గట్టిగా మాట్లాడినా.. అభిప్రాయాలను కచ్చితంగా చెప్పినా.. ఫొటోలు అప్‌లోడ్ చేసినా... ఆఖరికి తమకు జరిగిన అన్యాయంపై నిర్భయంగా నోరు విప్పినా.. ఏదో నేరం చేసిన వాళ్లలాగా మహిళలను చిత్రీకరించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ముఖ్యంగా సోషల్ మీడియా విస్త్రృతి పెరిగిన తర్వాత స్త్రీవాదులు మొదలు సామాన్య మహిళల వరకు ప్రతీ ఒక్కరూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. దక్షిణాదిన మీటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తే ఈ విషయం సుస్పష్టమవుతుంది. రాయడానికి కూడా వీల్లేని అసభ్య, పరుష పదజాలంతో ఆమెను దూషించిన ఎందరెందరో మగానుభావుల సంస్కారం సదరు కామెంట్లలో ప్రస్ఫుటిస్తుంది. గౌరవప్రదమైన హోదాలో ఉండి, పెద్దమనిషిగా చలామణీ అవుతున్న వైరముత్తు లాంటి ఎంతో మంది వ్యక్తులపై వచ్చిన ఆరోపణల గురించి కనీసం ఆలోచించకపోగా... పైగా వారు ఏం చేసినా సరైందే అన్న రీతిలో ఉండే ట్వీట్లు పితృస్వామ్య భావజాలానికి అద్దం పడతాయి. ఇటువంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్న చిన్మయిలు ఎందరో.
అటువంటి వారికోసం నుపుర్ తివారీ అనే జర్నలిస్టు తన బృందంతో కలిసి ప్రత్యేకంగా ఓ యాప్‌ను ప్రవేశపెట్టారు. పితృస్వామ్య వ్యవస్థలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించేందుకు, బాధితుల సమస్యల తీర్చేందుకు వీలుగా స్మాష్‌బోర్డు పేరిట యాప్‌ను తీసుకువచ్చారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీవాదులందరినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యాప్‌ను ఢిల్లీలోని మిరాండా కాలేజీలో శనివారం ఆవిష్కరించారు. కేవలం హ్యాష్‌ట్యాగ్ మూమెంట్లకే పరిమితం కాకుండా.. డిజిటల్ వీధుల్లో చేదు అనుభవాల బారిన పడుతున్న వారికి మద్దతు లభించేలా చేయడం, వారి గోప్యతకు భంగం కలగకుండా చూసుకోవడమే ఈ సోషల్ నెట్‌వర్క్ ప్రధాన లక్ష్యం. అదే విధంగా బాధితుల గోడు వెళ్లబోసుకునేందుకు.. వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు.. ఈ యాప్ తోడ్పాడునందిస్తుంది. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడే మహిళలు, పురుషులు, థర్‌్డ జెండర్(ట్రాన్స్ మెన్ లేదా ట్రాన్స్ ఉమన్) ఇలా ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యులు కావొచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
అందుకే స్మాష్‌బోర్డు..
స్మాష్‌బోర్డు యాప్ గురించి నుపుర్ తివారీ మాట్లాడుతూ... ‘ బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా నోరు విప్పేలా చేయాలనే ఆలోచనే స్మాష్‌బోర్డు రూపకల్పనకు కారణం. న్యాయవాదులు, జర్నలిస్టులు, సైకాలజిస్టులు వంటి వివిధ రంగాల నిపుణులు దీనితో ఎంతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి బాధితులు తమ సమస్యలు, మానసిక స్థితి గురించి వీరికి చెప్పుకోవచ్చు. కేవలం బాధితుల కోసమే కాకుండా పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఎంతో మందిని ఏకతాటిపైకి తెచ్చే ఉద్దేశంతోనే ఈ యాప్ ప్రారంభించాం. తద్వారా వారి ఆలోచనలు సారూప్య భావజాలం కలిగిన వ్యక్తులతో పంచుకునే వీలు కలుగుతుంది’ అని పేర్కొన్నారు. త్వరలోనే ఈ యాప్‌ను ప్రాంతీయ భాషల్లో తీసుకువచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
అద్భుతమైన ఆలోచన ఇది..
ది వెజీనా మోనాలోగ్స్ ఫేం ఈవ్ ఎన్‌స్లర్(స్త్రీలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా గళమెత్తిన కార్యకర్త) ఈ యాప్ గురించి మాట్లాడుతూ.. అద్భుతమైన ఆలోచన అని కొనియాడారు. మహిళలు నిర్భయంగా తమ గాథలను, అనుభవాలను చెప్పుకొనేందుకు గొప్ప వేదిక స్మాష్‌బోర్డు అని పేర్కొన్నారు. ఈ సోషల్ నెట్‌వర్క్‌లో అందరూ స్త్రీవాదులే ఉన్న కారణంగా బాధితులు తమ సమస్యలను మరింత ధైర్యంగా ఇతరులతో పంచుకోగలుగుతారన్నారు. లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న వర్గానికి ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికగా ఉపయోగపడుతుందని హర్షం వ్యక్తం చేశారు.
Watch this video to learn more about the Smashboard app #smashboardapplaunch pic.twitter.com/RrD4tZfie1
— Smashboard_ (@Smashboard_) November 12, 2019
Comments
Please login to add a commentAdd a comment