సాక్షి, న్యూఢిల్లీ : 'పద్మావత్' సినిమా వివాదం వారి జీవితాల్లో మర్చిపోలేని సంఘటనగా మిగిలింది. 30మంది చిన్నారులకు, ఓ టీచర్‌కు, బస్సు డ్రైవర్‌కు, కండక్టర్‌కు పెద్ద భయానక అనుభవంగా గుర్తుండిపోనుంది. ఆ సమయంలో డ్రైవర్ బస్సు ఆపి ఉన్నట్లయితే, బహుశా! చెప్పవీలుకానీ దుర్ఘటన చోటుచేసుకుని చరిత్రలో ఓ చెరిగిపోని మరకగా మిగిలి ఉండేదేమో. పద్మావత్ చిత్రం విడుదలను ఆపేయాలంటూ గుర్గావ్‌లో ఆందోళన చేస్తున్న కర్ణిసేనకు చెందినవారు కొంతమంది ఓ పాఠశాల బస్సుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన ఎలాజరిగిందనే విషయాన్ని కండక్టర్‌ను అడిగి తెలుసుకోగా ఒళ్లు గగుర్పొడిచే అనుభవాన్ని చెప్పాడు.
'సరిగ్గా మేం స్కూల్ నుంచి బయలుదేరి 7కిలో మీటర్ల వరకు వచ్చాం. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఓ బస్సు తగలబడిపోతుండటాన్ని మేం చూశాం. పోలీసులు ఆందోళన కారులను చెదరగొడుతున్నారు.. వారు మాత్రం తిరిగి దాడి చేస్తున్నారు. చెట్ల పొదల్లో నుంచి అనూహ్యంగా మా బస్సు వద్దకు వచ్చి దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో స్కూల్లో 30మంది నర్సరీ చదువుతున్న చిన్నారులు ఉన్నారు. దాదాపు 60మంది ఆందోళన కారులు రాళ్లు విసరడం మొదలుపెట్టారు. దాంతో చిన్నారులు ఏడ్వడం మొదలుపెట్టారు.
అందులోని టీచర్ వారిని ఓదార్చడం మొదలుపెట్టింది. అన్ని వైపుల నుంచి రాళ్లు రావడం మొదలయ్యాయి. దాంతో చిన్నారులను సీట్ల కింద దాచి ఉంచే ప్రయత్నం చేశాం. ఒక పెద్ద బండరాయి వచ్చి ముందు అద్దాన్ని బద్ధలు కొట్టింది. దాంతో ఇక ఎంత నష్టం జరిగినా పర్వాలేదని డ్రైవర్, నేను నిర్ణయించుకున్నాం. బస్సును ముందుకు పోనిచ్చాం. పిల్లల ప్రాణాలు ముఖ్యం అని భావించి బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లాం. అప్పటికీ కొంతమంది వెదురు బొంగులతో వెంబడించారు. వెళ్లే క్రమంలోనే గాయపడిన చిన్నారులకు ప్రథమ చికిత్స చేశాం. ఆ సమయంలో బస్సును ఆపినట్లయితే ఏం జరిగి ఉండేదో కూడా ఊహించలేకపోయేవాళ్లం' అని వెల్లడించాడు. ఈ సంఘటన మొత్తం దేశాన్ని కదిలించిన విషయం తెలిసిందే.
'ఆ క్షణంలో బస్సు ఆపినట్లయితే ఏం జరిగేదో..'
Published Thu, Jan 25 2018 3:41 PM | Last Updated on Thu, Jan 25 2018 6:42 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment