హంతకుల్లేని హత్య! | Sakshi Editorial on Mob Attacks | Sakshi
Sakshi News home page

హంతకుల్లేని హత్య!

Published Thu, Aug 15 2019 12:56 AM | Last Updated on Thu, Aug 15 2019 1:24 AM

Sakshi Editorial on Mob Attacks

ప్రతీకాత్మక చిత్రం

ఉన్మాద మూకలు అమాయకుల్ని కొట్టి చంపుతున్న ఉదంతాల్లో చాలా కేసులకు ఏ గతి పట్టిందో రాజస్తాన్‌లోని పెహ్లూ ఖాన్‌ హత్యోదంతంలోనూ అదే జరిగింది. రెండేళ్లక్రితం రాజస్తాన్‌లోని ఆళ్వార్‌ జిల్లాలో 55 ఏళ్ల పెహ్లూఖాన్‌ అనే వ్యక్తిని ఒక మూక కొట్టి చంపిన కేసులో ఆరుగురు నింది తులూ నిర్దోషులని జిల్లా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు మైనారిటీ తీరనివారు గనుక వారిపై బాల నేరస్తుల కోర్టులో విచారణ జరుగుతోంది. హర్యానాకు చెందిన డెయిరీ రైతు పెహ్లూ ఖాన్, ఆయన కుమారులిద్దరూ జైపూర్‌ పశువుల సంతలో ఆవుల్ని కొని స్వస్థలానికి వెళ్తుండగా ఉన్మాద మూక వారిపై దాడి చేసింది. పశువుల్ని అక్రమ రవాణా చేస్తు న్నారన్న అనుమానమే ఈ దాడికి కారణం. మూడు గంటలపాటు పెహ్లూఖాన్‌నూ, ఇతరులనూ కొట్టి తీవ్రంగా గాయపరిస్తే  రెండు రోజుల తర్వాత పెహ్లూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఇలాంటి దాడులు గత అయిదేళ్లలో వందకుపైగా చోటుచేసుకోగా వేళ్లమీద లెక్కపెట్టదగ్గ కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. ఆ కేసుల్లో కూడా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూకదాడులు చోటు చేసుకున్నప్పుడల్లా కాస్త వెనకో ముందో అధికార, విపక్ష నేతలు ఖండిస్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భిన్న సందర్భాల్లో ఈ తరహా దాడుల్ని సహించేది లేదని హెచ్చరించారు. కానీ కింది స్థాయిలో పరిస్థితులు దానికి తగినట్టుగా లేవు. ఘటన జరిగాక అరెస్టులు చేస్తున్నా దర్యాప్తులో, సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు ఘోరంగా విఫల మవుతున్నారు. చాలా సందర్భాల్లో కావాలని నీరుగారుస్తున్నారు. పెహ్లూఖాన్‌ ఉదంతంలో వీడియో దృశ్యాలున్నాయి. ఫొటోలున్నాయి. ఒక న్యూస్‌ చానల్‌ చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌లో నిందితు డొకరు అతన్ని ఎలా కొట్టి చంపిందీ కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఇవన్నీ న్యాయస్థానం ముందు వీగిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కిన కేసు స్థితే ఇలా ఉంటే దేశంలో చట్టపాలనపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా?

ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా కాంగ్రెస్, దాంతోపాటు ఇతర పార్టీలు బీజేపీ, సంఘ్‌ పరివార్‌లను తప్పుబడతాయి. ఆ సంస్థలు ఖండిస్తాయి. అక్కడితో అది ముగిసిపోతుంది. పెహ్లూఖాన్‌ ఉదంతంలో కాంగ్రెస్‌ ఎంత హడావుడి చేసిందో ఎవరూ మరిచిపోరు. బహుశా దాని పర్యవసానం కావొచ్చు... నిరుడు జరిగిన రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకుంది. ప్రత్యేకించి ఆళ్వార్‌ జిల్లాలో కాంగ్రెస్, బీఎస్‌పీలు అత్యధిక స్థానాలు గెల్చుకున్నాయి. రాజస్తాన్‌లో జరిగిన మూడు మూక హత్యలూ ఈ ప్రాంతంలో చోటుచేసుకున్నవే.  కనీసం ఈ కేసును సవాలుగా తీసుకుని దోషుల్ని దండించడానికి ప్రయత్నిద్దామన్న స్పృహ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయింది. ఈ కేసులో పోలీసులు నిందితులపై సరైన సెక్షన్లు పెట్టలేదని ఆరోపణలొచ్చినా దానికి పట్టలేదు. నడిరోడ్డుపై బహిరంగంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి చంపితే నిందితులపై పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశమున్న సెక్షన్‌ 307(హత్యాయత్నం)ను పెట్టలేదు. దానికి బదులు ‘ప్రాణనష్టం జరిగినా హత్యగా పరిగణించవీల్లేని’ చర్యగా సెక్షన్‌ 308కింద నేరారోపణ చేశారు. పైగా బాధితులపైనే రెండు నెలలక్రితం మరో చార్జిషీటు దాఖలు చేశారు. పెహ్లూఖాన్, అతని కుమారులు, ట్రక్కు యజ మాని పశువుల్ని అక్రమంగా తరలిస్తున్నారన్నది దాని సారాంశం. హర్యానా–రాజస్తాన్‌ సరిహద్దు ల్లోని ఆళ్వార్‌ తదితర ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఉంది. అక్కడ పశువుల్ని ఇటునుంచి అటూ, అటునుంచి ఇటూ తరలించడం, అమ్మడం రివాజు. పశువుల్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలంటే జిల్లా కలెక్టర్‌ అనుమతి అవసరమన్న నిబంధన ఉన్నా చాలామంది దాన్ని పట్టించుకోకుండా వ్యాపార లావాదేవీలు సాగిస్తుంటారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులకు వర్తమానం ఇచ్చి నిందితులను పట్టి ఇవ్వొచ్చు. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలా కొట్టి చంపడం, ఆ కేసు కాస్తా వీగిపోవడం, చివరకు బాధితులపై స్మగ్లింగ్‌ కేసు నమోదు కావడం దిగ్భ్రాంతికలిగిస్తుంది. పెహ్లూ, అతని కుమారులపై చార్జిషీటు నమోదైనప్పుడే కొన్ని సంస్థలు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది.

దర్యాప్తులోనూ, సాక్ష్యాధారాల సేకరణలోనూ పోలీసులు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు నిస్సహాయంగా మిగిలిపోతాయి. ఈ కేసులో ప్రభుత్వాసుపత్రి వైద్యులిచ్చిన పోస్టుమార్టం నివేది కకూ, దెబ్బలుతిన్నవారికి తొలుత చికిత్స చేసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి పోస్టుమార్టం నివేదికకూ పొంతన లేదు. ఒంటినిండా తీవ్ర గాయాలు కావడం వల్లా, షాక్‌కి గురికావటం వల్లా పెహ్లూ మరణించి ఉండొచ్చని ప్రభుత్వాసుపత్రి వైద్యుల నివేదిక చెప్పగా, అతను గుండెపోటుతో చనిపోయాడని ప్రైవేటు ఆసుపత్రి తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం పెహ్లూ మరణ వాంగ్మూ లంపై మేజిస్ట్రేట్‌ సంతకం చేయాల్సి ఉండగా అది జరగలేదు. ఇక వీడియో తీసిన వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదన్న కారణంతో ఆ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. నిరుడు సెప్టెంబర్‌లో మూకదాడి కేసులో జరిగే విచారణకు హాజరుకావడాని కొచ్చిన బాధితులపై దుండగులు దాడిచేశారు. పెహ్లూఖాన్‌ తరహాలోనే అంతం చేస్తామని తమను హెచ్చరించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ అదంతా నిజం కాదని పోలీసులు తేల్చారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తయినా, దాన్ని ప్రత్యక్షంగా చూసిన మరెవరైనా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాగలరా? మూకదాడులపై ప్రత్యేక చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిం చమని 2015లో సుప్రీంకోర్టు సూచించింది. కానీ దర్యాప్తు సంస్థల్లో నిబద్ధత కొరవడినప్పుడు ఎన్ని చట్టాలుండి ఏం ప్రయోజనం? ఉదాసీనతతో లేదా ఉద్దేశపూర్వకంగా నిందితులకు తోడ్పడే అధికా రులను సైతం నేరాల్లో భాగస్వాములుగా పరిగణించే నిబంధనలుంటేతప్ప ఈ ధోరణి ఆగదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement