీరా 2,39,65,582 మంది ఫాలోవర్లతో రేసులో ఉన్నారు.
 
 ఫాలోవర్లను సంపాదించుకోవడం ఎలా?
 అప్పుడప్పుడు నాలుగైదు మాటలు మొహాన పడేసే వారి కన్నా ఎప్పుడూ తమకు కబుర్లు చెబుతూ... తమ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సెలబ్రిటీలకే ట్విటర్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని మన సెలబ్రిటీలే నిరూపిస్తున్నారు.  ఉదాహరణకు... ఆఫ్‌లైన్‌లో ప్రియాంక చోప్రా కన్నా  సచిన్‌కే ఎక్కువ ఫ్యాన్  ఫాలోయింగ్ ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! అయితే ట్విటర్‌లో  సచిన్ కన్నా ప్రియాంక చోప్రాకు ఎక్కువ ఆదరణ  ఉందంటే ఇందుకు కారణం ఆమె చెప్పే క్యూట్ క్యూట్ కబుర్లే! అమావాస్యకూ పున్నమికి ట్విటర్ పేజ్‌లో ప్రత్యక్షమయ్యే సచిన్ కన్నా... ఉదయం కొశ్చన్‌కు సాయంత్రం రిప్లయ్ ఇచ్చే ప్రియాంక అంటేనే ట్విటర్ ప్రజలు పడి చస్తున్నారు!  
 
 ట్విటర్‌లో కమల వికాసం!
  అత్యధిక స్థాయి ట్విటర్ ఫాలోవర్లను కలిగి ఉన్న రాజకీయవేత్త గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి. బీజేపీ తరఫున ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన మోడీ ట్విటర్‌లో తన విధానాలను ప్రకటిస్తుంటారు. గుజరాత్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పుకుంటుంటారు. 31,47,153 మంది ఫాలోవర్లున్నారాయనకు. మోడీ సంగతి ఇలా ఉంటే... ఎంపీ హోదాల్లో ట్విటర్ ఖాతాను నడిపేవారిలో కొంతమందికి ఆస్థాయి ఆదరణే ఉంది. ఈ జాబితాలో విజయ్‌మాల్యా 24,20,592తో తొలిస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానం   కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్‌ది.
 
 ఆయనకు 20,20,762 మంది ఫాలోవర్లున్నారు. అయితే వీరిద్దరూ కేవలం రాజకీయనాయకులు మాత్రమే కాదు. వ్యాపారవేత్తగా మాల్యాకు, ఐరాసాలో పనిచేసిన వ్యక్తిగా శశికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. దీంతో వీరికి ఫాలోవర్ల సంఖ్య సినీ, క్రికెట్ సెలబ్రిటీల స్థాయికి సమానం ఉంది. వీరిద్దరిని మినహాయిస్తే ఇక బీజేపీకే చెందిన సుష్మా స్వరాజ్‌కు 4,52,648 మంది ఫాలోవర్లున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల వ్యవహారాలను తప్పుపడుతూ మాత్రమే ట్వీట్లను ఇచ్చే జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణియన్ స్వామికి 1,67,395 మంది ఫాలోవర్లున్నారు.
 
 స్పందించే హృదయాలు...
 కొంతమంది ప్రముఖుల ట్విటర్ అకౌంట్లకు మంచి పాలోయింగ్ ఉంది. ట్విటర్ అకౌంట్‌లను కలిగి ఉన్న ఇతర తారలను తలదన్నే రీతిలో వారు ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అందుకు కారణం వారు స్పందించే తీరు. సామాజిక రాజకీయ అంశాల గురించి చేతన్ భగత్, అనపమ్ ఖేర్, ఆనంద్ మహీంద్రా, ప్రీతిశ్ నంది వంటి భిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఎప్పటికప్పుడు సునిశిత విమర్శలను పోస్టు చేస్తుంటారు. వీరిలో చేతన్‌భగత్‌కు 15,22,946, అనుపమ్‌ఖేర్‌కు 14,06,163, ఆనంద్ మహీంద్రాకు 7,82,593, ప్రీతిశ్ నందికి 3,80,176 మంది పాలోవర్లున్నారు.
 
 వివాదాలను ట్వీటేస్తున్నారు!
 ఇండియన్ సెలబ్రిటీస్‌లో ఈ విషయం గురించి ముందుగా ప్రస్తావించుకోవాల్సింది దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేసి ఓపెనప్ అయిపోయే వర్మ సినీ, రాజకీయ, మహిళా విషయాలలో వివాదాస్పద ట్వీట్లను ఎన్నో ఇచ్చాడు. అవన్నీ పత్రికలకు వార్తలు అవుతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత ఇచ్చిన రెండు మూడూ ట్వీట్లు వివాదాస్పదం అయ్యాయి. ‘వన్’ సినిమా వాల్ పోస్టర్‌కు సంబంధించి, పవన్‌కల్యాన్ మూడో పెళ్లికి సంబంధించి ట్వీట్లతో తనకు ఏ మాత్రం ఉపయోగంలేని వ్యవహారాల్లో వేలు పెట్టిందని అనిపించుకొంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ‘గే, లెస్బియన్’ ల గురించి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించి అమితాబ్ కూడా అభాసుపాలయ్యాడు. తీర్పు పట్ల విషాదాన్ని వ్యక్తపరిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వయసులో బిగ్ బి ఇలాంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడాలి? అనే కామెంట్లు కూడా వినిపించాయప్పుడు.
 
 కొంతమందిది అడిక్షన్..!
 చేతిలో ఒక స్మార్ట్‌గాడ్జెట్‌ను ఉంచుకొని నిత్యం అప్‌డేట్స్ ఇవ్వడం మన సెలబ్రిటీలకు బాగా అలవాటుగా మారింది. టీవీ చానళ్లు బ్రేకింగ్ న్యూస్‌ను వేసినట్టుగా కొంతమంది సెలబ్రిటీలు అనునిత్యం ట్వీట్లను ఇస్తూనే ఉంటారు. షూటింగ్ స్పాట్స్‌లో ఖాళీ సమయం దొరికితే చాలు వీరు ట్వీట్లు ఇచ్చేస్తుంటారు. ఇక వారు ఏ విమానాశ్రయంలో ఫ్లైట్ కోసమో ఎదురుచూస్తున్నప్పుడు, దేశంలో ఏదైనా ప్రముఖ సంఘటన చోటు చేసుకొన్నప్పుడు ట్వీట్ల వర్షాన్నే కురిపించేస్తుంటారు.
 
 వాటికి వచ్చే రీట్వీట్లను ఆస్వాదించడానికే సెలబ్రిటీలు అంతగా ట్వీట్లను ఇస్తున్నారని అనుకోవాల్సి ఉంది. అయితే ఇది కూడా ఒకరకమైన అడిక్షన్ అని సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. తాము ఏం పలికినా కొన్ని లక్షల మందికి చేరిపోతోందనే ఉద్వేగం వారి చేత అలా ట్వీట్లను ఇచ్చేలా చేస్తోందని విశ్లేషిస్తున్నారు. దీని ప్రకారం చాలా మంది సెలబ్రిటీలను ట్విటర్ అడిక్ట్స్ అనుకోవాల్సి వస్తోంది!
 - జీవన్ రెడ్డి.బి
 
 నేషనల్ లెవల్‌లో బిగ్ బీ... ది బాస్
 భారతీయ సెలబ్రిటీల్లో అత్యధిక సంఖ్యలో ట్విటర్ ఫాలోవర్లను కలిగి ఉన్న వ్యక్తి బిగ్‌బి అమితాబ్ బచ్చన్.  77,00,796 మంది ఫాలోవర్లతో సెలబ్రిటీల్లో తొలిస్థానంలో ఉన్నారు.  ఎక్కువగా హిందీలో, తక్కువగా ఇంగ్లిష్‌లో ట్వీట్లనిచ్చే అమితాబ్  తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ కవిత్వాన్ని పోస్టు చేస్తారు.
 
 షారూఖ్ ఖాన్‌కు 63,87,127 మంది
 బాలీవుడ్‌లో అమితాబ్ తర్వాత అంతటి స్థాయి అభిమానగణాన్ని సంపాదించి, బాలీవుడ్ బాద్  షా గా గుర్తింపు ఉన్న షారూఖ్ ట్విటర్ ఫాలోవర్లవ విషయంలో కూడా అమితాబ్ తర్వాతి స్థానంలోనే ఉన్నారు!
 
 సల్మాన్ ఖాన్- 59,27,751
 ట్విటర్‌లో షారూఖ్ స్థానాన్ని అందుకుని అమితాబ్ తర్వాతి స్థానం సంపాదిచుకోవడానికి   పుష్కలంగా అవకాశం కలిగిన వ్యక్తి సల్మాన్. తన సినిమాలు వచ్చినప్పుడు, ‘బీయింగ్ హ్యూమన్’కార్యక్రమాలకు సంబంధించిన ట్వీట్లు మాత్రమే వెలువడుతూ ఉంటాయి.
 
 ఆమిర్ ఖాన్- 55,47,847
 సంవత్సరాల తరబడి  ఆమిర్ ట్విటర్ పేజ్‌లోకి లాగిన్ అవ్వకుండా గడిపేస్తున్నా పాలోవర్ల సంఖ్యమాత్రం నిత్యం పెరుగుతూనే ఉంది!  ఆమిర్ కూడా కేవలం తన సినిమాల గురించి మాత్రమే స్పందిస్తూ ఉంటారు.
 
 ప్రియాంకా చోప్రా- 53,45,184
 ఒకప్పుడు భారతీయ సెలబ్రిటీలందరిలోనూ ఫాలోవర్ల సంఖ్య విషయంలో ప్రియాంక తొలిస్థానంలో ఉండేది! ఇప్పటికైతే కాస్తంత వెనుకబడింది. అయితే ఈ స్థాయిలో ఫాలోవర్లను కలిగి ఉన్న ఏకైక భారతీయ మహిళ ప్రియాంక!
 
 దీపిక పదుకొనే: 50,59.997
 తన స్నేహితుల గురించి, సినిమాల గురించి, క్రికెట్ గురించి ట్వీట్లను ఇచ్చే దీపిక ఫాలోవర్ల సంఖ్య విషయంలో ఫాలోవర్లు ఫిదా అయిపోతున్నారు. ఫాలో కావడానికి పోటీ పడుతున్నారు.
 
 హృతిక్ రోషన్: 48,79,760
 తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా హృతిక్ ట్విటర్‌లో పోస్టు చేస్తుంటాడు. అభిమానులకు బోలెడన్ని విశేషాలు చెబుతుంటాడు.
 
 అక్షయ్ కుమార్: 41,39,278
 హృతిక్ తర్వాతిస్థానంలో అక్కీ ఉండగా...వీరి మధ్య ఫాలోవర్ల సంఖ్య విషయంలో వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని గమనించవచ్చు. ఇప్పటి వరకూ అక్షయ్ 1,677 ట్వీట్లను ఇచ్చారు.
 
 సచిన్ టెండూల్కర్: 40,18,271
 ఒకప్పుడు ఫాలోవర్ల సంఖ్య విషయంలో తొలిస్థానం కోసం పోరాడిన టెండూల్కర్ ఆఖరిసారి ట్వీట్స్ ఇచ్చింది 2013 ఫిబ్రవరిలో!  అందుకే ఫాలోవర్ల సంఖ్య విషయంలో మాస్టర్ వెనుకబడి పోయారు.
 
 ప్రీతి జింతా:26,26,722
 సినిమాల విషయాలను, షూటింగుల కోసం విదేశీ టూర్లను విశదీకరిస్తుంటుంది ప్రీతి.  క్రికెట్‌ఫ్యాన్‌ను అంటూ క్రికెట్ కబుర్లు చెబుతూ ఉంటుంది.  తద్వారా టాప్‌టెన్‌లో స్థానం సంపాదించింది.
 
 మనోళ్లు ఎక్కడ?
 ఇండియాకు సంబంధించి ట్విటర్ గురించి మాట్లాడుకోవడం అంటే అది బాలీవుడ్ సబ్జెక్ట్ అయిపోతోంది! ఇది సోషల్‌నెట్‌వర్కింగ్ సైటే అయినా.. బాలీవుడ్ నెట్‌వర్క్‌ను మాత్రమే కవర్ చేస్తోంది. అందుకు కారణం దక్షిణాది సినిమా సెలబ్రిటీలు ట్విటర్ గురించి అంతగా పట్టించుకోకపోవడమే! బాలీవుడ్ స్టార్ హీరోలందరికీ ట్విటర్ ఖాతాలు ఉంటే... మనవాళ్లలో వీరిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు!
 
 తెలుగు హీరోల్లో...  మహేశ్ ఫాలోవర్ల సంఖ్య 7,05,178. తన సినిమాల విడుదల సమయాల్లో మాత్రమే మహేశ్ ట్వీట్స్ ఇస్తాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీ విషయాలు పంచుకొంటాడు.
 
 హీరోయిన్లలో శ్రుతి హాసన్!
 కొన్ని హిందీ సినిమాలు కూడా చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకొన్న శ్రుతి కి 8,62,157  మంది ఫాలోవర్లున్నారు.
 
 సెకెండ్ ప్లేస్ త్రిషది!
 త్రిష చెప్పే కబుర్లకు మంచి క్రేజ్ ఉంది. 7,41,908 మంది ఫాలోవర్లతో దక్షిణాది సెలబ్రిటీల్లో రెండో ప్లేస్‌లో ఉంది ఈ భామ.
 
 దర్శకుల్లో రాజమౌళి...
 ఈగ సినిమాతో జాతీయస్థాయిలోగుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళికి 5,40,459 ల మంది ఫాలోవర్లున్నారు.  
 
 నాగ్ పోటీ ఇస్తున్నాడు..
  యువహీరోలతో ధీటుగా పోరాడుతున్నాడు అక్కినేని నాగార్జున. తన సినిమాల  విశేషాల గురించి మాట్లాడే అక్కినేని నాగార్జునకు  4,86,910 మంది ఫాలోవర్లున్నారు.
 
 సమంత దూసుకొస్తోంది..
 కొన్ని వివాదాస్పద ట్వీట్లను ఇచ్చిన సమంతకు ట్విటర్‌లో ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం తనకు 4,11,504 మంది ఫాలోవర్లున్నారు.
 
 దక్షిణాది స్టార్లు...
 తమిళ యువ హీరో ధనుష్‌కు 6,41,852 మంది పాలోవర్లున్నారు.  మలయాళీ సీనియర్ హీరో మమ్మూట్టీ కి 2,53,018 మంది ఫాలోవర్లున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరసగా హీరో రామ్ పోతినేనికి  2,23,804, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు 1,29,409 మంది ఫాలోవర్లున్నారు.
 
 
 నంబర్ వన్ కోసం పోరు...!
 ఇండియన్ సెలబ్రిటీల విషయంలో పాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పుడైతే నంబర్ వన్‌స్థానంలో అమితాబ్ బచ్చన్ ఇతర సెలబ్రిటీలెవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నారు కానీ...కొంత కాలం కిందటి వరకూ భారతీయ సెలబ్రిటీల మధ్య తొలిస్థానం కోసం తీవ్రమైన పోరు నడించింది. అమితాబ్, షారూఖ్, ప్రియాంకా చోప్రా, సల్మాన్‌ల మధ్య ఈ పోరాటం కొనసాగింది. ఒక దశలో ప్రియాంక నంబర్ వన్ స్థానంలో కొనసాగింది. వీరి ఫాలోవర్ల సంఖ్య స్థాయి 15- 20 లక్షల వధ్య కొనసాగుతున్న సమయంలో అమితాబ్, సచిన్, షారూక్‌లను దాటేసి ప్రియాంక తొలిస్థానంలో చాలా రోజుల పాటు కొనసాగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement