దాడిలో గాయపడిన ఈడీ అధికారి, దెబ్బతిన్న వాహనం
కోల్‌కతా: పశి్చమబెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతుదారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఘటనలో అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ పరిణామంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని గవర్నర్ సీవీ ఆనంద బోస్ పేర్కొన్నారు.
రేషన్ పంపిణీ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఈడీ అధికారులు సందేశ్‌ఖలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న షాజహాన్ మద్దతుదారులు రెచి్చపోయి ఈడీ అధికారులపై దాడికి తెగబడ్డారు. దాడిలో అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్ అనుచరులు అధికారుల వాహనాల్నీ వదల్లేదు. వాటిని ధ్వంసం చేశారు. రక్షణగా వచి్చన కేంద్ర పారా మిలటరీ బలగాలపైనా దాడికి దిగారు.
సోదాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా సిబ్బందిపైనా దాడి చేశారు. వారి వాహనాల్ని తుక్కు చేశారు. గాయపడిన ఈడీ అధికారులు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అధికారులకు ఆస్పత్రిలో చికిత్స చేయించనున్నారు. రాష్ట్రమంత్రి జ్యోతిప్రియో మాలిక్‌కు షాజహాన్ సన్నిహితుడు. రేషన్ కేసులోనే గత ఏడాది మాలిక్ అరెస్టయ్యారు. షేక్ షాజహాన్‌పై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపినట్లు ఈడీ అధికారి ఒకరు పీటీఐకి చెప్పారు. ఘటనతో సంబంధమున్న 10 మందిని
అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర పోలీసులు చెప్పారు.
సందేశ్‌ఖలి ఘటనను రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులపై దాడిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అనాగరిక చర్యను, విధ్వంసాన్ని ఆపాలని కోరారు. రాజ్యాంగానికి లోబడి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర అధికారులపై దాడి సమాఖ్య వ్యవస్థపై జరిగిన దాడిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ పేర్కొన్నారు. ఘటనపై ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment