సాక్షి, ముంబై : పద్మావత్ చిత్రానికి రాజ్‌పుత్‌ల ఆధ్వర్యంలోని కర్ణిసేన మరో ఝలక్ ఇచ్చింది. పద్మావత్ సినిమాపై ఆందోళనలు విరమించుకునే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ సినిమా రాజ్‌పుత్‌ల ధైర్యసాహసాలను చాటేలే, వారి గౌరవాన్ని ఇనుమడించేలా ఉందని పేర్కొంటూ.. ఈ చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలను విరమించుకుంటున్నట్లు కర్ణిసేన పేరుతో ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణిసేన తాజాగా వివరణ ఇచ్చింది. పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు విరమించుకోలేదని, సినిమాపై తమ నిరసన యథాతథంగా కొనసాగుతోందని తాజాగా కర్ణిసేన జాతీయ నాయకులు లోకేంద్ర సింగ్ కల్వీ, సుఖ్‌దేవ్ సింగ్ గొగమేడి తెలిపారు.
కర్ణిసేన ముంబై చీఫ్ యోగేంద్ర సింగ్ కటార్‌తోపాటు ముంబై విభాగపు బాధ్యులు పద్మావత్ సినిమాపై తమ ఆందోళనలు విరమించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే, దేశవ్యాప్తంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించిన కల్వీ, గొగమేడి మాత్రం ఈ ప్రకటనను ఖండించారు. శ్రీరాజ్‌పుత్ కర్ణిసేనకు కల్వీ జాతీయస్థాయిలో నాయకత్వం వహిస్తుండగా.. రాజ్‌పుత్‌లకు సంబంధించిన మరో జాతీయ సంఘమైన శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేనకు గోగమేడి జాతీయాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు అనుకూలంగా ప్రకటన ఇచ్చినందుకు యోగేంద్రతోపాటు.. ఆ ప్రకటనలో సంతకాలు చేసిన ఇతరులను సైతం తమ సంఘం నుంచి బహిష్కరించినట్టు గోగమేడి తెలిపారు. పద్మావత్ సినిమాపై తమ అభ్యంతరాలు పరిష్కారం కాలేదని, తాము ఆందోళన విరమించుకున్నట్టు సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాదని వివరించారు.
కాగా, 'పద్మావత్ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఏం లేవు. ఇందులో రాజ్‌పుత్‌ల గురించి చాలా గొప్పగా చూపించారు. పద్మావత్ చూశాక ప్రతీ రాజ్‌పుత్ కూడా గర్వపడతారు' అని గోగమేడి నాయకత్వంలోని కర్ణిసేనకు ముంబై చీఫ్‌గా ఉన్న యోగేంద్ర తెలిపారు. కర్ణిసేన జాతీయాధ్యక్షుడు గోగమేడి ఆదేశాలను అనుసరించి ప్రకటన విడుదల చేసినట్టు ఆయన ఇంతకుముందు మీడియాతో తెలిపారు.
చిత్ర షూటింగ్ ప్రారంభం నుంచే అభ్యంతరాలు లేవనెత్తుతూ విడుదలను అడ్డుకునేందుకు కర్ణిసేన శతవిధాల ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆందోళనలు, ధర్నాలు, దాడులు, నిరసనలు, భన్సాలీ-దీపిక తలలపై నజరానాల ప్రకటనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాల(బీజేపీ పాలిత) నిషేధం... ఇలా ఏవీ కూడా పద్మావత్ విడుదలను అడ్డుకోలేకపోయాయి. చివరకు న్యాయస్థానాలు కూడా పద్మావత్ విడుదలకు క్లియరెన్స్ ఇవ్వటంతో కర్ణిసేన కూడా కాస్త వెనక్కి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment