సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ చిత్రం ‘పద్మావత్’కు వ్యతిరేకంగా ఆరేడు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తూ కర్ణిసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంతవరకు నోరు విప్పి నిర్ద్వందంగా ఖండించక పోవడం పట్ల ప్రగతిశీల పౌరుల్లో విస్మయం వ్యక్తం అవుతుంది. తనకుతాను లౌకికపార్టీగా, ప్రగతిశీల శక్తిగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ భావ ప్రకటనా స్వేచ్ఛను వ్యతిరేకిస్తున్న రాజ్‌పుత్‌లను ఎందుకు ఖండించడం లేదు? రాజస్థాన్ రాష్ట్రంలో రానున్న ఉప ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం రాజీపడుతుందా? రాజ్‌పుత్‌లు పార్టీకి దూరం అవుతారని భయపడుతుందా?
హర్యానాలో ఓ చిన్న పిల్లల స్కూల్ బస్సుపై జరిగిన రాళ్ల దాడి వార్త దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ‘ఎంత పెద్ద కారణం ఉన్నప్పటికీ పిల్లలపై జరిగిన దాడిని ఎవరూ సమర్థించుకోలేరు’ అంటూ ట్వీట్ ద్వారా మాత్రమే రాహుల్ గాంధీ తేలిగ్గా స్పందించారు. ‘మీరు చేస్తున్నది తప్పు’ అంటూ బహిరంగంగా రాజ్‌పుత్‌లను నిలదీయాల్సిన రాహుల్ మెతక వైఖరిని అవలంబించడాన్ని ప్రగతిశీల పౌరులు, ముఖ్యంగా మేథావులు విమర్శిస్తున్నారు. గోవథను నిషేధిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకొచ్చిన కఠిన చట్టాలను నిరోధించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత గోరక్షకుల పేరిట జరిగిన దాడుల నుంచి దళితులను, మైనారిటీలను రక్షించడంలో ఇలాంటి మెతక వైఖరి కారణంగానే విఫలమైంది.
ఇప్పుడు రాజ్‌పుత్‌ల ఆందోళన పట్ల కూడా రాహుల్ గాంధీ తన మౌనాన్ని కొనసాగించినట్లయితే మున్ముందు అందుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ‘బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్నారుగదా! పైగా రాజ్‌పుత్‌లకు రిజర్వేషన్లు కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైనందున వారంతా బీజేకీ వ్యతిరేకంగా ఉన్నారు కదా! అలాంటి వారిని ఖండించి దూరం చేసుకోవడం ఎందుకు?’ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండవచ్చు.
అప్పుడు ఇక్కడ పార్టీ నైతిక ప్రవర్తన ప్రశ్నార్థకం అవుతుందన్న విషయాన్ని గ్రహించకపోతే ప్రమాదం. పద్మావత్ సినిమాను తమ రాష్ట్రంలో నిషేధించాలంటూ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ అది సరైన మార్గం కాదంటూ నచ్చచెప్పలేకపోయారు. దాంతో కొందరి మనోభావాలను దెబ్బతీసే చారిత్రక చిత్రాలను తీయకపోవడమే మంచిదంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్వజయ్ సింగ్ వ్యాఖ్యానించే వరకు వెళ్లింది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కున్న సెక్యులర్ భావాలను చెరిపేస్తాయని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
రాజులకు పుత్రులుగా చెప్పుకునే రాజ్‌పుత్‌ల పూర్వీకులు ఎక్కువగా మొగల్ చక్రవర్తులు దగ్గర సామంత రాజులుగా పనిచేశారు. ఆ తర్వాత బ్రిటీష్ ఇండియా సైన్యంలో చేరి ‘మార్షల్ రేస్ (సుశిక్షితులైన యోధులు)’ అని పిలుపించుకున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భూస్వాములుగా ఉత్తర భారతమంతా విస్తరించారు. రాజస్థాన్‌లో అధికంగా ఉన్న రాజ్‌పుత్ యువత ప్రభుత్వ ఉద్యోగ, విద్యారంగాల్లో రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఆధ్వర్యాన 2006లో ‘శ్రీరాజ్‌పుత్ కర్ణిసేన’గా ఏర్పడింది. ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలకు అనుకూలంగా మూడు ముక్కలుగా విడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment