సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు. రెండో రోజు కూడా ఢిల్లీ అల్లర్లపై అధికార, విపక్ష సభ్యులు బాహాబాహీకి దిగారు. లోక్‌సభ, రాజ్యసభల్లో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం జరగడంతో రెండు సభలను వాయిదా పడ్డాయి. లోక్ సభను మధ్నాహం 12 గంటల వరకు, రాజ్యసభను మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా వేశారు.
రెండో రోజు సమావేశాలు మొదలైన వెంటనే లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై చర్చ జరపాలని విపక్షాలు పట్టుబట్టాయి. చర్చకు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష నాయకులు నిరసన తెలుపుతూ పోడియం వద్దకు దూసుకొచ్చారు.సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ ఇరు పక్షాలు పట్టించుకోలేదు. సభ్యులెవరూ పోడియం వద్దకు రావొద్దని స్పీకర్ పదే పదే సూచించినప్పటికీ విపక్షాలు వినిపించుకోలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
ఇక పెద్దల సభలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. సభ మొదలవగానే ఢిల్లీ అల్లర్లపై దుమారం రేగింది. అల్లర్లపై చర్చ పెట్టాలని విపక్షాలు కోరాయి. కానీ రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చర్చకు నిరాకరించారు. దీంతో విపక్షనేతలు నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. ప్లకార్డులను పట్టుకొని నిరసన తెలిపారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment