gorakshana
-
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్‌ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్‌లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్‌లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్‌లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
మనుషులను చంపడం కంటే నేరం!
సాక్షి, న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గో సంరక్షణ (ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాటిల్) బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ డిసెంబర్ 9న ఆమోదించింది. అలాంటి చట్టాలు కలిగిన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రం తీసుకొచ్చిన బిల్లు మరీ కఠినంగా ఉంది. ఆవులే కాకుండా ఎద్దులు, లేగ దూడలను చంపడం నేరం. 13 ఏళ్ల లోపు బర్రెలను చంపడం కూడా నేరం. వాటిని స్మగ్లింగ్ చేయడం, ఓ చోటు నుంచి మరో చోటుకు తరలించడం కూడా నేరం. ఈ నేరాలకు పాల్పడిన వారికి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అంటే, నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి కారణమైతే విధించే శిక్షకన్నా ఇది పెద్ద శిక్ష. ఉద్దేశ పూర్వకంగా కాకుండా కేవలం నిర్లక్ష్యం వల్ల తోటి మానవుడి మరణానికి బాధ్యుడైన వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఒక్కోసారి జరిమానాతో కూడిన జైలు శిక్ష కూడా విధిస్తారు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు పౌష్టికాహారం కోసం చౌకగా దొరికే ఆవు, ఎద్దు, బర్రె మాంసాలపైనే ఆధారపడతారు. ఇలాంటి చట్టాల వల్ల వారి నోట్లో మట్టిపడుతుంది. ప్రభుత్వమే వారి పౌష్టికాహారం బాధ్యత తీసుకుందనుకుంటే తోళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. ఆ రంగంలో ఎక్కువగా పనిచేస్తున్న ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. వారందరికి ప్రభుత్వమే ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తుందనుకుంటే భారత్‌లో పాడి పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుంది. దేశంలో పాడి పరిశ్రమ టర్నోవర్ 6.5 లక్షల కోట్ల రూపాయలు. దేశంలోని రైతులకు గోధుమలు, వరి కలిపి అమ్మితే వచ్చే లాభం కన్నా పాడి పరిశ్రమ వల్ల ఎక్కువ లాభం వస్తోంది. (చదవండి: రణరంగమైన విధాన పరిషత్) డెయిరీలకు పాలను సరఫరా చేసేది ఎక్కువగా పశు పోషకులు, రైతులే. పాలివ్వడం మానేసిన ఆవులను, బర్రెలను, వ్యవసాయానికి పనికి రాని ఎద్దులను కబేలాలకు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బే యాదవులు, రైతుల పాడి పరిశ్రమకు ప్రధాన పెట్టుబడి. అందుబాటులో ఉన్న 2014 సంవత్సరం లెక్కల ప్రకారం మహారాష్ట్రలో పశువులను కబేలాలకు తరలించడం ద్వారా ఏటా వచ్చిన సొమ్ము అక్షరాల 1,180 కోట్ల రూపాయలు. దేశవ్యాప్తంగా పశు వధ నిషేధం వల్ల రైతులు సరాసరి సగటున నెలవారి ఆదాయం 6,427 రూపాయలను కోల్పోయారని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. 1970లో దేశంలో క్షీర విప్లవాన్ని తీసుకొచ్చిన ‘అముల్’ వ్యవస్థాపకులు వర్గీస్ కురియన్ కూడా మొదటి నుంచి పశు వధ నిషేధ చట్టాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ‘పశు సంపదను, పాడి పరిశ్రమను పరిరక్షించుకోవాలంటే అనారోగ్య, నిరుపయోగ పశువులను కబేలాలకు తరలించడమే ఉత్తమమైన మార్గం’ అని కురియన్, ‘ఐ టూ హ్యాడ్ ఏ డ్రీమ్’ పేరిట రాసుకున్న తన జీవిత చరిత్రలో పేర్కొన్నారు. దేశంలో పనికిరాని పశువుల బాధ్యతలను స్వీకరించి అవి చనిపోయే వరకు మీరుగానీ, మరెవరైనగానీ స్వీకరిస్తారా? అంటూ పూరి శంకరాచార్యను కురియన్ ప్రశ్నించగా, ఆయన తన వద్ద సమాధానం లేదని చెప్పారు. (చదవండి: కర్ణాటక పశు సంరక్షణ) నిషేధం ఉన్న చోట తగ్గుతున్న పశువుల సంఖ్య ‘2019–లైవ్‌స్టాక్ సెన్సెక్స్’ ప్రకారం పశు వధ నిషేధం ఉన్న రాష్ట్రాల్లోనే పశువుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2012 నుంచి 2019 మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పశువుల సంఖ్య వరుసగా 10.07, 4.42 శాతం, 3.93 శాతం తగ్గుతూ వచ్చింది. ఎలాంటి నిషేధం లేని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇదే కాలానికి పశువుల సంఖ్య 15.18 శాతం పెరిగింది. ఇదే కాలానికి ఎవరూ పోషించక పోవడంతో రోడ్డున పడ్డ ఊర పశువుల సంఖ్య ఉత్తర ప్రదేశ్‌లో 17.34 శాతం, మధ్యప్రదేశ్‌లో 95 శాతం, గుజరాత్లో 17.59 శాతం పెరగ్గా, అదే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పశువుల సంఖ్య 73.59 శాతం తగ్గింది. పంటల నష్టం...ప్రాణ నష్టం రోడ్డున పడ్డ పశువుల వల్ల రైతులకు ఓ పక్క పంటల నష్టం వాటిల్లుతుండగా, మరోపక్క పశువుల కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగి ప్రాణ నష్టం కూడా ఎక్కువగానే జరగుతోంది. హర్యానాలో గత రెండేళ్లలో అనాథ పశువులు అడ్డంగా రావడంతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 241 మంది మరణించారు. -
హంతకుల్లేని హత్య!
ఉన్మాద మూకలు అమాయకుల్ని కొట్టి చంపుతున్న ఉదంతాల్లో చాలా కేసులకు ఏ గతి పట్టిందో రాజస్తాన్‌లోని పెహ్లూ ఖాన్ హత్యోదంతంలోనూ అదే జరిగింది. రెండేళ్లక్రితం రాజస్తాన్‌లోని ఆళ్వార్ జిల్లాలో 55 ఏళ్ల పెహ్లూఖాన్ అనే వ్యక్తిని ఒక మూక కొట్టి చంపిన కేసులో ఆరుగురు నింది తులూ నిర్దోషులని జిల్లా కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు మైనారిటీ తీరనివారు గనుక వారిపై బాల నేరస్తుల కోర్టులో విచారణ జరుగుతోంది. హర్యానాకు చెందిన డెయిరీ రైతు పెహ్లూ ఖాన్, ఆయన కుమారులిద్దరూ జైపూర్ పశువుల సంతలో ఆవుల్ని కొని స్వస్థలానికి వెళ్తుండగా ఉన్మాద మూక వారిపై దాడి చేసింది. పశువుల్ని అక్రమ రవాణా చేస్తు న్నారన్న అనుమానమే ఈ దాడికి కారణం. మూడు గంటలపాటు పెహ్లూఖాన్నూ, ఇతరులనూ కొట్టి తీవ్రంగా గాయపరిస్తే రెండు రోజుల తర్వాత పెహ్లూ ఆసుపత్రిలో కన్నుమూశాడు. ఇలాంటి దాడులు గత అయిదేళ్లలో వందకుపైగా చోటుచేసుకోగా వేళ్లమీద లెక్కపెట్టదగ్గ కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడ్డాయి. ఆ కేసుల్లో కూడా ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. మూకదాడులు చోటు చేసుకున్నప్పుడల్లా కాస్త వెనకో ముందో అధికార, విపక్ష నేతలు ఖండిస్తూనే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా భిన్న సందర్భాల్లో ఈ తరహా దాడుల్ని సహించేది లేదని హెచ్చరించారు. కానీ కింది స్థాయిలో పరిస్థితులు దానికి తగినట్టుగా లేవు. ఘటన జరిగాక అరెస్టులు చేస్తున్నా దర్యాప్తులో, సాక్ష్యాధారాల సేకరణలో పోలీసులు ఘోరంగా విఫల మవుతున్నారు. చాలా సందర్భాల్లో కావాలని నీరుగారుస్తున్నారు. పెహ్లూఖాన్ ఉదంతంలో వీడియో దృశ్యాలున్నాయి. ఫొటోలున్నాయి. ఒక న్యూస్ చానల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో నిందితు డొకరు అతన్ని ఎలా కొట్టి చంపిందీ కళ్లకు కట్టినట్టు వివరించాడు. ఇవన్నీ న్యాయస్థానం ముందు వీగిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కిన కేసు స్థితే ఇలా ఉంటే దేశంలో చట్టపాలనపై ఎవరికైనా విశ్వాసం ఉంటుందా? ఇలాంటి దాడులు జరిగినప్పుడల్లా కాంగ్రెస్, దాంతోపాటు ఇతర పార్టీలు బీజేపీ, సంఘ్ పరివార్‌లను తప్పుబడతాయి. ఆ సంస్థలు ఖండిస్తాయి. అక్కడితో అది ముగిసిపోతుంది. పెహ్లూఖాన్ ఉదంతంలో కాంగ్రెస్ ఎంత హడావుడి చేసిందో ఎవరూ మరిచిపోరు. బహుశా దాని పర్యవసానం కావొచ్చు... నిరుడు జరిగిన రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. ప్రత్యేకించి ఆళ్వార్ జిల్లాలో కాంగ్రెస్, బీఎస్పీలు అత్యధిక స్థానాలు గెల్చుకున్నాయి. రాజస్తాన్‌లో జరిగిన మూడు మూక హత్యలూ ఈ ప్రాంతంలో చోటుచేసుకున్నవే. కనీసం ఈ కేసును సవాలుగా తీసుకుని దోషుల్ని దండించడానికి ప్రయత్నిద్దామన్న స్పృహ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయింది. ఈ కేసులో పోలీసులు నిందితులపై సరైన సెక్షన్లు పెట్టలేదని ఆరోపణలొచ్చినా దానికి పట్టలేదు. నడిరోడ్డుపై బహిరంగంగా కొట్టి తీవ్రంగా గాయపరిచి చంపితే నిందితులపై పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశమున్న సెక్షన్ 307(హత్యాయత్నం)ను పెట్టలేదు. దానికి బదులు ‘ప్రాణనష్టం జరిగినా హత్యగా పరిగణించవీల్లేని’ చర్యగా సెక్షన్ 308కింద నేరారోపణ చేశారు. పైగా బాధితులపైనే రెండు నెలలక్రితం మరో చార్జిషీటు దాఖలు చేశారు. పెహ్లూఖాన్, అతని కుమారులు, ట్రక్కు యజ మాని పశువుల్ని అక్రమంగా తరలిస్తున్నారన్నది దాని సారాంశం. హర్యానా–రాజస్తాన్ సరిహద్దు ల్లోని ఆళ్వార్ తదితర ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఉంది. అక్కడ పశువుల్ని ఇటునుంచి అటూ, అటునుంచి ఇటూ తరలించడం, అమ్మడం రివాజు. పశువుల్ని రాష్ట్ర సరిహద్దులు దాటించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతి అవసరమన్న నిబంధన ఉన్నా చాలామంది దాన్ని పట్టించుకోకుండా వ్యాపార లావాదేవీలు సాగిస్తుంటారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాల్లో అధికారులకు వర్తమానం ఇచ్చి నిందితులను పట్టి ఇవ్వొచ్చు. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇలా కొట్టి చంపడం, ఆ కేసు కాస్తా వీగిపోవడం, చివరకు బాధితులపై స్మగ్లింగ్ కేసు నమోదు కావడం దిగ్భ్రాంతికలిగిస్తుంది. పెహ్లూ, అతని కుమారులపై చార్జిషీటు నమోదైనప్పుడే కొన్ని సంస్థలు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. కానీ ఫలితం లేకపోయింది. దర్యాప్తులోనూ, సాక్ష్యాధారాల సేకరణలోనూ పోలీసులు విఫలమైనప్పుడు న్యాయస్థానాలు నిస్సహాయంగా మిగిలిపోతాయి. ఈ కేసులో ప్రభుత్వాసుపత్రి వైద్యులిచ్చిన పోస్టుమార్టం నివేది కకూ, దెబ్బలుతిన్నవారికి తొలుత చికిత్స చేసిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి పోస్టుమార్టం నివేదికకూ పొంతన లేదు. ఒంటినిండా తీవ్ర గాయాలు కావడం వల్లా, షాక్‌కి గురికావటం వల్లా పెహ్లూ మరణించి ఉండొచ్చని ప్రభుత్వాసుపత్రి వైద్యుల నివేదిక చెప్పగా, అతను గుండెపోటుతో చనిపోయాడని ప్రైవేటు ఆసుపత్రి తేల్చిచెప్పింది. నిబంధనల ప్రకారం పెహ్లూ మరణ వాంగ్మూ లంపై మేజిస్ట్రేట్ సంతకం చేయాల్సి ఉండగా అది జరగలేదు. ఇక వీడియో తీసిన వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి ముందుకు రాలేదన్న కారణంతో ఆ సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. నిరుడు సెప్టెంబర్‌లో మూకదాడి కేసులో జరిగే విచారణకు హాజరుకావడాని కొచ్చిన బాధితులపై దుండగులు దాడిచేశారు. పెహ్లూఖాన్ తరహాలోనే అంతం చేస్తామని తమను హెచ్చరించారని బాధితులు ఫిర్యాదు చేశారు. కానీ అదంతా నిజం కాదని పోలీసులు తేల్చారు. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు వీడియో తీసిన వ్యక్తయినా, దాన్ని ప్రత్యక్షంగా చూసిన మరెవరైనా సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రాగలరా? మూకదాడులపై ప్రత్యేక చట్టం తెచ్చే అంశాన్ని పరిశీలిం చమని 2015లో సుప్రీంకోర్టు సూచించింది. కానీ దర్యాప్తు సంస్థల్లో నిబద్ధత కొరవడినప్పుడు ఎన్ని చట్టాలుండి ఏం ప్రయోజనం? ఉదాసీనతతో లేదా ఉద్దేశపూర్వకంగా నిందితులకు తోడ్పడే అధికా రులను సైతం నేరాల్లో భాగస్వాములుగా పరిగణించే నిబంధనలుంటేతప్ప ఈ ధోరణి ఆగదు. -
యూపీలో రెచ్చిపోయిన గోరక్షక ముఠా
బులంద్‌షహర్: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో గోరక్షక ముఠా రెచ్చిపోయింది. ఓ మతానికి చెందిన ప్రజలు ఆవును చంపేశారని ఆరోపిస్తూ రోడ్డును దిగ్బంధించి ఆందోళనకు దిగింది. ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి అక్కడకు చేరుకున్న పోలీసులపై రాళ్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పంటించింది. ఈ ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్తో పాటు మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. మీరట్ జోన్ అదనపు డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ‘బులంద్ షహర్ జిల్లా మెహౌ గ్రామం దగ్గర సోమవారం ఆవు కళేబరం కనిపించింది. దీంతో ఓ మతానికి చెందినవారు ఆవును చంపేశారని ఆరోపిస్తూ హిందుత్వ సంస్థల సభ్యులు కొందరు ఆ ఎముకల్ని ట్రాక్టర్లో వేసుకుని ఛింగర్వతి పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకొచ్చారు. తర్వాత బులంద్‌షెహర్–గఢ్ రాష్ట్ర రహదారిని దిగ్బంధించారు. దీంతో జిల్లా కలెక్టర్ అనూజ్ కుమార్, సబ్‌డివిజినల్ మేజిస్ట్రేట్ అవినాశ్ కుమార్ రంగంలోకి దిగి ఆందోళనకారులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అంతలోనే ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీస్ ఔట్‌పోస్ట్‌తో పాటు పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా దుండగుల దాడిలో ఇన్స్పెక్టర్ సుబోధ్ కుమార్ మరణించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమిత్ అనే యువకుడు చనిపోయాడు. -
అయ్యా! అది గేదె మాంసం
సాక్షి, న్యూఢిల్లీ : గో రక్షక దళాల పేరిట దేశ రాజధాని శివార్లో శుక్రవారం జరిగిన దాడి దేశవ్యాప్తంగా మరోసారి కలకలం రేపుతోంది. ఫరిదాబాద్‌లో ఓ ఆటో రిక్షాలో బీఫ్ తీసుకెళ్తున్న ఆరోపణతో ఇద్దరిని చితకబాది.. ఆపై వారిని కాపాడేందుకు వచ్చిన మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. అజాద్ అనే వికలాంగుడు ఓ ఆటో రిక్షా నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం తన ఆటోలో గేదే మాంసంను ఓ దుకాణం వద్దకు తీసుకెళ్తున్నాడు. మార్గమధ్యలో కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆటోని అడ్డగించారు. అజాద్‌తోపాటు ఆటోలో ఉన్న మరో బాలుడిని తమ వెంట సమీపంలోని బజ్రీ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ గోమాంసం ఆరోపణలతో వారిపై దాడి చేశారు. అది గో మాంసం కాదని ఎంత మొత్తుకున్నా వారిని నిర్దాక్షిణ్యంగా చితకబాదారంట. విషయాన్ని అజాద్ ఫోన్లో తన కుటుంబ సభ్యులకు వివరించగా.. అక్కడికి రాగానే వారిపై కూడా దాడికి తెగపడ్డారు. అంతలో మరో 40 మంది వారికి జత కలిశారు. జై హనుమాన్, జై గో మాత చెప్పాలంటూ డిమాండ్ చేశారని.. తాను నిరాకరించటంతో పంది మాంసం తినిపిస్తామని బెదిరించారని గాయపడిన అజాద్ మీడియాకు తెలిపాడు. ఏం చేసినా తాను మాత్రం నినాదాలు చేయనని చెప్పటంతో 40 మంది కలిసి తమను దారుణంగా చితకబాదారంటూ... గాయాలు చూపించాడు. అతని మెడ, కాళ్లు, వీపు నిండా దెబ్బలే ఉన్నాయి. కాగా, ముందు బాధితులపై గోమాంసం అక్రమ రవాణా కేసు నమోదు చేసినప్పటికీ.. పరీక్షల్లో అది గేదే మాంసం అని తేలటంతో కేసు కొట్టివేసినట్లు పోలీసులు వెల్లడించారు. గోరక్షక దళాల పేరిట జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన సుప్రీంకోర్టు.. వాటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. మరో పక్క నిజమైన హిందువులు ఆవులను పూజిస్తారని.. కేవలం నేర చరిత్ర ఉన్న వారే ఇలాంటి దాడులకు తెగబడతారని గోరక్షక దళాలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
ఆర్ఎస్సెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : గోసంరక్షణ పేరిట జరుగుతున్న దురాగతాలను ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పరోక్షంగా సమర్థించారు. గోసంరక్షకులు చట్టాలను ఉల్లంఘించడంలేదని, వారి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయదశమి సందర్బంగా పుణేలో ఆర్ఎస్సెస్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. గోసంరక్షణ రాజ్యాంగంలో భాగమేనన్నారు. ఆవు ఒక మతానికి సంబంధించినది కాదని, ఎంతో మంది ముస్లింలు ఆవులను పెంచి పోషించారని, వాటి రక్షణ కోసం ప్రాణాలు కూడా అర్పించారని పేర్కొన్నారు. కావాలనే కొంతమంది గోసంరక్షణ పేరిట హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారన్నారు. కానీ, గోవులను దొంగ రవాణా చేసే వారి చేతుల్లో కూడా గోసంరక్షకులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారనే విషయం గుర్తించాలని సూచించారు. గోసంరక్షణ సమస్యను మతంతో ముడిపెట్టకుండా చూస్తున్నామని తెలిపారు. ఆవు పాలు, మూత్రాలను ఉపయోగించే మనదేశంలో, చిన్నా చితక రైతులకు ఆవులు ఎంతో అవసరమని, గో ఆధారిత వ్యవసాయాన్ని రక్షించాలని రాజ్యాంగంలో ఉందని ఈ సందర్భంగా మోహన్ భగవత్ గుర్తుచేశారు. గోసంరక్షకులపై కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలు సంఘ విద్రోహ శక్తులకు చేయూతనిస్తున్నాయని ఆరోపించారు. రోహింగ్యాలు దేశానికి ముప్పు.. రోహింగ్యాలు దేశ భద్రతకు ముప్పు అని, వారికి ఆశ్రయం కల్పించవద్దని ప్రధాని నరేంద్రమోదీకి భగవత్ సూచించారు. ఇప్పటికే అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీలతో సమస్య ఎదుర్కొంటున్నామన్నారు. రోహింగ్యాలతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లడమే కాక దేశంలో హింసాత్మక ఘటనలు చెలరేగుతాయని, మయన్మార్‌లో వారు సృష్టించిన ఘటనలే సాక్ష్యమని భగవత్ పేర్కొన్నారు. -
ఇప్పటికైనా కదలాలి
దేశంలో గోరక్షణ పేరిట ఉన్మాద మూకల వీరంగం సాగుతున్నవేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆ ఉదంతాలపై స్పందించారు. వాటిని సహించేది లేదంటూ హెచ్చరించారు. ఆ పేరిట హత్యలకు దిగడం ఆమోదయోగ్యం కాదన్నారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు మౌనం విడనాడి మాట్లాడటం ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో అవసరం. ఆ పని చేసినందుకు మోదీ అభినందనీయులు. అయితే మూక దాడులపై ఆయన స్పందించడం ఇది మొదటిసారేమీ కాదు. 2015 అక్టోబర్‌లో న్యూఢిల్లీకి సమీపం లోని గ్రామంలో ఒక ముస్లిం కుటుంబంపై దాడిచేసి ఆ కుటుంబ పెద్ద అఖ్లాక్ను కొట్టి చంపి, అతని కుమారుణ్ణి తీవ్రంగా గాయపరిచినప్పుడు ఆయన గళం విప్పారు. అలాగే నిరుడు ఆగస్టులో గుజరాత్‌లోని ఉనాలో కొందరు దళిత యువ కులు పశు కళేబరాలను తరలిస్తున్నారని ఆగ్రహించి దుండగులు నడిబజారులో వారిని బట్టలు ఊడదీసి, పెడరెక్కలు విరిచి కట్టి కొట్టినప్పుడు కూడా మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టమేమంటే ఆ తర్వాత కూడా అవి ఆగింది లేదు. గత మూడేళ్లలో ఆ మాదిరి ఉదంతాలు 32 చోటు చేసుకోగా 23మంది ప్రాణాలు కోల్పోయారని, 50మంది గాయపడ్డారని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కనుక మాటలతోపాటు వెనువెంటనే చేతలు మొదలైనప్పుడే ఈ దుర్మార్గానికి అడ్డు కట్ట పడుతుందని ఎవరికైనా అర్ధమవుతుంది.. కానీ విషాదమేమంటే ఆ విషయం లో మన ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. శాంతిభద్రతల వ్యవహారా లను చూసే రాష్ట్ర ప్రభుత్వాలు చేష్టలుడిగి ఉండిపోతున్నాయి. కొందరు నేతలు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఈ కేసుల్లోని నిందితులు సులభంగా బెయిల్ తీసుకుని బయటికొస్తున్నారు. బాధిత కుటుంబాలు మాత్రం సమాజంలో వెలివేతకు గురవుతున్నాయి. దిక్కూ మొక్కూ లేకుండా మిగులుతున్నాయి. మూక దాడులపై నరేంద్ర మోదీ స్పందించిన రోజే జార్ఖండ్‌లోని బజ్రతర్ గ్రామంలో ఒక వాహనంలో వెళ్తున్న 40 ఏళ్ల అలీముద్దీన్ అనే వ్యక్తిని పశుమాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో ఒక గుంపు అటకాయించి దాడిచేసి కొట్టి చంపింది. వాహనానికి నిప్పంటించింది. సరిగ్గా అంతకు వారంక్రితం ఈద్ పండగ కోసమని ఢిల్లీలో షాపింగ్ చేసుకుని రైల్లో హర్యానాలోని స్వస్థలానికి వెళ్తున్న నలుగురు పిల్లలను బోగీలోని కొందరు మతం పేరుతో అవమానించి, వారు సంప్రదాయంగా ధరించే టోపీలను లాగి దూషించడమే కాక వారిలో జునైద్ అనే పిల్లవాడిని తీవ్రంగా కొట్టి రైల్లోంచి తోసి ప్రాణం తీశారు. మరొకరిని గాయపరిచారు. ఈ గొడవంతా జరుగుతున్నప్పుడు బోగీ నిండా ప్రయాణికులు న్నారు. కానీ ఒక్కరైనా వారించడానికి ప్రయత్నించలేదు. వారిపై క్రూరంగా దాడి చేస్తుంటే, ప్రాణం తీస్తుంటే మాట్లాడలేదు. దగ్గరలోని ప్లాట్‌ఫాంపై ఉన్న దాదాపు 200మంది ప్రవర్తనా ఆ విధంగానే ఉంది. తోటి మనుషులతో, అందులోనూ కనీసం ఆత్మరక్షణ కూడా చేసుకోలేని పిల్లలతో దుండగులు అంత అమానుషంగా ప్రవర్తిస్తుంటే అంతమంది ఉండి కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోవడం దేనికి సంకేతం? ఇలాంటి మూక దాడులు జరిగిన సందర్భంలోనే నాగరిక విలువ గురించి, వైవిధ్యత గురించి, బహుళత్వం గురించి రాష్ట్రపతి మాట్లాడారు. కానీ ఉన్నకొద్దీ ఆ విలువలు అడుగంటుతున్న వైనం కనబడుతోంది. ఆమధ్య రైల్లో వెళ్తున్న మహిళల వద్ద పశుమాంసం ఉన్నదన్న అనుమానంతో అమానుషంగా దాడి చేయడం, మరోచోట పశువుల్ని తరలిస్తున్నవారిని అనుమానించి వారితో ఆవుపేడ, మూత్రం, నెయ్యి, పెరుగూ కలిపి తినిపించిన ఉదంతం ఎవరూ మరిచిపోరు. ఇలాంటి హంతకముఠాలు గాల్లోంచి ఊడిపడవు. ఎవరి దన్నూ లేకుండా అలా చెలరేగిపోవు. పౌరుల ప్రాణాలు కాపాడటం తమ కర్తవ్యమని విశ్వసించే పాల కులుంటే, ఘటన జరిగిన వెంటనే స్పందించే గుణముంటే సమస్య ఇంతగా విష మించదు. అది లేకపోగా అధికార పార్టీలో ఉంటున్న నేతలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. అఖ్లాక్ను కొట్టి చంపిన ఉదంతంపై మాట్లాడిన ఒక బీజేపీ నేత కేవలం పశుమాంసం తిన్నారన్న వదంతి ఆధారంగా దాడి చేయడం తప్పని అన్నారు. అది నిజమని నిర్ధారణ అయితే దాడి చేయొచ్చని ఆయన పరోక్షంగా చెప్పారు. మన దేశంలో గోవధ నిషేధ చట్టాలున్న రాష్ట్రాల్లో ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని వధిస్తే...వాటిని ఆ ఉద్దేశంతో తరలిస్తే బాధ్యులైనవారికి విధించే శిక్షలైనా, జరిమానాలైనా వేర్వేరు రకాలుగా ఉన్నాయి. పశువుల తరలింపు దానికదే నేరమని ఏ చట్టమూ చెప్పడం లేదు. పైగా మిగిలిన అన్ని చట్టాల్లాగే ఆ చట్టాన్ని అమలు చేయాల్సింది కూడా అధికార యంత్రాంగమే తప్ప ప్రైవేటు ముఠాలు కాదు. కానీ గోరక్షణను నెత్తినేసుకున్నవారు పశువుల్ని తరలిస్తున్నవారిపైనా, పశుమాంసం దగ్గరున్నదని అనుమానం వచ్చినవారిపైనా దాడులు చేస్తున్నారు. చంపుతున్నారు. అఖ్లాక్ కేసు నిందితుడు మరణించి నప్పుడు కేంద్రమంత్రి మహేష్ శర్మ అతని మృతదేహంపై జాతీయజెండాను కప్పారు. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు దుండ గులపై చర్య తీసుకోవడానికి అధికార యంత్రాంగం సాహసిస్తుందా? పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరిం చడానికి ముందుకొస్తారా? ఈ మూకదాడులపై నిరసనలు వ్యక్తమైనప్పుడు కేరళ, పశ్చిమబెంగాల్ వంటిచోట్ల ఆరెస్సెస్ నేతలను హత్య చేయడాన్ని బీజేపీ నేతలు ఎత్తిచూపుతున్నారు. ఇవన్నీ ఖండించదగినవే. బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. కానీ రాజకీయ కారణాలతో, పరస్పర కక్షలతో జరిగే హత్యలనూ...ఒక మతానికి చెందిన సాధారణ పౌరులను గోరక్షణ పేరుతో హతమార్చడం ఒకే గాటన కట్టగలమా? కనీసం మోదీ ప్రసంగాన్ని గమనించాకైనా అలాంటి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వాలు చురుగ్గా కదిలి దుండగులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. వారికి వెంటవెంటనే శిక్షలుపడేలా చర్యలు తీసుకోవాలి. ఈ అమానవీయ ఉదంతాలు అవిచ్ఛిన్నంగా కొనసాగడం మన దేశానికి తలవొంపులు తెస్తుందని తెలుసుకోవాలి. -
గోరక్షణ శాలలో ఎంపీ బుట్టా పూజలు
కర్నూలు (న్యూసిటీ): నగరంలోని పెద్దపార్కు సమీపంలో ఉన్న గోరక్షణ శాలలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సోమవారం లక్ష్మీదేవికి కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం దత్త గో ప్రదక్షిణశాలలో శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. బుట్టా ఫౌండేషన్ రూపొందించిన 2017 నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆధ్యాత్మిక శ్రీదండి అష్టక్షరి సంపత్కుమార రామానుజజియర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకు ముందుగా ఎంపీ బుట్టారేణుకను దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఎం.రామాంజనేయులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ధర్మకర్త మండలి మాజీ సభ్యుడు శ్రీకాంతనాయకుడు, గోరక్షణ శాల సిబ్బంది రమణ, గోపాలకృష్ణ, గోపా సహస్త్ర నామ మండలి అధ్యక్షుడు ఎం.నాగరాజు, మహిళలు పాల్గొన్నారు.