సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన వెంటనే జేడీయూ ఎంపీ బైద్యనాథ్ ప్రసాద్ మృతికి సభ సంతాపం తెలిపింది. అనంతరం సభను మధ్యాహ్నం 2గంలకు వాయిదా వేశారు. మరోవైపు పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఢిల్లీ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలిపాయి. ఢీల్లీ అల్లర్లకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు పార్లమెంట్‌లో ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు పాల్గొన్నారు. ఢిల్లీ హింసకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర కళ్లకు గంతలు కట్టుకొని, నోటిపై వేల్లు వేసుకొని నిరసన తెలిపారు.
మరోవైపు ఢిల్లీ అల్లర్లు రాజ్యసభను కూడా కుదిపేశాయి. సోమవారం సభ ప్రారంభమవగానే విపక్షాలు ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టాయి. దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఢిల్లీలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు అందరూ కృషి చేయాలన్నారు. అంశం గంభీరమైందని, ఇప్పడే దీనిపై చర్చించడం సరికాదన్నారు. సామన్య స్థితి ఏర్పడిన తర్వాత ఈ అంశంపై చర్చిద్దామని చెప్పారు. వెంటనే కాంగ్రెస్ నేత గూలంనబీ ఆజాద్ లేచి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో హింస చెలరేగి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినా ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. కాగా, ఆజాద్ వ్యాఖ్యలను అధికార పక్షం తప్పుబట్టింది. ఇరుపక్షాలు పోడియం వైపుకు దూసుకురావడంతో చైర్మన్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మొత్తం 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment